(ది. 15 ఆగష్టు 1947 సంవత్సరము )
యోహాను 8:32. 36; 1తిమోతి 2:1-3, 1 పేతురు 2:14-17
స్తుతి ప్రార్ధన
దేవా; మా సృష్టికర్తవును, తండ్రివియు, రక్షకుడవైన నీవు స్వతంత్రుడవు గనుకను సర్వకార్యములను నీయంతట నీవే చక్కబరచుకొనగల స్వతంత్రుడవు గనుక నీకు వందనములు. నీ పావన లక్షణములైన ప్రేమ, జీవము, న్యాయము, పరిశుద్ధత, శక్తి మొదలగునవి మానవునికిచ్చి వాటితోపాటు స్వతంత్రలక్షణమునుకూడ జన్మమునందే మా కిచ్చిన నీ దయకు మా నుతులు. దేవా! మేము స్వతంత్రులమైనను, దేవుడవైన నీ మీద ఆధారపడవలసి యున్నాము. గనుక పరతంత్రులముగాకూడ మేము వర్ధిల్లుచున్నాము. అట్టి పరతంత్రము మా కిచ్చి మా స్వతంత్రత దుస్థిలోనికి పోకుండ జేసి మమ్మును స్వతంత్రులను గాను, పరతంత్రులనుగాను చేసిన నీకు నమస్కారములు.
మాలోగల సమృద్ధి దుర్భుద్ధి యను రెండింటిని నడిపించుటకు అనగా సద్భుద్ధి చెప్పిన ప్రకారము చేయుటకును, దుర్భుద్ధిని అణచివేయుటకును, స్వాతంత్రమను లక్షణమును గొప్ప సాధనముగ నిచ్చిన ప్రభువా! నీకు వందనములు. పరిశుద్ధుల దేవదూతల లోకములోని ప్రధాన దూతలోనికి దుర్భుద్ధి వచ్చినందున తాను తన అనుచరులతో క్రిందికి వచ్చివేయవలసివచ్చెను. ఆ సాతాను తన స్వతంత్ర లక్షణమును వాడి దుర్భుద్ధి నణచివేసిన ముప్పు రాకపోయెడిది. ప్రభువా! మేమట్లు పడిపోకుండ నీవు మాకిచ్చిన స్వతంత్రత లక్షణమును సరిగ వాడుకొని నిలువబడగల శక్తి దయచేయుదువని నమ్మి నీకు నుతులర్పించుచున్నాము.
మొదట నరులను మోసపుచ్చుకొనుటకు సాతాను సర్పవేషముతో వచ్చి మాట్లాడినప్పుడు మా తండ్రి తినవద్దన్నాడు. గనుక మేము తినము. అని చెప్పి తమ స్వతంత్రతను వాడుకొన్నయెడల వారు పరిశుద్ధులుగానే ఉండియుందురు. మేమును మా స్వతంత్రతను వాడుకొని సాతానుకు చోటియ్యకుండు కృపనిత్తువని నమ్ముచు ప్రణుతులర్పించుచున్నాము. మొదటి మానవులు ఒక పాపమే చేసిరి కాని తరువాత వచ్చినవారు అనేక పాపములు చేయుటవలన వారికి దేవుడిచ్చిన స్వతంత్రతను సరిగా వాడుకొని పాపముచేయకుండ కాపాడుదువని నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. దేవా! మా దేశమునకిచ్చిన స్వతంత్రతను కాపాడుకొన గలుగునట్లు పరిపాలకులను, ప్రజలను దీవించుము. మరియు మాశత్రువగు సాతాను బారినుండి మమ్మును కాపాడి, రక్షించినట్లే మాదేశ విరోధుల చేతిలో పడకుండ వారి బారినుండి మా దేశమును, దేశ స్వాతంత్య్రమును కాపాడి రక్షింతువని నమ్మి నిన్ను వందించుచున్నాము.
ప్రభువా! మా దేశమందున ప్రభుత్వము వారిచ్చిన మత స్వాతంత్య్రమును నీకు మహిమ కరముగ వాడుకొనునట్లు సహాయపడుదువు గనుక నీకు నిత్య మంగళస్తోత్రములర్పించుచున్నాము. ఆమెన్.