దేశీయులారా! అంగడిలో వస్తువు పరీక్షించకుండ కొనువారుండరు. నచ్చినయెడల కొందురు. నచ్చనియెడల విడిచి పెట్టుదురు. అట్లే లోకములో మతములు, అనేక మతశాఖలు, అనేక అభిప్రాయములు గలవు. అందుచేత తెలివి తేటలు గలిగి పరీక్ష
చేయవలసియున్నది.
దేవుడు ఒక్కడే యని నమ్మువారును అనేక దేవత పూజలు చేయుచున్నారు. ప్రపంచములో 600కోట్లకు పైగా జనులున్నారు. ఒకరికున్న తలంపు మరియొకరికి ఉండదు. ఎవరికి సమాధానము చెప్పగలము? చెప్పినయెడల కలహము వచ్చును. పూజ వలన
కలుగు మేలు చెప్పుకొనవచ్చును. దేవునిని పూజించుట మన విధి. దాని వల్ల శాంతి కలుగక మానదు. పోలీసువారు తమ దుస్తులతో చుట్టపుచూపునకు వచ్చినను ఇంటివారు భయపడుదురు. ఇంటివద్ద వేసికొను వస్త్రములతో వచ్చిన యెడల సత్కరింతురు.
ఇహట్లే దేవుడు దేవుడుగా వచ్చినయెడల నరులు భయపడుదురు. భస్మమైపోవుదురు. అందుచేతనే ఆయన మనుష్యుడై వచ్చెను. ఎందు నిమిత్తము? పాపములు పరిహరించుటకును అన్ని కష్టములలో సహాయపడుటకును వచ్చెను.
దేవుడు మనుష్యుడైనాడు గనుక ఏదో యొకపేరు పెట్టుకొనవలెను, లేనియెడల మనుష్యులు యేమని పిలువగలరు? కాబట్టి ఆయన యేసుక్రీస్తను పేరు పెట్టుకొనెను. ఆయన ఎవరు? దేవుడు. ఇంకను ఎవరు? మన మనుష్యుడే. ఆయనను కొలిచినయెడల
ఇహమందు, పరమందున్ను మనము ధన్యులమగుదుము. పూర్వకాలమందు ఆయన తనను ఆశ్రయించిన వారికి మోక్షమార్గమును బోధించి, పాపములు పరిహరించెను. తన ప్రభావము వల్ల మందులేకుండ వ్యాధులు బాగుచేసెను. మనుష్యులను పట్టిన
దయ్యములను వెళ్ళగొట్తెను. పూర్వకాలపు మాటయెందుకు? ఇప్పుడును ఆయన తన సేవకులచేత అట్టి పనియె చేయించుచున్నారు. గుంటూరు దగ్గరనున్న కాకానివద్ద స్థాపించిన స్వస్థిశాలకు వెళ్ళి చూడండి ఎన్ని వేలమంది బాగగుచున్నారో, బాగైనవారితో
మాట్లాడి చూడండి. దయ్యములు పట్టినపట్టినవారిలో నుండి ఆయన వాటిని ఎట్లు వెళ్ళగొట్టుచున్నారో కనుగొనండి. కొన్ని యేండ్ల నుండి సంతానము లేనివారికి ఆయన యెట్లు సంతానము దయచేయుచున్నారో అడగండి, తెలిసికొనండి. ఎవరు క్రైస్తవబోధ
మొదటినుండి చివర వరకు విందురో వారికి నమ్మిక కలుగును. ఆ నమ్మిక వలన క్రీస్తు ప్రభువును పూజింతురు. అప్పుడాయన వారి జబ్బులు బాగుచేయును. మనమీద ప్రేమ లేకపోయిన యెడల దేవుడు భూమి మీద మనుష్యుడుగా సంచరించునా? సమస్త
ధర్మములు బోధించునా? ఆ కాలపు ప్రజలకు మాత్రమే గాక మన కాల ప్రజలకు కూడ బోధ పంపిన క్రీస్తుప్రభువు ప్రేమ గలవాడు కాడా? దుష్టులాయనను కేవలము మనుష్యుడనుకొని చంపగా, ఆయన తనను చంపనిచ్చి, బ్రతికివచ్చి, దేవుడని రుజువు
పరచుకొనెను. తరువాత ఆయన మహిమ శరీరముతో దేవలోకమునకు వెళ్ళెను. రేపో, మాపో వచ్చి, నమ్మిన వారిని ప్రాణముతోనే మోక్షమునకు తీసికొని వెళ్ళును. సిద్ధపడండి. క్రీస్తుప్రభుని గురించిన బోధ పూర్తిగా విని చూడండి. పరీక్షించండి. నమ్మి చూడండి.
ఆయన ఆజ్ఞల ప్రకారము నడిచి చూడండి.మీకు తెలిసిన చెడును విసర్జించి చూడండి అనునదియే ఈ పత్రికలోని ముఖ్యాంశము. క్రీస్తుప్రభువును మీ ఇండ్లకు పిలిచి, పూజించి చూడండి. నిజము బయట పడును. మీకు శుభము కలుగును గాక. ఆమెన్.