సంఘారాధనలు

⌘K
  1. Home
  2. Docs
  3. సంఘారాధనలు...
  4. 14. కాలోచిత ప్రార్ధనలు...
  5. భస్మ బుధవారము కొరకైన ప్రార్ధన

భస్మ బుధవారము కొరకైన ప్రార్ధన

ప్రార్ధన:- మిక్కిలి ప్రియుడవైన తండ్రీ! తిరిగి మమ్ములను మండల దినములలో ప్రవేశపెట్టి మాకు జీవము పోయుటకును, సాతాను జీవమును నశింపజేయుటకును యీ ధ్యాన దినములను భస్మ బుధవారముతో ప్రారంభము చేసిన తండ్రీ నీకు స్తోత్రము. సాతాను క్రియలు నాశనము చేయుటకును, సాతాను బలమును పడగొట్టివేయుటకును, మాకు యీ నలుబది బాణములను యిచ్చినందుకు స్తోత్రములు. నీవు నలుబది దినములు ఉపవాసముచేసి సాతానును జయించినావు. మోషే నలుబది దినములు ఉపవాసము చేసి సాతానును బంధించు పది యాజ్ఞలు సంపాదించియున్నాడు. అలాగే మేమును యీ నలుబది దినములను వాడుకొనుటద్వారా సాతానును మా పాదముల క్రింద చితుక త్రొక్కగల కృప దయచేయుము.

 తం డ్రీ! భస్మ బుధవారమునాడు మేము ఒక విత్తనము భూమిలో విత్తిన యెడల మంచి శుక్రవారమునాటికి ఏ విధముగా నెదుగునో ఆ విధముగానే నీవు మా కొరకు సిలువను భరించి జయించిన యీ జయ విత్తనము మాలో విత్తబడి వృద్ధిపొందు విశ్వాసము దయచేయుము. నీవు నలుబది ఉపవాస ప్రార్ధన ధ్యాన దినములయందు బలము పొంది ఆ బలము ద్వారా శ్రమలకు ఎదురెక్కి జయించుటకు మేమును ధ్యానాభ్యాసముచే సంపాదించిన బలమును బట్టి జీవము కలిగి శ్రమలకు ఎదురెక్కు కృప నిమ్ము.

 తండ్రీ! ప్రతివారు నశింపక నిత్య జీవము పొందునట్లు నీవీ లోకమునకు వచ్చియున్నావు. నశించువారికి యీ ధ్యాన దినములద్వారా జీవము పోయబడినట్లు సహాయము దయచేయుము. మరియు క్రైస్తవ బిడ్డల యొక్క పాటలు, మాటలు, ఉపదేశములు,ధ్యానములు మొదలగువాటి ద్వారా అనేకులు మేలుపొందు కృప ననుగ్రహింపుము. ఈ నలుబది దినముల ధ్యానము ఒక ధ్యానము కంటె మరియొక దిన ధ్యానము మమ్మును తెప్పరిల్ల జేయునట్లు చేయుము. తండ్రీ! కోడి పొదిగిటలోనున్న ఆకారములేని గ్రుడ్లు యిరువది ఒక్క దినములకు పిల్ల రూపమును దాల్చి జీవము కలిగియున్నట్లు మేమును నలుబది దినములు సిలువ పొదిగిటిలో నుండి జయశీలుడవైన నీ రూపము దాల్చుకొని సమృద్ధి జీవము పొందునట్లు చేయుము. మట్టిలో విత్తనము చెమ్మను పీల్చుకొని మూడవరోజునకు మన్నును పెల్లగించు కొని మొలకెత్తి బయటకు వచ్చి సూర్యుని యెదుట పడినట్లు ఈనలుబది దినముల ధ్యాన చెమ్మవలన పాపపు మట్టిని, బలహీనతలను పెల్లగించుకొని బయటికి వచ్చి నీతి సూర్యుడవైన నిన్ను అంటుకొని బ్రతుకునట్టి జీవము దయచేయుము.

 తండ్రీ! మా చేతిలో ఒక రూక ఉంటే వాడుకొందుము. కాని పారవేయము, అలాగే యీ నలుబది దినములను విలువైన నాణెములుగా వాడుకొని మేలు పొందునట్లు దీవెన దయచేయుమని త్వరగా వచ్చుచున్న ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్.

ఆది 18:27 యోబు 30:19 42:6, ఆది 3:19 యోనా 3:5-10. మత్తయి 20:17-19 మార్కు 10:32-34. లూకా 18:31-32.
Please follow and like us:

How can we help?