రక్షణ వార్తావళి

⌘K
  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి...
  4. నిర్భీతి

నిర్భీతి

దేశీయులారా! దేవాది దేవుని నామమందు మీకు శుభము కలుగును గాక, ఆపత్కాలమందు నిర్భీతి కలుగునుగాక, దుర్వార్తల సమయమందు దేవుని శుభవార్తలు వినబడునుగాక, మనము ఏ కారణము చేతనైనను భయపడకూడదు. భయపడుటకు

కారణములు లేకపోవు, అయినను విపత్తును చూచి ఏ మాత్రమును భయపడకూడదు. మనకు సహాయముగనున్నాడు. మనలను పుట్టించిన దేవుడు మనలను ఆపదలపాలు చేయునా? మన తండ్రి మనకు హాని కలుగనిచ్చునా? గనుక మనము

భయపడకూడదు. మనమీదికి కీడు రప్పించుటకే ఆయన మనలను పుట్టించినాడా? మీరు ఆలాగు అనుకొనుచున్నారా? దేవుని యందు మీకు అట్టి దురాభిప్రాయముండకూడదు. దేవుడన్న ఆయన మంచివాడు, పరిశుద్ధుడు. ఉపకారి గదా! ఆయన మనలను

ఆపద కూపములో ముంచివేయునా? దురవస్థలో వేసి నాశనము చేయునా? దేవుడు మనలను కాపాడువాడే గాని కాపాడనివాడు కాడు. ఇది మనము బాగుగా జ్ఞాపకముంచూకొనవలెను. మరచి పోకూడదు; ముఖ్యముగా కష్టకాలములో ఈ మాట

బలవంతముగానైనను జ్ఞాపకమునకు తెచ్చుకొనవలెను. లోకములో ఏ ప్రక్క చూచినను ఆపదలు గలవు. మనము చేసికొన్న పాపములవల్ల ఆపదలు వచ్చుచున్నవి గాని దేవుని వల్ల రావడము లేదు. దేవుని వల్ల మనకెప్పుడును అపకారము కలుగదు.

ఉపకారమే కలుగును. అందుచేత మనము భయపడకూడదు. ఆయన మహా మహోపకారి. దేవునికిగల కొన్ని బిరుదులు చెప్పబడినవి. 1) ఆయన మన సృష్టికర్త 2) మన తండ్రి 3) మనలను కాపాడువాడు 4) మహోపకారి. కాబట్టి మనము భయపడరాదు. ఈ

నాలుగు బిరుదులు మరచిపోకూడదు. భీతికాలములో ఈ నామాంతరముల వలన గొప్ప శాంతి కలుగును. అప్పుడు మన భయము పోవును. భయము అనునది ఒక నీరసగుణము. భయము, దిగులు, గుండెదడ, అదురు, బెదురు ఇవి నీరసగుణములు. ఇవి

ఎందుకు వచ్చినవి? ఇవి దేవుడు సృష్టిలో కలుగజేసినవా? కాదు ఇటీవల వచ్చినవే. పాపము అనునది లోకములోనికి రాకున్న యెడల ఇవి కూడ రాకుండ నుండెడివి. భయము ఏలాగుపోవును? పాపము తీసివేసికొనిన పోవును. అయితే పాపము ఏలాగు

పోవును? పాపము పోగొట్టుకొనవలెననిన యెడల దేవునికి ప్రార్ధన చేసిన పాపముపోవును. దీనినే పాపపరిహారము అందురు.

   కాబట్టి ప్రియులారా! దేవుని ప్రార్ధించండి. మూడు అవస్థలు తీసివేయుమని ప్రార్ధించండి. పాపము ఒక అవస్థ, భయము రెండవ అవస్థ, ఆపద మూడవ అవస్థ, దైవ ప్రార్ధనవల్ల ఈ మూడు అవస్థలు అంతరించిపోవును. గనుక ప్రార్ధించండి. ఆనందించండి. 

నిర్భయముగా నుండండి. దేవుడు ఒకప్పుడు మానవుడై జన్మించినాడు. మన భయములు తీర్చుటకు, మనతో మాట్లాడుటకు, మన పాపములు పరిహరించుటకు, మనలను పవిత్రులనుగా చేయుటకు, మనతో కలిసిమెలసి యుండుటకు జన్మించెను. కాబట్టి

సంతోషించండి. భయపడకండి. ఎందుకనగా దేవుడు మనకు తోడైయున్నాడు. మనతోనేయున్నాడు. దేవుడు దేవుడుగా ఉన్నప్పుడు ఆయన దేవుడే. ఆయనకు పేరులేదు. దేవుడు మనిషిగా పుట్టిన తరువాత మనుష్యులాయనను పిలుచుటకు యేసుక్రీస్తు అను

పేరు పెట్టుకొనెను. దేవుడు దేవుడుగా నున్నాడు. మనుష్యుడుగా కూడా యున్నాడు. అటువంటి ఆయన మన యొద్దనున్నాడు గనుక భయపడవద్దు. ఆయన ఈ భూమి మీద నున్నప్పుడు ఒక రోజున యేమి జరిగినదనగా-శిష్యులను వెంటబెట్టుకొని సముద్రము

మీద ప్రయాణము చేయుచుండెను. శిష్యులు దోనె నడిపించుచుండిరి. క్రీస్తు ప్రభువు దినమంతయు బోధ చేసి అలసిపోయినందున ఆయనకు నిదురపట్టెను. ఇంతలో పెద్దగాలి రేగినది. అది సామాన్యమైన గాలికాదు. ఊళ్ళు ఊళ్ళు కొట్టుకొనిపోవు గాలి, దోనె

ఊగులాడుచున్నది, మునిగిపోయెటట్లున్నది. కెరటాలు దోనెలో పడుచున్నవి. శిష్యులు నీటి ప్రయాణములలో ఆరితేరిన వారే గాని ఏమి చేయలేక పోయినారు. వారికి భయము కలిగినది. అందరము ఒక్కసారే బుడంగున మునిగిపోతా మనుకున్నారు. వెర్రి కేకలు

వేసినారు గాని యేసుప్రభువు సుఖముగానే నిదురపోవుచున్నారు. అప్పుడు వారు “బోధకుడా! మేము నశించి పోవుచున్నాము; నీకు చింత లేదా?” అని కేకలు వేసినారు (మార్కు 4:38). అప్పుడాయన లేచి శిష్యులను గద్దించిరి. మీరెందుకు

భయపడుచున్నారు? మీ విశ్వాసమెక్కడ? అని వారిని మందలించెను. ఆ తర్వాత గాలిని, సముద్రమును ఆపుచేసెను. అప్పుడు ప్రయాణము బాగుగా జరిగెను. వాన మునిగిపోవు స్థితికి వచ్చెను గనుక ఆ పండ్రెండు మంది శిష్యులు అడలిపోయిరి. ఆ

అడలిపోవుటయే నేరమాయెను. అందుకే ప్రభువు వారిని గద్దించెను. దీనిని బట్టి భయము నేరము కదా! గనుక ఎంత ఆపద ఉన్నను భయపడవద్దు. యేసుక్రీస్తు ప్రభువు నిద్రపోవు చున్నప్పటికిని వారి దగ్గరనే యున్నారు. గనుక శిష్యులు భయపడకుండ

యుండవలసినది. గనుక ఎట్టి ఆపదయున్నను మనము నమ్మిన యెడల ఆయన సహాయము మనకు తప్పకుండ కలుగును.

Please follow and like us:

How can we help?