8 కీర్తన
తండ్రినుండియు, కుమారునినుండియు, పరిశుద్ధాత్మనుండియు కృపాసమాధానములు మీకు కలుగునుగాక!
దేవా, నా ప్రభువా! మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చియున్నావు. నీవు దేవుడవు గనుక నీ మాట, సత్యము దయచేసి నీ దాసుడనైన నాకుటుంబము నిత్యము నీ సన్నిధిని వుండునట్లుగా దానిని ఆశీర్వదించుము. దేవా, ప్రభువా! నీవు సెలవిచ్చియున్నావు. నీ ఆశీర్వాదమునొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుగాక!
2సమూ 7:28,29.
స్తుతి:- పరలోకపుతండ్రీ నీ పావన లక్షణరూపమునకై స్తోత్రములు, మమ్మును, మాకు కలిగిన సమస్తమును కాచేదూతలను, నీ ప్రేమ రూపమును నీ దివ్య కార్యక్రమమును చూపు గ్రంధము నిమిత్తము, స్తుతులు.
మా నివాసము నిమిత్తము భూమిని, ఇల్లుగాను, ఆకాశమును పైకప్పుగాను, సూర్య చంద్ర నక్షత్రాదులు దీపములుగాను సమస్త యీవులను మా కొరకు సృజించిన నీకు ప్రణుతులు. నీ హృదయవాసియైన నీ ప్రియకుమారుడైన మాప్రభువైన క్రీస్తును, లోకమునకు పంపి, మమ్మును రక్షించిన నీకు నుతులు. నీ పావనాత్మను మాలో వుంచి, మమ్మును శుద్ధిచేసి, నీ కుమారునితోపాటు నీయందు నిత్యము నివశించుటకు మాకిచ్చిన మోక్షనివాసము నిమిత్తము స్తోత్రములు. దానకర్తవైన తండ్రీ యీ దీనకుటుంబము నీ దీవెన కలిగి, నివశించుటకు నీవిచ్చిన యీ గృహము నిమిత్తము స్తుతులు.
బోధకుడు:- ప్రభువైన యేసూ రమ్ము.
సంఘము:- ప్రభువా! మాతో వుండుము.
బోధ:- నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును.
సంఘ:- నీ భోజనపు బల్లచుట్టు, నీ పిల్లలు ఒలీవమొక్కలవలె వుందురు.
కుటుంబము:- నేనును, నా యిటివారును ప్రభువును సేవించెదము.
ప్రార్ధన:- దేవా! తండ్రీ! నీ ప్రేమనుబట్టి నీవును నీ ప్రియకుమారుడైన మా ప్రభువైన క్రీస్తును, మా వద్దకు వచ్చి, మా వద్ద నివాసము చేతుము అని పలికిన ప్రభువా మాలో మా గృహములో నివసించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము. ఆమెన్.
బోధ
ప్రార్ధన
త్రియేకుడవైన తండ్రీ! నీ ముఖకాంతిని యీ గృహముపై యీ గృహవాసులపై ప్రకాశింప జేయుము. మా కార్యక్రమములకు ఆదియు, అంతము నైయున్న ప్రభువా నీవును, దూతలును, పరిశుద్ధులును. మాతో నుండి దీవించుము. నీ కృపా సమాధానములు మాకు దయచేయుమని త్వరగా వచ్చుచున్న యేసునామములో వేడుకొనుచున్నాను. ఆమెన్.
బోధ:- భూమియు, దాని సంపూర్ణతయు, లోకము, దాని నివాసులును దేవునివే.
సం:- మహిమ గల రాజు ప్రవేశించునట్లు మిమ్మునులేవనెత్తుకొనుడి.
ప్రార్ధన:- దావీదు తాళపుచెవి గలిగిన ప్రభువా! పరలోక పాతాళలోకపు ద్వారము తెరచిన నీవే, యీ గృహ ద్వారమును తెరచి ఈ గృహవాసులతో నుండుమని సదాకాలము మీతోకూడ ఉన్నానని పలికిన క్రీస్తునామమున వేడుకొనుచున్నాము. ఆమెన్.
(తలుపు తెరచుట) ఈ పేరున గల నూతన గృహద్వారములను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున తెరచుచున్నాము.
కీర్తన 69. (అందరూ పాడుచు లోపల ప్రవేశింతురు.)
ద్వితీయో: 6:4-13.
లూకా:- 10:38-42.
ప్రకటన:- 21:1-3.
ప్రసంగము
సమర్పణ:- బుద్ధి విజ్ఞానములు సర్వసంపదలుగల ప్రభువ్నకే ఈ గృహమును సమర్పణ చేయుచున్నాము.
బోధ:- ఈగృహమునందు దేవును వాక్యమునకును, క్రీస్తుప్రభువునకును, స్థానమిచ్చెదరా?
కుటుం:- ఔను. అలాగునే చేయుదము.
బోధ:- ప్రభువు రెండవరాకడకు సిద్ధపడుటకు అనుదినము దైవ సన్నిధి కార్యక్రమము ఈ గృహమందు జరిగించెదరా?
కుటుం:- అట్లే చేయుదుము.
దీవెనలు
- ప్రభువుయొక్క మహిమ కాంతి మీ మీదను, మీ గృహమందును, మీ కార్యములందును, ప్రకాశించునుగాక!
- ప్రభువుయొక్క వాత్సల్యత నూతన గృహవాసులైన మీకు ప్రతి దినమును నూతనముగానే కలుగుచుండునుగాక!
- ప్రభువు యిచ్చు ఇహ పరసంబంధమైన సకల యీవులతో వర్ధిల్లుదురు గాక!
- మీకు కలుగు శ్రమలే ప్రభువుతోగల మహిమానుభవమును అందరికిని కనుపించును గాక!
- మన ప్రభువైన క్రీస్తుయొక్క దివ్యస్వరూపము మీహృదయములలో ప్రతిష్టింపబడునుగాక!
- మన ప్రభువు మీతో ఈ గృహవాసియైయుండి, మీకు కనబడుచు, మీతో మాట్లాడుచుండుగాక!
- ఈ గృహవాసులైన మీరు ప్రభువుయొక్క మహిమ రాకడకు సిద్ధపడి పరమందున్న నూతన యెరూషలేము యొక్క నివాసులగుదురు గాక! ప్రార్ధన:- త్రియేకుడవైన తండ్రీ! నీ యాశీర్వాదము, నీ కరుణ, నీ శాంతి, ఈ గృహవాసులపై నుంచుము. వీరిని, వీరికి కలిగిన సమస్తమును కాయుటకు నీ కావలిదూతల నుంచుము. అన్నిటికంటె ఉన్నతమైనదియు, అవసరమైనదియునైన నీ సన్నిధిని వీరి గృహమందు నుంచుము. వీరికి కనబడుము. వీరితో మాటలాడుము. వీరికి పరిశుద్ధుల సహవాసమును అనుగ్రహించుము. నీ పరిశుద్ధాత్మను వీరిలోనుంచి నీ కృపావరములను దయచేయుము. వీరి గృహమే చిన్న మోక్ష మయ్యుండునట్లుగా దీవించుము. వీరి గృహములోనికి వచ్చు వారికి వీరి ప్రార్ధనలవలనను, వీరి అంతరంగ జీవితానుభవము వలనను వీరి వాక్యానుభవము వలనను, వీరి పరిచర్య వలనను, మేలు కలిగించుము. వీరి శరీర జీవితమునకు, ఆత్మీయ జీవితమునకు, మహిమ జీవితమునకు, అవసరమైన సమస్త యీవులను దయచేయుము.
వీరికి కలిగిన బిడ్డలకు, ఆరోగ్యము, ఆయుష్కాలము, జ్ఞానము విద్య, ఉద్యోగము. దైవభక్తిని అనుగ్రహించుము. ఈగృహవాసులను సాతాను పిశాచములనుండి, పాపశాపములనుండి, శత్రుభీతినుండి, అంటువ్యాధుల నుండి, విషపురుగులు, విషజంతువులనుండి, అపాయములు, అజ్ఞానమునుండి, ఆయా విధములైన కీడులన్నిటినుండి తప్పించుము. మరియు ఈ గృహవాసుల నందరిని నీ రాకకొరకు సిద్ధపరచుము. వీరి జీవితాంతము నందు మహిమ మోక్షమునందు చేర్చుకొనుము. ఈమా ప్రార్ధనలను త్వరగా రానైయున్న యేసునామమున వేడుకొనుచున్నాము. ఆమెన్.