రక్షణ వార్తావళి

⌘K
  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి...
  4. వింతలు

వింతలు

లూకా 5:17-26.

ప్రార్ధన:- ఓ తండ్రీ! నీవు ఈలోకంలో ఉన్నప్పుడు ఒక పక్షవాత రోగిని బాగుచేసినావు. ఆ రోగికి నీ శక్తి, నీ ప్రేమ, నీ దైవత్వము కనుపరచినావు. నీకు వందనములు. ఈకథలో ఉన్న సారాంశము మాకు తెలియచేయుము. నీ వాక్యము శక్తి కలది. మా శక్తికి మించినది గాన నీ వాక్యమును మాకిచ్చినావు. వివరించుకొనుచున్న మాకు బోధపరచుము. నీ కృప అందరికి కనుపరచుమని వేడుకొనుచున్నాము. ఆమెన్.

ప్రియులారా! దేవుని వాక్యము ఆశక్తితో వినండి. ఆశక్తితో నమ్మండి. ఆసక్తితో బాగుపడండి

ఇంటికి వెళ్లితే అనుమానము, భయము కలుగును. మూడు పనులు చేస్తే బాగుపడతారు- 1) సమీపించుట 2) మాటనమ్ముట 3) బాగుపడుట. యేసుప్రభువు గ్రామములు, దేశములు తిరిగి బోధించినారు. ఈలాగు ఎవరును బోధించలేదు గనుక, గొప్పవారు, తక్కువవారు, రోగులు, రోగము లేనివారు ఆయన యొద్దకు వచ్చినారు. ఎందుకు వచ్చినారు? బోధ వినవలెనని వచ్చినారు. ఎందుచేత వినవలెనని ఆశ కలిగినది? ఆయన మాటలు వినసొంపుగా నున్నవి. ‘ఎవరును ఆలాగు చెప్పలేరు ‘ గనుక వచ్చినారు. మన కాలములో ఏదైనా మీటింగులు జరిగినా పేపర్లు అచ్చువేసి, నోటీసులు వేసి పంపుదురు. అందరు చదువుకొని, వచ్చెదరు, గాని ప్రభువు కాలములో అచ్చులేదు. పేపర్లులేవు. ప్రభువు వచ్చిన 1500 సంవత్సరముల పిదప అచ్చు పుట్టినది. ప్రభువు కాలములో ఇటువంటివి ఏమియు లేకపోయినా, ఇప్పుడిక్కడకు వచ్చేవారికంటే అప్పుడు ఎక్కువ మంది వచ్చారు. ప్రభువు పట్టణములలో, పల్లెలలో, సముద్రపు ఒడ్డున బోధించగా లెక్కపెట్టలేనంత మంది వచ్చినారు. ప్రభువు బోధ కొద్దిమంది విన్నా, వారినిబట్టి విన్నవారు ఇంకా వచ్చిరి. వినసొంపుగా నుండగా దారిలో పల్లెలలో ఉన్నవారికి విన్నవారు చెప్పిరి. వినసొంపుగా ఉన్న ఈ మాటలు దాచుకోలేక ఆలాగు చెప్పిరి. మీరు చెప్పుచున్నారా? దారిలో, పల్లెలలో, మీ ఊరిలో చెప్పుచున్నారా?

యేసుప్రభూ అలసిపోయి ఒక పట్టణము వచ్చినారు. అక్కడ ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు శిష్యుని ఇల్లు. అందులో ప్రభువు ఉన్నారు గనుక ఎవరిని రాకుండా ఆపు చేయవలసినది. ఎవరు రాకుండా ఉండవలసినది గాని ప్రభువును చూచిన ఆ పట్టణస్థులందరు ఆ ఇంటికి వచ్చిరి. వారు నిశ్శబ్ధముగా ఉన్నారు. మన వలె వారు మాటలాడలేదు. ఆలాగు మాట్లాడిన ప్రభువు మాట వారికి వినబడదు. నిశ్శబ్ధముగా కూర్చున్నారు గనుక ప్రభువు మాటలు వారి చెవిలో నుండి వారి హృదయములోనికి వెళ్ళినవి. చెవిటివారికి వినబడునా? వినబడదు. ఆయన దేవుడు గనుక చెవుడు అడ్డము రాదు. ఆయన మాట చెవిలోనికి వెళ్ళి చెవిని బాగుచేసినది. హృదయములోనికి వెళ్ళి హృదయమును బాగుచేసినది. ప్రభువు సర్కీటు ‘పరిచర్య ‘ నుండి మంచి మండుటెండలో రాగా ఆ యిల్లంతయు ఆయన బోధకొరకు వచ్చిన వారితో నిండి పోయినది. దగ్గరున్న వారికి, దూరమున నున్నవారికి ఆయన మాట వినబడినది. ఆయన దేవుడు గనుక బూర, మైకు ఏమియు అక్కరలేదు. మనము మనుష్యులము గనుక బూర, మైకు కావాలి. ఇవి ఉన్నా సరిగా వినబడడములేదు. యేసుప్రభువు లోకములో నున్నప్పుడు రెండు పనులు చేసిరి. 1) బోధపని 2) జబ్బులు బాగుచేసేపని.

ఇప్పుడు ఈ ఇంటిలో జబ్బులు బాగుచేయ తలంచుకోలేదు. ఇక్కడున్న వారికి 1) బోధ చేయవలెనా?. 2) జబ్బులు బాగు చేయవలెనా? జబ్బులు బాగు చేయకుండా బోధ చేస్తే మీకు సంతోషమా? సంతుష్టియా? ప్రభువు కాలములో అట్టి బోధచేసినా సంతుష్టి పడ్డారు. వినసొంపుగా ఉన్నది. గనుక వినేవారు. బాబూ! మా జబ్బులు బాగుచేయండి అనుటకు సమయము లేదు బోధ వినగానే ఆశ తీరింది, ఆనందము కలిగినది. అట్లు బోధించేవారు ఇక పుట్టరు. ప్రభువు బోధ చేయుచున్నారు. వారు వింటున్నారు. కాని ప్రభువా! బోధ తరువాత చేయవచ్చు. ముందు మా రోగములు బాగుచేయండి అని వారు అడుగలేదు. ఒకవేళ అక్కడ జబ్బుగా ఉన్నవారు ఉన్నా, వారు కూడా శ్రద్ధగా వింటున్నారు గాని  మధ్యలో ఒక అల్లరి జరిగింది.      

ఒక మంచమున్నది నలుగురు మోసికొని వచ్చిరి. కూర్చున్న వారు ప్రభువు వైపు చూస్తున్నారు గాని, రోగివైపు మంచమువైపు చూచుటలేదు మంచమువైపు చూడాలా? 3) ప్రభువు చూడాలా? వారు ప్రభువువైపే చూస్తున్నారు. అక్కడ ఒక మనిషికైనా చోటు లేదు. రోగిని మోసుకొచ్చినవారు మనిషిని ప్రభువు వద్దకు తోడుకొని వెళ్ళటానికి వీలులేదు. మీరు ఆ రోగిని చూస్తే ఏమంటారు? మా బోధ చెడగొడుతున్నారు, రేపు రా అని అంటారు. మోసికొని వచ్చినవారు పన్నాగాలు పన్నారు. పగ్గాలు తీసికొన్నారు. ఇల్లు ఎక్కినారు. ఇంటికి రంధ్రము చేసినారు. ఆ మంచమును ప్రభువు పాదముల యొద్దకు దించినారు. ఆవ్యక్తిని ప్రభువు చూచినారు. ఈ కథ విడిచి రోగి కథ విందాము.

ప్రభువు కాలములో పేపర్లు లేకపోయినా ప్రజలు వచ్చినారు. ప్రజలు కూర్చున్నారు. ప్రభువు బోధిస్తున్నారు. ఈ కథ ప్రభువు కథ. రోగికి ఒక అడ్డున్నది. నేను పక్షవాత రోగి గనుక నేను వెళ్ళలేను. ఎవరో ఒకరు నన్ను మోసికొని వెళ్ళాలి. ఒకరు పనికి రారు, నలుగురు మోసుకొని వెళ్ళాలి. ఎవరు వస్తారు? అనేతలంపు అడ్డుగా ఉంది గాని ఈ రోగి ఈ అడ్డును తొలగించుకొన్నాడు. నలుగురు మోసికొని వచ్చిరి. ఇక్కడ మరియొక అడ్డువచ్చింది.ప్రజలు అధికంగా ఉన్నారు. అందువల్ల అడ్డుగానున్న పైకప్పును తొలగించి దిగవలసివచ్చెను. ఆలాగే ప్రభువు వద్దకు వచ్చుటకు మనకు అనేకమైన అడ్డులున్నవి. మిమ్మును ఆటంకపరచు వారుంటారు. మీ మనసులో ఎన్ని సార్లు వెళ్ళినా, జబ్బుపోలేదు అనే అడ్డు ఉన్నది. ఎన్ని అడ్డులున్నా రోగి ఆగలేదు. బాగుచేయునని రోగికి నమ్మకమున్నది. రోగిని మొసేవారికున్నదా? వారికి కూడా ఉన్నది ఏలాగు తెలుసు? వాక్యములో “యేసు వారి విశ్వాసమును చూచి” అని ఉన్నది (మత్తయి 9:2). మోసే వారికి నమ్మకము లేకపోతే ఏలాగు మోసుకొని రాగలరు? వారు ప్రభువు కార్యములను గూర్చిన వదంతి విన్నారు గనుక విశ్వసించి మోసుకొని వచ్చినారు. మీకు అడ్డులు ఉన్నా మానవద్దు. ఇంటి యజమానుడు ఏమైనా కోపపడునని వారు తలంచక ధైర్యముతో కప్పువిప్పిరి. గనుక ప్రభువు దగ్గరకు వచ్చే మనము ధైర్యముతో రావలెను రోగిని దించగానే ప్రభువు రోగివైపు చూచెను. రోగిని దించగానే రోగమును ప్రభువు వెళ్ళగొట్టలేదు. “వెళ్ళు” అని అనవలసినది గాని అనలేదు. బైబిలులో ప్రభువు ఆ జబ్బుమాటే ఎత్త లేదు.

రోగి వచ్చినాడు, ఉన్నాడు గాని అడుగలేదు. రోగిని మోసికొని వచ్చిన ఆ నలుగురు కూడా అడుగలేదు. గాని ప్రభువే వారితో మాట్లాడినాడు. (1) ' కుమారుడా ' అని అన్నారు. ఆ రోగి కుమారుడవుతాడా? తెలియాలని ప్రభువు అన్నారు. అందరూ నా బిడ్డలే, నాకు అందరూ ఒకటే. అందరికీ నేను తండ్రిని అని ప్రభువు తెలియజేసెను. బైబిలు వైద్యగ్రంధము. ఇందులో అన్నియు ఉన్నవి. 2. ధైర్యము తెచ్చుకో! అని ప్రభువు అన్నారు. అనుమానము పోయింది. ధైర్యము లేకపోతే ఇంతదూరము రాడు. అన్ని అడ్డులున్నా వస్తాడా? ప్రభువు ధైర్యముగా ఉండు అని ఎందుకు అన్నారు? దీనినిబట్టి రోగికి ధైర్యము లేదన్నమాట. వడలిపోయినాడు. హడలిపోయినాడు. నమ్మకమున్నది గాని ధైర్యము లేదు. స్వస్థతశాలకు వస్తున్నారు. గాని ఏమో! అనే దిగులుంటే ఎలా? అతనికి సంతోషము కలుగుటకు ధైర్యము తెచ్చుకో అని ప్రభువన్నారు. ఆ రోగికి ధైర్యము ఎందుకు లేదు? ధైర్యము లేకపోతే ఇంతదూరము ప్రయాసపడి రాగలడా? గాని ఎవరికి తెలియని ఒక విషయము అతని హృదయములో ఉన్నది అదేమనగా కొంతకాలము క్రింద నేనొక పాపము చేసినాను. అప్పటినుండి ఈ జబ్బు నన్ను పట్టుకున్నది గాని వదలడంలేదు. అయితే ప్రభువు ముందు అదే ఎత్తుకున్నాడు. గనుక ' నీ పాపములని ' ప్రభువు ముందు ఎత్తినారు. అతడు రోగము కొరకు వస్తే పాపమును ఎత్తినారు. మీలో ఎవరికైనా మంచి నీళ్ళు బదులు మీకు పచ్చడి పెడితే, లేదా బట్టలిస్తే సంతోషమా? నీళ్ళిస్తేనే సంతోషము. ఆలాగే జబ్బు బాగుచేస్తేనే ఆ నలుగురికి సంతోషము. ఆ రోగికి జబ్బున్నదని అందరికి తెలియును గాని మాత్రమే తనలో ఆరోగికి పాపమున్నదని  తెలుసును. మొదట ప్రభువు, 'కుమారుడా!' అని అన్నారు. అందునుబట్టి సంతోషమే. మరలా, ధైర్యముగా ఉండు, అన్నారు. మరికొంత సంతోషము. 'పాపము క్షమించినాను ' అని అన్నారు. ఇంకొక సంతోషము. నా జబ్బు పోతేఏమి? పోకపోతే ఏమి? నా కుమారుడా! అని ప్రభువు అన్నారు. ధైర్యముగా ఉండు అన్నారు. నీపాపములు క్షమింపబడియున్నవని అన్నారు. తాను జబ్బు పోగొట్టుకొందుననుకొన్నాడు గాని దానికి ప్రభువు 3 మాటలు చేర్చినారు. 1) కుమారుడా! 2) ధైర్యము 3)క్షమింపబడినవి.  అతనిలో నున్న జబ్బు పోయినది గాని ప్రభువు అతనిలో లేనివి. అడగనివియైన ఈ మూడు భాగ్యములు ఇచ్చినారు. జనము ప్రభువు చుట్టు క్రిక్కిరిసి, రోగివైపు, ప్రభువువైపు చూచుచున్నారు. ప్రభువేమి చేయునో? అని, రోగి ఏమవునో? అని చూస్తున్నారు. ఏది ఎక్కువ కీడు? పాపమా లేక వ్యాధియా? పాపమే. పాపము వలన వ్యాధి వచ్చినది. ప్రభువు పాపము తీయకుండా జబ్బు తీసివేస్తే పైమెరుగే గనుక జబ్బు మరలా వచ్చును. పాపమే తుడిచివేయబడితే మరలా జబ్బు ఎన్నటికి రాదు. బోధ వినకపోతే బాధ పోదు. ఇది నా సొంతబోధగాదు, ప్రభువిచ్చినది. బోధ వింటే మీ పాపములు పోవును, జబ్బులు, పోవును, సుఖము కలుగును. ఈ విషయము ఆ రోగికి గాని, మోసుకువచ్చిన వారికిగాని తెలియదు. పాపమున్న సంగతి రోగికి తెలుసు, ప్రభువునకు తెలుసు గాని ప్రభువు చుట్టునున్న ప్రజలకు తెలియదు. పాపములు క్షమించినానని ప్రభువు అన్నారు గాని 'పాపములు పోయినవని ' చెప్పలేదు. పాపము క్షమించినాను అని ఆ దేవుడు జబ్బు పోగొట్టినాను అని కూడా అనవలసినది, ఆలాగు అనలేదు గాని 1) అనిన లెమ్ము 2) పరుపెత్తుకొనుము 3) నీ ఇంటికిపొమ్ము, అన్నారు. జబ్బు పోనిదే లేవగలడా? పరుపెత్తుకొనగలడా? ఇంటికి వెళ్ళగలడా? జబ్బుపోతే సరిగాని జబ్బు పోకముంద ఈ మాటలు ప్రభువు అన్నారు. జబ్బు పోయిందని చెప్పిన పిదప ఈ మూడు మాటలు చెప్పవలసినది గాని ప్రభువు అలా అనలేదు. మహాప్రభువా! నా జబ్బు తీసివేయి, అప్పుడు లేస్తానని ఆ రోగి అనవలసినది గాని అనలేదు. దిగ్గున లేచెను. ఎంతో కాలము నుండి జబ్బుగా నున్నవాడు లేచినాడు. పాపములు పోయినవి. జబ్బు పోయిందని అనుకొన్నాడు. పరుపెత్తడము చూచి, పరుపెత్తుకొని వెళ్ళిపోయినాడు. ఆ పుణ్యభాగ్యము మీకు కూడా కలగాలి. పాపము పోయి, వ్యాధిపోయి ఇక్కడ నుండి వెళ్ళాలి.    

అక్కడ కొందరు గొప్పవారున్నారు.ఈ మాటలను బట్టి సణుగుకొన్నారు. అవేమనగా పాపములు పోగొట్టుటకు ఇతడెవరు? లోకములో పాపములు పోగొట్టుకొనుటకు శక్తి కలిగిన వారున్నారా? అని సణుగుకొన్నారు. మంచము రోగిని మోసికొని వచ్చినది గాని ఇప్పుడు రోగి మంచమును మోసికొని ఇంటికి వెళ్ళుచున్నాడు. ఎంత శక్తి! ఎంత అద్భుతము! ఎంత సంతోషము! ఎంత ఆశ్చర్యము! ఆ రోగి ఇప్పుడు రోగికాదు గాని భోగి, యోగి, మీరుకూడా జబ్బుతో వచ్చి ఆ రోగివలె ఆరోగ్యం కలిగి వెళ్ళండి. మీ పాపములు, వ్యాధులు పరిహారము చేసుకొనండి. ఆ రోగి వచ్చినపుడు ఏమి జబ్బు? పక్షవాతము, పక్ష అంటే ప్రక్క. ఒక ప్రక్క బాగుండి మరియొక ప్రక్క జబ్బుగా ఉంటే అతడు రోగియే. కొందరు పైకి బాగానే ఉంటారు గాని లోపల జబ్బు ఉండును. కొంత బాగుగా ఉండి, కొంత బాగులేకపోతె ఆ బ్రతుకు వర్ధిల్లునా? కొందరిలో మంచి బుద్ధులు, చెడు బుద్ధులు ఉండును. అట్టివాడు మంచివాడా? చెడ్డవాడా? ఒక మనిషిలో పాపము, పుణ్యము ఉన్నవి. అతడు మోక్షానికి వెళ్ళడు. ఒక వెయ్యి పుణ్యములు చేసి ఒక్క పాపము చేసినా మోక్షమునకు వెళ్ళలేరు. జబ్బున్నా పర్వాలేదు గాని పాపముంటే మోక్షమునకు వెళ్ళలేరు. గనుక పాపక్షమాపణ కోరుకొని రక్షణ పొందండి.

ప్రార్ధన:- ప్రభువా! ఒక్క పాపమున్నా మోక్షము చేరమని మేము విన్నాము. మాలో ఒక్క పాపమైనా లేకుండా శుద్ధిచేయుము. బోధకులమైన మేము ప్రజల మీద చేతులెత్తి   దీవించుచున్నాము. నేనందరిని దీవిస్తున్నానని నీవన్నావు. నీవు దేవుడుగా అన్న ఆ మాటను బట్టి మేము ప్రార్ధన చేయుచున్నాము. ఎందుకంటే మీరు దీవిస్తే నేను దీవిస్తానని మీరు అన్నారు. (గనుక) వందనములు.
  1. క్రీస్తుప్రభువు మీ జబ్బులను బాగుచేయును గాక!
  2. పాపములు పరిహారము చేయునుగాక!
Please follow and like us:

How can we help?

Leave a Reply