చిన్నబిడ్డల ప్రతిష్టారాధన
వాక్య పఠనము
లూక 2:21-32. 52, మత్తయి 18:3-6, 19: 13-15 మార్కు 10:13-16, లూక 18:17 కీర్తన 8:2,22:9.
బో: తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మునియొక్కయు, నామమున కృపాసమాధానములు మీకు కలుగును గాక! ఆమెన్.
ప్రియులారా! మన ప్రభువైన యేసు దేవాలయమునకు కొనిపోబడి సుమెయోనుచేత ప్రతిష్టింపబడెను. ఆ విధముగానే మన బిడ్డలను దేవాలయములలో దేవునికి ప్రతిష్టించుట క్షేమమును, దీవెనయునైయుండును. ప్రభువునకు నామకరణము చేసినట్లు మన బిడ్డలకును నామకరణము చేయుదము.
1. బోధకుడు: సైతాను కార్యములన్నిటిన్ విసర్జించునట్లు మీ బిడ్డను పెంచుదురా?
జవాబు : ప్రభువు సహాయము వలన అలాగుననే పెంచుదుము.
2. బోధ: దేవుని వాక్యము నేర్పుచు వానిని ప్రభువు మార్గమున పెంచుదురా?
జ: ప్రభువు సహాయము వలన అలాగుననే పెంచుదుము.
3. బోధ: బైబిలు మిషనువారు బోధించుచున్న బోధలు వారికి నేర్పుదురా?
జ: ప్రభువు సహాయము వలన అలాగుననే నేర్పుదుము.
(బోధకుడు బిడ్డను ఎత్తుకొని ప్రభువుకు ప్రతిష్టించి పేరు పెట్టవలెను.)
ప్రార్ధన
పరలోకపు తండ్రీ! యీ నీ బిడ్డను జ్ఞానమదును, వయస్సుమందును, దేవుని దయ యందును, మనుష్యుల దయయందును వర్ధిల్లునట్లు దీవించుము. తల్లిదండ్రులు బిడ్డను నీవాక్యమందును, దైవాసహవాసానుభవము నందును పెంచు కృప ననుగ్రహించుము! బైబిలు మిషనును నీవే బైలుపరచిన సంగతి యీ బిడ్డద్వారా వెల్లడిలోనికి వచ్చునట్లు కాపాడి నడిపించుము. మరియు సైతానుయొక్క సకల దుస్థితినుండి విడిపింపబడి ప్రభువైన క్రీస్తుమహిమ రాకడ కాయత్తపడునట్లు నీ పావనాత్మయొక్క నింపుదల దయచేయుమని త్వరగా రానైయున్న యేసునామమున వేడుకొనుచున్నాను. ఆమెన్.
దీవెనలు
ప్రభువు నీ బిడ్డను జ్ఞాన మందును, ఆరోగ్యాయుష్కాల మందును, విద్య యందును, దైవభక్తి యందును, సకలైశ్వర్యముల యందును వర్ధిల్ల జేసి తన చిత్తప్రకారము వాడుకొనును గాక! ఆమెన్.
పరలోక ప్రార్ధన
దీవెన.
Please follow and like us: