రక్షణ వార్తావళి

⌘K
  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి...
  4. స్వాతంత్ర్యము

స్వాతంత్ర్యము

ప్రార్ధన:- స్వతంత్రుడవైన ఓదేవా! మేము నీకు సలహాలు ఇవ్వనవసరము లేదు. ఎందుకంటే నీవు స్వతంత్రుడవై యున్నావు. నీవు స్వతంత్రుడవై యున్నావు గనుక మాకును స్వతంత్రతను ఇచ్చినావు. గనుక నీ స్వతంత్ర్యతను బట్టి మా స్వతంత్రతను వాడుకొను కృప దయచేయుము. నీవు స్వతంత్రముగా పనిచేయుటకు నీవు స్వతంత్రుడవు. మాకు కూడా స్వతంత్రత ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. అయినను మేము పరతంత్రులమై యున్నాము. అదికూడా మాకు ధన్యతే. నీ స్వతంత్రత మీద మేము ఆనుకొనుచు, మా స్వతంత్రతను మేము వాడుకొనవలెను. మా దేశమంతయు స్వాతంత్ర్య దినోత్సవమునాడు స్వతంత్రతను గురించి ఆలోచించు ఆలోచనను దీవించుము. నీ నామధారులైన వారు ఈనాడు చేయు ఆరాధనలను దీవించుము. ఈ విధముగా మా దేశజనమును దీవించుము అని ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్.

ఈ ఉదయము మనము స్వాతంత్ర్యము విషయములో స్తుతి చేయుదము. మధ్యాహ్నము దేశమునకు, సంఘమునకు విరోధమైన విషయముల నివారణ ప్రార్ధనలు జరుపుకొందము. ఐదు స్వతంత్రములున్నవి. వినండి.

  1. ఆదిలో దేవుడు నరులకు అనుగ్రహించిన స్వాతంత్ర్యము మొదటిది. దేవుడు తనయొక్క దివ్యలక్షణములను మనుష్యులకు, దేవదూతలకు ఇచ్చెను. అన్ని గుణములిచ్చి ఈ ఒక్క స్వాతంత్ర్యమివ్వక పోయిన యెడల అవి ఇచ్చినా లాభములేదు. స్వాతంత్ర్యము ఉంటేనే అవి వాడుకొనగలము. ఇది లేకపోయిన అవి వాడుకొనలేము. ఈ తోటలోని వృక్షఫలములు తినవచ్చునని ప్రభువు చెప్పెను. ఆ మాటయే స్వాతంత్ర్యము రెండవమాట కూడ చెప్పిరి. అదేదనగా ‘నిరభ్యంతరముగా తినవచ్చును ‘ అనగా మీ యిష్టము వచ్చినన్ని, తినవచ్చును. ఎవ్వరూ ఆటంకపెట్టరు. అని అర్ధము. ఇది గొప్ప స్వాతంత్ర్యము. కాని అది వారు చెడగొట్టుకున్నారు.
  2. రెండవ స్వాతంత్ర్యము ఏమంటే యేసుప్రభువు తన శిష్యులకిచ్చిన స్వాతంత్ర్యము. అదేమనిన మీరు లోకమంతా తిరిగి సువార్త చాటించండి. అనగా లోకమంతా తిరిగి ప్రకటించుటకు మనకు స్వతంత్ర్యము ఇచ్చినారు. కాబట్టి మన. దేశములో కూడా ఎక్కడబడితే అక్కడే, ఎప్పుడుబడితే అప్పుడు, ఏలాగుబడితే ఆలాగు సువార్త ప్రకటించవచ్చును. ఇది యేసుప్రభువు ఇచ్చిన స్వాతంత్ర్యము. ఇది సువార్తలలో వ్రాయబడియున్నది. ఎవ్వరూ దీనిని తీసివేయలేరు. ఇది ఒక దస్తావేజు అనగా దానపట్టా భూలోకమంతా సువార్త ప్రకటించుటకు ఇది మనకు దానపట్టా. మనమొకచోట ఉండకుండా లోకమంత తిరిగి చెప్పవచ్చును. మా దేశము ఎందుకు వచ్చారని కొరియా దేశస్థులు చైనా వారు, జపాను వారు అన్నప్పుడు యేసుప్రభువు మాకు హక్కుయిచ్చారని చెప్పవలెను. ఎందుకనిన భూమి అంతయు ఆయనదే. ఆయన లేకుండా ఏదియు కలుగలేదని బైబిలులో వ్రాయబడియున్నది. యోహాను:1:3.
    1. మూడవ స్వాతంత్ర్యము ఏదనగా ఇంగ్లీషు ప్రభుత్వము వారు మన దేశమునకు మత స్వాతంత్ర్య మిచ్చినారు. ఎవరి జ్ఞాన, మనస్సాక్షులను బట్టి, ఎవరికి ఇష్టమున్న మతములో వారుండవచ్చును. కాని ఇతర మతములను దూషింపకూడదు. ఇతర మతస్తులను హింసింపకూడదు. ఎవరిష్టము వచ్చినట్లు వారు, వారికిష్టము వచ్చిన మతములో యుండవచ్చునని స్వేచ్ఛ నిచ్చిరి.
    2. నాలుగవ స్వాతంత్ర్యమేదనిన దేశీయ ప్రభుత్వము వారుకూడ మత స్వాతంత్ర్య మిచ్చినారు. ఇచ్చినది కొట్టివేయబడదు. ఒకవేళ ఇతరులు కొట్టివేయుటకు ప్రయత్నించినను, దేశీయ చట్టమును ఎవరు కొట్టివేయగలరు? నాలుగు స్వాతంత్ర్యములుగల మనము ఎంత ధన్యులము! కాని వాటిని వాడుటలేదు గనుక దరిద్రులము. 5. ఐదవ స్వాతంత్ర్యమున్నది. దానికి పరతంత్రమని పేరు. అనగా మన స్వాతంత్ర్యమును దేవుని యొక్క స్వాతంత్ర్యముమీద ఆనుకొని వాడిన అదే పరతంత్రము. పర అనగా ఇంకొకరు. ఆ ఇంకొకరు దేవుడే గనుక అది బలము. ఇంట్లో పెట్టినది తీసికొనుటకు భార్య తన భర్తను అడుగనక్కరలేదు. తన తన ఇష్టము చొప్పున చేయవచ్చును. అందుకే ఆయనను అడుగకుండా, చెప్పకుండా అవ్వ పండు కోసి తెచ్చింది. అది ఎంత గొప్ప స్వాతంత్ర్యము! అయితే ఎంత, కుమ్మరము తెచ్చినది! ఆదామునకు, ఆడవారికి అందరికీ కుమ్మరము తెచ్చినది. పోనీ ఆదామునకు చెప్పకపోతే చెప్పక పోయింది. దేవునినైనా దేవా! ఏమిటిది? ఈ సర్పము ఈలాగు అనుచున్నదని అడిగిన సరిపోయి యుండునుగాని అడుగలేదు. స్వాతంత్ర్యమిచ్చిన దేవుని మరలా అడుగుట ఎందుకు? అని అవ్వ అనుకొన్నది. దేవుడిచ్చిన స్వాతంత్ర్యమైనా ఆయన మీద ఆనుకొనవలెను. అదే పరతంత్రము. దేవుడిచ్చిన ఆజ్ఞకు విరోధముగా కనబడినప్పుడు, ఆయనను అడుగకపోయిన ఇంకెవ్వరిని అడుగవలెను? ఆమె తన స్వతంత్ర్యము వాడిన యెడల అడుగనక్కరలేదు. ఏలాగనిన మాతండ్రి తినవద్దన్నాడు నీవు తినుము అనుచున్నావు. అసలు నీవు ఎవ్వడవు? అని అనిన తీరిపోవును గాని ఆలాగనలేదు. గనుకనే ఆ ఆదాము, ఆ అవ్వమ్మలు ఇంకనూ మనలోనికి వస్తూనేయున్నారు. ఇప్పుడు చెప్పండి. అవ్వ స్వాతంత్ర్యమును వాడుకొన్నదా? లేదా? పండు తినుట ఎంత చిక్కో, దీనికి జవాబు చెప్పుటయు అంత చిక్కే.

ఆదాము, అవ్వలు పండుతిన్న స్వతంత్రతకు ఏమని పేరంటే “స్వాతంత్ర్యము”. అది వారిదే. దేవుడిచ్చిన స్వతంత్రమును చెట్టువద్ద విడిచి పెట్టారు. అది క్రిందపెట్టి పైనున్న పండు తీసుకున్నారు. ఆదాము కూడా అలాగే చేసినాడు. దేవుడిచ్చిన స్వాతంత్ర్యము క్రిందపెట్టి, భార్య ఇచ్చిన పండు తీసుకొన్నాడు. సంతోషముతో తీసికొన్నాడు భార్య తెచ్చింది గనుక, అడిగినాడా? ఈ పండ్లెక్కడివి? రోజూ తెచ్చేవి కావుకదా? ఇవి ఈలాగున్నవేమిటి? అని అడిగిన తీరిపోవును. ఆదాము యొక్క ఇంటిలో అవ్వది పెద్దరికము. దేవుని ఇంటిలో ఆదాముది పెద్దరికము. ఇద్దరు తమంతట తాము పెద్దలయ్యారు. ఇక దేవుడెందుకు? గనుక దేవుడు మనకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని మరలా తెచ్చుకొని, బాగుగా వాడుకొనిన ధన్యులము. అప్పుడు ఏ పండ్లు తినముగాని పరదైసులో నున్న పండ్లు తిందుము. ప్రకటన 2వ అధ్యాయములో ఎఫెసు సంఘమును గూర్చి యున్నది. “జయించువానికి పరదైసులోని జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును.” ప్రకటన 2:7. అక్కడ చావువృక్షఫలములు లేవు. ఇక్కడ చావు వృక్షఫలములు ఉన్నవి. ఇప్పుడీ పాఠము అర్ధమైనా, లేకపోయినా జ్ఞాపకమున్నదా? జ్ఞాపకమున్న, లేకపోయినా అర్ధమైనదా?

Please follow and like us:

How can we help?

Leave a Reply