“ఒక మనుష్యునుకి ఇద్దరుకుమారులుండిరి. వారిలో చిన్న వాడు-తండ్రి ఆస్థిలో, నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రి నడుగగా, అతడు వానికి తన ఆస్థిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, దూరదేశమునకు ప్రయాణమైపోయి, అచ్చట తన ఆస్థిని దుర్వాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడసాగి, వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడును వాని కేమియు ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను, నీ యెదుటను పాపము చేసితిని; నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని, అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను, నీ యెదుటను పాపము చేసితిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి; క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము; ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను. తప్పిపోయి దొరికెనని చెప్పెను; అంతట వారు సంతోషపడ సాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు (పొలము నుండి) వచ్చుచు ఇంటిదగ్గరకు రాగా, వాయిద్యమును, నాట్యమును జరుగుట విని దాసులలో ఒకనిని పిలిచి-ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చియున్నాడు; అతడు తనయొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక పోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి (లోపలికి రమ్మని) బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో – ఇదిగో ఇన్ని యేండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే; అయినను నా స్నేహితులతో సంతోష పడునట్లు నీవు నాకెన్నడును ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్థిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీనికొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను. అందుకతడు -కుమారుడా, నీవెల్లప్పుడును నాతో కూడ ఉన్నావు; నా వన్నియు నీవి; మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే; ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను. తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను.” (లూకా 15:11-32)
వివరము:- క్రైస్తవమతము భూలోక కాలచక్రమును బట్టి మూడు భాగములు:-
- సృష్ట్యాదిని కలిగిన నరవంశ జననీజనకులగు ఆదాము, హవ్వల కాలము నుండి అబ్రహాము కాలము వరకు ఉన్న దైవజ్ఞుల మతము, దైవమతమనియు, యెహోవా మతమనియు చెప్పదగిన మతము. అయినను అది “అంతరంగక్రైస్తవ మతమై” యున్నది. దానిలో నుండియే భూలోకములోని అన్ని జనాంగములను, అన్ని మతములును లేచినట్టు ఆదికాండము 9,10,11 అధ్యాయముల వలన తేలుచున్నది. 2. అబ్రహాము మొదలుకొని క్రీస్తు యొక్క దైవ నరావతారము వరకు ఉన్న సశేష దైవమతము, యూదుల మతము. కనుక యూదులు అంతరంగ క్రెస్తవ మతములోని వారే. 3. క్రీస్తు వచ్చి ముప్పది మూడు సంవత్సరముల ఆరు నెలలలో మహా రక్షణ కార్యము ముగించి, దేవ లోకమునకు ఆరోహణమైన పిమ్మట స్థాపితమై, నేటి వరకు సాగుచున్న మతము “బహిరంగక్రైస్తవ మతమై” యున్నది. ఇది అన్ని దేశముల మతమని గ్రహింపనగును. ఇది ప్రకటన మతము. సర్వజనోపకార మతము. సర్వ జనాంగములకు ఉద్దేశింపబడిన మతము. ఆహ్వాన మతము. సైతానును, అతని రాజ్యమును కూల్చు మతము.
మరియొక వివరము:- తప్పిపోయిన కుమారుని చరిత్ర:- ఆస్థి అడుగుట, దూర దేశము వెళ్ళుట, ఆస్థిని పాడుచేయుట, ఇబ్బంది పడుట, కూడని వృత్తి యగు పందులను మేపుట, వాటికి వేయుపొట్టు తినగోరుట – ఈ మొదలగు కాని పనులుచేయు స్థితికి తండ్రి కారకుడు కాడు కాని పుత్రుడే కారకుడు. అలాగే మానవులు చేయు చెడుగునకు సృష్టికర్తయైన తండ్రి కారకుడుకాడు. కుమారుని తండ్రి చేర్చుకొని ఆది సౌఖ్యమును, స్వాతంత్య్రమును అనుగ్రహించెనుగదా! అట్లే పాపి మారుమనస్సు పొంది, “దేవా క్షమించుము” అని పలికిన యెడల రక్షించి, మోక్ష మందిరమునకు చేర్చుకొనును. చదువరులారా! ఇట్టి ధన్యత మీకు అక్కరలేదా? దేవుడు మిమ్మును, అందరిని దీవించును గాక. ఆమెన్.