దేవుడు నరావతారమెత్తి లోకైక రక్షకుడు అను అర్ధమిచ్చు యేసుక్రీస్తు అను నామమున ప్రసిద్ది కెక్కెను. తన ప్రభావము వలన రోగులను స్వస్థపర్చెను. ఆకలిగొన్న వారికి ఆహారము కల్పించెను. ఆపదలో నున్నవారిని విడిపించెను. భూతపీడితులను రక్షించెను.
పాపులకు క్షమాపణ యిచ్చెను. మృతులను కొందరిని బ్రతికించెను. సాతానును, పాపములను, పాప ఫలితములగు వ్యాధులను, ఇబ్బందులను, మరణమును జయించెను మరియు లోక పాప భారము తన మీద వేసికొనెను గనుక మరణము పొందవలసి వచ్చెను.
అయినను బ్రతికి ఆరోహణమాయెను. ఈయన గొప్ప జయశాలి గనుక మనకు అన్నిటిలో జయము కలిగింపగలడు. త్వరలోనే వచ్చి నమ్మిన వారిని చావు లేకుండా మోక్షమునకు తీసికొని వెళ్ళును. చావు లేకుండ మోక్షమునకు వెళ్ళగోరు వారు పాప విసర్జన చేసి
సిద్ధపడండి.
మనుష్యుని కుమారుడు మనుష్యుడే కదా; అలాగే దేవుని కుమారుడని వ్రాయబడినది యున్నది గనుక ఆయన దేవుడే. ఇది మార్చలేము. క్రీస్తు ప్రభువు ప్రవక్త మాత్రమే అయి యున్నాడని కొందరు నొక్కి చెప్పుచున్నారు. అలాగైన యెడల ఆయన చెప్పిన
మాటలన్నియు ఎందుకు నమ్మకూడదు. మత్తయి, మార్కు, లూకా, యోహాను అను భక్తులు వ్రాసిన సువార్త పుస్తకములలో ఆయన మాటలున్నవి. ప్రవక్త అనగా ఎవరు? గత కాలములో జరిగిన విషయములు ఎత్తి చూపింపగలవాడు; ఇక ముందునకు
రానైయున్న విషయములు ఎత్తి ప్రవచించువాడు. గొప్ప బోధకుడే ప్రవక్త. క్రీస్తు అందరికంటే గొప్ప మానవుడు అందరికంటే గొప్ప బోధకుడు, అందరికంటే గొప్ప వైద్యుడు, అందరికంటే గొప్ప పునరుత్థాన దాయకుడు, అందరికంటే గొప్ప పాపపరిహారకుడు, అందరికంటే
గొప్ప పోషకుడు, అందరికంటే గొప్ప భూతవిముక్తుడు, అందరికంటే గొప్ప మార్గదర్శి, అందరికంటే గొప్ప ఆరోహణ ప్రభువు. క్రీస్తు అందరికంటే, అన్నిటిలోను ఎక్కువ గనుక ఆయనను ఆశ్రయించినపుడే మనకు ఉపకారము కలుగును. చూడండి! ఆయన బోధ వలన
ఇప్పుడు అన్ని దేశములలో క్రైస్తవులున్నారు. వారు బైబిలు గ్రంధమును బోధించుచున్నారు. పాఠశాలలు పెట్టి, వైద్యశాలలను స్థాపించి, చేతి పనులను నేర్పు శాలలను ఏర్పరచి, అన్న వస్త్రాదులు ఉచితముగ నిచ్చుచు, బీదలను పోషించునట్టి గృహములు కట్టి ఈ
విధముగ సర్వజనులకు మహోపకారములు చేయ యత్నించుచున్నారు. రెండు వేల భాషలలో దైవ గ్రంధమగు బైబిలును అచ్చు వేయించినారు. యిది ఎవరు కాదనగలరు! దైవ ప్రత్యక్షత మీకు దొరుకును గాక! ఆమెన్.