ప్రసంగ పాఠము మత్తయి 4:1-11.
ప్రవక్తయైన ఎలీషా మాటనుబట్టి రాజైన యెహోయాషు బాణములు ఎట్లు ఉపయోగించినది ||రాజులు 13:14-15లో కలదు. ఆ రాజు యొక్క శత్రువు అరాము (సిరియా) దేశపురాజు. విశ్వాసియొక్క శత్రువు సాతాను. కనుక సాతానుపై అలాగు బాణములు వేయవలెను. మత్తయి 4:1-11లో మన ప్రభువు సాతానును ఓడించిన పద్ధతి. ఆయన వాడిన బాణములు గలవు.
చిన్న పిల్లవాడు తెలిసి తెలియక అగ్గిపుల్ల గీచిన "కాలదు" అను వారుండరు. బాణము ఎవరిమీదనైన వేసిన గ్రుచ్చుకొనక మానదు. యేసుప్రభువు శోధన సమయములో బాణములు వేసినప్పుడు "వ్రాయబడియున్నదీ" అనుమాట వాడెను. "వ్రాయబడి యున్నది" అనుట వలన అది మనిషి మాట కాదు, అది దేవుని యొక్క మాట అని తెలియుచున్నది. కమ్మరి బాణముచేసి దాచిన ఉపయోగము లేదు; అది వాడినఉపయోగము. ఆ విధముగానే ప్రభువు వాడిన మాట మనము సాతానుపై వాడిన ఉపయోగము. యేసుప్రభువు వేసిన బాణములు , ఆయన వాడిన బాణములు ఈ కథలో గలవు. ఆ బాణములకు పిశాచి నిలువబడలేకపోయెను. అపవాది నుండి పాపము వచ్చినది. ఆ పాపము నుండి అన్ని శోధనలు, కష్టములు వచ్చినవి. యేసుప్రభువు వాడిన బాణములు మనము కూడ వాడిన సాతాను పోవును. పాపము పోవునుమరియు పాపము తెచ్చు శ్రమలన్నీ పోవును. మనిషి వేసిన బాణము వలన అపవాదియు, వాడు తెచ్చిన దుష్టఫలితములు పోవక పోవచ్చును, గాని ప్రభువు వేసిన బాణముల వలన అవి పోవును. దావీదు, రాజు కాకముందు , కాపరిగా నున్నప్పుడు లోయలోని రాళ్ళు తీసికొని వడిసెలతో విసరగా, ఎంతో ఎత్తు, బలము ఉన్న రాక్షసి వంటివాడైన గొల్యాతు తాడిచెట్టు పడినట్ట్లు పడెను. యేసుప్రభువు వేసిన బాణములు మనమువాడిన, జయము కలుగును. సాతానుపై జయము, పాపముపై, శోధనపై, శ్రమలన్నిటిపై జయము కలుగును.
యేసుప్రభువునకు కూడ శ్రమలు వచ్చినవా? వచ్చినవి. అయితే అవి పాపము వలన వచ్చినవి కావు. ఆయన శోధనను, పాపమును జయించెను. పాపము చేయకపోయినను ఆయనకు శ్రమలు వచ్చినట్లు; విశ్వాసులు పాపము చేయకపోయినను శ్రమలు వచ్చును. పరీక్ష కొరకు వీరికి శ్రమలు వచ్చును, ఇతరుల వలన వీరికి శ్రమలు వచ్చును, ఇతరుల తప్పిదము వలన కూడ వీరికి శ్రమలు వచ్చును. మన పాపములవలన వచ్చు శ్రమలు మరియు యితరుల పాపముల వలన వచ్చు శ్రమలు, విశ్వాసులు జయించవలెను. యోబునకు శ్రమలు వచ్చెను. యూదా ఇస్కరియోతునకు కూడా శ్రమ వచ్చెను. ఆ శ్రమలకు వేరువేరుకారణములు గలవు. గనుక ఎట్టి శ్రమలు జయించుటకైనను బాణములు వాడవలెను. బాణములను వాడిన వారి జీవితములలోను పాపశోధన, పాపము, పాపఫలితము కనబడును. అయినను సైతానునుఓడించుటకు ప్రభువు 'వ్రాయబడియున్నదీ’ అన్నట్టు, మనమును వ్రాత వాక్యమును వాడవలెను. మనము వాడినప్పుడు తండ్రిని గురించి తలంచు కొనుచు 'వ్రాయబడియున్నదీ’ అనవలెను. కుమారుని తలంచుకొనుచు 'వ్రాయబడినదీ అనవలెను. పరిశుద్ధాత్మను తలంచుకొనుచు 'వ్రాయబడియున్నదీ’ అనవలెను.
మూడు బాణములు:- (1) "మానవుడు రొట్టెవలననే కాదు, దేవుని నోటినుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును." ఇది మొదటి బాణము. (2) ప్రభువైన నీ దేవుని శోధించవలదు. ఇది రెండవ బాణము. పైనుండి క్రిందికిపడిన, దేవుడు రక్షించునా? ఇది దేవుని శోధించుట. పొరపాటున పడినయెడల రక్షించును. అది మూడవ బాణము. (3) "నీ దేవుడైన ప్రభువునకు నమస్కరించి ఆయనను మాత్రము సేవింపవలెను. ఇది మూడవబాణము. మనకు సాతాను, శోధన, పాపము, శ్రమ కనబడినప్పుడు పై మూడు వాక్యములు తీసికొనవలెను. క్రీస్తు ప్రభువు వాటిని వాడి చూపించెను. గనుక జయించుటకు దేవుని వాక్యము బాణమై యున్నది. మనప్రార్ధనకు బలమున్నది. విశ్వాసమునకు బలమున్నది. ధైర్యమునకు బలమున్నది. అయినను వీటిని చూచి పిశాచి మనలను లోకువ కట్టవచ్చును. గాని దేవుని వాక్యము చూచినప్పుడు భయపడును. ఉదా:- ఎలుగుబంటి కత్తికి, కర్రకు దేనికి భయపడదు. అయితే చిన్న కుర్రవాడైనను అగ్గిపుల్ల గీసిన, పారిపోవును. తన పైబొచ్చు కాలిపోవునని భయపడును. ఆ విధముగానే దేవుని వాక్యమన్న పిశాచికి భయము. భూమిని, జ్యోతులను, సృష్టి అంతటిని దేవుడు తన వాక్యము వలననే సృజించెను. ఈ సృష్టి మీదికి శోధనలు వచ్చిన దేవుడు ఊరకుండునా? మొదట 'ఆ, ఆ, ఆ' అని అనుట ద్వారా తోలివేయును. ఆలాగే దేవుడు సాతానును, అదితెచ్చిన శ్రమలను గద్దించి తోలివేయును. దేవుని వాక్యమే మనకు కాపుదల "సాతానా పొమ్ము" అని ప్రభువు పలికెను. విశ్వాసులుకూడ సైతానును అట్లు పొమ్మనవలెను. విశ్వాసులు దేవుని వాక్యమును వాడవలెను. ప్రార్ధన, విశ్వాసము, ధైర్యము ద్వారా కొన్ని పర్యాయములు మనము శోధన జయింపలేక పోవచ్చును గాని వాక్యము ద్వారా తప్పక జయింపగలము. ప్రభువు యొక్క మూడు శోధనలలోను వాక్యము గలదు. సాతానా! వెనుకకు పొమ్మని ప్రభువు చెప్పెను. ఎందుకు ముందుకు పొమ్మని చెప్పలేదు? దేవుని ముఖము ఎదుటికి గాని, విశ్వాసుల ఎదుటికి గాని సైతాను రాలేడు గాని వెనుకకు పోవును. విశ్వాసి దేవుని వాక్యమును సాతానుకుచూపించవలెను. పిశాచినుండి వచ్చు మొదటి బాణము శోధన, శోధనకు తగిన బాణములు బైబిలులో వెతకండి. ఉదా:- కోయవారు అనేక రకములైన బాణములు వాడుదురు. చిన్న జంతువునకు చిన్న బాణము, పెద్దజంతువునకు పెద్ద బాణము వాడుదురు. బైబిలులో అనేకమైన బాణములున్నవి. గనుక బైబిలు బాగుగా చదువుకొనవలెను. 2వ కొరింథి 10వ అధ్యాయములో అంతరంగ యుద్ధోపకరణములను గురించి వ్రాయబడెను. అపవాదియొక్క శోధన తప్పించుకొనుటకు దేవుడు ఒక మార్గము ఏర్పర్చియున్నాడు అదేదనగా దేవుని యొక్క వాక్యము ఎత్తుకొని, సాతానును ఎదిరించు మార్గము ప్రభువు ఏర్పర్చెను. వ్రాయబడిన వాక్యమునుమార్చుటకు వీలులేదు. ఎందుకనగా మాట పలికిన తర్వాత, ఒకవేళ ఆమాట మార్చుకొనవచ్చును.
దేవుడు తప్పించుకొను మార్గము ఏర్పరచినను, మానవుడు పాపములో పడిపోవుచున్నాడు. పాపములో పడినవారికి సాతానుపై వేయుటకు వాక్యములో ఉన్న బాణము మీ పాపములు రక్తమువలె ఎర్రని వైనను అవిహిమమువలె తెల్లబడును. యెషయ 1:8. ఈ వ్రాత వాక్యమును చూచినచో పడిపోయిన మనిషి లేవగలడు. మనిషి లేచినప్పుడు పాపము పోవును. దానివలన వచ్చిన ఫలితములు కూడ పోవును. సూర్యుడు వచ్చినచీకటి పారిపోవునట్లు పాపము పోవును. కనుక మనము యేసుప్రభువు చెప్పెనని లేక వ్రాయబడి యున్నదని చెప్పవలెను. ఎందుకనగా శ్రమలు చాల ఉన్నవి. వ్యాధులు, ఇబ్బందులు, అపాయములు, అవమానములు, మరణము వీటన్నిటిమీద మనము బాణములు వేయవలెను.
అన్ని బాణములకు సంబంధించిన వాక్యములు దేవుని గ్రంధమందున్నవి. పలాని వాక్యములో వ్రాయబడి ఉన్నదని కూడ చెప్పవలెను. స్నేహితుని కొంత సొమ్ము అప్పు అడిగిన, పత్రము వ్రాసి ఇమ్మనును. వ్రాసిఇచ్చినచో సొమ్ము తిరిగి వచ్చునని ఎక్కువ నమ్మకము. మాటయైతే మార్చవచ్చును. వ్రాత మార్చుట కష్టము. అలాగే వాక్యము చూపించిన, పిశాచి ఎదురు ప్రశ్న వేయలేదు. ఎన్ని కష్టములు వచ్చునో, అన్నిటికివాక్యములో అంబులపొది తయారుచేయబడి యున్నది. దీనిని ఎవరును మార్చలేరు. అట్లు వాడిన, ఏవియు పరిహారము కావని సైతాను అపనమ్మిక పుట్టించును. జయము లేదని చెప్పెను. గేహాజీకి బెత్తము నిచ్చి, చనిపోయిన వాని మీద పెట్టిన బ్రతుకునని ఎలీషా చెప్పెను. కాని ఆలాగు బ్రతుకలేదు. ఎందుకనగా, పొరపాటు గెహాజీలో నున్నది. కాని ప్రవక్త చెప్పిన మాటలో లేదు. ఆలగే దేవుని వాక్యములో జయము ఉన్నది. కాని ఆవాక్యము సరిగా వాడనప్పుడు పని సరిగా జరుగదు. ఉదా:-చిన్న పిల్ల వానిని పైపు దగ్గరకు వెళ్ళి తల్లి నీరు తెమ్మనెను. అతడు వెళ్లి, పైపు నొక్కగా నీరు రాలేదని తల్లితో చెప్పెను. తల్లి మరల వెళ్ళుమని చెప్పగా, వెళ్ళిప్రయత్నము చేసెను గాని నీరు రాలేదు. అప్పుడు తల్లి-జాన్! నీవు వెళ్ళి నీరు వచ్చే వరకు త్రిప్పు అని చెప్పెను. అప్పుడు ఆ పిల్లవాడు తన శక్తినంతా ఉపయోగించి త్రిప్పగా నీరు వచ్చెను. నీరు రాకపోవుటకు పొరపాటుఎక్కడున్నది? పైపులోనా, పిల్లవానిలోనా? పిల్లవానిలోనే, పైపులో నీరున్నది, కాని పిల్లవానికి త్రిప్పుట చేతకాలేదు. ఆలాగే దేవుని వాక్యములో పొరపాటు లేదు. గాని మనిషిలోనే ఉన్నది. ఉదా:- ఒక అడవిలో కోయవారైనతండ్రి, కుమారుడు కలసి వేటకు బయలుదేరినారు. పులి నీరు త్రాగుటకు చెరువు దగ్గర ఉన్నది. వీరిని ఆ పులి చూడలేదు. పిల్లవాడు బాణముతో ఆ పులిని కొట్టవలెనని చూచుచుండగా తండ్రి వద్దని చెప్పెను. ఆ పులికొంతసేపు అటు ఇటు చూచి, వీరిని కూడ చూచి, వీరి మీదికి వచ్చుచుండగా, తండ్రి పిల్లవానితో ఇప్పుడు కొట్టుమని చెప్పెను గాని పిల్లవాడు కొట్టుటకు భయపడి, కొట్టలేనని చెప్పగా తండ్రి దానిని కొట్టెను. దేవుని యొక్కవాక్యములో శక్తి ఉన్నది. గాని వాడుటలో పొరపాటున్నందున , సరిగా వాడనందున, భయపడుచున్నందున, ఎక్కువ ఉపయోగము కనబడుటలేదు.
సాతానులో కూడా ఒక శక్తి ఉనంది అదే దుష్ట శక్తి. ఆలాగే శోధనలో, పాపములో, శ్రమలో దుష్టశక్తి ఉన్నది. యేసుప్రభువు వీటన్నిటిని జయించెను. దుష్టశక్తికి రెండు లక్షణములున్నవి. అవి 1. బాధ పెట్టుట 2. నాశనము చేయుట. వీటి వలన మానవులకు దేవుని నుండి ఎడబాపు, నరకము, అందువలన యేసుప్రభువు, విశ్వాసులు జీవించుట కొరకై దుష్టశక్తి యొక్క రెండవ లక్షణమును పోగొట్టెను మరియు నాశనము నుండివిడిపించెను. గనుక విశ్వాసికి వాక్యము ద్వారా, ప్రార్ధన్ ద్వారా, విశ్వాసము ద్వారా విడుదల కలుగును. అయితే బాధ పెట్టు శక్తి మిగులును. ఈ బాధపెట్టు ఈ బాధపెట్టు శక్తిలో దేవుడు మంచిని అమర్చియున్నాడు. విశ్వాసిని అపరంజిగా చేయుటకు, అనగా శ్రమల వలన మరింత కాంతి కలిగియుండుటకు, కిరీటము పొందుటకు, దేవుడు బాధపెట్టు శక్తిని ఉంచినాడు. అట్టి బాధ వలన నాశనము మాత్రము రాదు. పౌలు చెప్పినట్లుపిశాచితో ఇట్లు చెప్పవలెను. "ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ....?" (కొరింధి: 15:55) (ముల్లు=కీడు). విశ్వాసులకు మరణమున్నను నాశనము లేదు. నిజ విశ్వాసులకు ఎప్పుడును నిజమైనహానిలేదు. దేవుడు నీ ప్రార్ధనలు వినలేదు అనవద్దు. ఎందుకనగా దుష్టశక్తి యొక్క నాశనము చేయు లక్షణమును ఆయన తీసివేసి యున్నాదు. పిశాచి పొడపాము వలె విశ్వాసి చెవిలో అవిశ్వాస వార్తలను ఊదును. "నీవువాక్యము చదివినావు, ప్రార్ధించినావు. దేవుడు జవాబిచ్చినాడా? ఇయ్యలేదు" అని చెప్పును. అయితే యేసుక్రీస్తు ప్రభువు చెప్పుదేమనగా "భయపడవద్దు, నేను నీకు తోడై యున్నాను". కొందరికి దేవుడు దుష్ట శక్తి వలనకలుగు రెండు లక్షణములను తీసివేయును. 1. బాధ 2. నాశనము తీసివేయును. ఎందుచేత? ఆయన సృష్టికర్త, ఎవని ఓర్పును బట్టి వానికి బాధను ఉంచును. పది దినములు శ్రమ అనుభవించిన, జీవకిరీట మిత్తుననిప్రకటన గ్రంధములో వ్రాయించెను(ప్రకటన:2:10). మానవుని హృదయ స్థితినిబట్టి ఆయన కార్యము యుండును. 'నా రక్షకుడు నన్ను నాశనము కానీయడు. అనునదే విశ్వాసి యొక్క పలుకు అయి ఉండవలెను. శ్రమతీసివేయక, వానికి సహించు శక్తిని ఆయన యిచ్చును. సహించిన తర్వాత జీవకిరీటము నిచ్చును. శ్రమ సహించుట కష్టమని ఎప్పుడు ఆయన తలంచునో, అప్పుడు ఆ శ్రమను తీసివేయును. సహింప దగిన దానికంటెఎక్కువ రానీయడని వాక్యములో గలదు (కొరింధి: 10:13).సాధు సుందరసింగు - నాకు సౌఖ్యమున్నది. ఆరోగ్యము ఉన్నది గాని తృప్తిలేదు. ఏదో ఒక శ్రమ పపించు ప్రభువా! అని ప్రాధించెను. ఎందుకనగా శ్రమవల్ల భక్తివృద్ధి, ప్రార్ధనవృద్ధి, విశ్వాసవృద్ధి కలుగును. ఉదా:- ఒక కుర్రవాడు ఎప్పుడూ, మా అమ్మ ఈవేళ కొడితే బాగుండును అనువాడు. ఎందుకనగా కొట్టినప్పుడు ఏడ్చిన, అరిసెలు ఇచ్చేది. కాబటి సాతానును, పాపమును,పాపఫలితములను జయించుటకు దేవుని వాక్యము వాడుకొనిన నీవు సుఖింతువు.
ఇట్టి దీవెన చదువరులకు ప్రభువు అనుగ్రహించును గాక! ఆమెన్.
Please follow and like us: