లోకములో నున్న ప్రజలందరు మూడు భాగములుగా విభజింపబడి యున్నారు.
మొదటి జనాంగము ఏర్పాటు ప్రజలైన యూదుల జనాంగము.
రెండవ జనాంగము సంఘము.
మూడవ జనాంగము అన్యులు.
ప్రియ చదువరులారా! యేసుప్రభువు ఈ లోకమునకు వచ్చినప్పుడు యెవరైన ఒకరు ఆయనను ఈ మూడు జనాంగములకు దర్శనము చేయించవలెను. అనగా ఇదిగో మీ కొరకై ఈ భూమి పైకి వచ్చిన రక్షకుడు. ఈయనను మీరంగీకరిస్తే మీ బ్రతుకు నెగ్గునని
చెప్పవలయును.
ఇదిగో యూదా జనాంగమా! ఈయన మీవాడే. ఇదిగో క్రైస్తవ జనాంగమా! ఈయన మీ వాడే. ఇదిగో అన్య జనాంగమా! ఈయన మీవాడే అని ఒకరు చెప్పవలయును. ఈ విధముగా జరిగినట్లు దేవుని గ్రంధమందు మూడు జనాంగములలో అట్టి పని జరిగినదనియు,
మూడుజనాంగములకు సంబంధమున్నదనియు మనము చూడగలము.
1వ భాగము:- యూదులకు సంబంధించిన కథ యోహాను 12:14. "ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు" మట్టల పిల్లల కథలో ఇదిగో నీ రాజు అని జెకర్యా 9:9 లో యున్న మాటలున్నవి. ఈ మాటలు ప్రవక్త యూదులను ఉద్దేశించి వ్రాసిన
మాటలు. ప్రభువు యూదుల రాజై యున్నాడు. ఆయన వరుసకు వారికి రాజైయున్నాడు. రాజనగా తన ఆజ్ఞ ప్రకారము తన ప్రజలను నడిపించేవాడు. ఒక వేళ యెపుడును తన ప్రజల ఇష్ట ప్రకారమే నడిచిన యెడల అతడు రాజు అనే బిరుదుకు అర్హుడు కానేరడు.
పాఠక మహాశయులారా! మీరు ప్రభువును రాజుగా అంగీకరించండి. మీ పంతములు, మీ యిష్టము నెరవేర్చుకొనుటకు చూడవద్దు గాని ప్రభువు, చిత్తమును ఆయన మాటలను నెరవేర్చి ఆయనను మీ రాజుగా అంగీకరించిన యెడల మీరు ధన్యులు. యూదులు
ప్రభువును అంగీకరించక సిలువ వేసిరి. కనుక ఇప్పటికి వారు శాపగ్రస్తులై దేశ దేశములకు చెదరగొట్టబడిరి. వారు చేసిన గొప్ప తప్పేదనగా ప్రభువును వారు లోక రాజుగా యెంచుకొన్నారు. ఇదే వారు చేసిన గొప్ప తప్పు. ప్రియ చదువరీ! నీవు ఈ రెంటిలో యే
విధముగా ప్రభువును అంగీకరించుచున్నావు. ఆత్మీయ రాజుగానా? లేక లోక రాజుగానా? నీవు పరీక్షించు కొనుము. లోక రాజుగా తలంచిన యెడల యూదుల స్థితిని జ్ఞాపకము తెచ్చుకొనుము.
మీ యాత్మీయ రాజు రెండవసారి త్వరలో వచ్చి నిన్ను తీసికొని వెళ్ళనైయున్నాడు. కనుక నీవు అంగీకరించి నీ యాత్మీయ రాజు యొక్క అంతము లేని మహిమ రాజ్యములోనికి వెళ్ళుటకు సిద్ధపడుచుంటివా? లేని యెడల యూదులను జ్ఞాపకము చేసికొనుము.
మనము లోక రాజును గూర్చి యాలోచింతుము. రాజైన వెనుక తన ప్రజలను వారి శత్రువుల బారి నుండి విడిపించగల శక్తి గలవాడై యుండవలెను. ప్రభువు ఆ విధముగానే మనలను సైతాను, దయ్యములు, పాపములు, వ్యాధులు, శ్రమలు, శిక్షలు,
మరణములు, నరకము వీటన్నిటి నుండి గెలిచి మనలను వీటి దాస్యము నుండి విముక్తులనుగా జేసినాడు గనుక ఈయనే నిజమైన రాజు. ఈయన లోక రాజు కన్న గొప్ప రాజు. లోక రాజు యుద్ధభూమి యందు శత్రువుల కెదురుగా తాను నిలువక మొదట తన
సేనాధిపతులను నిలువబెట్టి శత్రూల కెదురుగా తాను నిలువక మొదట తన సేనాధిపతులను నిలువబెట్టి వారు శత్రువులను గెలువ లేక ఓడి మరణించిన యెడల అప్పుడు రాజు శత్రువులతో పోరాడును. మన రాజైతే ఎవ్వరి సహాయము లేకుండనే తానే
స్వయముగా పై చెప్పిన మన విరోధులను జయించియున్నాడు. అట్టి రాజు మనకుండగా యితరమైన వేవియు మనల నేమియు చేయజాలవు. గనుక నీవు శత్రువుల నుండి విముక్తుడవు కావలయునంటే ప్రభువైన రాజును అంగీకరించి ఆయన రెండవ రాకడకు
కనిపెట్టుము. ప్రక 5:5 “ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సిం హము ఏడు ముద్రలు తీసి ఆ గ్రంధమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను.”
2వ భాగము:- సంఘము- క్రీస్తు ప్రభువు సంఘమునకు గొఱ్ఱెపిల్ల వంటివాడై యున్నాడు. ప్రక 5:6- "మరియు సిం హాసనమునకు ఆ నాలుగు జీవులకును, పెద్దలకును మధ్యను వధింప బడినట్లుండిన గొఱ్ఱెపిల్ల నిలిచి యుండుట చూచితిని. ఆ గొఱ్ఱె పిల్లకు ఏడు
కొమ్ములును, ఏడు కన్నులుండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడినదేవుని యేడు ఆత్మలు.”
యోహాను 1:29- “మరునాడు యోహాను, యేసు తన యొద్దకు రాగా చూచి-ఇదిగో లోకపాపములు మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల” అని చెప్పెను.
ప్రభువు రెండవ రాకడలో విశ్వాసుల సంఘమైన సత్య సంఘమును ఆయన పరలోకములోనికి తీసికొని వెళ్ళును. అచ్చట గొఱ్ఱెపిల్ల యొక్క వివాహము జరుగును. ఆ వివాహమునకు ఎత్తబడిన సత్యసంఘమే పెండ్లికుమార్తెగా కూర్చుండును. కనుక దీనిని
బట్టి చూడగా క్రీస్తు పెండ్లి కుమారుడగును; మరియొక రీతిగా గొఱ్ఱెపిల్లయగును. ఎట్లనగా తాను గొఱ్ఱెపిల్ల వంటి సాధుత్వముతో లోకమునకు వచ్చి సిలువపై బలియై, తన స్వంత రక్తమును ధారపోసి, ఆ రక్తముతో సంఘమును ఆస్థిగా కొనుక్కొని యున్నాడు గనుక
సంఘము ప్రభువునకు పెండ్లికుమార్తెయైనది. ఇది యిప్పుడు మనము ఆలోచించుచున్న యంశమైయున్నది. యూదులొక్కరే సంఘము కారు గాని అన్యులును, యూదులును కలిసి సంఘను. అప్పుడాయన పెండ్లి కుమారునిగా వచ్చి, తన పెండ్లి కుమార్తెయగు
సత్య సంఘమును తీసికొని పోవును కనుక యెవరైతే పెండ్లి కుమార్తె వరుసలో యుంటారో వారే ప్రభువు పెండ్లి కుమారుడుగా వచ్చినప్పుడు యెత్తబడుదురు. ఆత్మ చెవులున్న వాడు ఈ సంగతులు వినును గాక! ఆత్మ జ్ఞానము గలవారు గ్రహింతురు! యూదుల
వలె మన మేమాత్రము తప్పు అభిప్రాయపడినను, పెండ్లి కుమారుడైన ప్రభువు నందు ప్రేమ తగ్గినను పెండ్లి కుమార్తె వరుసలోనికి రాజాలము. కాబట్టి జాగ్రత్త!
3వ భాగము:- అన్యులు- యోహాను 19:5 ఆ ముండ్ల కిరీటమును ఊదా రంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు -“ఇదిగో ఈ మనుష్యుడు” అని వారితో చెప్పెను. పిలాతు కోర్టులో కూర్చుండి “ఇదిగో ఈ మనుష్యుడు” అని యూదులకు
చెప్పబడినప్పుడు, అన్యుల కోర్టులో యూదుల గుంపులో యున్న అన్యులకు ఈ మాట చెప్పబడెను. యూదా, క్రైస్తవ జనాంగములకు చెప్పుటయైనది. ఇప్పుడు అన్యులకు చెప్పుటయున్నది. మనుష్యులందరిలోను శ్రేష్టమైన మనుష్యుడు కనబడిన యెడల
అన్యులు ఆ శ్రేష్టమైన మనుష్యుని నమ్ముదురు. ఆయన గొప్పవాడని ఎప్పుడు తెలిసికొనెదరో అప్పుడు ఆయనను వెంబడించెదరు.
ప్రకటన 5:13 అంతట పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన ప్రతి సృష్టము అనగా వాటిలో నున్న సర్వమును-సిం హానాసీనుడైయున్న వనికిని, గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును
యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని .
వెయ్యేండ్ల పరిపాలనలో కోటాను కోట్ల ప్రజలు క్రీస్తు ప్రభువును గొప్ప మనిషిగా తెలిసి కొనెదరు. ఓ క్రైస్తవుదా! నీవు బోధ నిమిత్తమై మనుష్యులను ఆశ్రయించుట తప్పని నేను చెప్పుట లేదు గాని, అసలు రక్షణ విషయమై పరలోకమునకు తయారగుట కొరకు,
యేసను గొప్ప మనుష్యుని, జీవము గలిగిన మనుష్యుని, మాదిరి చూపించిన మనుష్యుని ఆశ్రయింపవలెను. ఇది తప్పితే యూదులకును, క్రైస్తవులకును, అన్యులకును గతి లేదు. ఒక ముసలాయన యొక జమీందారుని కుమారుని ఒక దేశమునకు తీసికొని
వెళ్ళి ప్రజలకు ఇదిగో మీ దేశమునేలు రాజని చెప్పగా వారంగీకరించిరి. కొంత కాలమునకు మరియొకరింటికి తీసికొని వెళ్ళి ఇదిగో మీ అల్లుడు అనగా పెండ్లి కుమారుడు అని చెప్పెను. ఇంకొక దేశము వెళ్ళి సంబంధములేని మనుష్యులను చూచి ఇదిగో ప్రజలారా!
ఈయన అసలైన మనిషి. ఈయనలో యే లోటును లేదు. మనుష్యులలో ఎంత మంచి వారికైనను యొక లోటుండును. ఈయనలో ఏ లోటును లేదు గనుక ఈయనను వెంబడించి నడుచుకొనుడి. ఈ సంపూర్ణ మనిషిని వెంబడించిన మీరును సంపూర్ణులు కాగలరని
చెప్పెను. మరియు అతడు చెప్పిన దేమనగా ఈ భూలోకములో యుండే మనుష్యులు మోక్షానికి వెళ్ళవలెను గదా ఈ మనుష్యుని పట్టుకుంటే వెళ్ళగలరని చెప్పెను. ప్రియ చదువరీ! ఆ మాదిరి మనిషి సంపూర్ణ మనిషి, నిజమైన మనిషి ఎవరని తలంచు చున్నావు?
ఆయనే రెండవసారి తన మహిమతో మేఘారూఢుడై, సత్య సంఘమైన పెండ్లి కుమార్తెను తీసికొని వెళ్ళుటకు త్వరలో రానైయున్న పెండ్లి కుమారుడైన యేసు.
ప్రియ చదువరులారా! చివరగా నేను చెప్పునదేమనగా ప్రభువు యూదులకే కాదు మనకును రాజు. పెండ్లి కుమారుడునై యున్నాడు. మనలను తన వలె శ్రేష్టమైన మనుష్యులనుగా చేసే నిజమైన మనిషియై యున్నాడు గనుక మనము ఆయనకు కృతజ్ఞులమై
యున్నాము. అట్లయిన మన మర్యాద దక్కును, లేనియెడల దక్కదు.
ప్రభువు మనలను త్వరగా తన మహిమతో ఎదుర్కొని, పరమ విందు ననుభవించుటకు తన పరిశుద్ధాత్మ శక్తితో నింపి సిద్ధపరచును గాక! ఆమెన్.