ప్రార్ధన – ఓ తండ్రీ! త్వరపడుచున్న ఓ తండ్రీ! త్వరగా వచ్చుటకు త్వరపడుచున్న తండ్రీ! నీ సంఘము సిద్ధపడవలసినదని త్వరపెట్టుచున్న తండ్రీ! నీకు అనేక స్తొత్రములు, నా దినము నా జనము వస్తుంది నీకు ఈ ప్రక్కకు ఆ ప్రక్కకు వత్తిగిలి దారిచేయుము అని ఎర్ర సముద్రముతో చెప్పిన తండ్రీ! నీకు అనేక వందనములు ఇప్పుడుకూడ ఆమాటే చెప్పుము. పరలోకమునకు నాసంఘము వస్తూయున్నది గనుక సంఘములోనున్న నామక క్రైస్తవులారా! ఒక దరికి తప్పుకొనండి. అని చెప్పుము మరియొక ప్రక్కకు ఉన్న ఇతరులను చూచి మీరుకూడ ఒక ప్రక్కకు తొలగండి అని చెప్పుము. కుడిచేతి వైపున నామకార్ధం క్రైస్తవజనమును, ఎడమచేతివైపున ఇతర జనమును తప్పుకొన్న వెంటనే నీవువచ్చి నీ సంఘమును కుడివైపునకు గాని ఎడమ వైపునకు గాని తొలగకుండునట్లు కృప దయచేయుము. ఆమెన్!
(ఇక్కడ ఇప్పుడు కూర్చున్న మా అందరము తొలగకుండ కృప దయచేయుము. మనోనిదానము దయచేయుము ఆమెన్)
ఇశ్రాయేలీయులు ముందుకు చూచున్నట్లు మేముకూడ పరలోకము తట్టుచూచే బలము మనోనిదానము దయచేయుము, మరియు ఓ ప్రభువా కుడివైపున నున్న మా లోక సౌఖ్యమును చూడక ఎడమవైపుననున్న మా కష్టమును చూడక తిన్నగా నీవైపు, పరలోకము వైపు మేఘము వైపు పరలోకమందున్న పరిశుద్ధులవైపు, దూతలవైపు నీ సింహాసనమువైపు నూతన యెరూషలేమువైపు చూడగలశక్తి దయచేయుము. ఈవేళ మాకు నీవు ఇవ్వవలసిన వర్తమానములో ఒక వర్తమానము మా ప్రార్ధనలోనే ఇచ్చివేసినావు గనుక నీకు స్తోత్రములు.
ఇప్పుడు మా బైబిలు పాఠములో ఇయ్యవలసిన వర్తమానము ఇమ్మని వేడుకొనుచున్నాము ఆయాస్థలములనుండి వచ్చినటువంటివారు ఈవరండాలో ఎలాగున్నారో అలాగే పరలోకమునుండి వచ్చినవారు కూడా వుండేటట్లు నీకృప దయచేయుము నీవు ఎల్లప్పుడు వుంటున్నావుగదా! నీకు స్తోత్రములు మా అందరి కండ్లు నీవైపు నీవారివైపు నీ ఉపకారములవైపు త్రిప్పుము మాలో ఎవరికైన తగినటువంటి ఆలోచనలు చేరకుండచేయుమని వేడుకొనుచున్నాము ఇక్కడవున్న ఒకొక్కరిని ఒకొక్కవిధముగా దీవించుము సూర్యకిరణములు పరిశుభ్రమైన హృదయము గలవారిలో పడునట్లు చేయుము సూర్య కిరణములు అపవిత్రమైన స్థలములో పడునట్లు నీ వర్తమాన కిరణములు ఎవని హృదయములో అపవిత్రత వున్నదో లౌకికమున్నదో పాపమున్నదో వారి హృదయములో పడేటట్లు చేయుము మా ప్రార్ధనలు, మాపాఠములు, మా ప్రయత్నములు, అన్ని నెరవేరునట్లు మిక్కిలి త్వరగా వచ్చుచున్న యేసుప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము ఆమెన్.
1. వర్తమానము ఎర్రసముద్రము
ప్రార్ధనలలో ఇవ్వబడినవి
2. కిరణముల వర్తమానము,
బైబిలు పాఠము:- షడ్రకు, మేషక్కు, అబెద్నెగో, దానియేలు 3-22-25వ ఆపుచేయుమనేవరకు చెపుతాను సంఘమునడిచే స్థితిలో లేదు. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రములో నడిచే స్థితిలో లేరు కాని భయపడే స్థితి ఉన్నది గనుక ఐగుప్తీయులు తరుముకుని వచ్చుచున్నారు. వారికి భయపడతా, స్వభావ సిద్ధముగా భయపడతారు గాని ప్రభువు భయపడండి అని చెప్పలేదు. గాని సాగిపొండి అని అన్నాడు అలాగే ఇప్పుడు నిజసంఘమును చూచి అసౌఖ్యాల జోలెందుకు, ఇండ్లు, వాకిండ్లు పొలములు వస్తువులు వాటిజోలెందుకు. అనగా అవి మానుకొనుమని కాదు. వాటిని గురించిన చింత ఎందుకు అని ప్రభువు చెప్పెను. చెప్పుచున్నాడు అది అందరికి వినబడదు రాకడ గుంపునకే వినబడును తక్కిన వారికి వినబడదు మాకెందుకు వినబడుటలేదు. అనడుగుదురు దానికి అయ్యగారు ఇచ్చే జవాబు ఒక చెవి దగ్గర సౌఖ్యములును ఒక చెవి దగ్గర కష్టములును వుండి చెవులు దిబ్బడవేసుకొనిపోతే ఎలాగు వినబడుతుంది? వినపడదు జాగ్రత్తగా వుండండి. బహు జాగ్రత్తగా వుండాలి ఆ సమయాన ఎలా! నన్ను ఏలాగో తీసుకొనిపోతాడు అని అనవద్దు అలాగు అనుకునేవారు సిద్ధపడనివారు. వారికి అయ్యగారు చెప్పేది సరే అలాగే వుండండి. మేము వెళ్ళిపోతాము ఈ ప్రార్ధనలన్నిటి వలన ఈ 7 సంఘములలో మారుమనస్సు పొందుదురు. మనము ఉన్న దైవసన్నిధి గురించి మాట్లాడుకొన్నాము, అయితే ఇప్పుడు రాకడ గురించి కొద్దిగా మాట్లాడుకొందాము ఎందుచేతనంటే భూమిమీద ఇప్పుడు తయారగుచున్న సన్నిధి కూటములు వుండవు అన్ని అక్కడకు వెళ్ళిపోవును. అక్కడ నిత్యమైన సన్నిధి వుంటుంది ఇక్కడ సన్నిధి కూటములో తర్ఫీదు అయితే అక్కడ సన్నిధి కూటములో శాశ్వతముగా ఉన్నది గనుక మన సన్నిధి కూటములు క్రమముగా అక్కడికి వెళ్ళిపోవును. ఇప్పుడు మరల మన పాఠము భూమి మీదికి వస్తాము నెరవేర్చు కొందాము.
ఆదాము విషయములో ఆదాము మొదలు పాతనిబంధన భక్తులు దేవుడే ఆదాము, హనోకు, అబ్రహాము మొదలైన భక్తులందరి విషయము ఆయనే తన సన్నిధి అని వేసికొని వచ్చి చూపించెను. గాని యాకోబు విషయములో కాదది. యాకోబుచే, తన అవసరములను బట్టి తన పాప జ్ఞప్తిని బట్టి దైవ సన్నిధికి తానే వెళ్ళెను. దేవుని సన్నిధి యాకోబు దగ్గరకు రాలేదు. యాకోబు దేవుని సన్నిధి కావలసి, దైవ సన్నిధికి వెళ్ళెను. అప్పుడు దేవుడు ప్రత్యక్షమాయెను అలాగే ఇప్పుడు మన అవసరమును బట్టి దైవసన్నిధి కూటములు మనం పెట్టుకుంటే ఆయన ప్రత్యక్ష మగును దైవసన్నిధికి వెళ్ళుమని యాకోబుకు చెప్పిన పెద్దమనిషెవరు? కష్టాలు, భయము తాను అన్నగారిని మోసము చేసిని పాపజ్ఞప్తి ఇవి రెండు యాకోబును దైవసన్నిధికి తోసివేసెను. పద్దనరాములో మామగారింటివద్ద గొర్రెలను మేతకు తోలివేసిన యాకోబును, ఇప్పుడు కష్టాలు, యాకోబును దేవుని సన్నిధికి తోలివేసెను. ఇంకొకటి చెప్పలేదు. కుటుంబాలను ముందు పంపివేసి నేను సన్నిధికి వెళ్ళితే మేలుంది అని నమ్మెను. అట్టి స్థితిలో మన కాలమువారైతే ఏమిచేస్తారు దానియేలు అదే సందు తీసికొని పైకివెళ్ళి కిటికీలు తెరచి ప్రార్ధన చేసికొనుచుండెను. బహు త్రీవముగా చేస్తుండెను ఆ గతి దానియేలుకు వచ్చిన సంగతి. దుర్గతి ఇప్పుడు మనకు వచ్చినది.
మన మతము బోధించడానికి గాని, ప్రార్ధన చేసికొనడానికిగాని అనేక ఆటంకాలు ఉన్నవి. గనుక దానియేలు ఏ ప్రకారము దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడో ఆ ప్రకారముగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళకపోతే ఈ చిక్కులను జయించలేము దానియేలు సన్నిధిలోనికి వెళ్ళిన సిం హపు బోను తప్పలేదు, గాని సింహములు హాని చేయలేదు. అలాగే ఇప్పుడు మీరు సన్నిధిలోనికి వెళ్ళిన ఇతరుల వలన కష్టాలు రాక తప్పవు అయినప్పటికిని హాని మాత్రము రాదు. దానియేలు దగ్గరకు దేవుని సన్నిధి రాలేదు. దానియేలే దైవసన్నిధిలోనికి వెళ్ళెను. పైకి వెళ్ళి ప్రార్ధన చేస్తుంటే ఎవరైనా చూసి రాజుకు చెప్తారేమోనని భయపడి. తలుపులు వేసికొని ప్రార్దించలేదు కిటికీలు తెరచి విరోధులు చూచేటట్లుగానే ప్రార్ధన చేసెను. దేవునిసన్నిధిలో నుండేవారికి అదురా? బెదురా? గనుక ప్రియులారా! దానియేలువలె ప్రార్ధించుటలో, ధ్యానించుటలో, సువార్త ప్రకటించుటలో, పత్రికలు పంచుటలో, పగవారికి సమాధానము చెప్పుటలో వెనుక తీయక ముమ్మరముగా చేయండి.అని దానియేలు యొక్క సన్నిది ప్రార్ధనలవల్ల తెలుసుకొనుచున్నాము. ధ్యైర్యముగా పత్రికలు పంచగలరా? ఇతరులకు బోధ చేయగలరా? ధైర్యముగా సన్నిధిలో ప్రార్ధించగలరా? ఈ ప్రశ్నలకు మీకు మీరే జవాబు చెప్పుకొనండి దానియేలు వలె దైర్యముగా నుండండి ఎంతోమంది చేస్తారు. సన్నిధికి వెళ్ళవద్దు ప్రసంగాలు చేయవద్దు, పత్రికలు పంచవద్దు శత్రువులదాడి ఎక్కువగుచున్నది అయినప్పటికిని భయపడకండి, ఇశ్రాయేలీయులకు ఎర్రసముద్రముయొద్ద శత్రువులు వెనుకనుండి వచ్చారు అయితే దానియేలుకు ఎదుటే ఉన్నారు శత్రువులకుగాని ఏమి భయపడలేదు. తన మనస్సులో ఒకటే ఉన్నది. నేను దేవుని యొక్క జనమునకు సంబంధించిన యూదులలోని ఏర్పాటు వాడనే. అనేది మాత్రమే మనస్సులో ఉన్నది. అదే తనను దైర్యపరచింది గనుక మీరు కూడ సన్నిధిలోనికి వెళ్ళి నూతనబలము కొరకు కనిపెట్టి పొందండి.
రాజాజ్ఞకు దానియేలు భయపడనట్లు ఈ ముగ్గురు బాలురు కూడ భయపడలేదు. వీరు కూడా రాజుగారు ప్రియులే, విగ్రహ పూజ చేయవలసినదని రాజాజ్ఞ, దానియేలుకు ప్రార్ధన చేయకూడదు అనే ఆజ్ఞ వీరికి విగ్రహ పూజ చేయవలెనని ఆజ్ఞ, అదికూడదు, ఇది చేయవలెను. అదికూడదు అనే ఆజ్ఞ, ఇది వలెను అనే ఆజ్ఞ ఇప్పుడు మన కాలములో ఆ రెండే ఉన్నవి. ఏమిటంటే ప్రార్ధన చేయకూడదు. సృష్టిని పూజించాలి ఆ కాలములో దానియేలు గ్రంధములో ఉన్న ఆ రెండు ఇప్పుడు మన కాలములో నున్నవి గనుక ఆయన ఈ ముగ్గురు ఏమిచేసారో అదే ఇప్పుడు మనము చేయాలి దానియేలును సింహము బోనులొ పడవేసినట్లు ఈ ముగ్గురిని అగ్నిగుండములో పడవేసిరి. వారి మీద చాడీలు చెప్పిరి. రాజాజ్ఞ మీరినారని వారి మీద చాడీలు చెప్పిరి అగ్నిగుండములోనికి వెళ్ళినారు గాని దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేదు ఎందుకంటే వారి బ్రతుకంతా దేవుని సన్నిధిలోనున్నారు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటందుకు వారికి సమయము దొరుకలేదు దానియేలునకు దొరికినది (ఆయనకు) ముగ్గురికి దొరకలేదు తీసికొని వెళ్ళిన వెంటనే అగ్నిగుండములో పడవేసిరి ఇంటికివెళ్ళి సన్నిధిలో ఉండటానికి సమయము లేదుగా; దేవునియొక్క సన్నిధియే వచ్చివేసినది అగ్నిగుండములో ముగ్గురే పడలేదు. నాల్గవ ఆయన కూడ పడ్డాడు అందుచేత కాలలేదు, కష్టాలు యెదుట ఉన్నప్పుడు మనము కష్టములో నున్నప్పుడు దేవుని యొక్క తలంపు ఉంటే అదే దేవుని సన్నిధి ఆ ముగ్గురుకి దేవుని తలంపు నున్నది అందుచేతనే వారు ఒకమాట అన్నారు. మా దేవుడు తప్పించగలడు తప్పించకపోయిన పర్వాలేదు అని దేవుని పేరు ఎత్తినారు గనుక దేవుని తలంపు వారికున్నది. అదే సన్నిధియై యున్నది.అందుచేత దేవుడే అగ్నిగుండములో నున్నాడు. అగ్నిగుండములో నుంటే హాయిగా నుండునా? వారికి హాయిగానే యున్నది. దానికి కారణములు (ఏమిటంటే) రెండు ఉన్నవి.
1) దేవుని తలంపు 2) ఆయనే విడిపిస్తాడు. 3) విడిపించకపోతే ఆయన దగ్గరకు వెళ్ళిపోతాము 4) కాని విగ్రహమునకు పూజ చేయము, వారిలో 4 అంటే అగ్నిగుండములో నలుగురు ఉన్నారు. వారేమిచేస్తారంటే అగ్ని వారిని కాల్చివేయుటకు బదులు వారే అగ్ని కాల్చివేసిరి. "యేసునామధారులందరు" అనే పాటలో 22వ చరణము అదే ఇప్పుడు చచ్చిన మీ కష్టాలు, శ్రమలు, వాటిని మనమే కాల్చివేసి వాటిలో నుండి షడ్రక్కు, మేషేకు, అబెద్నెగోల వలె అయిపో, మనము బయటకు వచ్చివేయవలెను అప్పుడు ఏమి జరిగిందో తెలుసునా? రాజుగారు షడ్రక్కు, మేషేక్కు, అబెద్నెగోలు దేవుని తట్టు తిరిగి పోయారు, మన శత్రువులు కూడ అలాగే తిరిగిపోతారు. అది మన పాఠము కొరకు వ్రాయబడిన బాబెలుదేశములో జరిగినకథ బైబిలుమిషనులో ఈవేళ వివరించబడినది. ఎప్పటికైనా బాబేలుపోయి బైబిలువచ్చును. అగ్నిలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమైనట్లు మనము కష్టములలో నున్నప్పుడు కూడ దేవుడు ప్రత్యక్షమగును. అందుకే సన్నిధి కూటములు పెట్టమని చెప్పుచున్నాను. సన్నిధి కూటములు పెట్టలేనివారు ఆముగ్గురు బాలురువలెనే తలంపు కలిగి ఉండండి అని ఇదివరకు అయ్యగారి చెప్పినదే ఇపుడు స్థిరపరచుచున్నారు,సన్నిధికూటము పెట్టడానికి శక్తిలేక పోతే తలంపుకైనా శక్తి ఉండదా? ఒకవేళ అదిలేకపోతే ఇదిలేకపోతే (తలంపు) మూడవది ఉన్నది. అది ఏదనగా III. నిర్ధారణ ఏమైనా మా బాగే, మేము విగ్రహమును పూజచేయుము, ఏమైనా మాబాగే. మాదేవుని మాత్రము ఆరాధింపమానము. ఈనిర్ధారణ కలిగి యుండండి అదే సన్నిధి ఒకవిధమైన సన్నిధి అది ఆముగ్గురికి ఉన్నది ఆ నిర్ధారణ క్రైస్తవ నిర్ధారణకూటము. ఈకథ దానికి సరిపోయింది 1] ఈ నలుగురు రాజుగారియొక్క పోషణలోనున్నారు. 2] ఈనలుగురు రాజుగారియొక్క పరిపాలనలో నున్నారు. 3] ఈనలుగురు రాజుగారియొక్క ఇష్టములో నున్నారు ఈ మూడు ఉన్నప్పటికిని ఆ సమయమందే దేవుని ఇష్టములో నున్నారు ఇదిచాల కష్టము. ఇంకా ఆయన తిండిని ఇంకా ఆయన పరిపాలనలోనుండి, రాజుఇష్టములోనే యుండి రాజుని సంతోషపెట్టాలని లేదు. దేవునినే సంతోషపెట్టాలని ఉన్నది అందుచేతనే వారికి జయము (ఈ రాత్రి గడిపే ప్రార్ధనలో దానియేలు సంగతి, ఈ ముగ్గురి సంగతి జ్ఞాపకము తెచ్చుకొనండి)
డానియేలు + ముగ్గురు కలిపితే బైట నలుగురు
ఈ ముగ్గురు + యేసుప్రభుని కలిపితే నలుగురైరి. ఆ నాలుగు లెక్క ఇక్కడకు ఇక్కడకు వచ్చింది ఆతర్వాత వారినిర్ధారణ కూడ ఈనాలుగే ఇప్పుడు బైట నాలుగు. ఈ అగ్నిగుండములో నాలుగు వీరి నిర్ధారణ నాలుగు.
బైబిలులోని కథ బైబిలుమిషనులో వివరించబడినది. ఐగుప్తులో దావీదు యొక్క దానియేలు యొక్క జనాంగములోని యోసేపు గవర్నమెంటులో రాజుగారికిష్టమైన “వైస్ రాయ్” ఆయెను, బాబెలు దేశములో రాజుగార్కి ఇష్టుడైన దానియేలు పెద్ద ఉద్యోగి అయినాడు. అలాగే పర్షియా గవర్నమెంటులో యూదురాలైన ఎస్తేరు రాజుగారికి ఇష్టురాలై రాణియైపోయినది. యోసేపుకంటె దానియేలు కంటె ఎక్కువై పోయినది. వీటివల్ల మనము ఒక పాఠము నేర్చుకొనుచున్నాము. కష్ట స్థితిలో దేవుడు తన బిడ్డలకు సహాయము చేయక మానడు. అందుకు దృష్టాంతముగా ఐగుప్తు, బాబెలు, పర్షియా ఈ మూడు అన్యదేశములలో దేవుడు తనబిడ్డలకు తోడైయున్నాడు గౌరవపర్చినాడు (దేవుడు మీకెల్లప్పుడు అనే మాట) దేవుడు మీకు ఇండియాలో, పర్షియాలో, ఐగుప్తులో, బాబెలులో,
1. దేవుడు మీకు ఐగుప్తులో తోడుగా నున్నాడు.
2 . " " బాబెలులో " "
3. " " పర్షియాలో " "
4. " " ఇండియాలో " "
ప్రార్ధన:- ఓ తండ్రీ! (ఈవేళ) మాకు నాలుగు పాఠములు నేర్పినందుకు నీకు అనేక వందనములు. నీ యొద్దకు తూర్పునుండి, పడమటినుండి, ఉత్తరమునుండి. దక్షిణమునుండి. ప్రజలు వస్తారని బైబిలులో వ్రాయించిన ఈ వేళ నెరవేర్చుచున్నందుకు నీకు స్తొత్రములు ఆమెన్.