(దేవుని అడుగకుండా విమర్ష చేయుట నిషేధము)
ప్రియులారా! దేవుని దీవెన మీకు కలుగును గాక!
- ఏదైన మనకు తెలియనప్పుడు మన జ్ఞానశక్తితో ఆలోచింపవలెను. ఆలోచింపగ, ఆలోచింపగ సంగతి తెలియును.
- తెలిసిన వారిని అడిగిన యెడల వివరము తెలియును
- జ్ఞానులు వ్రాసిన గ్రంధములు చదివిన యెడల సంగతి వివరము తెలియును. మీ జ్ఞానమును అడిగి, మీ మనస్సాక్షిని అడిగి, గ్రంధములను అడిగి, తెలిసినవరిని అడిగి, దేవుని అడుగని యెడల న్యాయమా? ఈ గొప్ప విషయమును పాపాత్ములు, దైవభక్తులు అవలంభింపవలసినదే, వాటిని, వారిని అడిగి మన సృష్టికర్తయు, మన తండ్రినైన దేవుని అడుగుట పరిష్కారార్ధమై మిగుల అవసరము. జ్ఞానులు యెక్కువా? దేవుడు యెక్కువా? అందరిని అడిగిన తరువాత తప్పకుండ దేవునిని అడుగవలెను. అప్పుడు ఆయన జ్ఞానోదత మూలముగానో, గ్రంధముల మూలముగానో, కష్టస్థితుల మూలముగానో, తెలిసినవారి మూలముగానో, సత్యము తెలియపర్చును. లేదా స్వప్నము మూలముగానో, దర్శనము మూలముగానో, స్వరము మూలముగానో, గాలిలోని వ్రాత మూలముగానో, దేవుని మీరు కోరినదితెలియజేయును.
వీటి మూలముగా కాక మరి వేటి మూలముగానైన దేవుడు తన చిత్తమును తెలియపర్చును.
మనకు అగత్యమైన విషయములు తేటపర్చుటకు దేవుని యొద్ద అనేక పద్దతులు గలవు. నేను యీ పత్రికలో వ్రాసిన పద్దతులుగాక దేవుడు ఏదో మరియొక పద్ధతి మూలముగ విషయములు విశదపర్చును. ఇది మీరు నమ్మగలరా? నమ్ముటకు శక్తి యున్నదేమో చూచుకొనండి. ఉన్నయెడల లెండి. ఏకాంతస్థలమున దైవ సన్నిధిలో మీ ప్రశ్నలు అడిగి జవాబు మీకు అందువరకు కనిపెట్టండి. విసుగవద్దు. ఒక అధికారి యొద్దకు మీరు వెళ్ళి ఏదో ఒక మనవి చేసుకొని ఆయన జవాబు చెప్పక ముందే ఇంటికి వెళ్ళిపోదురా! దేవుని నొక సంగతి అడిగి, ఆయన వెంటనే జవాబు చెప్పలేదని దైవసన్నిధిలో నుండి వెళ్ళిపోవుట సబబుగా నుండునా? ఇది మీరే చెప్పండి వార్తా పత్రికలలో మనకు అర్ధము కాని ఒక విషయము చదివినప్పుడు దేవునినడిగి తెలిసికొనుట మంచిది కాదా? ఒకరి మూలముగా విచారకరమైన కబురు వినగానే ప్రభువా, ఇది నిజమా? అని అడుగుట నేరమా? అనుదినము మనవారితోను, ఇతరులతోను మాట్లాడుచున్నాము.
అలాగే దేవునితో కూడ మాట్లాడవలెను. అప్పుడు గొప్ప సంతోషము, సంతుష్టి కలుగును. మన విచారములన్నియు అంతరించును. దేవునిని అడుగనిదే ఆ మత సిద్ధాంతములు తప్పు, ఈ మత సిద్ధాంతములు తప్పు అని త్వరపడి విమర్శ చేయకూడదు. ఒకరి సిద్ధాంతము పూర్తిగా విన్న తర్వాత మీ అభిప్రాయము వెల్లడింపవచ్చును గాని ఒకరిని దూషింపకూడదు, ద్వేషింపకూడదు.
ప్రభువా, పలానివారి సిద్ధాంతము నాకు సరిగ తోచుట లేదు. నీవు ఏమందువు అని దేవుని అడుగవచ్చును. ఆయన ప్రతివారియొద్ద ఉండును. ఆయన లేని స్థలము లేదు. దేవుని అడుగువారు ఈ కాలమందు కూడ అక్కడడక్కడ చాలమంది ఉన్నారు. మనము దేవుని అడిగినప్పుడు మనలోనున్న తప్పు దిద్దుకొనని యెడల దురాత్మ తప్పుడు జవాబు ఇచ్చును. దురాత్మ మిమ్మును చేరకుండును గాక! ఆమెన్.
దేవుడు మీకు సమాధానము కలుగజేయునుగాక!