రక్షణ వార్తావళి

⌘K
  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి...
  4. కరవు పాఠము

కరవు పాఠము

దేశీయులారా! సహ మానవులారా! మీకు శుభము కలుగును గాక! “ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు” లూకా 6:21

1) దేవుని అనాది తలంపు:జగత్తు పునాది వేయబడక మునుపే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును బట్టి నరులను సృజింప వలెననెడి తలంపు (దేవుడు) కలవాడై యుండెను (ఎఫెసీ 1:6). 

కాబట్టి నరులు పుట్టక మునుపే నరుని యొక్క ఆహార పదార్ధములు అనగా పండ్లు, నీళ్ళు, గాలి మొదలైనవి దేవుడు కలుగజేసెను. గనుక నరుడు ఇబ్బంది పడకూడదని దేవుడు ఉద్దేశించినట్లు కనబడుచున్నది. ఇది ఎంత కృప. అది మాత్రమే మనిషి ఈ లోకములో జీవించినంత కాలము అతనికి ఏ కొదువ లేకుండ సమస్తమును సమృద్ధిగా సృజించినాడని సృష్టి మనకు ఋజువుగా ఉన్నది. మరియు నీవు ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరముగా తినవచ్చును ((ఆది2:16) అనే మాట దేవుడు చెప్పినందువలన మన ఆహారమునకు అడ్డము రాడని తేలియున్నది.

2) మనుష్యులను మాత్రమే కాక పక్షులను, జంతువులను, సమస్తమైన జీవరాసులన్నిటిని ఉచితముగా పోషించుచున్నాడని మన స్వంత అనుభవమైయున్నది. దేవుడు జీవరాసులనే పోషించుచుండగా ఉభయ లోకములలో ఉండవలసిన మనిషిని పోషించడా?

పోషించునని అర్ధము.

3) వానిని మాత్రమే గాక, వృక్షాదులను కూడ నీటి ద్వారా పోషించుచున్నాడని ఎరుగుదుము. వృక్షముల కంటెను, పక్షుల కంటెను మన మెక్కువ కాదా? మీరు పక్షుల కంటె శ్రేష్టులు కారా! అని ప్రభువు సెలవిచ్చిన మాటను జ్ఞాపకమునకు తెచ్చుకొనండి

(లూకా12:7). వాటిని పోషించుచున్న దేవుడు మనలను కూడ పోషించును.

4) నోవాహు కాలమందు దేవుడు అతని కాలమతటికిని సరిపడునంత ఆహార పదార్ధములను అనుగ్రహించినాడు గదా! (ఆది6:21). దేవుడు మనకు సరిపడునంత ఆహారమిచ్చును.

5) “నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలుపోగైనను తీసికొనను” (ఆది14:22) అని అబ్రహాము పలికెను. దీనిని బట్టి చూడగా మనుష్యుల వలన ధనవంతుడగుటకు అబ్రామునకు ఇష్టము లేదని కనబడుచున్నది అనగా

దేవుని వలననే తాను ధనవంతుడగుటకు కోరినాడు. ధనము విషయములో, ఆహార విషయములో తాను దేవుని మీదనే ఆధారపడెను.

6) అబ్రాము పశువుల కాపరులకును, లోతు పశువుల కాపరులకును కలహము వచ్చినప్పుడు అబ్రహాము లోతునకు పంట భూమిని విడిచి పెట్టి తాను ఇతర భూములను యేర్పర్చుకొనెను (ఆది13:1-12). ఇట్లు లోకములో ఎవరును చేయరు.  

బీడు భూములను ఎవరును యేర్పరచుకొనరు. దేవుడు నా పక్షముగ నుండిన యెడల ఏ భూమి యైతేనేమి అని అబ్రహాము అనుకొన్నట్లున్నది. ఇదిచిత్రమైన విశ్వాసము. అతనికి ఏ విధమైన కొదువయు లేదు. మనమును అబ్రహామువలె దేవుని మీద ఆధారపడిన యెడల మనకును ఏ కొదువ యుండదు.

7) యాకోబు యొక్క మందలు తనకంటే పెద్దవాడైన లాబాను మందల కంటే ఎక్కువగా పెరిగెను. ఔను, అతడు విశ్వాస గృహములో పెరిగెను. అందుచేత అతడు దేవుని మీదనే అనుకొనెను. కాబట్టి మోసకాలములో సైతము అతనికి కొదువలేదు. మనకు కూడ కొదువయుండదు. (ఆది 30:41).

8) ఆది 22:8లో అబ్రాహాము దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనునని తన కుమారునితో అనెను. కొండ మీద గొఱ్ఱెలమంద లేదు. మంద లేనప్పుడు గొఱ్ఱెపిల్ల ఏలాగుండును? దేవుని నమ్ముకొన్న యెడల ‘పుట్టనిచోట పుట్టునని ‘అబ్రహాము తలంచి అట్లనెను. చివరికి గొఱ్ఱెపిల్ల కాదు పొట్టేలే దొరికినది గనుక పుట్టనిచోట మనకెందుకు పుట్టదు? దేవుని మీద ఆధారపడినయెడల పుట్టును.

9) దేవుడు హాగరు యొక్క మొరను ఆలకించి, పిమ్మట నీళ్ళు లేనిచోట నీటిబుగ్గను చూపించెను (ఆది 21:19). మనకు కూడ దేవుడెందుకట్లు చేయడు? తప్పక చేయును.

10) ఆదికాండము 42వ అధ్యాయములో యాకోబు యొక్క కుటుంబమునకు కరవు కాలమున ధాన్యము కావలసివచ్చెను. అప్పుడు దేవుడు చాల దూరముననున్న ఐగుప్తులో ఆహార ధాన్యము దాచిపెట్టియుంచెను. దేవుడు తనబిడ్డలు ఆకలిగా నుండుట చూచి ఓర్వలేడు. “సిం హపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయై యుండదు” (కీర్తన 34:10) మనకును ఆహార ధాన్యములకు కొరత ఉండదు.

11) దేవుడు ఆరు లక్షల మందిని అరణ్యములో నలువది సంవత్సరములు పోషించెను. మనలను ఎందుకు పోషింపడు? ఆ అడవిలో బజార్లు లేవు. పంట భూములు లేవు, నదులు లేవు, మరియొక చిత్రమేమనగా వారికి వృత్తికూడా లేదు. బోధవినుట, ప్రార్ధనాభ్యాసము చేసికొనుట ఇవి రెండే వారికున్న పనులు. దేవుడు వారిని పోషించెను గనుక మనలను కూడ పోషించును.

12) రూతు గ్రంధములో గొప్ప కరవును గూర్చి చెప్పబడియున్నది. ఒక కుటుంబమువారు మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళిరి. వారచ్చట ఉండగ ఒక కబురు వినబడెను. వారికి ‘ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ‘ వినిరి.

(రూతు 1:6). ఇది కరవుకాలములో మన చెవులకు వినసొంపుగా నుండును. దీని అర్ధమేమి? ఇబ్బందిగా నున్నదని విని బియ్యము, కూరగాయలు మొదలగునవి దేవుడు తీసికొనివచ్చెనని ఒకరు చెప్పినట్లున్నది. కాబట్టి మన యిబ్బందిలో దేవుడు మనకు ఆహారము ఇచ్చునని ఈ వ్రాతను బట్టి తెలిసికొనుచున్నాము. పేదలకు ఇదొక గొప్పపాఠము.

13. రాజైన సొలొమోను దేవుని యందు విశ్వాసము కలిగియుండెను. అతని కాలములో వెండికి లోటులేదు. బంగారము కూడ విస్తారముగ నుండెను. దేవుడు అతనికి జ్ఞానము మాత్రమే కాదు. ధనమును కూడ ఇచ్చెను ||వ దిన 1:12 భాగ్యవంతుడై యుండుట 

ఒక వరమేయని అతడు గ్రహించెను. దేవుడు తలంచినయెడల మనుష్యుడందులకు అనుగుణముగా నుండిన, యెడల ఎంత ధనవంతునిగానైన చేయగలడు. ఎందుకనగా వెండి, బంగారములు ఆయనవే, ధనవంతుడు తన ధనమును దేవుని మహిమార్ధమై వాడిన యెడల దేవుడతనికి కోట్లకొలది ధనమియ్యగలడు.

14) సామెతలు 30:7-9లో ఒక ప్రార్ధన యున్నది. ‘నన్ను బీదవానిగా చేయకుము నిన్ను ద్వేషింతునేమో, నన్ను ధనవంతునిగా చేయకుము.నిన్ను లెక్క చేయనేమోయని యున్నది. ఈ ప్రార్ధన కూడా విశ్వాస జీవితములో అవసరమైయున్నది. ప్రభువు  చెప్పినట్లు ఏనాటి బత్తెము ఆనాడే దయన చేయును. ఆయనను నమ్ముకొనిన యెడల ఆహారమునకు కొదువ లేకుండ చేయును.

15) కరవు కాలములో ఒక విధవరాలి ఇంటిలో నూనె తరగలేదు. పిండి తరగలేదు |రాజులు 17:16. అలాగే దేవుడు మనకు అనుగ్రహించిన ఆహార పదార్ధములు తరుగవు. ఉన్నవి తరిగిన యెడల క్రొత్తవి వచ్చును. అనగా మనము ఒక దరినుండి విశ్వాసముతో

ఖర్చు పెట్టుచుండగ మరియొక ప్రక్క నుండి నూతన భోజన పదార్ధములు వచ్చుచుండును. అయ్యో, ఇది ఖర్చు చేసినచో రేపెట్లు? అని అనుకొనుట అవిశ్వాసమునకు గుర్తైయున్నది. తరుగని దేవుని పదార్ధములు మన ఎదుటనుండగా ఏ ముఖము పెట్టుకొని రేపు

ఎట్లు? అను అవిశ్వాసపు మాట అనగలము?.

16) ప్రవక్తయైన ఏలీషా కాలంలో అందరికి సరిపడు ఆహారము లేకపోయెను గాని వారందరు తినగా మిగులునవి దేవుడు సెలవియ్యగా వారు వడ్డించిరి. దేవుడు సర్ధివేసినాడు. ఇంకను మిగిలినది ||రాజులు 4:43. ఇంత మందికి ఐదు రొట్టెలు ఏ మూల? అని

ప్రభువు శిష్యులు అనిన మాట ఇక్కడ జ్ఞాపకము వచ్చుచున్నది. వడ్డించేవాడు మన ప్రభువైయుండగా కరవు దినములలో లోటు ఉండునా?

17) ప్రవక్త చెప్పగా ఒక పేద విధవరాలు తన ఇరుగు పొరుగు వారందరి యొద్ద వట్టి కుండలు ఎరవు తెచ్చెను. తెచ్చిన కుండలు నూనె పోయబడెను కుండలు లేనప్పుడు నూనె ఆగిపోయెను. “అమె” దేవుని దగ్గర నుండి పుచ్చుకొనగలిగినది. పుచ్చుకొనుటకు

పాత్రలు లేనప్పుడు నూనె నిలిచిపోయెను ||రాజులు 4:6. దేవుడు ఇచ్చుటలో వెనుక తీయడు. మనము పుచ్చుకొనుటలోనే వెనుక తీయుదుము! ఆమె ఆ నూనె అమ్మి అప్పులు తీర్చుకొనెను. ఇది అప్పులున్న వారికి గొప్ప పాఠము. నూనె ఊరినట్లు అనుదినము

మన విశ్వాసము ఊరవలెను. అప్పుడు కొదువ ఉండదు.

18) వాన లేని అరణ్యములో గోతులు నిండేటట్లు దేవుడెక్కడ నుండియో నీరు రప్పించెను ||రాజులు 3:16,17. ఇది ఇశ్రాయేలీయుల రాజు యుద్ధములో నున్నప్పుడు జరిగిన సంగతి. దేవుని యొక్క ఆలోచనలు ఇశ్రాయేలీయుల రాజువలె అడిగేవారికి చెంబుడు నీరు కాదు ప్రవాహ జలము లభించును.

19) విశ్వాసికి పేదరికము వచ్చుట కూడ తగువే! అని దావీదు కీర్తన 23 వల్ల తేలుచున్నది. లేనియెడల బీదవారు, ఇబ్బంది కలవారు. కరవులో నున్నవారు యెహోవా నా కాపరి అని ఎట్లు పాడగలరు? శత్రువు ఎదుట భోజనము సిద్ధపరచినావు అని, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని ఎట్లు పాడగలరు?
 20) భిక్షమెత్తుట అనే ఉధ్యోగము విశ్వాసులకు కూడని వృత్తి. కీర్తనలు 37:25. అట్టి దుర్ధశ విశ్వాసులకు సంభవించదు. దీనికి మూలము అవిశ్వాసమే. క్రైస్తవ భిక్షకులు ఈ పాఠము నేర్చుకొనవలెను. నేను ధనికుడను కానుగాని, నా తండ్రి మహా ధనికుడని ఒక 

మిషనరీ పరలోకపు తండ్రిని గూర్చి గొప్ప స్వానుభవ సాక్ష్యమిచ్చెను. అందరిని అడుగుకొనుట, అడుగుకొనడము గాని తండ్రిని అడుగుట, అడుగుకొనడము కాదు. నీతిమంతుని ఇల్లు ఖజానా వంటిదని సామెతలు 15:6లో గలదు.

21) నీతిమంతుడనగా ఎవరు? దేవుని, నమ్మిన వారే. అబ్రహాము దేవుని నమ్మెననియు, అది అతనికి నీతియని ఎంచబడెననియు ఆది 15:6 లో వ్రాయబడియున్నది గదా!

22) అపార సంపాదన చేయగల బలముగల సిం హము యొక్క పిల్లలకైనను ఒకనాడు మేత దొరకకపోవును గాని విశ్వాసులకైతే ఏ మేలు కొదువయుండదు కీర్తన 34:9,10. ఈ సామెత విశ్వాసులకు మేలు కలిగించే సామెతయైయున్నది.

23)”ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయుము”. దేవుడు ఆకలిగొన్నవారిని తృప్తిపరచును గనుక ఎవ్వరును ఆకలితో నుండకూడదని దేవుని యొక్క కోరిక అని మనకు తెలియుచున్నది కీర్తన 146:7, 107:9.

24) ప్రభువు మనకు అన్నియు దయచేయునని కీర్తన 104 లో ఉన్నది. ఉదా:- జలము; భూమి, గాలి, వెలుగు, నక్షత్రాదులు, ద్రాక్షారసము, మెరుగు తైలము. మరియు ఆయన సృష్టిలోని సమస్తమునకు తగిన కాలమందు ఆహారమిచ్చుచున్నారు.

25) యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులుగలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారిమీదను నిలుచుచున్నది కీర్తన 33:19. యెహోవా యందు భయభక్తులు గలవారికి ఆయన కృప చూపును.

స్వభావ సిద్ధముగా దేవుని యొక్క ఉపకారములనుబట్టి దేవుని యందు కృతజ్ఞత కలిగియుండుట క్షేమము. దేవుని కృప ఎప్పుడును ఉన్నది కాని ఒకానొకప్పుడది మనకు దూరముగ నున్నట్లు కనిపించును. అప్పుడు విసుగుకొనక కృపచూపబడునను

నిరీక్షణతో కనిపెట్టవలెను. ఇట్టి అనుభవము క్రైస్తవ జీవితములో తటస్థమగును. ఒకానొకప్పుడు మనమెన్ని ప్రార్ధనలు చేసినను దేవుని కృప మనకు కలిగినట్లు కనిపించదు. అది మనకు శోధన కాలమైయున్నది. దేవుని కృపను తప్పుగా భావించుకొనకూడదు.

దేవుడు తన కృపను ఆలస్యముగా బైలుపర్చుటలో ఏదో ఒక మంచి ఉద్దేశము గలదు. కనిపెట్టడము ఎందుకు వచ్చినది? కృప ఆలస్యముగా వచ్చుట వలననే గదా! లేని యెడల కనిపెట్టుట అవసరము లేదు. కనిపెట్టుట అను విద్య నేర్పించుటకు దేవుడు

అప్పుడప్పుడు తన సహాయము ఆలస్యముగా పంపును సహాయము కలుగని దినములలో కూడ మనకు తెలియని రీతిగా తన కృప చూపించుచునే యుండును. మనము బాగుగా పరిశీలించిన యెడల తెలిసికొనగలము ఇది గొప్ప తర్ఫీదు. కృప ఎప్పుడు

తీసివేయబడునో అప్పుడు నరులు నశించిపోవుదురు. అట్లు నశించుట దేవుని కిష్టము కాదు గనుక తరచుగా ఆయన కృప చూపించుచునే యుండును. కనిపెట్టుటలో విసుగుకొనుటవల్ల మొదటి భాగములోని దైవభక్తి తగ్గిపోవును. కరవు కాలమందు మరణము

రాకుండ సజీవులనుగా కాపాడుట ఈ వాక్యములో నున్నది. ఏ పని నిలిచియుండే పని? యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారిమీదను నిలుచుచున్నది కీర్తన 33:19. యెహోవా దృష్టి పనిచేయుచున్నట్లు

ఈ వాక్యములో గలదు. కొంత సేపు సహాయము చెసి, కొంతసేపు ఆగి, మరికొంతసేపు సహాయముచేసి మరల ఆగి ఈ ప్రకారము చేయుట నిలిచి యుండుటము కాదు. వర్షము ఆగి, కురియుట మనము చూచుచున్నాము. దేవుని దృష్టి ఎల్లప్పుడు నిలిచియుండే

దృష్టియైయున్నది. ఓహో! నరుడు దేవుని కృపను, దేవుని దృష్టిని గ్రహించగలిగితే ఎంత ధన్యుడు! ఏ కొదువ ఉంటుంది?

26) మత్తయి 6:25లో రెండు భాగములు ఉన్నవి. మొదటి భాగము ప్రాణము. ప్రాణమునకు కావలసినవి తిండి, నీరు, రెండవ భాగము శరీరము. శరీరమునకు కావలసినది వస్త్రము. ప్రభువు దృష్టిలో మనము పక్షుల కంటే ఎక్కువ. ఎందుకంటే అవి మన కొరకు సృజింపబడినవి. అయితే చింతించేటప్పుడు వాటికన్న మనమే ఎక్కువగా చింతించుచున్నాము. పువ్వుల దృష్టాంతములో దేవుడు వాటికి అలంకారమిచ్చియున్నాడు. అలాగే మనిషికి అలంకారము బట్టలు, రాజైన సొలొమోను యొక్క అలంకారము. పువ్వుల

యెదుట తగ్గిపోయినది. అనగా పువ్వులకలంకారమిచ్చిన దేవుడు మనకెందుకియ్యడు? అడవి గడ్డిని దేవుడలంకరిస్తే మిమ్మునెందుకు అలంకరింపడనేది గొప్ప గద్దింపు. ఈ రెండు గద్దింపులిందులో నున్నవి. ఆకాశ పక్షులను చూడండి వాటికి ఆహారము ఎంతైనా

ఉన్నదని కనబడుచున్నది.

27) లూకా 5:5 లో శిష్యులకు అది చేపలు దొరికే సమయము కాదని జాలరులకు తెలుసును. ఎందుకనగా వారు జాలర్లు గనుక. "అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని" వలలు వేసి విస్తారమైన చేపలు పట్టిరి. విధేయత గౌరవము, నమ్మకము ఉన్నయెడల దేనికి కొదువయుండదు.

28) మత్తయి 5:32-39 లో క్రీస్తు ప్రభువు నాలుగు వేల మందికి ఆహారము అద్భుతముగ పెట్టెను. ఇక్కడ కొంచెమును దీవించి ఎక్కువచేసిన ప్రభువు ఎప్పుడును దీవించగలడు.

29) సొలోమోను రాజు దేవాలయమును కట్టించి – ప్రజలు ఈ దేవాలయములొ ప్రార్ధన చేస్తే కరవు తొలగించుము. అట్లు తొలగించకపోతే ఈ గుడి కట్టించి ఏమి లాభము? అని గొప్ప ప్రార్ధన చేసెను ||దిన 6:28-31.

30) మత్తయి 7:9-11 ఈ వాక్యములో బిడ్డకు తండ్రి, రొట్టె అడిగిన రాయినిచ్చునా? చేపనడిగిన పామునిచ్చునా? అని ఉన్నది. పిల్లలకు తండ్రి మంచివి ఇచ్చును. అలాగే పరలోకపు తండ్రి మిక్కిలి శ్రేష్టమైనవి ఇచ్చును. ఈ గద్దింపునకు అందరు

సిగ్గుపడవలసినదే. దేవుడిచ్చేదంతా మిక్కిలి శ్రేష్టమైనది.

31) మత్తయి 17:24 దేవుడిపూడు కూడ్ద్ద్ద్ద అట్టి సహాయము చేయును. అవసరముంటేను, నమ్మితేను, ఆయన చేయును. లూకా 5:1-11 శిష్యులు ఈ కథలో యేసు ప్రభువు మాట నమ్మి ఆప్రకారము చేసిరి.

32) యోబు 5:20లో దేవుడు క్షామకాలమందు కరవు బాధ నుండి తప్పించునని స్పష్టముగా నున్నది.

33) కీర్తన 78:24; 136:25 దేవుడు ఆకాశ ధాన్యమిచ్చెననియు, సమస్త జీవులకు ఆహార మిచ్చువాడని ఉన్నది. అట్టి దేవుడు మనకెందుకియ్యడు?

34) బీదలు సేద్యపరచు భూములు బాగుగ పండును. ఇదివరకు మీరు బీదలుగ నున్నారు. ఇప్పుడు కొంత భూమి సంపాదించుకొన్నారని వారి పంటను దేవుడు వృద్ధిచేయును. ఇది దేవుని దయ.

35) కీర్తన 147: 9లో మిక్కిలి చిన్నవియును, కొరగానివియునైన కాకి పిల్లలకు దేవుడు ఆహారము ననుగ్రహించును అని వ్రాయబడియున్నది. ఆ కాకి పిల్లలకు ఆహారము లేకపోతే ఎవరికి నష్టము?

   36) "మనుష్యుడు ....... దేవునినోటనుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును" మత్తయి 4:4. మనిషి దేవుని వాక్యము వలన బ్రతుకునా? అన్నము వల బ్రతుకునా? ఈ ప్రశ్నలకు లౌకికులు అన్నము వలననే బ్రతుకుదురు అని జవాబు చెప్పుదురు. 

సైతాను మాటలను బట్టి చూస్తే అన్నము వలనే అని కనబడుచున్నది. ప్రభువు అందుకు సమ్మతించలేదు. “ఆహారము” ముందా? దేవుని “వాక్యము” ముందా? దేవుని వాక్యము వలననే ఆహారము దొరుకును. దేవుని వాక్యము తీసివేయబడిన యెడల,

ఆహారము తీసివేయబడును. ఒక విశ్వాసి ఇట్లు ప్రార్ధించెను. ఓ దేవా! నీ వాక్యము వలన ఆకలి తీరునని యున్నది గనుక అలాగే చేయుదునని ప్రార్ధన చేసి బలముగానే యుండెను. అనేకులకు ఇది చాదస్తముగా ఉండును. ఎవరైనా ఒకరు సువార్త ప్రకటించుచూ,

బైబిలు చదువుచుంటే ఆహారము దొరకని సమయమందు, విశ్వాసముంటే ఈ పని జరుగును.

37) కీర్తన 132:13-15లో సీయోను నివాసులను దేవుడు తృప్తిపరచునని యున్నది.

38) యెషయా 33:16 "తప్పక అతనికి ఆహారము దొరకును. అతని నీళ్ళు అతనికి శాశ్వతముగా నుండును." నీతిపరులకు తప్పక నీరు, ఆహారము దొరుకును. "తప్పక" అను మాట మహా ముఖ్యమైనది.  

39) లూకా 11:3 ఆహారము నిమిత్తము ప్రార్ధన చేయుట ఎంతో అవసరము గనుక ప్రభువు ఈ మనవి నేర్పెను. ఆత్మ జీవమును గురించి బోధించినాను అంతే చాలునని ఊరుకున్నట్లు లేదు. శరీర జీవనమును గూర్చి కూడ బోధించెను.

 నాకేమి కొదువ నాధుడుండ ఇక=శ్రీకరుండగు దేవుడే నా= శ్రేష్టపాలకుడు నా ఏక రక్షకుడు.

చదువరులారా! మన ప్రాంతములో వర్షము లేనందున ఆహార ధాన్యముల కొరత కలుగునని తలంచుచున్నాము. పైవాటిని చదువుకొని దేవునిపై ఆధారపడి ప్రార్ధించిన యెడల దేవుని సహాయము లభించును.

చదువరులకు అట్టి సహాయము లభించును గాక! ఆమెన్. 
Please follow and like us:

How can we help?