ప్రసంగ పాఠము : ఆది 1:3, యోహాను 8:12, మత్తయి 5:14, కీర్తన 119:130.
వెలుగు బిడ్డలారా! ఈ దీపమున నేను రెండు విధములైన వెలుగులను గూర్చి చెప్పుచున్నాను. సూర్యుని వెలుగు వేరు. చంద్రుని వెలుగు వేరు. నక్షత్రముల వెలుగు వేరు. నేను ఈ మూడు వెలుగులను గూర్చి చెప్పుటలేదు. బీదల ఇంటిలో ప్రమిదల వెలుగు, దారిలోని లాంతరు వెలుగు, భాగ్యవంతుల యిండ్లలో మెరుపు దీపాలు-వీటినిగూర్చి కాదు నేను చెప్పునది.
బైబిలులో మొదటి గ్రంధము, మొదటి అధ్యాయము, మొదటి(ఐదు) వచనములలో వెలుగును గూర్చి ఉన్నది. దేవుడు వెలుగు కలుగునుగాక అని చెప్పినారు. ఆ వెలుగు బైలుపడక ముందు ఎక్కడ ఉన్నది? ఉదా:- అగ్గిపుల్ల గీచినపుడు వెలుగు వచ్చును. గీయక ముందు ఆ వెలుగు పుల్లలో ఉన్నది. గీచినపుడు బైలుపడినది. ఆలాగే వెలుగు కలుగు గాకని దేవుడు చెప్పక ముందు వెలుగు ఆయనలో ఉన్నది. వెలుగు కలుగు గాకని దేవుడు చెప్పిన తరువాతనే సూర్య, చంద్ర నక్షత్రముల వెలుగు, మన దీపాల వెలుగు కలిగెను. కాని అంతకు ముందు అవి దేవునిలోను, ఆయన సంకల్పనలోను ఉన్నవి.
అయితే ఆది కాండము మొదటి అధ్యాయములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురుగా లేరు. ఒక్కరుగానే ఉన్నారు. తరువాత ముగ్గురుగా బైలుపడినారు. ఆ ముగ్గురిలో ఒకరైన యేసుప్రభువు భూమి మీదకు వచ్చిన తరువాత ఒకమాట అన్నారు. "నేను లోకమునకు వెలుగై యున్నాను" అన్నారు (యోహాను 8:12). మనిషి ఏలాగు వెలుగై ఉంటాడు? ఈ మాట చెప్పినపుడు ఆయన మనిషి. ఆలాగైతే మనము ఎరిగియున్న వెలుగు వంటివాడును, దీపము వంటి వాడునుకాదు. అసలైన మనము ఎరిగియున్న వెలుగు వంటివాడును, దీపము వంటి వాడునుకాదు. అసలైన ఆ 'మొదటి వెలుగు ' అయిఉన్నారు. ఆయనలో నుండి తరువాత వెలుగులన్నియు వచ్చెను. ఆయన వెలుగు అసలైన వెలుగై యున్నది.
ప్రభువు చెప్పిన వెలుగు మాట ఏదనగా 'నేను లోకమునకు వెలుగై యున్నాను ' పాలస్తీనాలో యెరూషలేము ప్రాంతము నందు కొండ మీద ఆయన కూర్చుండి యున్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న మనుష్యులతో నేను వెలుగై యున్నాను అని చెప్పెను. అక్కడున్న వారు శరీర రీతిగా గ్రహించువారు ప్రభువా! నీవు మనిషివి, ఏలాగు వెలుగైయున్నావు? అని అడుగవలసినది గాని అడుగలేదు. ఎందుచేతననగా నేను లోకమునకు వెలుగైయున్నాను అని చెప్పినప్పుడు, ఆ మాట ద్వారా వెలుగు వారిలోనికి వెళ్ళినది గనుక వారికి ఆయన ఎలాగు వెలుగై యున్నాడో అనునది తెలిసిపోయినందున అడుగలేదు.
మత్తయి 9: 1-8లో ప్రభువు పక్షవాత రోగిని - "నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్ము" అని చెప్పెను. అప్పటికి జబ్బు పోలేదు. ఏలాగు ఎత్తుకొని పోవుదును అని అడుగలేదు. ఎందుకనగా ప్రభువు మాట ఆయన చెవిలోకి(రోగి చెవిలోకి) వెళ్ళగానే జబ్బుపోయందని తెలిసిపోయింది. (కీర్తనలు 119:130) రోగి దృష్టికి జబ్బు పోయినట్టు తెలిసినది. అందుచేతనే, పరుపెత్తుకొని వెళ్ళిపోయెను.
వెలుగైయున్న ఆయన మాట వినగానే అతనికి తెలివి కలిగెను. బాగైనాను అనే తెలివి కలిగెను. తెలివి అనగా జ్ఞానము. జ్ఞానమనగా రెండవ కన్ను. అందుకే పండితులు తెలివిని జ్ఞాన నేత్రము అంటారు. ఈ జ్ఞానము వేరొక రకమైన వెలుగు.
వెలుగు కలుగవలెనంటే మైనపు వత్తి వెలిగించి చూస్తే, ఎదుటనున్న వస్తువులు కనబడును. అలాగే యేసుప్రభువు నీ పరుపెత్తుకొని వెళ్ళుమన్నప్పుడు, ఆ పలుకును బట్టి, పలుకులోని వెలుగును బట్టి తనలోని స్వస్థత తనలోని జ్ఞాననేత్రమునకు కనిపించెను. అందుచే అతడు వెంటనే పరుపు సర్ధుకొని వెళ్ళిపోయినాడు. ప్రభువు మాటలో వెలుగున్నది. కాబట్టి నేను లోకానికి వెలుగై యున్నానని యేసుప్రభువు చెప్పినపుడు, దగ్గరున్న వారికి-నిజమే, ఈయన లోకమునకు వెలుగైయున్నాడనే తెలివి పుట్టెను. ఆ తెలివే జ్ఞానము. ఆయన వెలుగై యున్నాడనే సంగతి జ్ఞాననేత్రములకు కనిపించినందున వారు ఆయనను అడుగలేదు.
దీపము ఏది? అని దీపము లేనప్పుడు అడుగుదుము. కాని, దీపము ఉన్నప్పుడు దీపము ఏది? అని ఎవ్వరును అడుగరు. ఆలాగే నేను లోకానికి వెలుగై యున్నానని చెప్పినపుడు, వారింతటికీ బదులుగా అప్పటి కాలములో ఆయన ఎదుట ఉన్న యూదులు, అన్యులు లోకము యెదుట ఆయన వెలుగై యున్నాడు గనుక అడుగలేదు, ఆలాగుననే ఆ సమయములో భూలోకమంతయు ఆయన ఎదుట లేదు. జపాను నుండి అమెరికా రష్యా నుండి ఆఫ్రికా వరకు ఉన్న భూగోళము అప్పుడు ఆయన ఎదుట లేదు, గాని ఆయన నేను లోకమునకు వెలుగైయున్నాను అని అన్నారు. అనగా అప్పటి కాలములో ఆయన ఎదుట ఉన్న యూదులు, అన్యులు లోకమంతటికీ బదులుగా వచ్చిన ప్రతి నిధులుగా ఉన్నారు గనుక అప్పుడున్న లోకానికి, అంతకు ముందున్న లోకానికి, ఇప్పుడున్న లోకానికి వెలుగైయున్నారు అని అర్ధము. ఉదా:- ఒక మీటింగుకు ఆయా ఊళ్ళనుండి వచ్చినవారున్నారు. ఆ ఊళ్ళలోని వారందరూ రాకపోయినా, కొందరు వచ్చినారు గనుక అందరు వచ్చినట్ట్లే. లోకమంతటిలో ఉన్న వారు అందరు రాకపోయినా, వారికి బదులుగా వచ్చిన వారున్నారు. అనగా ఆ చిన్న లోకము అప్పుడు ఆయన పాదముల దగ్గర ఉన్నట్టే. ఆలాగే కొండమీద కూర్చున్న ఆయన దీపమై యుండగా, ఆయన ఎదుట లోకమంతా ఉన్నట్టే, కొండమీద ఉన్న పట్టణము మరుగైయుండదని ప్రభువు అన్నారు. దీపస్తంభము మీద ఉన్న దీపము మరుగై యుండదు అన్నారు (మత్తయి 5:14,15). అప్పుడు కొండమీద దీపమై కూర్చున్న, యేసుప్రభువు, లోకములో ఉన్న అన్ని దేశములకు వెలుగైయున్నారు. అన్ని దేశములకు వెలుగిచ్చుటకు సూర్యుని కలుగజేసిన యేసు ప్రభువే, అన్ని దేశములకు అసలైన వెలుగై యున్నారు.
శిష్యులు, సర్వలోకానికి వెలుగైయున్న క్రీస్తును గూర్చి చెప్పినప్పుడు – వారి తెలివికి శక్తి వచ్చినప్పుడు, క్రీస్తే రక్షకుడని వారికి తెలిసిపోయినందున. నేను లోకానికి వెలుగై యున్నానని చెప్పినప్పుడు (1) శిష్యుల కాలములో (2) మన కాలములో కనబడుచున్న వెలుగై యున్నానని ఆయనకు తెలుసు.
రెండవ మాట:- "మీరు లోకమునకు వెలుగై యున్నారు" మత్తయి, 5:14.
(1) నేను లోకమునకు వెలుగై యున్నానన్న మాట ఎంత విడ్డూరమో;
(2) మీరు లోకమునకు వెలుగై యున్నారన్న మాట అంతకంటే విడ్డూరముగా ఉన్నది.
ఉదా:- ఒక మీటింగులో కూర్చున్న పిల్లలను చూచి, మీరు గొప్ప పండితులు అని బోధకులు అంటే, ఆ పిల్లలు ఒకరి ముఖము వంక ఒకరు చూచుకొంటారు. 2,3 తరగతులు చదువుకొనుచున్న మనమేలాగు పండితులమై ఉన్నామని చెప్పుకొనుచు నవ్వుకొంటారు.
యేసుప్రభువు కొండమీద కూర్చుని నేను లోకమునకు వెలుగై యున్నాను. మీరు కూడా లోకమునకు వెలుగై యున్నారని చెప్పినప్పుడు, వారు ఒకరి ముఖము ఒకరు చూచుకొని, నవ్వుకొని, మేము ఏలాగు లోకానికి వెలుగై యున్నామని చెప్పుకొనిరి. ఆలాగనుకొనుట నిజమే. అప్పుడు అర్ధము చేసుకోలేదు గాని క్రమక్రమముగా వారును వెలుగై యున్నట్టు గ్రహించుకొన్నారు.
వారు కొండ దిగి వెళ్ళిపోన తరువాత-ఎన్ని మంచి మాటలు ఆయన మనతో చెప్పినా విన్నాము గాని, "మీరు వెలుగై యున్నారు" అని చెప్పి ఆయన మనలను గౌరవపరచినారు అని గ్రహించుకున్నారు. అయోగ్యులమైన మమ్మును, మాలో ఇంకా చీకటి ఉన్నప్పటికిని, పాపాంధకారమున్నప్పటికిని మమ్మును 'వెలుగూ అని ఎంతగా గౌరవపరచినారు అని వారు ఇతరులకు చెప్పగా; వారు చచ్చిపోయిన తరువాత ఆయా ఇతరులు మరొక ఇతరులకు చెప్పగా, ఆ ఇతరులు వేరొక ఇతరులకు చెప్పగా, ఆ వేరే ఇతరులు ఆ ఇతరులకు చెప్పగా, ఆ ఇంకొక ఇతరుల ద్వారా ఆ రెండు దీపాలు మన వరకు వచ్చినవి. ఈ రెండు దీపాలు లోకాంతము వరకు కూడా వెళ్ళును.
మనము ప్రతి ఆదివారము ప్రభువును గూర్చి మాట్లాడుకొనుట అనునది వెలుగా? లేక చీకటా? వెలుగే. ఆలాగే మేము ప్రభువును తెలిసికొన్నాము. మారుమనస్సు పొందినాము అని మనము చెప్పుకంటాము గనుక మనము కూడా వెలుగైయున్నాము.
మనము ఆ కొండ మీద కాకుండా, ఎవరైనా కట్టిన గొప్ప ఎత్తు అయిన గోపురము మీద నిలువబడి టెలిస్కోపుతో అన్ని ప్రక్కలకు చూస్తే, యేసుప్రభువు యొక్క శిష్యులు (విశ్వాసులు) ఐదు ఖండాలలో అనగా ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఐరోపా, దక్షిణ అమెరికాలలో ఉన్నారు. కాబట్టి మీరు లోకమునకు వెలుగై యున్నారని ప్రభువు చెప్పినది చాలా వరకు నెరవేరినది
(1) మీరు వెలుగై యున్నారనేది వేరు.
(2) మీరు లోకమునకు వెలుగైయున్నరనేది వేరు.
దీపము వెలిగించి మంచము క్రిద పెడితే వెలుగున్నది కాని అందరికికాదు.
గానీ యిప్పుడైతే అందరికీ వెలుగు ఉన్నది. అందరికీ అంటే ఎవరైతే తాము వెలుగై యున్నారో, వారు ఇతరులకు అనగా తక్కిన లోకమునకు వెలుగైయున్నారు.
(1) మీరంతట మీరు 'వెలుగై' యున్నారు.
(2) ఇతరులకు మీరు ప్రభువును గూర్చి చెప్పడము వలన వెలుగై ఉన్నారు. ఇతరులకు చెప్పి, మీ వెలుగుతో యితరులను వెలిగించండని ఆయన చెప్పిరి.
చరిత్రోపమానము:- నేటిరాత్రి దేవాలయములో మైనపువత్తులు వెలిగిస్తామని అనుకొనండి. ఎవ్వరిమట్టుకు వారు మైనపువత్తి తెచ్చుకొనండి. ఇక్కడున్న ఒత్తిచేత మీ వత్తులను వెలిగించండి అని అంటే వెలిగిస్తారు. వెలిగింపబడినవారి వత్తులచే, వెలిగింపబడని వారి వత్తులు వెలిగించండి. అప్పుడు దేవాలయమంతా వెలుగై ఉండును. అది ఏలాగనగా యేసుప్రభువు అనే దీపము ఇక్కడ నిలువబడి, మీరిప్పుడు లోకమునకు వెలుగై యున్నారని చెప్పినట్లున్నది.
మీరును మీ స్వస్థలములకు వెళ్ళిన తరువాత, మీరు ఇక్కడ వెలిగించబడి నందున వారిని మీరు వెలిగిస్తారు. ఆలాగే చేయండని మీకు సలహా యిస్తున్నాను. కాబట్టి మీరు మీరు వెలుగైయున్న యేసుప్రభువు యొక్క వెలుగు బిడ్డలై యుండండి. ఇదే స్థిరము అగునుగాక! ఆమెన్.