1. Home
  2. Docs
  3. దైవ సాన్నిధ్యము...
  4. ముందుమాట

ముందుమాట

దేవుడు “బైబిలు మిషను” బయలుపరచిన యం. దేవదాసు అయ్యగారు వాక్యములో నుండి ఎన్నో సద్విషయములు నూతనవిషయములు ఎత్తి లోకమునకు చూపించిరి. ఆయన తన జ్ఞానమునుబట్టి వాక్యోపదేశము చేయలేదు. కేవలము దైవాత్మ వశములోనుండి వర్తమానమందించిరి. పరిశుద్ధాత్మ చెప్పిన విషయము “నీవు బోధించిన యెడల వాక్యమునకు వేరే అర్ధము వచ్చును గాని నేను (అనగా ఆత్మతండ్రి) బోధించిన అట్టివి రావు” అన్నారు. ఏఉపదేశముగాని, సిద్ధాంతముగాని కట్టడగాని తన స్వంత ఉద్దేశము, జ్ఞానమును బట్టి చేయక ప్రతివిషయము ప్రభువును అడిగి ప్రభువు చిత్తము తెలిసికొని ఉపదేశించుట జరిగెను.

ఈ పుస్తకము ఆయన వాక్యములో నుండి వివరించిన విషయములు తెలియజేయును. గ్రంధకర్తకు ప్రభునకు గల సహవాసము బహు గంభీరము. ఇతరులకు అర్ధముకాదు. వాక్యసేవకులకు కూడ అర్ధముకాదు, గనుక అనేకులు అపార్ధముగ మాట్లాడుదురు. ఆయనకు ప్రభువుతో గల సహవాసమును గురించి తన దగ్గరనున్న వారికి కొన్ని విషయములు చెప్పిరి. వాటనన్నిటిని వ్రాసినను, కొందరు నమ్మరు. అపార్ధము చేసికొందురు. ఈ పుస్తకముయొక్క ఉద్దేశ్యము మానవుడు ప్రభువును చూచుట, ప్రభువుతో మాట్లాడుట, ప్రభువు చిత్తమును తెలిసికొనుట ప్రభువుతో సహవాసము చేయుట. ప్రభువును ముఖాముఖిగా ఎరిగియుండుట. అవసరమైన యెడల ప్రభువుపై ప్రశ్నలు వేసి జవాబు అందుకొనుట, ఇట్టి అనుభవము; లేటు డా|| ఆట్మనమ్మ, యం.డి. (బరంపురము) అయిదుగురు స్త్రీలు నిత్యము ప్రభువు సన్నిధిలో నుండి ఆయనను చూచి, ఆయన మాటలు ఆలకించిరి. ఈ పరిశుద్ధ కూటములోనికి బైబిలులోని భక్తులందరు పరలోక పరిశుద్ధులు వచ్చి మాట్లాడిరి, ఈ కూటములలో యం. దేవదాసు అయ్యగారు కూడ ఏకీభవించిరి. ఆ కూటములలోనే త్రియేకతండ్రి దేవదాసు అయ్యగారికి (అనగా తండ్రి, కుమారుడైన ప్రభువు, పరిశుద్ధాత్మ తండ్రి) వారి ముగ్గురు హస్తములను శిరస్సుపై నుంచి అభిషేకము ఇచ్చిరి. అనేకులిది నమ్మకపోయినను తెలియజేయుచున్నాము. ఇతరులు నమ్మలేని అనేక విషయములు గలవు అనుభవములు గలవు (కాలక్రమమున అన్ని వీలునుబట్టి తెలియజేయగలము.)

వాక్యములో దైవ సన్నిధి ఎక్కడెక్కడ నరునితో పని చేసిన విషయము ఇందు చెప్పబడెను. దైవ సన్నిధి అనుభవము యం. దేవదాసు అయ్యగార్కి గలదు అందును బట్టి ప్రభువుతో సహవాస అనుభవమును గలిగియుండుటను బట్టియే ఇట్టి మర్మమైన సంగతులు ఇతర భక్తులు ఎరుగని వాటిని అందింపగలిగిరి. ఒకప్పుడు ఆయన ఒంటెద్దు బండిలో కూర్చుని రాజమండ్రి నుండి ఒక గ్రామమునకు వెళ్ళుచుండగా ప్రభువు వచ్చి ఆయన చెంత కూర్చుండెను. వారిద్దరు ఆ గ్రామమునకు చేరు వరకు మాట్లాడుకొనుచుండిరి. ఆయనకు ప్రభువుతో నున్న పరిచయము లూథరన్ మిషనులో నున్నప్పుడు రాజమండ్రిలో ఉపాధ్యాయులు, పాస్టర్లు ఉన్న సభలో మాట్లాడుటకు అయ్యగార్కి ప్రసంగమిచ్చిరి. ప్రభువు అయ్యగారు ఇద్దరు కలసి మాట్లాడుకొనుచు వేదికపై వచ్చిరి. వేదికపై ఒకే కుర్చీ కలదు; ఎవరు కూర్చుండవలెను? ప్రభువా నీవు కూర్చుండు, ప్రభువు అన్నారు అది నీకొరకు వేయబడినది నీవు కూర్చో! నీవున్నావు నేనెట్లు కూర్చుంటాను అన్నారు అయ్యగారు. చివరికి ప్రభువు కూర్చున్నారు. (కుర్చీలోనే) “నేను మీలో, మీరు నాలో ఉందురు” అను వాక్యానుభవమిదేనా! ఇట్టిసంగతులనేకములు మాతో చెప్పిరి. అవన్ని వ్రాతలో వ్రాయలేము. చదువరులు అయ్యగారు కలిగియున్న ప్రభువుయొక్క సహవాసము గ్రహించుటయే మా కోరిక. నమ్మగలిగిన యెడల నరునికిట్టి సహవాస భాగ్యమిచ్చిన ప్రభువును స్తుతించండి. లేదా అబద్ధ ప్రవక్తలని బైబిలు మిషను వారమైన మమ్ములను దూషించండి.

మరియొక అనుభవము: ప్రభువు చివరి రాత్రి తన శిష్యులతో కలసి ఆచరించిన ప్రభువు సంస్కారమును గురించి అపోస్తులుడైన పౌలుగారిట్లు వ్రాయుచున్నారు “నేను మీకప్పగించినదానిని ప్రభువు వలన పొందితిని.” 1కొరింధి 11:23

ప్రభువు వలన పొందుట అను మాటను గుర్తించండి ప్రభువు అయ్యగారికి సంస్కారమిచ్చిరి, ఒక ఆదివారము ఆయన దేవాలయములో నుండగ పరలోకమునుండి ఒక బల్లదిగి వచ్చినది. దానిపై తెల్లని వస్త్రము గలదు. తదుపరి ప్రభువే దిగివచ్చి ఆయన శరీరమును రక్తము నిచ్చిరి. ప్రభువు ప్రక్కన యోహాను 4అ||లో ఆయన రక్షించిన సమరైయ స్త్రీ కూడ నిలువబడియుండెను. ఇది మాసపత్రికలలో చదివిన “గారడీ విద్య” అన్నారు. దేవుడు వారిని దీవించునుగాక! అట్టి మా బోధలు అపార్ధము చేసికొనువారు కూడ ఇట్టి లోతైన అనుభవములోనికి రాగలుగునట్లు మా ప్రార్ధన. ఈ ప్రభువిచ్చు సంస్కార భోజనము, అంతరంగ సంస్కారమును గురించి ఆయన మాకు బోధించి ఈ అంతరంగ అనుభవము కొరకు ప్రభువు దగ్గర కనిపెట్టుమని మాకు బోధించిరి, మాలో కొందరికి ఇట్టి అంతరంగ అనుభవము గలదు.

నైజ పాపములు – నశియించుటకే = భోజనము

వడ్డించును – రాజే స్వయముగా దేవరాజే

స్వయముగ||గనుక నాకేమి||

ఒకప్పుడు అయ్యగారిని ఎరుగని ఒకామె ఆయనతో ప్రార్ధన చేయించుకొని ఆనాడే వెళ్ళిపోవలెనని ఇంటివారితోకూడ చెప్పకుండ ఆయన దగ్గరకు వచ్చెను అయ్యగారు ఆమెను ఎప్పుడు చూడలేదు ఆమెను ఎరుగరు. అయ్యగారు ఆమెను వెళ్ళనీయకుండా ఆదినమునకు ఆపుచేసి, మరుసటి ఉదయమున సంఘమంతటిని ప్రార్ధనకు రమ్మని పిలిచిరి. ఆ ప్రార్ధనకు మాలో పెద్దలు, పాదిరమ్మలు, సన్నిధి అనుభవము గలవారు వచ్చిరి అయ్యగారు అందరిని నిశ్శబ్దముగా కనిపెట్టుటలో నుండి ప్రభువు ఈ దినము మీకు ఏమి ఇస్తారో తీసికొనండి. మోకాళ్ళపై నుండండి అని చెప్పిరి. అందరు కొంతసేపు మోకాళ్ళపైనుండి తరువాత మోకరించిరి. కొన్ని గంటలు గడిచిన తర్వాత అందరిని కూర్చుండబెట్టి వారు ప్రభువు వలన ఏమి పొందినది చెప్పమనిరి మాలో ముఖ్యులయిన వారు కొన్ని దర్శనములు చెప్పిరి గాని ఆయనకు తృప్తి కలుగలేదు. క్రొత్తగా వచ్చిన ఆమె చివరి వరకు మోకాళ్ళు దిగలేదు అందరు తమ దర్శనములు చెప్పిన తరువాత క్రొత్తగా వచ్చిన ఆమె లేచి ఈలాగా చెప్పిరి. “అయ్యా నేను మీరు కూర్చోండి అనేవరకు మోకాళ్ళు దిగలేదు నేను ధ్యానములో ప్రభువు కొరకు కనిపెట్టుచుండగా ప్రభువు దూత పరలోకమునుండి ఒక బల్ల తీసికొని వచ్చి నా యెదుట నుంచెను. ఆ బల్లపై తెల్లని వస్త్రమును, ప్రభువు శరీర రక్తములు పాత్రలలో నుండెను తదుపరి ప్రభువే దిగివచ్చి వారు నాకు ఆ శరీరమును రక్తము ఇచ్చి వెళ్ళిపోయినా, కొన్ని నిమిషములకు మీరు అందరిని కూర్చుండమని చెప్పినారు” అని ముగించెను అప్పుడు అయ్యగారు ఇది నాకు కావలెను. దీనికొరకు మిమ్ములను పిలిచినాను అని ఆయన సంతోషించిరి. అందరము ఆశ్చర్యపడితిమి, ఇట్టి ప్రభువుతోనుండు సన్నిధి అనుభవము, ప్రభువుతో సహవాసము సంఘమునకిచ్చుటకే ఆయన పాటుబడిరి ఆమెయొక్క అంతరంగము వారికి ఎలాగు తెలిసినదో!

ప్రియ చదువరులారా! మన అనుభవములో లేని ఈ ఉపదేశములు, మన జ్ఞానమునకు అందని వాటిని మనము విన్నప్పుడు వెంటనే అపార్ధము చేసికొనక ప్రభువును అడగండి ప్రభువును అడగకుండ మీ జ్ఞానమును బట్టి తీర్పు చేయుట మీ ఆత్మీయ జీవితమునకు హానికరము ఈ గ్రంధమందు వ్రాయ బడిన దైవసన్నిధి అనుభవములోనికి వచ్చిన యెడల మీరు వధువు సంఘవరుసలో నుండుటయేగాక ప్రభువుయొక్క మహిమరాకడలో పాల్గొందురనుట నిస్సందేహము, సంఘముయొక్క గురి మేఘములో త్వరగా రానైయున్న పరలోక వరుడైన క్రీస్తుప్రభువును కలిసికొనుట ఆగురిని అందుకొను భాగ్యము చదువరులకు కలుగుగాక! అను ఆశతో ఈ గ్రంధమును మీకందించుచున్నాము.

సంఘమును పెండ్లికుమార్తెగా ఆయత్తపరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి తన ఉద్దేశ్యమును నెరవేర్చుకొనునుగాక!

ఈ పుస్తకము అచ్చుచేయుటకు శ్రీ. పి. దేవదాసుగారు రిటైర్డు ప్రిన్సిపాల్ గారు సహాయపడిరి.పెండ్లికుమారుడైన మన ప్రభువు యొక్క మహిమ రాకడలో పాల్గొను ధన్యత కలుగునుగాక!

ఇట్లు

ప్రభువు నందలి

రెవ. జె. జాన్ సెల్వ రాజు

ప్రసిడెంట్, బైబిలు మిషను

Please follow and like us:

How can we help?