చదువరులారా! లోకములోని కొందరు ఈ ప్రశ్న వేయుచున్నారు. నిరుకైన దైవబోధ తెలియని వారికి, పాపులకు, అనారోగ్యవంతులకు, ఆకలిగొన్నవారికి, అపాయములో నున్నవారికి, భూతపీడితులకు ధర్మబోధ నెదిరించువారికి, మృతులైన కొందరికి క్రీస్తు
అద్భుత్తోపకారములు చేసెనని మీరు చెప్పుచున్నారు గదా! అవి మనము చూడలేదు. ఇప్పుడు ఆయన చేయుచున్న ఒక అద్భుత క్రియ వేలుపెట్టి చూపించగలరా? అని కొందరు అడుగుచున్నారు. చూపించగలము. అది ఏదనగా: క్రైస్తవ మతసంఘమే-ఎన్ని
ఆటంకములు, ఎన్ని అవమానములు, ఎన్ని హత్యలు, ఎన్ని దోషారోపణలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని పాపాకర్షణలు, ఎన్ని కష్టములు వచ్చినను ఆది నుండి నేటి వరకు అన్ని కాలములలో, అన్ని దేశములలో వ్యాపించుచూ మనవరకు వచ్చి, మన కంటికి
కనబడుచున్నది క్రైస్తవ మత సంఘమే. ఇదే నేడు క్రీస్తు చేయుచున్న అద్భుతము. బహిరంగమునకు బోధకులు దీని నాయకులు. కాని అంతరంగమున క్రీస్తే దీని నాయకుడు. క్రీస్తు పేరు చెప్పకుండ, క్రీస్తు చరిత్ర వివరింపకుండ బోధకులు మతోపదేశము చేయలేరు.
కొండలలోపుట్టిన ఒక నది ప్రవహించుచుండగ పల్లములు కనబడును; ఎత్తు స్థలములు కనబడును. కొండలు కనబడును. కాని వాటిని ఒత్తిగించుకొని అది సముద్రములోనికి వెళ్ళును. అలాగే క్రీస్తు మతమునకు ఎన్ని దేశములలో అడ్డులు వచ్చినను తప్పించుకొని
తప్పించుకొని సాగి వచ్చుచునే యున్నది. దైవ విషయములు చెప్పుకొనుచు క్రైస్తవ మతసంఘము తనకును, యితరులకును దైవగ్రంధమగు బైబిలును లోకములోని అనేక భాషలలో చల్లివేయుచున్నది. ఇది అద్భుతము కాదా! ఎన్నో కోట్ల రూపాయలు
మతాభివృద్ధికై ఖర్చు పెట్టుచున్నది. ఇది అద్భుతము కాదా! క్రీస్తు వలెనె పాపులకు, రోగులకు, బీదలకు, భూతపీడితులకు, కష్టస్థితిలో నున్నవారికి ఉపకారములు చేయుచున్నది. ఇది కంటితో చూచుచు ఎవరు కాదనగలరు? క్రీస్తు మతము ప్రవేశించిన
దేశములలో విద్య, నాగరికత వ్యాపించుచున్నది. దైవ విషయములు తెలియుచున్నవి. మనుష్యులకు ఏది ఉపకారమో అది చేయుటకు ఉద్దేశించుచున్నది. ఆటంకములు కలిగినంత మాత్రమున ఉపకార కార్యములు ఆపుచేయదు. క్రీస్తు ఆజ్ఞలు శిరసావహించి
అర్ధము కాని వారికి నచ్చజెప్పుచున్నది. వినువారి వలన శ్రమలు కలిగినను ఓర్చుకొనుచున్నది. ఇవన్నియు అద్భుతములు కావా!