సంఘారాధనలు

⌘K
  1. Home
  2. Docs
  3. సంఘారాధనలు...
  4. 14. కాలోచిత ప్రార్ధనలు...
  5. త్రిత్వాది వారము

త్రిత్వాది వారము

(త్రిత్వ దేవునికి స్తుతి)

యెషయా 6:3. మత్తయి 28:19. 1యోహాను 5:7. 3:16-17, 2కొరింధి 13:14 ప్రకటన 1:4-5. 4అ|| సంఖ్యా 6:24-26.

తండ్రీ! త్రియేక దేవుడవైన తండ్రీ! ఒక్కరు ముగ్గురుగాను, ముగ్గురు ఒక్కరుగాను బైలుపడినందుకు స్తోత్రము. సృష్టిని కలుగచేసినప్పుడు వెలుగు కలుగును గాక అని పలికిన తండ్రీ! పలుకబడిన వాక్కైయున్న కుమారుడవైన తండ్రీ పలుకబడిన ప్రకారము వెలుగు కలుగజేసిన తండ్రీ స్తోత్రము. సూర్యబింబము ఒక్కటైనను, అందు వెలుగు, వేడి, జ్వాల గల త్రిత్వము నుంచిన తండ్రీ స్తోత్రములు. జ్యోతులు సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించును. దినములో ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము అను త్రిత్వము నుంచిన తండ్రీ స్తోత్రము. ఈ విధముగా సృష్టి అంతటిలో నీ త్రిత్వము నుంచిన తండ్రీస్తోత్రములు. మానవుని మీ స్వరూపమునందు మీ పోలిక చొప్పున కలుగజేసిన తండ్రీ స్తోత్రములు. మీ స్వరూపమనగా మీ దివ్య లక్షణములతోను, అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నట్లు మానవుని శరీర ప్రాణాత్మలను కలుగజేసిన మానవునిలో త్రిత్వమును కనబరచిన తండ్రి వందనములు.

మానవుని రక్షణ కొరకు మానవునిగ వచ్చి బాప్తీస్మము పొందిన సమయమందు కుమారుడు నీళ్ళనుండి బైటకు వచ్చుటయు, పరిశుద్ధాత్ముడు పావుర రూపమున కుమారునిపై వ్రాలుటయు, తండ్రి నా ప్రియకుమారుడని పలుకుటయు చూడగ త్రిత్వమును లోకమునకు బహిరంగముగ బయలుపరచిన తండ్రికి స్తుతులు. దేవా! పరలోకమందలి దూతలు నిన్ను స్తుతించుట చూడగా “పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు” అని ముమ్మారు పలుకుటను బట్టి నీవు ఒక్కడవైనను, ముగ్గురుగా నున్నావని బయలుపరచుచున్న నీకు నా జ్ఞానమునకు తోచినన్ని స్తుతులు. ఒకవృక్షముయొక్క మ్రానును తీసికొని కుర్చీలు, బల్లలు, మంచములు చేస్తున్నారు. ఆ వస్తువులు ముందు మ్రానులోనున్నట్లు కనబడవు. అలాగే త్రిత్వము ముందు మర్మముగా కనబడును గాని కాలక్రమమున దేవుడు చేసిన పనిని బట్టి అర్ధమగును.

తండ్రీ! నీవు సంఘమునకిచ్చిన దీవెనలో నీ త్రిత్వనామమును బయలుపరచుచున్నావు. “ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీఅందరికి తోడైయుండునుగాక!”

2కొరింధి 13:14, వర్తమాన, భూత, భవిష్యత్కాలములో ఉండువాని నుండియు, ఆయన సింహాసనము ఎదుట నున్న ఏడు ఆత్మలనుండియు, నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండియు ఆది సంభూతుడుగా లేచినవాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపా, సమాధానములు మీకు కలుగునుగాక! ప్రకటన 1:4,5.

ప్రభువా! ఇట్టి దీవెన త్రిత్వనామములో మాకిచ్చినందుకు స్తోత్రములు. ఆమెన్.

Please follow and like us:

How can we help?