(దేవాలయములోనికి వచ్చిన వారు నిశ్శబ్ధముగా మనోనిదానము కలిగి
యుండవలెను సంఘము లేచి చివర చరణము పాడుచుండగా బోధకుడు
వేదిక యొద్దకు రావలెను)
బో: తండ్రియొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు,
నామమున సం:ఆమెన్.
స్తుతి ప్రార్ధన
బో: ఓ దేవా! తండ్రివిగాను, కుమారుడవుగాను, ప్రత్యక్షమైన తండ్రీ! నీ
ప్రత్యక్షత నిమిత్తమై నీకనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్నారాదించు
కృపాసమయము దయచేసినందుకు వందనములు. దూతలు, పరలోక
పరిశుద్ధులు, నిన్ను స్తుతించుచున్నప్పటికిని మాస్తుతులు కూడా
కోరుకొనుచున్న నీకనేక స్తుతులు. నీవు కలుగ జేసిన సమస్త సృష్టిని బట్టి నీకు
ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నిన్ను
నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడి
విషయములన్నిటిని దీవించుమని ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము.
ఆమెన్.
బో: ప్రియులారా! ప్రభువునందు ప్రియులారా మనము పరిశుద్ధుడైన
దేవుని సన్నిధికి వచ్చునప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము
మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతోమేలు, మనము
పాపములేని వారమని చెప్పుకొనిన యెడల మనలో సత్యముండదు.
మనపాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడును,
నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త
దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము
చేయలేదని చెప్పుకొనినయెడల ఆయనను అబద్దికునిగా చేయువారమౌదుము
ఆయన వాక్యము మనలో నుందదు తన అతిక్రమములకు పరిహారము
నొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.
యెహోవా చేత నిర్ధోషియని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు
ధన్యుడు.
బో: పాపములను ఒప్పుకొందుము.
(సంఘము బోధకునితో కలిసి చెప్పవలెను)
పరిశుద్దుడవైన ఓ దేవా! మేము తలంపులను బట్టియు నైజమును బట్టియు
పాపులమై యున్నాము. తలంపును బట్టియు చూపును బట్టియు పాపులమై
యున్నాము. వినుటనుబట్టియు, మాటను బట్టియు పాపులమై యున్నాము.
ప్రవర్తనను బట్టియు క్రియలను బట్టియు పాపులమై యున్నాము.నీకృపను
పొందుటకు మేము అయోగ్యులము మమ్మును క్షమించుమని నీకుమారుని
పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమెన్.
బో: ప్రియులారా! తండ్రి తన అపరిమితమైన ప్రేమనుబట్టి విశ్వాసులందరి
అన్ని పాపములను క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు. మన
పాపములను జ్ఞాపకము చేసికొనడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించుదము.
బో: ఓ తండ్రీ! నీవు పరిశుద్ధుడవై యున్నందున పాపులను
అసహ్యించుకొనవలసినది గాని అట్లుచేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక
నీకు వందనములు. ఆమెన్.
(సంఘము కూర్చుండ వచ్చును)
(తండ్రి తన పాపములు క్షమించెనను విశ్వాసముతో )
[కీర్తన:దేవసంస్తుతి,పల్లవి 6,7,8 చరణములు పాడవలెను.]
( దేవుని వాక్యమును గౌరవించునిమిత్తము సంఘము లేచి
నిలువబడవలెను.)
బోధకుడు:[ తండ్రియైన దేవుని తలంచుకొనుచు పాత నిబంధన పాఠము
చదువును.కుమారుడైన తండ్రిని తలంచుకొనుచు సువార్తలలోని పాఠము
చదువును. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనుచు పత్రికలలోని పాఠము
చదువవలెను.]
వాక్యమిచ్చిన తండ్రికి స్తుతి ప్రార్ధన
బో: త్రియేకుడవైన దేవా! భూమి యాకాశములకంటెను, వెండి
బంగారములకంటెను, గొప్పదానమగు నీ గ్రంధమును మాకు దయచేసినావు
కాబట్టి నీకనేక కృతజ్ఞతా స్తోత్రములు. నీవు స్వయముగా మాకు
చెప్పవలసినమాటలన్నియు యీ పుస్తకములో యిమిడ్చినావు గనుక మా
వందములు. ఆమెన్.
[చాయ-పరములోన-పరములోన-పాపమేమిలేదుగా]
దేవాతి దేవరాజునకు - దివ్యమైన సంస్తుతి
పావన గ్రంధము బైలు - పరచెదన సన్నుతి
బో: మన విశ్వాసమును ఒప్పుకొందుము.
దేవుడు ఆది అంతము లేని దేవుదని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ,
న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము,స్వతంత్ర, సర్వవ్యాపకత్వము,
యీమొదలైన శుభలక్షణములతో నిత్యము మహాతేజోమయముగా
ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను
యేసుక్రీస్తు ప్రభువు రూపమునకు మనుష్యుడుగాను
అనాదిస్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు, దివ్యబోధల మూలముగాను
అద్భుతములగు ఉపకారముల మూలముగాను, నా పాపములు, నావ్యాధులు,
నా శిక్షలు తన శిలువ మ్రానుపై వేసికొని మరణమౌట మూలముగాను, ఆయన
సమాధిలోనుండి మూడవనాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట
మూలముగాను, తన నిజదేవతస్థితిని, ప్రేమను వెల్లడించినాడని
నమ్ముచున్నాను. ఇప్పుడు అందరినిమిత్తమై విజ్ఞాపన ప్రార్ధన
చేయుచున్నాడనియు, ఆయన రెండవమారు సంఘమును కొనిపోవుటకై
మేఘాసీనుడై వచ్చుననియు మిగిలిన వారికి యేడేండ్ల శ్రమ కలుగుననియు,
తరువాత అంతిక్రీస్తునకును,క్రీస్తునకును జరుగు యుద్ధములో అంతి క్రీస్తు,
అబద్ధ ప్రవక్త, నరకములో వేయబడుదురనియు, సాతాను పాతాళములో
వెయ్యేండ్లు బంధింపబడుననియు, ఆ తరువాత ప్రభువు భూమి మీద
వెయ్యేండ్లు పరిపాలనచేయుననియు తరువాత ఆయన సజీవులకును,
మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను..
క్రీస్తు ప్రభువు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు
భూమి మీదికి వచ్చి గోగు మాగొగు అన్ను పేర్లుగల సైన్యముల నేర్పర్చు
కొనుననియు అతడు దేవునితో యుద్ధముచేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని
నరకములో పడవేయునని నమ్ముచున్నాను. అటుతరువాత ఆయన
అందరకును తీర్పు విధించుననియు, అవిశ్వాసులను నరకములోనికి
పంపివేయుననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద నున్న
పరిశుద్ధులందరు ఏక సంఘముగా నుండుట వలన భూమి పరలోకములో ఒక
భాగమగుననియు, క్రీస్తు ప్రభువు పరలోకములోను భూలోకములోను
నుండుననియు నమ్ముచున్నాను.
నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను,
కుమారునితోను, యేక దేవుడు గానే యుండి పనిచేయుచున్నాడనియు,
ఈయన ఆవేశము వలననే దైవ గ్రంధము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన
వెలిగింపును బట్టియే ఆ గ్రంధము అర్ధమగుననియు, తండ్రి ఉద్దేశించిన రక్షణ
అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ
పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించుననియు నమ్ముచున్నాను. తండ్రి
కుమారులతో పాటు ఈయన కూడ సమానముగా ఆరాధన నొందదగు
దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్దుల సహవాసమును
పునరుత్థానమును, నిత్యజీవమును,కలవని నమ్ముచున్నాను. ఆమెన్.
కీర్తన
ప్రసంగ ప్రార్ధన
వాక్యము అనుగ్రహించిన దేవా! మేము నీ వాక్యమును యిప్పుడు
వివరించుకొనుబోవుచున్నాము.
ప్రతివారికి కావలసిన వర్తమానము నందించుము మా జ్ఞానము వెలుగునట్లు నీ
యాత్మ సహాయము నిమ్మని విన్నవించుచున్నాము. ఆమెన్.
ప్రసంగము
ప్రసంగాంత ప్రార్ధన
ఓ ప్రభువా! నీ వాక్యము మాలో నీమహిమార్ధమై ఫలించునట్లు చేయుమని
వేడుకొనుచున్నాము. ఆమెన్.
కీర్తన
(ఈ సమయములో చందా పట్టుట అందరు నిలువ బడి యుండగా
బోధకుడు చందాను గూర్చి ప్రార్ధించుట)
ప్రార్ధన
ఓ తండ్రీ నీవే మాకు అన్నియు యిచ్చుచుండగా మేము నీకు యేమి
యియ్యగలము? నీ విచ్చినవే నీకు చందాగా యిచ్చుచున్నాము. ఇవి నీ
సేవలో వాడుకొనుము. ఆమెన్.
ప్రటనలు
ముగింపు ప్రార్ధన
సర్వ్యప్తివైన ఓ దేవా! సర్వలోకమునకు నీ సువార్త అందించుటకు, సర్వ
మతముల వారికి నీ శుభవార్త నందించుము. నీ సంఘము తాను
నేర్చుకొనుచున్న విశ్వాకకు సిద్ద్సములో మాదిరిగా లోకము, యెదుట
నిలువబడగల శక్తి దయచేయుము మత తర్కములు, మిషను వివాదములు,
తప్పుడు బోధలు, పాప శోధనలు, పాపము వలన కలుగు నష్టములు
వీటన్నిటినుండి మమ్మును తప్పించుము.
కరువు కాలములో, వ్యాధి కాలములో, అజ్ఞానకాలములో వాటి
మూలముగా మానవులను నీతట్టు త్రిప్పుము. లోకమున
కుపకారమూలముగా నేర్పబడుచున్న పనులన్నిటిమీద నీ దీవెన
క్రుమ్మరించుము విశ్వాసులను పరిశుద్ధాత్మతో నింపి ప్రభు యేసుయొక్క
రెండవ రాకకు సిద్ధపర్చుము.
ప్రతి కుటుంబములోని వారిని, పేదలను, పాఠశాలలను, వైద్య శాలలను,
అనాధశాలను,బైబిలుసొసైటిని,అన్ని వృత్తులను నీటిమీదను మెట్టమీదను,
నిర్జన ప్రదేశములోను, గాలిలోను,ప్రయాణముచేయు
ప్రయాణికులను,ప్రభుత్వమువారి ఏర్పాటులను కాపుదల గల నీ
స్వాధీనమందు వర్ధిల్లచేయుము.
జ్యోతులమీదను, పక్షులమీదను, పశ్వాదులమీదను నిత్యము నీ కరుణా
దృష్టిని ప్రకాశింపజేయుచుండుము. ఆ వస్తువును ఈ జీవిని దేవుడు
దీవింపలేడు అను నేరము నీ మీదికి రానీయకుము.
అన్యా యము, అవమానము, దోపిడీలు, హత్యలు నిరాశలు,
దుర్మరణములు, భూకంపములు, యుద్ధములు ఆకస్మికముగా రానైయున్న
అపాయములు మొదలగు గండములనుండి ప్రజలను విమోచింపుము.
యంత్రములలోను, గనులలోను, సొరంగములలోను, నీటియడుగునను
పనిచేయువారిని, కాపాడుము. విషపురుగుల నుండియు, కౄర
మృగములనుండియు, దుర్జనలనుండియు, మమ్ములను తప్పించుము. ఏ
అంశప్రార్ధన మేము మరచిపోతిమో అది నీకు సమర్పించుచున్నాము.
మేము అడుగు వాటికంటెను, ఊహించువాటికంటెను, అత్యధికముగా
చేయజూచుచున్న ఓ తండ్రీ! మా అంతరంగ ప్రార్ధనలు మా బహిరంగ ప్రార్ధనలు,
యుక్త కాలమందు నెరవేరునట్లు మా ప్రార్ధనా స్తుతులను త్వరగా రానై యున్న
యేసుప్రభువు ద్వారా ఆలకించుమని వేడుకొనుచున్నాము. ఆమెన్.
ప్రభువు ప్రార్ధన
పరలోక మందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక; నీ
రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు
భూమియందును నెరవేరును గాక; మా అనుదినాహారము నేడు మాకు
దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించి యున్న ప్రకారము మా
ఋణములను క్షమించుము. మమ్ములను శోధనలోకి తేక కీడునుండి
తప్పించుము. రాజ్యము, శక్తియు మహిమయు నిరంతరము నీవియై
యున్నవి. ఆమెన్.
దీవెన
యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక! యెహోవా నీకు తన
సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరునించుగాక యెహోవా నీమీద తన
సన్నిధికాంతి నుదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక!
2. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ
సహవాసమును అందరికిని తోడై యుండును గాక! ఆమెన్.
ద్వితి 5 ;7. 6: 13. మత్తయి 4:10, యోహాను 4:20-24 ప్రకటన 19:10;
22:8.