భూలోకమునకు మధ్య పాలస్తీనా దేశము గలదు. అందు గలిలయ సముద్రము ఉన్నది. ఆ సముద్రము యొక్క పొడవు 12 మైళ్ళు వెడల్పు 7 మైళ్ళుండును. దీనినే తిబెరియ సముద్ర,మనియు, గెన్నెసరెతు సరస్సు అనియు కూడ చెప్పుదురు. దీని చుట్టు
పల్లెలు, పట్టణములు గలవు. యెసు ప్రభువు బోధ వినుటకు ప్రజలనేకులు ఈ తీరమునకు వచ్చిరి. మరియు జాలర్లు నిత్యము తమ దోనెలతో ఆ సముద్రముపై తిరుగుచుందురు. యేసు ప్రభువు చిన్న దోనె ఎక్కి దానినే ప్రసంగ పీఠముగా చేసుకొని ప్రజలకు
బోధించెను. సాయంకాలమున ఆయన తన శిష్యులతో అవతలి ఒడ్డునకు పోవుదమని చెప్పెను. యేసు ప్రభువు దోనె ఎక్కెను. శిష్యులు కూడ ఎక్కిరి.
1)" ఆయన వెంట వెళ్ళిరి."శిష్యులకు ప్రభువు వెంట వెళ్ళు వాడుక కలదు. ఎప్పుడును ప్రభువు వెంట వెళ్ళుట వారికి ఆనంద కార్యము. మనము కూడ క్రీస్తు వెంట వెళ్ళు వాడుక కలిగియుండిన క్షేమము. ఆయన గ్రామమునకు వెళ్ళిన, పర్వతమెక్కిన, నీటిపై
వెళ్ళిన, అడవికి వెళ్ళిన, ఆయన వారినెక్కడికి తీసికొనిను. ఆ గొర్రెలు తమ కాపరిని చు వెళ్ళిన వారక్కడికి వెళ్ళు మంచి వాడుక కలిగియుండిరి. ఉదా:- గొల్లబోయడు తన గొర్రెలను రాళ్ళు, ముండ్లు, పచ్చిక, నీరు ఉన్న చోటికి నడిపించును. అని అతనిని
వెంబడించూచుచూ వెళ్ళును గనుక భయముండదు. శిష్యులు దోనెను నడుపుచుండిరి. యేసు ప్రభువు అమరము మీద నిద్రపోయెను. దినమంతయుబోధ చేసియున్నారు గనుక త్వరలో నిద్రపోయెను. అంతలో గొప్ప తుఫాను సముద్రము మీద లేచి దోనె
మునుగునంతవరకు వచ్చెను.
2) దోనెలో నున్న శిష్యుల మీద గాలి తిరగబడినది. మానవులు పాపాత్ములైనందున సృష్టి వారిని ఎదిరించెను. గాలిని దేవుడు మన మేలు కొరకు చేసెను గాని మనము పాపాత్ములగుటవలన గాలి వల్ల మనకు నష్టము. గాలి ఎక్కువగుట వలన నావలు
మునుగును. ఇండ్లు కూలును. మనుష్యులు చనిపోవుదురు. నీటి వరదకు పంటలు కూడా పాడైపోవును.
3) శిష్యులు జాలరులు, చేపవలె ఈదగలరు. నీటి ప్రయాణము వారికి అలవాటు. మునిగిన, ఈదుకొని ఒడ్డునకు రాగలరు. వారు నీటి కాకులు, సముద్రము వారు బాగా ఎరిగిందే గనుక బలముగా తెడ్లు వేసి గాలిని ఎదిరించిరి. ఎంత ప్రయత్నించిన నావ
మునుగుటకు సిద్ధముగా నున్నందున మునిగి నశించిపోవుదుమన్న భయము వారికి కలిగెను.
4) పేతురు భయపడెను. అంద్రెయ జడిసెను. యాకోబు బెదరెను. యోహాను జంకెను. ఫిలిప్పునకు భీతి, బర్తొలొమయి వణకెను, తోమాకు సందియము, మత్తయి కృంగెను, యాకోబునకు అధైర్యము, తద్దయికి దిగులు, సీమోను అదరెను, ఇస్కరియోతు
యూదా సరేసరి.
5) వారున్న దోనెలోనే, వారి చెంతనే ప్రభువున్నారు. ప్రభువు వున్న నావ మునుగునా? గాలి, దేవుని ముంచి వేయునా? మనకెన్నో కష్టములు వచ్చి మనలను మ్రింగి వేయునట్లు కనబడును. గాని ఆయన మ్రింగనిచ్చునా! కష్టాలలో ఆయన కాపాడును గనుక
మనకు భయమెందుకు?
6) అయితే గాలి తుఫాను వారిచేత ప్రార్ధన చేయించెను. అశ్రద్దగా నున్నప్పుడు కష్టములు మన చేత ప్రార్ధన చేయించును. కష్టములలో విసుగక ప్రార్ధించిన అవి గతించిపోవును. దైవశక్తిని చూడగలము, మన విశ్వాసము వృద్ధి పొందును.
7) లోకము గలిలయ సముద్రము వంటిది అందున్న దోనె క్రీస్తు మతము వంటిది. గాలి, నీరు, కెరటములు, మన కష్టముల వంటివి. ఆ వాన ఈ ఒడ్డున బయలుదేరి అవతలి ఒడ్డునకు చేరవలసినది. అలాగే క్రైస్తవ మతము ఈ లోకములో బయలు దేరి మోక్ష
లోకమునకు చేరవలసియున్నది. ఈ ప్రయాణములో ఎన్నో కష్టములు, శోధనలు, ఆపదలు, మనలను భయపెట్టు సంగతులు, సందేహములు అడ్డుగా వచ్చును. ఉపకారియైన గాలి, నీరు శిష్యుల మీద తిరగబడినట్లు మన స్నేహితులే ఒకానొకప్పుడు శత్రువులై
పోవుదురు. ఆధారమైన దోనె మునిగి పోవునట్లున్నది గదా అలాగే సంఘము నాశనమగునట్లు అగపడును.
8) శిష్యులు ప్రభువు చేసిన అద్భుతములు, ఆయన బలము, ఆయన దయ ఎరిగినవారైనను ఎంతో భయపడిరి. మనము కూడా ఎన్ని బోధలు, అద్భుతములు ఎరిగినను, ప్రభువున్నట్లు ఎరిగియు కష్టములు, ఆపదలు, చిక్కులు రాగానే హడలిపోయి, చింత
కలిగి చావు రాక ముందుగానే చచ్చినట్లుందుము. ఎదే మన వింత వార్త.
9) శిష్యుల యొక్క ప్రార్ధనలు ఏవనగా: ఓ బోధకుడా, మేమిదిగో నశించిపోవుచున్నాము. నీకేమి చింత లేదా? నశించుచున్నాము. మమ్మును రక్షించుము, ప్రభువా నశించుచున్నాము-ఇవే వారి కేకలు, అరుపులు, వారు చేసిన శబ్దములు, వారి మొరలు
మనము పరీక్షించినచో, వారు ప్రభువును చూచి, నీకు చింత లేదా? అని అడుగుచున్నారు. అట్లు ప్రార్ధన చేయవచ్చునా? కష్టములలోనున్నవారిని చూచిన ఆయనకు జాలి లేదా! వారిని కనికరింపడా! శిష్యులు మునిగ్పోవుట గురువైన యేసు ప్రభువునకు ఇష్టమా!
వారి భయమే గాని వారు నిజముగా నశించుచున్నారా! ప్రభువు ఉండగా వారెప్పుడును నశింపరు. అలాగే సంఘములో ప్రభువుండగా సంఘము నాశనము కాదు.
10) మనము తెలిసికొనవలసిన మరియొక సంగతి ఏమనగా గాలి జోరుగా వీచినను, దోనెలో నీరు చేరినను, కెరటములు కొట్టి నీరు దోనెలో పడినను ప్రభువు హాయిగా నిద్రపోయెను. కష్టములను లెక్కచేయని యేసుప్రభువునకున్న నెమ్మది విశ్వాసికూడ
కలిగియుండవలెను. ఆ కష్టములు, ఈ కష్టములు, వారు, వీరు నన్నేమి చేయలేరు. ప్రభువుండగా నాకు భయము లేదని నిర్భయముగా నుండవలెను.
11) యేసుప్రభువు గనుక ఆయన దైవత్వమునకు శిష్యులకున్న కష్టములు తెలియును.అయితే ఆయన శిష్యుల ప్రయత్నములన్నియు ఎరుగును గనుక అన్ని ప్రయత్నములు చేయనిచ్చి వారి శక్తి చాలదని తెలిసికొను పర్యంతము ఊరకుండెను. అప్పుడు
ప్రభువు తన శక్తిని, తాను దేవుడనియు చూపించెను. అలాగే మనకు కష్టములు రాగానే ఆయన వెంటనే తొలగింపడు. మనము విసుగక సహాయము కొరకు ప్రార్ధన చేయుచుందము. అప్పుడు కష్టములు తొలగును.
12) ప్రభువు శిష్యులందరు కూడి ప్రార్ధనచేయు వరకు ఊరకుండెను. వీరి ఆపద అందరి ఆపద గనుక అందరు ప్రార్ధించు వరకు ఊరకుండెను. అలాగే దేశము ఆపదలో నున్న అందరు ప్రార్ధింపవలెను. సంఘము ఆపద కాలమందు సంఘమతతు ప్రార్ధింపవలెను.
అప్పుడు ఆపదలన్ని తొలగిపోవును. మన ఆపద కాలములో మనము ప్రయాసపడుచుండగా ప్రభువు ఊరకుండును. అట్టి సమయములో మన హృదయములో నున్న విశ్వాసమును ప్రభువు పరీక్షించి చూచుచుండును. ఆయన ఎల్లప్పుడును ఊరకుండక యుక్త
సమయములో మన కష్టములను తొలగించును. అప్పుడు మన మనస్సునందు సంపూర్ణ శాంతి లభించును.
13) మరియొక సంగతి ప్రభువు మనవలె నిద్రపోవుచుండెను. ఆయన మన నిమిత్తమై మానవుడైన దేవుడు గనుక నిద్ర అవసరము గనుక నిద్రించెను. మనము నిద్రలో ఉన్నప్పుడు బయట సంగతులు ఎలాగు తెలియవో అలాగే ఆయన మనుష్యత్వమునకు
శిష్యులపాట్లు తెలియవు గాని ఆయన దైవత్వమునకు వారి అగచాట్లు తెలియును. శిష్యులు కేకలు వేయుచు, నింద మాటలాడుచు ఆయనను లేపిరి. ఆయన నిద్ర నుండి లేచెను. ప్రభువు గాలికి లేవలేదు. ధూళికి లేవలేదు. వరదకు లేవలేదు, దోనె సడికి
లేవలేదు, తెడ్లసడికి లేవలేదు గాని, శిష్యుల కేకలకు, వారి ప్రార్ధనకు, వారి మొరలకు లేచెను. ఎన్ని లేపిన ఆయన లేవలేదు. గాని తండ్రి గనుక బిడ్డల మొరను విని లేచెను. తండ్రి యొక్క సంగతి ఇలాగే యుండును!ఉదా:- కోడికూసిన తల్లి నిద్రలేవదు. పిల్లకూసిన
లేవదు, కుక్క అరచిన లేవదు, పిల్ల మెదిలిన తల్లిలేచును. ఇది తల్లి ప్రేమ! అలాగే దైవ ప్రేమ ఏదనగా నరులు మొర్రపెట్టగానే దేవుడు వచ్చి సహాయము చేయును.
14) శిష్యుల ప్రార్ధన యేసుప్రభువు విని మేల్కొనగానే, ఆయన రెండు తుఫానులను చూచి వాటి నెదుర్కొనెను. 1.నీళ్ళను ప్రేరేపించినగాలి తుఫాను. ఇది అందరికి తెలిసినది. బహిరంగముగా అందరు చూచినది. 2. మరియొక తుఫాను ఏదనగా శిష్యుల
హృదయములలో నున్న గందరగోళము , అనగా చనిపోవుదము అను తుఫాను. మొదటి తుఫానుకన్న ఈ హృదయములలోని రెండవ తుఫాను గడ్డైనది. మొదటి తుఫాను గాలి. అలలు రెండును భయంకరమైనవి గాని రెండవ తుఫానులో చింత భయంకరమైనది.
భీతి, గాబరా, నిరాశ మరీ భయంకరమైనవి. ఇంతకన్న భయంకరమైనవి ఏమనగా తోటి మానవును, దేవునిని, గురువును, ఉపకారియైన ప్రభువును నిందించుట. ఇవి అన్నిటిని మించిపోయిన తుఫాను. గనుక యేసు ప్రభువు మొట్టమొదట వారి హృదయములలో
నున్న హానికరమైన “గందరగోళమను” తుఫానును గద్దించి వారికి జ్ఞానము చెప్పెను. ఓ అల్ప విశ్వాసులారా! ఎందుకు భయపడుచున్నారు? మీ విశ్వాసమెక్కడ? అని వారిని గద్దించెను.
15) ప్రభువు పన్నెండు మందిని గద్దించినపుడు శిష్యులకు కోపము రాలేదు. వారు సణుగుకొనలేదు గాని గద్దింపునకు లోబడిరి. అలాగే మన బలహీనతను చూచి దేవుడు గద్దించినపుడు మనము సణగకూడదు. ఆయన గద్దింపు వలన మనకు మేలు
సమకూడును. మనలను బాగుచేయుటకు ఆయన గద్దించును. అపనమ్మికయను గుణమే భయమునకు పుట్టిల్లు. ఆ గృహమును మనము విడువవలెను. ఆ ఇంటిలో నుండి భయపడుచు, చింతించుచు, నిందించుచు నమ్మకున్నట్టి మనలను ప్రభువు గద్దించును.
మన మేలు కొరకే గద్దించును.
16) తర్వాత ప్రభువు నీటిని, గాలిని గద్దించెను. అప్పుడవి నిమ్మళమాయెను. మనుష్యులది చూచి ఈయన ఏలాట్వాడో! ఈయన ఆజ్ఞాపింపగా గాలి, సముద్రము ఈయనకు లోబడెనని ఆయన శక్తిని చూచి ఆశ్చర్యపడిరి. మీరెప్పుఏఇన యేసు ప్రభువు
మహిమను చూచినారా? ఆయన విషయములో మి సాక్ష్యమేమి? గాలిని కలుగజేసినది యేసునాధుడే గనుక గద్దించగానే అది నిమ్మళమాయెను. ఆయన సృష్టికర్త కానియెడల గాలి ఆగదు. నీటిని కలుగజేసినది యేసుప్రభువే గనుక ఆయన గద్దించగానే
ఆగిపోయెను. ఆయన సృష్టికర్త కానియెడల గాలి సద్దణగియుండదు. ఈ రెండు అద్భుతములు అనగా గాలిని అణచుట, నీటిని అణచుట వలన ఈయన దేవుడు. సృష్టికర్త అని తెలిసెను.
17) ఆయన దేవుడు గనుక మనకు గాలి అంత పెద్ద కష్టమున్న యెడల దానిని ధూళి వలె ఎగురగొట్టును. అలలు వంటి కష్టములు లేచి పైకి పొరలి వచ్చినను, వాటన్నిటిని అణచివేసి శాంతిపరచును గనుక ప్రార్ధన విడువకుండ, మానకుండ చేసిన ఈ లోక
కష్టములు తొలగును. ఈ లోక భాగ్యములు దొరుకును మరియు ఆత్మీయ కష్టములు తొలగి పరలోక భాగ్యములు కలుగును.
18) నావ అవతలి ఒడ్డున చేరెను. యేసుప్రభువును ఆశ్రయించిన యెడల ఈ లోకమునుండి మోక్షలోకము చేరుదుము. మనము ఈ లోకములో ప్రయాణములో నున్నాము. అద్దరికి అనగా మోక్షలోకమునకు చేరవలెను. క్రీస్తు మతమే మన ఓడ. యేసుప్రభువే
మన నాయకుడు. మధ్య ఎన్ని తుఫానులు వచ్చినను తుదకాయన మనలను మోక్షమునకు తీసికొని వెళ్ళును. రేపో మాపో తీసుకొనిపోవును. వారికి మరణముండదు. మహిమ శరీరము దాల్చుదురు. ఈ పాపదేహము అంతర్ధానమగును. అట్టివారు
మహిమశరీరముతో నూతన యెరూషలేములో నుందురు. అక్కడశాశ్వత కాలము అత్యానందముతో నుండి ముఖాముఖిగా దేవుని చూచుచుందుము.
19) పాపము నరులకు తుఫానుకన్నను, మునిగిపోవుటకన్నను హాని. పాపము వలననే వ్యాధులు, కరువులు, మరణము, నరకము, నరకమనునది చివరి హాని. అన్నిటికన్నా గొప హాని. నీటిలో మునిగిపోకుండ శిష్యులను రక్షించిన యేసునాధుడు ఆయనను
నమ్మినవారి నందరిని నరకంలో బడకుండ మోక్షమున చేర్చును.
20) మార్కు 4:36లో "ఆయన వెంబడి మరికొనీ దోనెలు వచ్చెను." యేసు ప్రభువున్న దోనెలతో పాటు మరికొన్ని దోనెలు బయలుదేరినవి. అలాగే దైవభక్తిని కోరునవి. సత్యమును వెదకెడివి.మోక్షమును కోరునవి. నీతిమార్గమును, శుద్ధి శుభ్రము కోరునవి.
చెడుగును విసర్జించునవి. కొన్ని మతములు లోకమున బయలుదేరినవి. అవతలియొడ్డునకు అనగా మోక్షమునకు చేరు ఉద్ధేశముతోనే కొన్ని మతములు స్థాపింపబడెను. ఈ దోనెకు మిగతాదోనెకు ఒక గొప్ప తేడా ఉన్నది. ఈ దోనెలో యేసుప్రభువున్నారు.
మిగతాదోనెలలో ఆయన లేడు. ఇదియే గొప్ప బేధము. బయలుదేరిన నావల సంగతి ఏమో మనకు తెలియదు గాని యేసుప్రభువున్న నావ మాత్రము ఆవలి యొడ్డునకు చేరెను.