రక్షణ వార్తావళి

⌘K
  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి...
  4. స్వాతంత్ర్యము

స్వాతంత్ర్యము

పావన పురుషుడగు అనాది దేవుడు మనకు తన లక్షణములను అనుగ్రహించెను. అవి: జీవము, అనంతము, జ్ఞానము, ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, వీటిలో ఒకటి స్వతంత్రత. ఇదిగాని దేవుడియ్యని యెడల తక్కినవి కూడా ఇయ్యనట్టే. ఒక బల్లమీద పండ్లు, మిఠాయిలు, వస్త్రములు, రూపాయలు, పుస్తకములు పెట్టి, ఒక పేద వానిని దగ్గర కూర్చుండుమని చెప్పి, దానకర్త ఇంటిలోనికి వెళ్ళిపోయిన యెడల ఆ భిక్షకుడు వాటిని తీసికొనగలడా? తీసికొనలేడు; ఎందుచేత? ఇవన్నియు నీకేతీసికొనుమని ఆ ఇంటి యజమానుడు చెప్పలేదు గనుక అవి తీసికొనుటకు ఆ బాట సారికి స్వాతంత్ర్యము లేదు. మనలోని స్వతంత్రతను రెండు విధములుగా వాడుకొనవచ్చును. చెడుగును విసర్జించుట మొదటివిధము; మంచిని అవలంభించుట రెండవవిధము. విధ్యార్ధీ! నీవిట్లు చేసిన యెడల ని స్వతంత్ర బుద్ధిని సద్వినియోగపరతువు. చెడుగు అనగా ఏమిటో, మంచి అనగా ఏమిటో తెలిసికొనగలందులకు మన తండ్రియైన దేవుడు మనలో జ్ఞానలక్షణమును పెట్టియున్నాడు. తెలిసిన దానినిఅంగీకరించుటకు మనస్సాక్షిని పెట్టియున్నాడు గనుక నాకు తెలియదని అనుటకు వీలులేదు. ఏదో ఒక చెడువాడుక గాని, పాపముగాని నీవు మానలేని యెడల వాటికి బానిసవగుదువు. మానిన యెడల వాటిని అణగద్రొక్కిన జయశాలివియును, స్వతంత్రుడవును అగుదువు. ఏది నీ కిష్టము? స్వతంత్రతయే నీకిష్టమని చెప్పగలము గాని, దానిని నీవు ఉపయోగింపలేక పోవుచున్నందులకు నేను నీమీద జాలిపడవలసిందే. ఎప్పుడు నీ స్వతంత్రతను వాడలేవో అప్పుడు స్వాతంత్ర్య దానకర్తయగుదేవుని ప్రార్ధింపుము. నీ యిష్టము నెరవేరును. పైన వ్రాసితున్న దివ్యలక్షణముల చెంతను, నరునిలో దుష్టలక్షణములు కూడా చేరినవి. వాటి పని సాగనీయకుండా చేయు శక్తి నరునికి గలదు.

(2) ఒకప్పుడు ఒక సంగతి జరిగినది: ఒక పరిచారకుడు తన అధికారి ఇంటిలో సొమ్ముసంచి దొంగిలించెను గాని మరుసటి ఉదయమున అది తీసికొని వెళ్ళి అధికారివద్ద తప్పు ఒప్పుకొని యిచ్చివేసెను. అదియు, ఇదియు ఎట్లు జరిగెను? అనియజమానుడు అడిగెను. అప్పుడు ఆ పరిచారకుడు ఇట్లు చెప్పెను; అయా, మీరు సొమ్ముసంచి బల్లమీద పెట్టి మరచిపోయిరి. అది చూడగానే నాలో దుర్భుద్ధి పుట్టినది, తీసికొని వెళ్ళినాను, ఎవరికిని తెలియదు. నడచుచుండ్ద్దగానే నాలో యిద్దరువాదించుకొనుచుండిరి. ఇచ్చువేయుమని ఒకడు, వద్దు దాచుకొనుము అని ఇంకొకడు, వీరిద్దరు నన్ను నిద్రపోనిచ్చినారు కారు. కంటిమీద ఒక కునుకైనను పట్టలేదు. పైగా మనస్సులో బాధ!బాధ! కడుపులో పోరు!పోరు! మరచిపోవుటకుయత్నించునప్పుడు కుమ్ములాట వినబడుచండెను. కండ్లు గట్టిగా మూసికొన్నాను, పోరాటము ఎక్కువగుచున్నది. చెవులు గట్టిగా మూసికొన్నాను. కోటలోని యుద్ధధ్వని వలె, మరింత గట్టిగా వినబడుచండెను. ఉభయులకు గల వివాదములు తెరలుతెరలుగ వ్యాపించుచున్నవి. తర్కమునకు అంతము కనబడలేదు. తెల్లవారినది, మీకిచ్చివేయుటకు నిర్ణయించుకొన్నాను. అప్పుడు జట్టీలపట్లు వదిలిపోయినవి. మీకిచ్చివేయగా ఇపుడు నా మనస్సు నెమ్మదిగా నున్నది-ఈ మాటలు అధికారి విని, మెచ్చుకొని, బహుమాన మిచ్చెను. విద్యార్ధీ! నీకెప్పుడైనా దుర్భుద్ధి కలిగినప్పుడు, ‘క్రియ జరుగక ముందే’ మోకరించి, దైవప్రార్ధన చేయుము. అప్పుడు నీకు విడుదల, నీవు స్వతంత్రుడవు. “పట్టణము పట్టుకొనువాని కంటే తన మనస్సునుస్వాధీనపరచుకొనువాడు శ్రేష్టుడు”, అని బైబిలులో నున్నది (సామెతలు 16:32).

(3) సత్యము మిమ్మును విడిపించును అని యేసుప్రభువు ఉపన్యసించెను. మనము సత్యము, న్యాయము, ప్రేమ అను వీటి పక్షముగా నున్నప్పుడు, మనలను వేధించు దుర్గుణముల నుండి విమోచన కలుగును. సత్యమునకు ఇక్కడ ఏమి అర్ధము?క్రీస్తుప్రభువు బోధించిన యావత్తు బోధ సత్యము, ఇది ఒక అర్ధము. “ఆయన బోధ అందరును అవలంభింపవలెను అని ఉద్ధేశించి, ప్రభువు బోధించెను అను సంగతి కూడ సత్యము. ఇది రెండవ అర్ధము. బోధ అంగీకరించినవారు ఉపకారము పొందిన మాటకూడ సత్యము. ఆయన బోధ సత్యమని అనుభవము వల్ల చదువరులు అనేకులు గ్రహించిరి. సత్యమును లెక్క చేయక అసత్యమును గైకొన్నందునవలన హాని పొందినవారు, సత్యమును విడిచితిమి కదాయని తెలిసికొనిరి. ఇది మూడవ అర్ధము.

(4) ‘నేనే సత్యమూ అని ప్రభువు చెప్పెను. ఆయన మొదట దేవుడై ఉండుటయు,పిమ్మట మన నిమిత్తమై నరుడుగా జన్మించుటయు, మనకు చేయవలసిన పనులన్నియు ముగించి మోక్షమునకు వెళ్ళుటయు, సత్య వృత్తాంతము, గనుక క్రీస్తు సత్యమైయున్నాడు. ఆయన కల్పనా పురుషుడు కాడు; చరిత్ర పురుషుడు.

దేవుడు మిమ్మును దీవించుగాక! ఆమేన్.

Please follow and like us:

How can we help?