ఒక ధనికుడు తనకు కలుగబోవు బిడ్డల నిమిత్తమై కావలసిన వన్నియు సిద్ధపరచి, ఐదు అంతస్థులు గల మేడయందు వాటినుంచి; బిడ్డలు జన్మించి, ఎదిగి జ్ఞానవంతులైన పిమ్మట వారికన్నియు చూపి, సంతోషముతో అనుభవించుడని చెప్పిన రీతిగా
దేవుడును మానవులమైన మన యెడల చేసినట్లు బైబిలు గ్రంధమందు గలదు.
1 . భూమి – దేవుడు మనము జన్మింపక ముందే నివాసార్ధమై భూమిని చేసి దానిని ఉపకారములగు వృక్షములు, జీవరాసులు, నదులు, కొండలు, అడవులు మొదలైన వాటితో నింపెను. భూగర్భమును బంగారము, వెండి మొదలైన లోహములతో నింపెను.
సముద్రమ్ను ఉప్పుతోను, చేపలతోను, పలువిధములైన వస్తువులతో నింపెను. ఇవన్నియు మానవుని కొరకే గదా! మానవుడెంత ధన్యుడు!
- ఆకాశము – దేవుడు ఆకాశమును విశాలముగా చేసి దానిని పగలు కాంతి నిచ్చు సూర్యునితోను, రాత్రి వెలుగునిచ్చు చంద్ర, నక్షత్రాలతోను, వర్ష మిచ్చు మేఘములతోను, పీల్చుకొను గాలితోను నింపెను. ఇవన్నియు మానవుని కొరకే గదా! మానవుడెంత
ధన్యుడు!
- మోక్ష లోకము – మానవులు ఈ లోక జీవనాంతరమున నిత్యసంతోషమనుభవించుటకు మోక్షలోకమును చేసెను. ఇది నిత్య నివాసం గల వర్ణింపనలవి గాని లోకము, నిత్యము ఆనందమే కలిగి యుండుటకు ఏర్పాటు చేసెను. ఆయనను నమ్మి భక్తితో జీవించి,
మరణించిన వారు మోక్ష లోకమునందే సుఖించుచు, ప్రస్తుతము భూమి మీద బాధలు పడుచున్న మన యొక్క నిత్య రక్షణ నిమిత్తమై దేవుని నిత్యము ప్రార్ధించుచున్నారు. ఈ (మోక్ష) లోకమును, ఇందున్న సమస్తమును మానవుని కొరకే గదా! మానవుడెంత
ధన్యుడు!
4. దేవదూతల లోకము - మోక్ష లోకమునకంటే పైన మరియొక లోకమున్నది. ఇందు దేవుని వంటి ఆత్మరూపులైన దేవదూతలు నివసింతురు. మానవుని కాపాడుటకు, మానవుని కొరకు చేయబడిన సమస్తమును కాపాడుటకు, దేవుని నుండి మానవునికి,
మానవునుండి దేవునికి వర్తమానము అందించుటకు, మానవుని సుఖజీవనము, రక్షణ నిమిత్తము దేవుని ప్రార్ధించుటకు వీరు కలుగజేయబడిరి. ఈ లోకమును, ఇందున్న సమస్తమును మానవుని కొరకే గదా! మానవుడెంత ధన్యుడు!
5. దేవ లోకము - దూతల లోకము కంటే పైన మరియొక లోకమున్నది. దీనియందు దేవుడున్నాడు. ఆయన తన లక్షణములతో మానవుని కలుగజేసెను. తన జీవము, ప్రేమ, సంతోషము, న్యాయము, బలము మొదలైన తన గుణములతో మానవుని
నింపెను. మానవుని నిత్య శరీరాత్మల రక్షణ నిమిత్తం అనాది నుండియు ఆలోచనతో నిండి యుండెను. దేవునికి గల సమస్తమును తన బిడ్డయైన మానవుని కొరకే గదా! మానవుడెంత ధన్యుడు!
చదువరులారా! ఈ ఐదు అంతస్థుల మేడయును, అందలి సమస్తమును ఎవరి మూలమున కలిగెను? బైబిలులో యోహాను 1: 2,3 వచములలో "సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు" అనియు,
యోహాను 1: 10,11లో “ఆయన లోకములో ఉండెను. లోకము ఆయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు” అని వ్రాయబడియున్నది. ఆయన
యేసుక్రీస్తు ప్రభువే. ఆయన ఈ లోకంలోనకు చూపించెను. శరీర ధారిగా నున్నపుడు కొందరు ఆయనను అంగీకరింపలేదు. దివ్యోపదేశములతోను, అద్భుతములతోను, భక్తులతోను లోకము నింపి వెళ్ళెను. నేడు తన వాక్య గ్రంధముతో లోకము నింపెను.
సమస్తమును సమృద్ధిగా నింపి మనకు చూపించెను. స్వంతమని వాని నందుకొనుటయే మన పని. దేవుడు నాకేమియు చేయలేదని ఎవరును అనరాదు. మరియు ఆయన “నా నామమును బట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేతును” అని యోహాను
14:14లొను, అడుగు ప్రతివాడు పొందును” అని మత్తయి 7:8లోను చెప్పెను. సమస్తమును మీవి అని బైబిలు చెప్పుచున్నది. ఆహా! మానవుడెంత ధన్యుడు!