సంఘారాధనలు

⌘K
  1. Home
  2. Docs
  3. సంఘారాధనలు...
  4. 15. ఉపకార, అపకార నివారణ స...
  5. అనుదిన ప్రార్ధన

అనుదిన ప్రార్ధన

  1. పాపపు టొప్పుదల: ఓ దేవా! నేను నిన్ను తలంచుటకైనను, నీపేరెత్తుటకైనను, నిన్ను ప్రకటించుటకైనను యోగ్యుడనుకాను. జన్మము తలంపు, మాట, చూపు, వినికి, ప్రయత్నము, క్రియ, నైజము-వీనిని బట్టి నేను పాపినైయున్నాను. నీ ఉచితార్ధమైన కృపగల ఉపకారములకు లేశమైనను పాత్రుడను కాను. ఇది ప్రభువును బట్టి అంగీకరించుము. ఆమెన్. 2. విశ్వాసప్రమాణము: ఓ దేవా మహా ప్రభావముగల తండ్రీ నీ అధికమైన ప్రేమనుబట్టి నన్ను అంగీకరించుచున్నావని నమ్ముచున్నాను. నా నిమిత్తమే భూమి ఆకాశములను, మోక్షమును, అనుదినము నేను అనుభవించువాటిని కలుగజేసి యున్నావని నమ్ముచున్నాను. మరియు నాకు అన్ని విషయములలోను సహాయము చేయగల పరిద్ధులైన దేవదూతలనుకూడ నా నిమిత్తమే కలుగజేసిననావని నమ్ముచున్నాను. నీ ప్రియకుమారుని ద్వారా అనుగ్రహించు రక్షణ భాగ్యము నా నిమిత్తమే అని నమ్ముచున్నాను. ప్రేమ, శక్తి, జ్ఞానము, న్యాయము,విశ్వాస్యత, పరిశుద్ధత, సర్వవ్యాపకత్వము,నిరాకారము, జీవము, అనంతము,అనాది, నిర్వికారము మొదలగు పరిశుద్ధ లక్షణములతో ప్రకాశించుచున్నావని నమ్ముచున్నాను. ఇట్టిగొప్పవాడవైన నీవు నా దేవుడవు, నా రక్షకుడవు, నా తండ్రివి, నా సహకారివి. నా వైద్యుడవు, నా దాతవు, నా హృదయవాసివి, నా సర్వము అని హృదయ పూర్వకముగా నమ్ముచున్నాను. 3. ప్రార్ధన: ఓ దయగల తండ్రీ! నీవు ప్రార్ధనలు వినువాడ వగుటవలన నీ సన్నిధికి వచ్చి ఏదైన చెప్పుకొనవచ్చుననియు, అడుగుకొనవచ్చుననియు తెలిసి నిన్ను స్తుతించుచున్నాను. నాకు కావలసినవి నీకు ముందుగనే తెలిసినను అడుగుడి మీ కియ్యబడునని చెప్పినావు. గాన నా మనవులన్నియు నీ యెదుట సమర్పించు కొనుచున్నాను. ఓ తండ్రీ నాకు ఏమి ఇయ్యవలెనని నీకు ఉన్నదో అదే దయచేయుము. నేను ఎల్లప్పుడు నీ సన్నిధిలో స్వేచ్చగా సంచరింపగల బిడ్డనుగా నన్ను స్థిరపరచుచుండుము. కష్టకాలములోను, సంగతులు అర్ధముకాని కాలములోను, నేను నీ పక్షముగా నిలువబడగల దైర్యము దయచేయుము. నిన్ను గూర్చి నాకు గల మంచి అభిప్రాయమును మారనీయకుము. పాపమునుండియు పాప ఫలితమునుండియు నన్ను కాపాడుచుండుము. ప్రతి పర్యాయము నీ వాక్యము నాకు బోధ పరచుచుండుము. నా ఆత్మతో సదా మాట్లాడుచుండుము. మరియు నీ విషయమై కృతజ్ఞతతో కష్టపడి పనిచేయగల సేవకునిగా నన్ను స్థిరపరచుచుండుము. నన్ను పెండ్లికుమార్తె వంశమునుండి విడిపోనీయకుము. నీ కిష్టములేనిదే నేను అడుగ తలంచునప్పుడు అవి ప్రార్ధన వాలులోనికి రాకుండ తప్పింపుము. మరియు ఒక అంశమును గురించి ప్రార్ధించవలసిన గడియ దాటిపోనీయకుము. నాకు ప్రార్ధన వాలు దయచేయుము. సర్వజనులకు నీ వాక్య వార్త అందింపగల బోధకులను పంపుము వాక్యముపదేశించు ఏర్పాటులన్నిటిని వృద్ధిచేయుము. పాపులకు, బాధితులకు, బీదలకు అన్యాయము పొందుచున్నవారికి తోడైయుండి వారి పక్షమున జరుగవలసిన సత్య కార్యములను వృద్ధిచేయుము. ఈ ప్రార్ధన నీ కుమారుని ముఖము చూచి ఆలకించుము. ఆమెన్.
    1. సమర్పణ: ఓ దేవా నీవు నాకు ఇచ్చినవన్నియు నీకు సమర్పించుచున్నాను. మరియు నా శరీరమును, నా ఆత్మను, నాకు కలిగియున్న సమస్తమును నా జీవితకాలములోని గత కాలమును, నేటి కాలమును; రాబోవుచున్న కాలమును నీకు అర్పించుచున్నాను. నీ చిత్తము ఏదో అదే నా చిత్తమైయున్నది. నీ చిత్తము అనేక మారులు నాకు ఇష్టముగా నుండక పోయినను నేనది ఇష్టపడునట్లు సహాయపడ గోరుచున్నాను. ఏదినేను చేయలేక పోవుచున్నానో ఆ మంచి కార్యమును; నాకుగాని నీకుగాని ఇష్టములేనిది ఏది చేయుచున్నానో ఆ కార్యము నీకు అప్పగించుచున్నాను. మా బంధువులను, స్నేహితులను, అధికారులను, నేనంటే ఇష్టము లేనివారిని మాకు ఇష్టములేనివారిని, శత్రువులను నీ కప్పగించుచున్నాను. మమ్మును బాధపెట్టు పురుగులు, జంతువులు, పక్షులు మొదలైన వాటిని నీకు సమర్పించుచున్నాను. అలాగే మాకు బాధకరముగానున్న దయ్యములను, సైతానును తత్ సంబంధమైన వాటినన్నిటిని నీ వశము చేసికొనుచున్నాను. మేము బాధ తెచ్చుకొను వృక్షాదులు, శిలలు, నీకు అర్పించుచున్నాను. మాకు హానికరము కలుగునట్టి పంచభూతములను నీకు అర్పించుచున్నాను. ఈ అర్పణ నీ కుమారుని పరిముఖము చూచి అంగీకరించుము. ఆమెన్.
    2. రాకడ ప్రార్ధన:- ఒక గ్రామములో అందరు కలహములతో నుండిరి. ఒక దినమున తన జ్వరముగానున్న కుమార్తెను చూడ వచ్చిన తండ్రి భయంకరమైన కలహముల సంగతి విని తన కుమార్తెను తన యింటికి తీసికొనిపోయెను. ఈ లోకము గత్తరలోకము, పాపలోకము, పాపఫలితములగు అవస్తల లోకము, కరువుల లోకము, వ్యాధుల లోకము, విషపురుగుల లోకము, నిరీక్షణలేని లోకము, మరణ లోకము, దయ్యాల లోకము, దయ్యాలకు లోబడిన మనుష్యులున్న లోకము, కాబట్టి మన తండ్రియైన దేవుడు మనలను ఇచ్చట నుండకుండ మోక్ష మందిరమునకు తీసికొనివెళ్ళును. ఆయన శీఘ్రముగా వచ్చును. ఇదే రెండవ రాకడ తండ్రి కుమార్తెను తీసికొనివెళ్ళునపుడు రాను అని చెప్పదు. మనము కూడ మేఘములోనికి రాము అనిచెప్పకూడదు. ప్రభువా! తండ్రీ! సిద్ధముగా నున్నాను అని చెప్పవలెను. ఓ ప్రభువా మేమట్లు చెప్పగల కృపదయచేయుము. ఆమెన్.
    3. స్తుతి:- సర్వ సద్గుణ నామధారివైన ఓ ప్రభువా! నా సృష్టికర్తా! నీ స్థితిని బట్టి నీకు వందనములు. నేను ఏ నిమిషములో నిన్ను స్తుతించుట మానగలను, నా మనసులోనికి తెచ్చుకొనగల సర్వాంశమును నీ స్తుతియై యున్నది. నేను కూడ నీ స్తుతియై యుండగోరుచున్నాను. నా బ్రతుకంతటిలో నిన్ను స్తుతించునుగాక! దేవదూతలు పరిశుద్ధులగుటచేత పాపినైన నేను వారివలె స్తుతించలేక పోవుచున్నాను. గాని స్తుతించవలెనని ఉన్నది. నా హృదయములో నా స్తుతి రాత్రంతయు వెలిగే కాగడావలె ఉండవలెనని కోరుచున్నాను. నేను పొందుచున్న ఉపకారము వలనను నా సేవ వలనను నీకు కీర్తి కలుగునుగాక! ప్రార్ధనవారు దయచేయుమని అడిగిన నేను స్తుతిగానము కూడ దయచేయుమని వేడుకొనుచున్నాను. ఈ నా బలహీనమైనస్తుతి ప్రభువైన యేసునుబట్టి అందుకొనుము. ఆమెన్ ఆమెన్, ఆమెన్, ఆమెన్,ఆమెన్, ఆమెన్, ఆమెన్.
Please follow and like us:

How can we help?