దేవుడు యేసుక్రీస్తుగా భూమి మీద వెలసినప్పుడు ప్రజలకు వినిపించిన ధర్మోపన్యాసములలోని వచనములు కొన్ని ఇక్కడ ఉదహరించుచున్నాము. సహమానవుల యెడల మనమెట్లు ప్రవర్తింపవలెనో అవి ఈ వాక్యములలో కనబడును.
1) కనికరము గలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు. 2) సమాధాన పరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు. 3) నరహత్య చేయ వద్దు నరహత్య చేయువారు విమర్శకు లోనగునని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా! నేను మీతో చెప్పునదేమనగా-తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. 4) తన సహోదరుని చూచి వ్యర్ధ్డా అని చెప్పువాడు మహాసభకు లోనగును. 5) ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠము యెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళిన నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించుము. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్ధన చేయుడి. 6) మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా! మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? 7) క్షమించుడి. అప్పుడు మీరు క్షమింపబడుదురు. 8) ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. 9) మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. 10) నీ కంటిలోనున్న దూలము ఎంచక నీ సహోదరుని చూచి – నీ కంటిలోఉన్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల? వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసికొనుము. అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.
11) మనుష్యులు మీకేలాగు చేయవలయునని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి. 12) నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకనినొకడు ప్రేమింపవలెననుటయే నా ఆజ్ఞ. దీనినిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు. 13) నీవు పగటి విందైనను, రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులైనను, నీ సహోదరులైనను, నీ బంధువులైనను, ధనవంతులగు నీ పొరుగువారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. 14) ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి “బోధకుడా! నిత్యజీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలె” నని యేసుక్రీస్తు ప్రభువును శోధించుచు అడిగెను. అందుకాయన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి యున్నది? నీవేమి చదువుచున్నావని అతనినడుగగా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణశక్తి తోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలయుననియు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింప వలెననియు వ్రాయబడి యున్నదని చెప్పెను. అందుకాయన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి. ఆలాగు చేయుము అప్పుడు జీవించెనని అతనితో చెప్పెను. అయితే తాను నీతిమంతుడైనట్లు కనుపరచుకొనగోరి అతడు-“అవునుగాని నా పొరుగువాడెవడ”ని యేసునడిగెను. అందుకు యేసు ఇట్లనెను. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని, అతనిని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి.
ఆ సమయమందొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుచు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు అతడుపడియున్న చోటికి వచ్చి అతనిని చూచి, అతనిమీద జాలిపడి దగ్గరకు పోయి, నూనెయు, ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, తన వాహనముమీద ఎక్కించి యొక పూటకూళ్ళవాని ఇంటికి తీసికొనిపోయి అతని పరామర్శించెను. మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూటకూళ్ళవానికిచ్చి-ఇతని పరామర్శించుము. నీవింకేమైనను ఖర్చుచేసిన పక్షమున నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయెను. కాగా దొంగల చేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడని నీకు తోచునని యేసు అడుగగా “అతనిమీద జాలిపడినవాడే” అనెను. అందుకు యేసు “నీవును వెళ్ళి ఆలగు చేయుమ”ని అతనితో చెప్పెను. మత్తయి 5. అధ్యాయము. లూకా 14వ అధ్యాయము, లూకా 10వ అధ్యాయము. యేసుప్రభువు తన శిష్యులను బోధ పనిమీద పంపినప్పుడిట్లు చెప్పెను. 1) మీరు యే ఇంటనైనను ప్రవేశించునప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక అని మొదట చెప్పుడి. 2) రోగులను స్వస్థపరచుడి. 3) దయ్యములను వెళ్ళగొట్టుడి. 4) చనిపోయిన వారినిలేపుడి. 5) కుష్టరోగులను శుద్ధులనుగా చేయుడి. 6) ఉచితముగా పొందితిరి. ఉచితముగానే యియ్యుడి, అని చెప్పెను. మత్తయి 10:8. లూకా 10:6.