తండ్రి:- కీర్తనలు 89:1-5; కుమారుడు:-మత్తయి 8:1-10; పరిశుద్ధాత్మ:- హెబ్రీ. 11:1-5.
ప్రభువు యొక్క చరిత్రలో ఇతరుల యొక్క చరిత్రలు ఇమిడియున్నది. నాలుగు సువార్తలలో ప్రభువు, విశ్వాసుల చరిత్రలు కూడా ఇమిడియున్నవి. ముఖ్యమైనది విశ్వాసము. విశ్వాసమునకు లక్షణముండాలి. మరియు క్రియ కూడా ఉండాలి. క్రియ లేకపోతే మృతమే.
1వ కథ:- కానాను దేశపు స్త్రీ, తన కుమార్తెలోని దయ్యమును వెళ్ళుగొట్టుమని వేడుకొనగా ప్రభువు వెళ్ళగొట్టినాడు. ప్రభువు ఆమెను చూచి "అమ్మా! నీ విశ్వాసము గొప్పది" అన్నారు. విశ్వాసము గొప్పదిగా ఉండుట లక్షణము. ఆ స్త్రీ విశ్వాసమునకు గొప్పతనమున్నది. విశ్వాసమునకు క్రియ ఉండాలి. ఆమె విశ్వాసమువల్ల, ప్రభువు దయ్యమును వెళ్ళగొట్టెను. ప్రభువు దయ్యమును వెళ్ళగొట్టుట ఆయన క్రియ. ఆ స్త్రీ లక్షణము (గొప్ప విశ్వాసము) దయ్యమును వెళ్ళగొట్టించినది. యాకోబు క్రియలేని విశ్వాసానికి మృతవిశ్వాసమని పేరుపెట్టెను.
2వ కథ:- ఇద్దరు గ్రుడ్డివారు తమ కండ్లు బాగుచేయుమని అడిగిరి. నమ్మికతో ప్రార్ధించిరి. ప్రభువు "మీ నమ్మిక చొప్పున జరుగును గాక " అనెను. వీరి విశ్వాస లక్షణమేమి? కొందరు తమ విషయములు గొప్పగా చెప్పుకుంటారు. వీరిలోని విశ్వాసమేమనగా, తమలో విశ్వాసమున్నదని ప్రభువుతో చెప్పుకునే విశ్వాసము. ప్రభువు మాకింత విశ్వాసము ఇచ్చినాడని ఇతరులకు సాక్ష్యము ఇయ్యవలెను. విశ్వాసము చెప్పుకొనకపోతే మృత విశ్వాసము. అనగా చెప్పుకునే హక్కులేదు. ఎందుకనగా ఆ విశ్వాసమునకు సాక్ష్యలక్షణము లేదు. వీరు తమ విశ్వాసము ప్రభువుతో చెప్పుకున్నందున తమకు ఆ విశ్వాసము వారికి ప్రభువుచేత దృష్టి భాగ్యము కలిగించెను. మొదటి కథలోని క్రియ, లక్షణము వేరు. ఈ కథలోని క్రియ, లక్షణము వేరు.
3. శతాధిపతి దాసుని కథ:- ఇక్కడ శతాధిపతి ప్రభువుతో తన దాసుడు జబ్బుగా ఉన్నాడని చెప్పెను ఈ అన్యుని విశ్వాసము ప్రభువుకే ఆశ్చర్యము కలిగించే లక్షణముగా ఉండెను. మన విశ్వాసము ప్రభువునకు ఆశ్చర్యము కలిగించేదేనా?
ఇతని విశ్వాసములో రెండు గొప్ప విషయాలున్నవి:
- ప్రభువునకు ఆశ్చర్యము కలిగించెను.
- ఎన్నిక జనముయొక్క విశ్వాసమునకు మించిన విశ్వాసమున్నది. ఇతని క్రియ:- ఇంటికి వెళ్ళకుండ ఈ విశ్వాసముతో ఆ పక్షవాతమును బాగు చేయించుకున్నాడు. పడియున్న వానిని లేవనెత్తినాడు. ఇతని విశ్వాసము యొక్క ఘనత, ఎన్నిక జనములో కూడ లేని క్రియ. క్రియను బట్టి దాసుని బాగుచేయించుకొనెను.
- రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ:- ప్రభువునకు కనపడని రోగము, విశ్వాసము ఈమెలో ఉన్నది. ఈమె ప్రభువునకు తెలియకుండా వచ్చి ముట్టుకొన్నది. ఈమె లక్షణము యొక్క క్రియ ఏమంటే పై మూడు కథలలో ఉన్నది కాదు. ఆమె క్రొత్త లక్షణము ఏమంటే నాకింకేమక్కరలేదు. ప్రభువు వస్త్రము ముట్టుకుంటే చాలు అని అనుకున్నది, నమ్మింది. ముట్టుకున్నది. 1. అనుకున్న విశ్వాసము 2. ఆశ్చర్యం కలిగించింది. 3. చెప్పుకున్న విశ్వాసము. 4. గొప్ప విశ్వాసము. ఈ విశ్వాసములో ఉన్న లక్షణము సొంతసొమ్ము ఖర్చు పెట్టినా పోని దీర్ఘరోగము. ప్రభువు చేత బాగుచేయించుకున్న క్రియ, అనుకున్న విశ్వాసము ప్రభువుచేత బాగు చేయించు కున్న క్రియ. ఈ నాలుగు రకములైన విశ్వాసములు, అన్ని లక్షణములు. అన్ని క్రియలుగల విశ్వాసములై ఉన్నవి. ఈ విశ్వాసములో ఏదో క్రియ కలిగి ఉందాము పై నాలుగు విశ్వాసముల లక్షణములు, ఆ లక్షణముల యొక్క విశ్వాసము మీ హృదయములలో ముద్రించుకొందురు గాక, ఆలాగు చేసిన యెడల ప్రభువు ప్రియ బిడ్డలుగా ఉండగలరు.
5వ కథ:- ఆశ్చర్యమును కలిగించే, గొప్ప క్రియ జరిగించిన ఇంకొకకథ:- పాపాత్మురాలైన స్త్రీ, సీమోను ఇంటిలోని విందులో ప్రభువునకు పరిచర్య చేసెను. ఆమె ఎక్కువ ప్రభువును ప్రేమించెను. గనుక ఎక్కువ పాపములు ఆమెకు క్షమించబడెను. పై నాలుగు కథలలో శరీర రక్షణ ఉన్నది. ఆ నాలుగు గొప్పవే కాని ఈమెకు ఆత్మరక్షణ కలిగెను. ఆమె రుగ్మతను బట్టి ఆయన దగ్గరకు రాలేదు. ఆత్మస్థితిని బట్టి వచ్చెను. ఆమె పాపియైనా ఆమెలో ప్రేమయున్నది. ఈమె విశ్వాస లక్షణము ప్రేమించే లక్షణము. అయితే ఏ విశ్వాసము గొప్పది? 1. అనుకొన్న విశ్వాసమా? 2. ఆశ్చర్యము కలిగించే విశ్వాసమా? 3. చెప్పుకొన్న విశ్వాసమా? 4. గొప్పదని పేరుపొందిన విశ్వాసమా? 5 ప్రేమతో ప్రేమించే విశ్వాసమా? ఇదే గొప్పది. ఈమె విశ్వాసము యొక్క లక్షణములు. 1. మిక్కుటముగా ప్రేమించే విశ్వాసము. 2. ఆత్మ రక్షణను ప్రేమించే విశ్వాసము. ఈమె విశ్వాస క్రియ ఏమనగా, తన అంతరంగమును బ్రద్దలు చేసి ఆయన పాదముల మీద కుమ్మరించుకొనుట. నీ విశ్వాసము పాపములనుండి రక్షించెను. జబ్బుల నుండియు, పాపములనుండియు ఆయన రక్షించెను. అయితే పాపములనుండి రక్షించినప్పుడే మోక్ష ప్రవేశము దొరుకును. ఈమె విశ్వాసము కనిపెట్టిన మనమునూ ఈమె యొక్కయు మరియు పై నాలుగు విశ్వాస లక్షణములు కలిగియున్నప్పుడే మనశ్శాంతి కలిగియుండగలము. జబ్బు పోయినను పాపక్షమాపణ కలుగకపోతే మనశ్శాంతి ఉండదు. ఆమెకు ప్రభువు మనశ్శాంతి దయచేసి యున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి, ఆ భాగ్యము మనకును దయచేయును గాక! ఆమెన్.