ఎఫెసీ 1:1-3. దానియేలు 7:27. హెబ్రీ 11,12:1.
ప్రభువా! మానవులను నీవు కలుగ జేసినప్పుడు వారిని పరిశుద్ధులుగానే చేసియున్నావు. అట్టి పరిశుద్ధత మాకర్ధము కానప్పటికిని పాపపతనము తరువాత నున్న మాకును, అట్టి పరిశుద్ధత దయచేయుదువని నమ్మి నిన్ను స్తుతించుచున్నాము.
మానవుడు పాపములోపడిన తరువాత అనేకులను పరిశుద్ధపరచి వాడుకొందువని నమ్మి నిన్ను కొనియాడుచున్నాము. పాతనిబంధన భక్తులను నీవు పరిశుద్ధ పరచి భూమిమీద వారిని వాడుకొని పరలోకమందు వారిని చేర్చుకొన్నట్లు మమ్మును కూడ నీ మహిమకొరకు వాడుకొని తుదకు పరలోకము చేర్చుకొందువని నమ్మి నీకు అనంతకోటి వందనము లర్పించుచున్నాము. ప్రభువా! నీవు భూలోకమునకు వచ్చిన తరువాత అనేక మందిని నీవు నీ రక్తము ద్వారా శుద్ధీకరించి వారిని పరిశుద్ధులుగా చేసిన నీ కృపకు వందనములు. మమ్మును కూడ పరిశుద్ధపరతువని నమ్మి నీకు నమస్కారములు చెల్లించుచున్నాము. నీవు మాకొరకు ప్రాణము నర్పించిన విషయమును చూచి వెళ్ళలేని అనేకులు నాకొరకు తమ ప్రాణములర్పించి హతసాక్షులైన పరిశుద్ధులలో చేరియున్నారు, మేము మాప్రాణములను సహితము లెక్కచేయక నీకు హతసాక్షులుగ జీవించు కృప నిత్తువనినమ్మి నీకు నుతులర్పించుచున్నాము నీవు కొందరిని ఏర్పరచుకొని వారిని హిమాలయ పర్వతములలో ఎవ్వరును వెళ్ళలేని స్థలమందుంచి వారిద్వారా నీకు ఇష్టమైన పని చేయించుకొన్నందులకు అనేక వందనము లర్పించుచున్నాము మాలో కొందరికి వారికున్నట్టి అనుభవము నిత్తువని నీకు ప్రణతులర్పించుచున్నాము. నీ రాకడ కాలమందున్న పరిశుద్ధులకు నీవు మరణము అంటకుండజేసి సజీవులగుంపులో వారిని నీ మేఘములోని కాకర్షించుటకు తయారుచేయుచున్నావు. మమ్మునుకూడ అట్టిగొప్ప స్థితికి తయారుచేతువని నిన్ను వందించుచున్నాము. ఆమెన్.