యేసు ప్రభువు-నేనే మార్గమును, సత్యమును, జీవమునై యున్నాననెను. యోహాను 14:6.
|. జీవము:1) ఇక్కడ త్రిత్వములో ఒకరైయున్న తండ్రియైన తండ్రిని తలంచుకొనవలెను. ఆయన సృష్టిని కలుగజేసినప్పుడు, మొక్కలలోను, జీవరాసులలోను, తుదకు మనుష్యులలోను జీవమును ధారపోసెను. ఆ జీవము నేటి వరకును లోకములో గలదు.
మానవులలో గొప్ప దుస్థితి గలదు. అనగా మానవుడు పాపము చేసినప్పుడు మరణమునకు సమీపించు చుండును. పాపము చేసినప్పుడు తెలియని రీతిగా మనిషిలో నున్న జీవము ఖర్చు అయిపోవుచుండును కాబట్టి తండ్రి ఎప్పటికప్పుడే జివము
ధారపోయుచుండును. ఎండ వేడిమికి మొక్కలోని చెమ్మ తగ్గిపోవుచుండగా తోట మాలి నీళ్ళు పోయుచునేయుండును. అలాగే తండ్రి చేయుచుండును. ఈ జీవ ధార రెండు జీవితములకు ఉపయోగము. మన జన్మము మొదలుకొని మరణ పర్యంతము గల జీవితము
ఒకటి. ఈ జీవితములో దుర్జనులకు, సజ్జనులకు కూడ తండ్రి జీవము పోయుచుండును. అయితే విశ్వాసులకు మరణము తరువాత నిత్యజీవము కొనసాగింపబడును. ఈ రెండు విధములైన జీవితములకు అనుదినము తండ్రి జీవము ప్రసాదించుచునే యుండును.
ఒకటి జ్ఞాపకము ఉంచుకొనవలెను. మారు మనసు లేని వారికి కూడ మరణము తర్వాత అంధకార లోకమున జీవము ఉండును గాని అది మారు మనస్సు కొరకు గడువు జీవమై యుండును. చూచినారా1 తండ్రి ప్రేమ తండ్రియే. ఏదో విధముగా వృధా అని
తెలిసినను జీవము ధారపోయుచునే ఉండును. ఉదా: కోడిపిల్లకు దెబ్బ తగిలిన పెంచువారు దానిని రెండు గుప్పెళ్ళలో పెట్టుకొని ఊపిరి పోయుదురు. అట్లే తండ్రి చేయును. యేసు ప్రభువు నేను జీవమునై యున్నానని చెప్పుటను బట్టి ఆయన తండ్రి కూడ
అయియున్నట్లు తెలియగలదు. ఇదే ఆయన దైవత్వమునకు ఋజువు. 2) యేసు ప్రభువు జీవమై యున్నాడు. ఎట్లనగా ఆయన శత్రువులు దండించినప్పుడు, చంపినప్పుడు, భూస్థాపన చేసినపుడు ఊరుకొన్నాడు గాని మూడవనాడు వెలుపలికి వచ్చినాడు.
అప్పుడు ఆయన జీవమైయున్నాడని తెలిసినది. ప్రభువు యొక్క సేవలో చేసిన అద్భుత కార్యములన్నియు ఆయన జీవమైయున్నాడని ఋజువు పరచును. మరియు పునరుత్థాన కాలమందు అనగా రాకడలో అందరిని ఆయన లేపినప్పుడు ప్రభువు జీవమై
యున్నాడను సంగతి మరింత ఎక్కువగా తెలిసికొందుము. 3) రోమా 8:2 లో జీవము నిచ్చు ఆత్మ అని వ్రాయబడి యున్నది. గనుక పరిశుద్ధాత్మ కూడ జీవమైయున్నాడు.
|| మార్గము: 1) తండ్రి మార్గమై యున్నాడు. ఆదాము అవ్వలు పాపము చేసి చెట్టు చాటున దాగిరి. వారు చెట్టు దగ్గరకు వెళ్ళకుండ దేవుని దగ్గరకు వెళ్ళవలసిన మార్గము వారికి తెలియ లేదు గనుక ఆయనే స్వయముగా వచ్చి, పలకరించి, రక్షించి తన చెంత
చేర్చుకొనెను. అందుచేతనే తండ్రి మార్గమై యున్నాడు. తండ్రి కుమారుని పంపినందు వలన విశ్వాసికి పరలోకము వెళ్ళే మార్గము ఏర్పడినది. ఆ మార్గము నేర్పరచివాడు వాడు తండ్రి గనుక తండ్రి మార్గమై యున్నాడు. తండ్రి కుమారుని పంపినట్టు ఆత్మను కూడ
పంపియున్నాడు గనుక ఆ పంపుట వల్ల మార్గమేర్పడెను. గనుక తండ్రి మార్గమై యున్నాడు. 2) క్రీస్తు ప్రభువు మార్గమైయున్నాడు. ఇది చాల స్పష్టముగా నున్నది. ప్రభువు మనుష్యులకు కనబడి ఏలాగు నడువవలెనో చెప్పి నడిచి చూపించెను. కాబట్టి అందరు
ఆయన అడుగు జాడలలో నడువ వచ్చును. నన్ను వెంబడించు అని ప్రభువు సుంకపు మెట్టు దగ్గర నున్న మత్తయితో చెప్పినప్పుడు మత్తయి మెట్టు విడచి ప్రభువుతో కూడ వెళ్ళెను. ప్రభువు ముందు నడుచుట, మత్తయి ఆయన వెనుక పోవుట, అదే మార్గము.
యేసు ప్రభువు మార్గమని తెలియుచున్నది. ప్రభువు యొక్క ధర్మోపదేశము, ఉపకారములు, జనుల సహవాసము, శ్రమానుభవము, పునరుత్థానము ఇవన్నియు కలిపి ఒక బాటయైయున్నది. ప్రభువు ఇట్లు నడచి చూపించెను గనుక ఇది ఒక బాటయైయున్నది.
ఆయన చివరగా ఆరోహణమాయెను అదే పరలోకమునకు మార్గము. రేపు సంఘము కూడ ఈ మార్గముననే పరలోకమునకు వెళ్ళును. వీటన్నిటిని బట్టి యేసు ప్రభువు మార్గమై యున్నాడు. 3) పరిశుద్ధాత్మ మార్గమైయున్నాడు. ఆయన వచ్చినప్పుడు సర్వ
సత్యములోనికి మిమ్మును నడిపించును. గనుక పరిశుద్ధాత్మ మార్గమైయున్నాడు. యూదుల భయము చేత 120 మంది తలుపులు వేసికొనిరి. అప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. వారు తలుపులు తీసికొని విరోధుల యొద్దకు వెళ్ళిరి. ఎవరు
నడిపించుకొని వెళ్ళిరో, అయనే మార్గమైయున్నాడు. అనగా ఆత్మయే నడిపించుకొని వెళ్ళెను. ఆత్మను పొందిన పిమ్మట ఒక్క యెరూషలేము విధులలోనికి మాత్రమే కాక యూదయ, సమర, గలిలైయకు, చిన్న ఆసియాకును తుదకు సమస్త రాష్ట్రములకును,
భూదిగంతముల వరకును బాట వేసికొని వెళ్ళియున్నారు. ఇదంతా ఎవరి శక్తి? ఈ పాయ (మార్గము) చేసిన దెవరు? ఆత్మ గనుక ఆయన మార్గమై యున్నాడు. మరియు దేవుని వాక్యమునకు అర్ధము తెలియనప్పుడు ఆత్మ తండ్రి బోధించి, తేటపరుచుట ఒక
మార్గమైయున్నది.
||| సత్యము: 1) తండ్రి సత్యము, సత్యము అనగా నిజముగా జరిగిన సంగతి. తండ్రి చేసిన పని అనగా సృష్టి మన కంటికి కనబడుచున్నది కాదనలేము. సృష్టిని బట్టి తంద్రి సత్యమని ఋజువగుచన్నది. యోహాను 17:3లో సత్య దేవుడు అని వ్రాయబడి యున్నది.
సత్యము ఆయన యొద్ద నుండి వచ్చినదే. సత్యమనగా (fact). 2) కుమారుడు సత్యము, యేసు ప్రభువు చేయునది సత్యమని యోహాను సువార్త 8వ అధ్యాయములో ఉన్నది. క్రీస్తు యొక్క జీవిత చరిత్ర అనగా నలుగురు సువార్తికులు వ్రాసిన చరిత్ర
నిజముగా జరిగినది. అవిశ్వాసియైన ఒక యూదుడు (జెసిఫస్) గొప్ప గ్రంధము వ్రాసెను. క్రీస్తు చరిత్ర సత్యము గనుక ఆయన సత్యమై యున్నాడు. 3) పరిశుద్ధాత్మ: ఆత్మ సత్యము. సత్య స్వరూపియైన ఆత్మ అని యోహాను 16:13లో స్పష్టముగా కనబడుచున్నది.
మీరు సత్యమంతయు గ్రహింతురు అని కూడ గలదు. గనుక ఆత్మ తండ్రి మనము సత్యము గ్రహించునట్లుగా చేయును. కనిపెట్టు గంటలో దేవుని చిత్తమును తెలియపరచును. అనేకులు అనేక రీతులుగా చెప్పుచున్నప్పుడు ఏది సత్యమైనది తెలియనప్పుడు
కనిపెట్టు గంటలో నుండిన పరిశుద్ధాత్మయే, అనగా సత్యాత్మ వచ్చి తెలియపర్చును. తండ్రి సత్యమని సృష్టి వలనను, కుమారుడు సత్యమని స్వీయ చరిత్ర వలనను, ఆత్మ సత్యమని సంఘ చరిత్ర వలనను బాహాటమగుచున్నది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు-
మార్గము, సత్యము, జీవమునైయున్నారు. ఈ మూడు అయియున్నాడని ప్రభువు యొక్క మాటలలో కనబడుచున్నది. త్రిత్వము అను దైవత్వము క్రీస్తు ప్రభువులో ప్రత్యక్షమైనట్టు ఈ వాక్యములో కనబడుచున్నది. అనగా క్రీస్తు ప్రభువులో తండ్రి కలడు, ఆత్మ
కలదు అని అర్ధము. ‘తండ్రి పనుల మీద నేనుండవలెనని మీరెరుగరా’ అని భూమి మీద ప్రభువు మాట్లాడిన మొదటి మాటగా వ్రాయబడియున్నది. అది వ్రాతలో నున్న ప్రభువు యొక్క దైవత్వము కనబడుచున్నది. నేనే మార్గము, సత్యము, జీవము అను
వాక్యములో ఆయన దైవత్వము యొక్క నైజము ఉన్నది.
యెషయా 4:5లో "వితానము" అని ఉన్నది. వితానము అనగా కాపుదల కప్పు. మనిషిమీద ఇది విప్పబడియున్నది గనుక బయటికి పోవుటకు దుర్జనునికి సందు లేదు. మనిషిని కాపాడుటకు తండ్రియు, కుమారుడు, పరిశుద్ధాత్మ వితానముగా నున్నారు.
ఉదా: పారిపోవుచున్న కుర్రవానికి అడ్డగించుటకు ముగ్గురు మూడు ప్రక్కల నుండి అడ్డముగా వచ్చునట్లు పాపులమైన మనము దేవుని యొద్ద నుండి పారిపోకుండ త్రియేక దేవుడు అడ్డము వచ్చును. ఆ పారిపోయే కుర్రవాడు అడ్డగించు వారిని ఎదిరించిన వదలిపెట్టి
వేయును. వాడు చనిపోవును. అలాగే అనేకులు దేవుని వితానమును ఎదిరించి చెడిపోవుచున్నారు.
ప్రార్ధన: ఓ తండ్రీ! మేము తప్పిపోవుచున్నప్పుడు నీ మార్గము అడ్డుబడుననియు, తప్పు బోధలో కొట్టుకొనుచున్నప్పుడు నీ సత్యము అడ్డుబడుననియు, నిత్య నాశన మరణమునకు కొట్టుకొని పోవుచున్నప్పుడు నీ జీవము అడ్డుబడుననియు మేము తెలిసికొని
నీకు వందనములు ఆచరించుచున్నాము. ఆమెన్