(యం. దేవదాసయ్యగారు ది. 9 ఫిబ్రవరి 1960 ప్రభువునందు నిద్రించినారు.)
(సామెతలు 10:7,11 హెబ్రి 13:7,17 2దిన, 20:20 1 కొరింధి 4:17, కార్య 4:26.)
1. పరిశుద్ధుడవైన తండ్రీ! నీవు అనాది కాలములోనే నీ అనాది యోచనను బట్టి రక్షణ కార్యక్రమములో వాడుకొనుటకు అయావారిని కాలక్రమమున లోకమునకు పంపిన నీకు నుతులు.
2. ఈ కడవరి కాలములో నీ దాసుడును, మా ఆత్మీయ జనకుడవైన దేవదాసు అయ్యగారిని బైబిలుమిషనును లోకమునకు బయలుపరచుటకుగాను, వరముగా ననుగ్రహించిన నీకు ఆనంద స్తోత్రములు.
3. జన్మ కాలమునుండి జీవితాంతమువరకు పరిశుద్ధ జీవితమందు వర్ధిల్లజేసిన నీకు ప్రణుతులు.
4. బాల్యమునుండియు, యితరులకు ఆశ్చర్యము కలిగించు ప్రార్ధనలు చేయుటయందును, నిన్ను స్తుతించు గీతములు రచించుట యందును ప్రత్యేకత నను గ్రహించిన నీకు వినుతులు.
5. యౌవనమునుండి వృద్దాప్యమువరకు ఆంద్ర యివాంజలికల్ లూథరన్ మిషనునందు నీకు మహిమకరముగాను, అనేకులకు దీవెనకరముగాను నుండగల సేవను నీ దాసునిద్వారా జరిగించిన నీకు వందనములు.
6. వృద్దాప్యము, అనారోగ్యస్థితి గల యీ సమయములో బైబిలుమిషనును గాలిమీద తెలుగుభాషలో వ్రాసిచూపిన నీ ప్రత్యక్షతకు నీదాసుడు లోబడగల వినయమనసు దయచేసిన నీకు వినయ వందనములు.
7. ధనమును, జనసహాయమును లేనప్పుడు లూథరన్ మిషనునకు రిజైన్ యిచ్చి, "సైన్యముయొక్క యువరాజువలె నీవు వెలుపలికి రమ్ము" అను నీ పిలుపును అంగీకరింపగల విధేయత ననుగ్రహించిన నీకు నమస్కారములు.
- సంఘము నీదాసునికి సంస్కార భోజనమీయ నిరాకరించినపుడు నీవే వచ్చి స్వయముగ రొట్టె, ద్రాక్షారసముల నిచ్చి ఎవరికిని, ఎన్నడును లేని నూతనానుభవమును నీ దాసునిద్వారా వెల్లడిలోనికి తెచ్చిన నీకు సంస్తుతులు.
- మరియు నీ దాసుని బరంపురములోని దైవ సన్నిధిలోనికి నడిపించి మానవులచేత నీ దాసునికి అభిషేకము నిప్పించక త్రియేక దేవుడవైన నీవే స్వయముగ అక్కడే అభిషేకించి యితరులను సేవకు అభిషేకింపగల అనుభవాధికారమును యిచ్చిన నీకు స్తోత్రము.
- 1938 సం|| జనవరి 31వ తేదీని నీ దాసునికి బైబిలుమిషనును గాలియందు వ్రాసి చూపించి తన సహకారులను మే 5వ తేదీన స్థాపించి బహిరంగమునకు యీ మిషనును చూపించి నందుకు వందనములు.
- మరియు, యీ సంఘాభివృద్ధికి బైబిలు తరగతులు, పనివారి కూటములు, ఉపవాస ప్రార్ధన కూటములు, సామాన్య ప్రార్ధనలు జరిగించు ఏర్పాటును, సువార్తికులను హస్తనిక్షేపణద్వారా ప్రత్యేక పరచుట, పాష్టర్లను అభిషేకించుట, స్త్రీలను పనివారలుగా ఏర్పర్చుటయును, ముఖ్యమైన బోధలను చార్టుల రూపములో వ్రాయించుట, బూర ప్రసంగములు తెప్పించుట, కొన్ని గ్రంధములను, లక్షలాది సువార్త పత్రికలను అచ్చువేయించుట, యీ మొదలగు పనులను నీ దాసుని ద్వారా చేయించుకొన్న నీ కృపగల కార్యక్రమమునకు వేలాది నుతులు.
- నీ దాసుని ద్వారా ప్రత్తిపాడు, ఏలూరు, గుంటూరు మొదలగు స్థలములలో స్వస్తిశాలలను స్థాపింపజేసి లక్షలాది ప్రజలకు శరీరాత్మీయ ఉపకారములను చేకూర్చుచున్న నీ కృపకు మహిమ స్తోత్రములు.
- బైబిలు గ్రంధము నందలి ప్రత్యక్షత లన్నియు నీ దాసుని కనుగ్రహించి అవన్నియు నేటి కాలమందును జరుగునట్టి అనుభవమును అనేకులకు ఆయన ద్వారా అందింపజేసిన నీకు ప్రణుతులు.
- దేవుడందరికి కనబడును, మాట్లాడును, అనునట్టి గొప్ప సందేశము అన్నిమతములవారికిని, మిషనులవారికిని, నీ దాసుని ద్వారా అందింపజేసినావు గనుక నీకు ఆగని సంస్తుతులు.
- దైవ గ్రంధమగు బైబిలులోని గొప్ప మర్మములు నీ దాసుని ఉపదేశములద్వారాను, ప్రార్ధనలద్వారాను, వ్రాతలద్వారాను ముఖ్యముగా రెండవ రాకడ, పెండ్లికుమార్తె, దైవలక్షణములస్తుతి, సాతానును ఎదిరించుట, అను గొప్ప విషయములను లోకమునకు బయలుపరచుటద్వారా నీ కృపను చూపించినందుకు హృదయ వందనములు.
- క్రమముగాను, కారణసహితమైన స్తితిని, స్తుతియొక్క నిజస్థితిని, దాని వలన కలుగు ఫలితమును సృష్టినిబట్టి, వాక్యమునుబట్టి, అనుభవమునుబట్టి ఏలాగు స్తుతి చేయవలెనో నేర్చిన నీ దాసుని మా యెదుట నుంచిన ప్రభువా! నీకు ప్రణుతులు.
- ఓ ప్రభువా! బైబిలులో యేయే గ్రంధములు నీ సంఘము నిర్లక్ష్యముగా చూచుటవలన సైతాను ఆయాగ్రంధముల విషయములో వారి జ్ఞానముపై ముసుగువేసినదో అట్టి గ్రంధములగు పరమగీతము, ప్రకటన అను పుస్తకముల పూర్తి వివరమును నీ దాసునిద్వారా మాకందించి మాపై సైతానువేసిన ముసుగును తీసివేసినందుకు మా ఆనంద స్తోత్రములు.
- ప్రభువా! అంతరంగముగా నీ విచ్చు సంస్కారము తీసికొనగల అనుభవము ఒక్క నీ దాసునికి మాత్రమే కాదనియు, అట్టి అనుభవము సంఘములలో అనేకులు పొందగలరను ఉపదేశమును అందించినట్టి అనుభవము యితరులనేకులకు కలుగునట్లు నీ దాసుని ద్వారా గలిగించిన దేవా! నీకు నిత్య సంస్తుతులు.
- సన్నిధికూటములను నీ దాసుని ద్వారా స్థాపించినవాని వలన లోకమునకు, సంఘమునకు, అనేక మేళ్ళు అనగా దూతలతోను, పరలోక పరిశుద్ధులతోను, భూలోక పరిశుద్ధులతోను కైలాసమందలి ఋషులతోను, దురాత్మలతోను, మాట్లాడగల శక్తి విశ్వాసులకు కలదని లోకమునకు యెరుకపరచిన నీ దీవెన కరమైన స్థితికి మా హృదయ పూర్వక వందనములు.
- మరణకరమైన శ్రమను ఒకముల్లుగా యీ నీ దాసుని శరీరములోనుంచి ఆ శ్రమద్వారా నీ సేవకులకు, ప్రజలకు గొప్ప ఆదరణ కలిగించి వాటివలన శ్రమలలో నున్నవారికి గొప్ప మహిమ కలదని తెలియజేసినావు గనుక నీకు మహిమ నుతులు.
- అన్ని స్థితులలో నుండువారికి సరిపడు కీర్తనలును, అందరికి అర్ధమగునట్లు సులభశైలిలో పద్యములును, దండకము, తుపాను పాట మొదలగునవి నీ దాసునిద్వారా వ్రాయించి మహిమ పొందిన నీ నామమును స్తుతులతో ఘనపరచుచున్నాము.
- నీతిమంతుడు విశాసమువలన జీవించునను వాక్యప్రకారము నీ దాసుడు జీతములపై ఆధారపడక కేవలము నీపై మాత్రమే ఆధారపడి జీవించునట్లు చేసి, అట్టి విశ్వాస జీవితమును వాక్య సేవకులకు కూడా నేర్పించుటకు నీ దాసుని వాడుకొన్నందులకు నీకు నిత్య ప్రణతులు.
- గత కాలమందును, ప్రస్తుత కాలమందును, అనేకులు నీ నామ మెరుగకుండ చనిపోయినవారి రక్షణ విషయము ప్రార్ధించగా వారికి పాతాళమందు సువార్త విను ఏర్పాటు గలదని నీ దాసునికి తెలియజేసిన నీకు వందనములు. మరియు నీ దాసుని శరీరమును మంచము మీదనే యుంచి ఆత్మను ఆయా స్థలములకును, పాతాళమునకును, తీసికొ ని వెళ్ళి అక్కడ ఆయనతో సేవ చేయించుకొనుచున్న ప్రభువా! నీ కనేక వందనములు.
- అనేకుల ద్వారా నీవు సొమ్ము పంపించినప్పుడు ఆ సొమ్మును ముట్టుకొనకయు నీవు పంపిన లెక్కలేనంత సొమ్ముతో నీ మహిమార్ధమైన అనేక కార్యములు నీ దాసుని ద్వారా చేయించుకొనుచున్న నీకు నమస్కారములు.
- చేయవలసిన ప్రార్ధనలన్నియు ముగించినానని అనేకమార్లు చెప్పి నేను చనిపోయినను ఎక్కడికి వెళతాను? మీతోనే ఉంటాను అని చెప్పి చివరికి యీ భౌతిక దేహమును చాలించినను నీ దాసుని ఆత్మను మాతోనే ఉంచి అనేక వర్తమానములు, పనులు, అద్భుతములు, నీ మహిమకొరకు చేయించుకొన్నావు. గనుక నీకు మా ఆనంద స్తోత్రములు. ఆమెన్.
Please follow and like us: