ప్రియులారా! వెలుగు, జీవము, వాన, గాలి మొదలగునవి పన్ను లేకుండ
మన కిచ్చుచున్న దేవుని నామమున మీకు శుభము కలుగును గాక! ఆయన
కలుగసిన వాటిని గాక ఆయననే పూజింప వలసిన మనము ఆయన ఉచిత
దానముల నిమిత్తమై అనుదినము స్తుతించుట మనకు క్షేమము. మనలను
కాపాడుటకై ఆయన దేవదూతలను ఏర్పర్చియున్నాడు. వారు మనకు
తెలియని రీతిగా సహాయము చేయుదురు. దేవుడు మనకు
సర్వలోకములను మనుష్యులను పవిత్ర స్థితియందే సృజించెను. ఆయనలోని
పావన లక్షణములను నరులకు అనుగ్రహించెను కాని వారు పాపములో
పడిపోయిరి. అందుచేత సర్వ లోకమును రక్షించుటకై రక్షకుని పంపెదనని
నాలుగు వేల సంవత్సరముల వరకు వాగ్తత్తము చేయుచుండెను. తుదకు
ఆయనే రెండు వేల సంవత్సరముల క్రిందట నరావతారమెత్తి యేసు క్రీస్తు అను
నామమున ప్రసిద్ది కెక్కెను. యేసుక్రీస్తు ప్రభువు పాప జన్మము లేనివాడై
సజ్జనత్వమునకు మాదిరి చూపించుచు, మోక్ష మార్గమును బోధించుచు,
పాపులకు క్షమాపణ దయచేయుచు, రోగులకు ఔషధము లేకుండ తన
ప్రభావము చేత స్వస్థపరచుచు, మనుష్యులలోని భూతములను వెళ్ళగొట్టుచు,
తరుణము వచ్చినప్పుడు మృతులను బ్రతికించుచు యిట్లు సర్వ జనోపకార
కార్యములను చేసెను. అయినను కొందరు దుర్జనులు ఆయనను గ్రహింపలేక
సిలువకు అంటగొట్టి చంపగా, ఆయన చంపనిచ్చి, మూడవనాడు బ్రతికి వచ్చి,
40 దినములు బోధించి, శరీరముతో మోక్షమునకు వెళ్ళెను. ఇవన్నియు
చూచినవారు ఆయన దేవుడే అని తెలిసికొనగలిగిరి. యేసు ప్రభువు
రెండవమారు మిక్కిలి త్వరలోనే వచ్చి, నమ్మిన వారికి మరణము లేకుండ జేసి
మోక్షమునకు తీసికొని వెళ్ళును. ఆయన రాక ముందు భూకంపములు,
యుద్ధములు, కరవులు సంభవించును. ఇవి మన కాలమందే
సంభవించుచున్నవి. గనుక ఆయన రాకడ మిక్కిలి సమీపము. ఆయన
వచ్చినప్పుడు ఆయనతో వెళ్ళుటకు సిద్ధపడుదము. ఆయన శరీర రక్షకుడు,
ఆత్మ రక్షకుడు గనుక నమ్మగలవారు ధన్యులు. రెండవసారి క్రీస్తుప్రభువు వచ్చి
వెళ్ళిన తరువాత మిగిలిన వారికనేక శ్రమలు 7 సంవత్సరములు కలుగును.
అప్పుడనేకమంది ఆయన తట్టు తిరుగుదురు. పాపకారకుడైన సైతాను యొక్క
ప్రతినిధియగు అంతి క్రీస్తునకును, క్రీస్తునకును, హర్మ గెద్దోను యొద్ద యుద్ధము
జరుగును. అప్పుడు విరోధిని, అతని జత పని వారిని క్రీస్తు ప్రభువు
నరకములో పడవేయును. సైతానును పాతాళములో బంధించును. తర్వాత
ఆయన ఈ భూమి మీద వెయ్యి సంవత్సరములు శాంతి పరిపాలన చేయును.
అప్పుడు క్రీస్తు మత బోధ మోక్ష లోక వాస్తవ్వుల వల్ల ముమ్మరముగ
జరుగును. భూమి మిగుల పరిశుభ్రముగా నుండును. పాప కార్యములుండవు.
ప్రజలు వందలాది సంవత్సరములు సుఖముగా జీవింతురు. వెయ్యి యేండ్ల
బోధ విన్న వారి తీర్మానము చెప్పించుటకును, తీర్పు వినిపించుటకును క్రీస్తు
ప్రభువు ఈ భూమి మీదనే సిం హాసనము వేసికొనును. తర్వాత సైతానును
నరకములో పడవేయును. పిమ్మట అది వరకు పాతాళ లోకములో ఉండి
యింకను మారని వారిని కూడ ఆయన అగ్ని గుండమునకే పంపివేయును. ఈ
సంగతులు బైబిలులో లిఖితమై యున్నవి. క్రీస్తును పూజించు వారికి పాప
పరిహారమును, రోగ నివారణయును, మోక్ష భాగ్యమును లభించును. బైబిలే
దైవ గ్రంధమనియు, యేసుక్రీస్తే లోకైక రక్షకుడనియు, క్రైస్తవ మతమే అన్ని
మతములను చేర్చుకొను మతమనియు, రక్షణ కార్యక్రమము మానవులకు
మిక్కిలి అవసరమైన అంశమనియు క్రైస్తవ మత సంఘము బోధించుచున్నది.