31జనవరి 1938 బైబిలుమిషను బయలుపరచబడినది.
త్రిత్వాదేవా! భూమిపుట్టినది మొదలుకొని ఒకదాని తర్వాత ఒకటి ఏలాగు బయలుపరచినావో అలాగే బైబిలుమిషనును బైలుపరచినావు. నీకు అనేక నమస్కారములు.
ఆదికాండములో నీ సృష్టిని ఒకదానితర్వాత ఒకటి ఏలాగు బయలుపరచినావో అలాగే బైబిలుమిషనును బైలుపరచినావు. నీకు అనేక నమస్కారములు.
మోషే కాలములో ఏలాగు ధర్మశాస్త్రమును బయలుపరచినావో అలాగే బైబిలుమిషనును బయలుపరచినావు. నీకు అనేక స్తోత్రములు.
తర్వాత ప్రవక్తలద్వారా మలాఖీవరకు ఏలాగు నీ చిత్తమును బయలుపరచినావో అలాగే బైబిలుమిషనును బయలుపరచినావు. నీకు అనేక స్తోత్రములు.
పాతనిబంధనలో నిన్ను గూర్చిన భవిష్యత్తు ఏలాగు బయలుపరచినావో అలాగే బైబిలుమిషనును బయలుపర్చినావు. నీకు అనేకమైన స్తుతులు.
నాలుగు సువార్తలలో ఏలాగు నిన్ను నీవు బయలుపరచుకొన్నావో అలాగే బైబిలుమిషనును బయలుపరచినావు, నీకు అనేకమైన సంస్తుతులు.
పత్రికలలో నీ సంఘముయొక్క కట్టడలు ఏలాగు బైలుపరచినావో అలాగే బైబిలుమిషనును బయలుపరచినావు. నీకు అనేకమైన వినుతులు.
సిలువమీదను సమాధిమీదను నీ స్వంతజయమును ఏలాగు బైలుపరచినావో అలాగే బైబిలుమిషనును బయలుపరచినావు. నీకు అనేకమైన ప్రణుతులు.
సంఘముయొక్క జయమును ప్రకటన గ్రంధములో ఏలాగు బయలుపరచినావో అలాగే బైబిలుమిషనును బయలుప ర చినావు. నీకు అనేకమైన సాష్టాంగ నమస్కారములు.
లూథేరుద్వారా బైబిలు ఏలాగు బైలుపరచినావో అలాగే మా కాలములో బైబిలుమిషనును బయలుపరచినావు. నీకు అనేకమైన నిత్య స్తొత్రములు.
బైబిలుమిషనును ఏలాగు బయలుపరచినావో అలాగే నూతన విషయములు సన్నిధికూటములలో బయలుపరచుచున్నావు. నీకు అనేక స్తోత్రార్పణలు,
పూర్వకాలమందు భక్తులలో ఏలాగు మాట్లాడినావో అలాగే ఇప్పుడు సన్నిధికూటష్తులలో మాట్లాడుచున్నావు. నీకు అనేక స్తుతి వందనములు.
బైబిలుమిషనులో ఇదివరకే కొన్ని పుస్తకములు, అనేక కరపత్రములు ప్రచురింప చేసినావు. నీకు అనేకమైన ఆనంద స్తోత్రార్పణలు.
ఇంగ్లీషులోను, మహమ్మదీయుల భాషలోను, ఓడ్రభాషలోను, అరవ భాషలోను, కన్నడభాషలోను, హిందీభాషలోను కొన్ని కరపత్రములు ప్రచురింపజేసినావు. నీకు అనేకమైన దివ్యసంస్తులు.
బైబిలుమిషనులో నీ చిత్తమును పూర్తిగా నెరవేర్వలేని గుణమును ప్రవేశింపనిచ్చినావు. అందుమూలముగా మాకు చురుకుదనము, నీతి పాఠము నేర్పించుటకు ఉద్ధేశించినావు. నీకు అనేకమైన వందన స్త్రోత్రార్పణలు.
బైబిలుమిషనులో నీవు సన్నిధికూటములు స్థాపించినందుకును, నీవు ఆ కూటములలో దర్శనమిచ్చి కూటస్థుల ప్రశ్నలకు జవాబులు అందించుచున్నందుకు నీకు అనేకమైన అనంతస్తొత్రములు.
యేసుక్రీస్తుప్రభువా సన్నిధి కూటములలో ప్రతిదినము రాకడను గురించి చిన్న ప్రసంగములు వినిపించుచున్నావు. నీకు అనేక మైన వినయ స్తోత్రములు.
ప్రభువా నీవు సన్నిధి కూటస్థులకు ప్రతి లక్ష్మివారము సంస్కార భోజనము వడ్డించుచున్నావు నీ పాదములకు అనేక హృదయానంద నమస్కారములు.
బైబిలు మిషనులో స్వస్థిశాలలు స్థాపించుచున్నావు, నీకు అనేకమైన ప్రేమవందనములు.
దేవుని మెచ్చుకొనదగిన అంశములు
దేవా! నీవు ఏ ఉద్ధేశముతో బైబిలుమిషనును బయలుపరచినావో ఆ ఉద్ధేశమును కడవరకు నెరవేర్తువు.
నీవు స్థాపించిన సంఘము 850 శాఖలైనను నీవు బైబిలుమిషనును ఎందుకు స్థాపించినావో నీ జ్ఞానమునకే తెలియును.
క్రైస్తవులున్న ఇన్ని దేశములుండగా బైబిలు మిషను ఇండియాలో ఎందుకు బయలుపరచినావో నీ జ్ఞానమునకే తెలియును.
లోకములో గొప్పగొప్ప పట్టణములుండగా రాజమహేంద్రవరములో ఎందుకు బైబిలుమిషనును బయలుపరచిననావో నీకే తెలియును.
మొదటి నరులు పుట్టినది మొదలుకొని ఇన్ని వందల సంవత్సరములు గడువగా 1938 సవత్సరములో బైబిలుమిషనును ఎందుకు బయలుపరచినావో నీకే తెలియును.
సంఘములో 850 మిషనులుండగా లూథరను మిషనులోనున్న ఒక బోధకునికి ఎందుకు బైబిలుమిషనును బయలుపరచినావో ఈ ఒక్కనికే ఎందుకు బయలుపరచినావో నీకే తెలియును.
సంఘములో అనేకులగు ధనికులు ఉండగా ధనములేని ఈ బోధకునికి బైబిలు మిషనును ఎందుకు బయలుపరచినావో నీకే తెలియును. బైబిలుమిషనును వారికి బయలుపరచి యుండిన యెడల దీనిని గురించి ఈపాటికి లోకమంతటికిని తెలియజేసి యుందురు.
సంఘములో అనేకమంది గ్రంధకర్తలు ఉండగా ఈయనకే ఎందుకు బైబిలుమిషనును బయలుపరచినావో నీకే తెలియును. వారికి బైబిలుమిషనును బయలుపరచియున్నయెడల నేటికి అనేక పుస్తకములు కరపత్రములు అచ్చువేసి అందరికి తెలియజేసి యుందురు.
ప్రార్ధనాంశములు
1. తండ్రీ! మామీదికి వచ్చుచున్న నిందలు పరిహరించుము.
2. తప్పు అర్ధము చేసికొనుచున్నవారికి నిజము నీవు తెలియజేయుము.
3. మాద్వారా నీవు దయచేయదలంచుకొన్న అన్నిపనులు సాగించుము.
- ప్రతిస్థలములో బైబిలుమిషనును స్థాపించుము. 5. ప్రతి కుటుంబములో సన్నిధికూటములు స్థాపించుము. 6. ప్రతిచోట స్వస్థికూటములు స్థాపించుము. 7. అన్నిమిషనులలోనున్న సందేహములను తప్పుసిద్ధాంతములను రద్దుపరచుము. 8. నీవు చెప్పుచున్న వర్తమానములు త్వరలో అచ్చ్యములుగా రచింపగల హువేయుటకు మాకు శక్తి దయచేయుము. 9. మాకు విరోధముగా నున్న వారిని క్షమించుము. 10. బైబిలుమిషను చరిత్రను అన్ని భాషలలో ప్రకటింపజేయుము. 11. అనేకమైన బైబిలు కీర్తనలు రచింపగల కవులను లేపుము. 12. తెలుగులో బైబిలంతయును పద్యములుగా రచింపగల కవులను లేపుము. 13. రాకడ వర్తమానమును ఎడతెరపిలేకుండ చాటించు సామర్ద్యమును అనుగ్రహించుము. 14. సాతాను యొక్కయు అతని దూతలయొక్కయు అతని అనుచరుల యొక్కయు ప్రయత్నములను ఆపుచేయుము. 15. బైబిలు మిషనువారు చేయదలంచుచున్న పనులన్నియు సఫలపరచుము. 16. బైబిలుమిషనువారు ఏక్రొత్త పనులు చేయవలెనో అవి వారికి బయలుపరచుము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును నిత్య మంగళ స్తోత్రములు. ఓ త్రిత్వదేవా! ఓ సృష్టికర్తవైన ప్రభువా! మమ్మును కలుగజేసిన తండ్రి! మా ప్రార్ధనలు, మా స్తుతులు, మా కోరికలు, మా పనులు నీ ఘనతకొరకు ప్రజల కుపయోగముకొరకు సిద్ధించునట్లు త్వరగా రానైయున్న యేసుప్రభువుద్వారా ఆలకించుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. ఆమెన్.