1) వేద విధ్యార్ధీ! దేవుడు కలడు, లేడు, దూతలు కలరు, లేరు, మోక్షము కలదు, లేదు, సైతాను కలడు, లేడు, పిశాచములు కలవు, లేవు. పాపము పాపము కలదు లేదు. నరకము లేదు, కలదు-ఈ మాటలు అనేక మంది ప్రజల వాదములలో
వినబడుచున్నవి.
2) దేవుడు కలడను నిశ్చయము లేకపోయినను బోధ వలన నమ్మిక కలుగకపోయినను, నీ మట్టుకు నీవు నమ్మి ప్రార్ధించి స్తుతించి చూడుము. నీవు చనిపోయిన తరువాత దేవుడు నీకు కనబడినయెడల నిన్ను సంతోషముతో తన సన్నిధికి చేర్చుకొనును.
నీకు నిత్య పరమానందము కలుగును.
3) ఒకవేళ నీవు ఏ మాత్రము నమ్మనియెడల జీవాంతమందు దేవుడు కనబడగా నిను శిక్షిమ్ను. అప్పుడు ప్రలాపింతువు. ఇది రాకుండ చేసికొనుటకై ఉన్నాడని నమ్ముము.
4) ఒకవేళ దేవుడుగాని తక్కినవిగాని లేవని మరణ సమయమందు తెలిసిన యెడల నీకు మోక్షముగాని ఉండదు. అట్లైన నీవు ఒక విధముగా ధన్యుడవే.
5) ఉండదు, ఉండవు అని నేను చెప్పుటలేదు. దేవుడు మన నిమిత్తమై నరునిగా జన్మించి మనకు చేసిపెట్టవలసినవన్నియు చేసిపెట్టెను. ఆయన పేరే యేసుక్రీస్తు. దేవుని నమ్మండి అని చెప్పిన యెడల అనేకులు సుళువుగా నమ్ముదురు. ఆ దేవుడే
క్రీస్తయినాడు గనుక నమ్మండి అని చెప్పిన యెడల మనుష్యుని ఎందుకు నమ్మవలెను అని వాదింతురు. దేవుడన్నను, క్రీస్తన్నను ఒకటే అని చాల మందికి అర్ధముకాదు-మీరు నమ్ముచున్నారు. నన్నును నమ్మండి అని యేసుప్రభువు ఒకప్పుడు ఒక
సమూహమునకు చెప్పెను. దీని అర్ధమేమి? పైన చెప్పిన అర్ధమే. ఆయనను చూచి మనుష్యుడే అనుకొనుచున్నారు దేవుడని అనుకొనుటలేదు. దేవుని నమ్మువారు క్రీస్తుప్రభువును త్వరగా నమ్మగలరు. ఒక పట్టణస్థులు సిం హాసనము మీద ఉన్న రాజుగారిని
చూచి నమస్కరింతురు. ఆయనే రాజ వస్త్రములు తీసివేసి ఒక బీదవాని గుడిసెలో చాప మీద కూర్చుండి ఆమె కష్టసుఖములు వినుచుండగా ఈయన రాజు అని ఆమె గుర్తుపట్టనేరదు.ఏమి అట్లు తేరి చూచుచున్నావు? నేను సిం హాసనము మీద ఉన్నప్పుడు నన్ను
చూచినావు గదా! ఆయననే నేను అని చెప్పగా గుర్తుపట్టి మహాప్రభూ, ఈ బీదవారి యెడల నీకెంత జాలి అని పలికి నమస్కరించును. అట్లే పూర్వము జరిగినది. క్రీస్తుప్రభువును మొదటిసారి చూచినవారు దేవుదని గ్రహించి ఆయన మాటలనుబట్టియు,
అద్భుతములైన ఉపకారములను బట్టియు, శాంతమునుబట్టియు ఆయన దేవుడని క్రమేణా గ్రహించిరి. ఇప్పుడును అట్లే జరుగుచున్నది. యేసుప్రభువు మనకొరకు మరణమై, బ్రతికివచ్చి పరలోకమునకు వెళ్ళి, నమ్మినవారిని ప్రాణముతో తీసికొనిపోవుటకు మిక్కిలి
త్వరలో రానైయున్నాడు.