దేవుడు మన యెడల ఎంత దయగలవాడు!
- మనము జన్మింపక మునుపే వెలుగు, నీరు, గాలి, వృక్షాలు, జీవరాసులు,
వెండి, బంగారం మొదలగు ఖనిజములు, ఆకాశము, భూమి ఇవి ఆయన
కలుగ జేసెను. గనుక దేవుడు మన యెడల ఎంత దయగలవాడు!
ఆదికాండము 1వ అధ్యాయము.
- నేను మీ దేవుడను అని చెప్పి ఆయన నిర్గమ 20:1లో వ్రాయించెను.
దేవుడు చూస్తే ఎక్కడో మహోన్నతాకాశంలో ఉన్నాడు. మనము చూస్తే ఎన్నో
మైళ్ళ దూరంలో భూమి మీద ఉన్నాము. స్థలమును బట్టి ఆయనకు మనకు
ఏమి సంబంధము? అయినను నేను మీ దేవుడను అను మాటలలో
సంబంధము కలిపినాడు. గనుక దేవుడు మన యెడల ఎంత దయగలవాడు!
దేవుడు చూస్తే పరిశుద్ధుడు. మనము జన్మము నుండి పాపులమై
యున్నాము గనుక ఏమి సంబంధము? అయినను ఈ మాటల వల్ల సంబంధం
కలిపినాడు. గనుక దేవుడు మన యెడల ఎంత దయగలవాడు!
- నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమములను తుడిచి
వేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసికొనను యెషయ 43:25.
దేవునికి ఒకరు బోధించినందు వలన కాదుతన స్వంత యిష్టము చొప్పుననే
మన పాపములు పరిహరించుచున్నాను అని చెప్పుచున్నాడు. ఇదెంత గొప్ప.
కష్టములకు కారణమగు పాపమును అనగా మోక్షమునకు వెళ్ళనియ్యని
పాపమును పరిహరించుట ఆయనకు ఇష్టమైయున్నది. సృష్టికర్త మన యెడల
ఎంత దయగలవాడు మన పాపములను క్షమించుట మాత్రమే గాక పాపము
జ్ఞాపకము చేసికొనను అని సెలవిచ్చుచున్నాడు. ఇది ఎంత ఆశ్చర్యకరమైన
ప్రేమ. మనమెవరినైన క్షమించిన యెడల వారు కనబడినపుడు వారి పాపము
జ్ఞాపకమునకు వచ్చును. మనసులో కష్టము తోచును. దేవునికిదేవునికి
అట్లుండదు. తండ్రి మన యెడల ఎంత దయగలవాడు!
4. "రక్షింపనేరక యుండునట్లు యెహోవా (దేవుని) హస్తము కురుచకాలేదు
యెషయా 59:1. మనకు క్షమాపణ కల్గిన తరువాత పాపంలో పడి
పాతాళలోకమంత లోతునకు వెళ్ళు స్థితి లభించినను దేవుని చైఅయి అక్కడకు
వచ్చి నిన్ను పట్టుకొని లేవనెత్తగలదు. అధోగతి పాలగు నిన్ను రక్షించుటకై
ఆయన చేయి అంత పొడుగైన చేయి అని అనిపించుకొను శక్తిగల చేయి.
పరలోకపు తండ్రి మన మీద ఎంత దయగలవాడు!
- “విననేరక యుండునట్లు ఆయన (దేవుని) చెవులు మందము కాలేదు”
యెషయా 59:1. ఈ వచనములో మనము చేయు ప్రార్ధనలను
గురించియున్నది. మన ప్రార్ధనలు ఆయన ఆలకించును. అని తెలిసికొనుట వల్ల
మనకెంత ధైర్యం కలుగును. మనము మనసులో చేసికొను ప్రార్ధనలు సైతము
ఆయన వినగలడు. వినును గనుక సర్వలోకాధికారి మన యెడల ఎంత
దయగలవాడు!
6. "నేను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైన దేదైన
యుండునా?” యిర్మియా 32:27, నా చిత్తానుసారముగా పాపములు తుడిచి
వేతునన్న మాటలో దేవుని యొక్క ఇష్టమును, నాకు అసాధ్యమైన దేదైన
యుండునా? అను మాటలో ఆయన శక్తియు కనబడును. మనలను
రక్షించుటకు ఆయనకు ఇష్టమును, శక్తియును కలదని మనము వినుట ఎంత
సంతోషము. మనము ఎన్ని పాపములు చేసిన ఫర్వాలేదు అని ఈ వ్యాసము
చదివిన వారనుకొనకూడదు. ఎందుకనిన నీకు ఇష్టముంటేనే నిన్ను ఆయన
రక్షించును. నీ కిష్టమున్న యెడల ప్రార్ధింపవచ్చును. ఆయన నిన్ను
రక్షించును. ఇష్టము లేనియెడల ఇష్టము కలుగునట్లు ఇట్టి బోధలు
వినిపించును. మనస్సాక్షి చేత చెప్పించును. అపుడైనను నీకు ఇష్టము కలుగని
యెడల నీ వెట్లు రక్షణ పొందగలవు? ఆయన నీ ఇష్టమునకు వ్యతిరిక్తముగా
బలవంతపరచి నిన్ను రక్షింప వీలులేదు. నీ దృష్టికి ఏది అసాధ్యమో అది
ఆయనకు సాధ్యమే. మన సృష్టికర్త ఎంత దయగలవాడు!
7. "తమ ఆలోచననుసరించి చెడు మార్గమున నడచుకొనుచు లోబడనొల్లని
ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను” యెషయా 65:2.
మనము ఆయన యొద్దకు వెళ్ళినను, వెళ్ళక పోయినను నిత్యం చేతులు
చాపుచునే యున్నాడు. తండ్రి తన బిడ్డలను తన సందిట చేర్చుకొను సంగతి
ఇక్కడ జ్ఞాపకము వచ్చును. దేవుడు శరీరధారియై, యేసుక్రీస్తు అను నామంతో
ప్రసిద్ధికెక్కి, మన కొరకు తన ప్రాణము బలిగా పెట్టెను. ఆయన చెప్పిన మాట
జ్ఞాపకము .వచ్చుచున్నది అదేదనగా “ప్రయాసపడి భారము మోసికొనుచున్న
సమస్తమైన వారలారా! నా యొద్దకు రండి.నేను మీకు విశ్రాంతి కలుగజేతును”
మత్తయి 11:28.
- దేవుని సేవించు వారికి ఒక వాగ్ధానం గలదు అదేదనగా “మీ దేశమునకు
వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని దాని కాలమున
కురిపించెదను. అందు వలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును,
నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల
కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను” (ద్వితి 11:14, 15). ఇదివరకు
చెప్పుకొన్న వచనములు మనపారమార్ధిక జీవితము యొక్క ఉపయోగార్ధమై
వ్రాయబడినవి. ఈ వచనము మన భూలోక జీవితం యొక్క ఉపయోగార్ధమై
వ్రాయ బడినది. న్యాయం చొప్పున మనకును, పశువులకును ఇబ్బంది,
కరువు రాకూడదు. అవి వచ్చిన యెడల లోపము, ఇబ్బందులు
అధిగమించును. అనాది దేవుడు మన మీద ఎంత దయగలవాడు అనునది ఈ
వచనంలో ప్రత్యక్షమగుచున్నది.
- శాస్వత కాలము నిలుచునట్టి క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని దేవుడు
కలుగజేయనై యున్నాడు అని యెషయా 66:22 లో గలదు. పాపము,
వ్యాధులు, ముళ్ళు, విషపురుగులు, కౄర మృగములు, శత్రువులు, అనేక
విధములైన ఆపదలు గల ఈ లోకమును ఆయన గతింపజేసి మనకు నూతన
లోకము దయచేయునను సువార్త వార్తా పత్రికలన్నియు సత్కరింప వలసిన
వార్త, నన్ను కలుగజేసిన తండ్రి ఎంత దయగలవాడు!
- “శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ
యెడల కృప జూపుచున్నాను” యిర్మియా 31:3 ఈ వచనము ఈ లోకంలోను,
పై లోకంలోను మనమనుభవించు ప్రేమను వెల్లడించుచున్నది. ఆయన ప్రేమ
రెండు లోకములలోను ఉపయోగము. ఈ లోకంలో మనము ఆయన సందిటి
ప్రేమను అంగీకరించిన యెడల మోక్షలోకములో అనంతము వరకు ఆయన
సన్నిధి ప్రేమను అనుభవింపగలము. చదువరులారా! ఏ విషయంలోను
నిరాశపడరాదు. దేవుని దీవెన మీకు అందును గాక! ఆమెన్.