వివరము
ఈ బొమ్మలో కనిపిస్తున్నది ఏమిటి?
దీనిలో ఏమేమున్నాయి?
ఏది ఎంత పరిమాణములో ఉన్నది?
దీనిలో ఉన్న వాటి రంగు, రుచి, వాసన ఏ విధంగా ఉంటాయి?
ఇట్లాంటి ప్రశ్నలు అడిగినపుడు 95% ప్రజలు ఠక్కున సమాధానం చెప్పేస్తారు. ఇది కొబ్బరి అని, దీని నీళ్ళు అరోగ్యానికి మంచిదని, తురుముతో చేసిన పచ్చడి బాగుంటుందని, అదే మా అమ్మ చేసిన కొబ్బరుండలయితే ఆ టేస్టే వేరని నెమరు వేసుకొనే వారు చాలామంది ఉంటారు.
అయితే ఇక్కడ ప్రశ్న అది కాదు. పండి, ఎండిన కొబ్బరికాయలో ఏమున్నది? ఇక్కడ కొబ్బరి ఉదాహరణగా తీసుకొన్నం గాని, ఏదైనా విత్తనంలో ఏమున్నది? దాని వేరు ఏవిధముగా ఉంటుంది? దాని కాండం, ఆకులు, పువ్వులు, కొమ్మలు, పిందెలు ఏ విధంగా ఉంటాయి?
విత్తనంలో ఇవేమి కనిపించవు గాని, అంత పెద్ద చెట్టు, అన్ని రంగులు, అంత బలమైన కాండం ... ఇవన్నీ ఆ చిన్న విత్తనములో రూపింపబడి ఉన్నవి. నా కిప్పుడే ఆ మహా వృక్షాన్ని ఈ విత్తనంలో చూపించు అంటే అది సాధ్యము కాదు.
భూమిమీద విత్తనము మొలకెత్తుటకు కావలసిన అనుకూలమును సిద్ధపర్చి, సూర్య కాంతికి అడ్డంకులు తొలగిస్తే, దానిలోని అసలు వైభవము మనకు కనబడుతుంది.
విత్తనములో వృక్షముయొక్క రూపకల్పన అంతా నిర్మాణమైనగాని, అది విత్తకముందు దాని మొలక రూపము ఇంకా ప్రారంభము కాలేదు. అనగా ఇంకా దానికి ఆది లేదు. అనగా దాని స్థితి అనాదిలో ఉన్నది. వృక్షముయొక్క రూపము, వైభవము ఏ మచ్చుకి కూడా విత్తనములో లేకపోవడమే దాని అనాది. ఇదంతా ఒక వృత్తాంతము.
ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూమి మీదికి వచ్చుటకు ప్రధాన కారణము, దైవ రాజ్య స్థాపన. ఆయన తన విలువైన ప్రాణమును అర్పించి, తిరిగి లేచి, అనేక ఋజువులను ప్రమాణములను చూపించి, ఆరోహణమునకు ముందున్న ఈ 40 దినములలో నిరూపించి, సృష్టించిన పరలోక అనుభవ రాజ్యమే, దైవ రాజ్య నిర్మాణము. పెంతెకొస్తు దినము వరకు, ఈ దైవ రాజ్య విత్తనము యొక్క స్థితి అనాది స్థితి. దైవ రాజ్యమనగా ఇహలోకములో క్రైస్తవ ప్రభుత్వ రాజ్యములు / దేశములు కావు. బైబిలులో రాజ్యము / దేశము అనగా ప్రజలు. భూమి /ప్రభుత్వము కాదు.
ప్రభువు స్థాపింపబోయే రాజ్యము అనగా సత్యము, నీతి, సమాధానము గల రాజ్యము; దైవ సంబంధమైన రాజ్యము అనగా దైవ లక్షణములైన పరిశుద్ధత, ప్రేమ, న్యాయము, శక్తి, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము మొదలగు వాటిమీద ఆధారపడి నిర్మించే రాజ్యము యొక్క అనాది స్థితిని ఆయన శిష్యులు అందుకొనుచున్న కాలమే ఈ ఆరోహణ యాత్ర కాలము.
దేవుడు ఇప్పుడు మనము చూస్తున్న భూమి, ఆకాశమును సృష్టింపక ముందు అనాది లో సంకల్పించిన తన రక్షణ మహా సంకల్పమును సిలువ యాగము ద్వార నెరవేర్చి, దానిని స్థిరపర్చుటకు శిష్యులను సిద్ధపర్చు యాత్ర ఈ పునరుత్ధాన యాత్ర. అప్పుడన్నీ ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి గాని, శిష్యులలో దైవ రాజ్య విత్తనము నాటబడిపోయినది. పెంతెకొస్తు రోజున అది మొలకెత్తినది. అది ఆది. ఆ సంఘము ఆది సంఘము. నరుడు (స్త్రీ + పురుషుడు) ఏ దైవ లక్షణమునైనా రూపాంతరము ద్వారా పొందుకోగలడు గాని, ఆదాము ద్వారా కోల్పోయిన జీవము, తద్వారా పరిశుద్ధతలను స్వతహాగా పొందుకోలేడు. కాబట్టి జీవమైయున్న మన ప్రభువు మనకు నిత్యజీవమిచ్చుటకు పరిశుద్ధాత్మను దైవ రాజ్య సంబంధులకు అనుగ్రహించెను.
మరియొక వృత్తాంతము
ఈ ఫోటోలో ఉన్న విత్తనము ఏమిటి?
దీని అంతరంగములో ఏ వృక్షము వున్నది?
ఇది మనకు తెలియదు కాబట్టి అసలు విత్తనమే కాదంటామా? ఒకవేళ చెర్రీ పండు తిన్నాగాని, మా ప్రాంతములో పండదు కాబట్టి ఈ చెట్టే లేదు అని చెప్పగలమా?
మనిషి జీవితమును నడిపించే విత్తనము లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ మాట్లాడితే ఆ డిపార్ట్ మెంట్ అన్నమాట. లాంగ్వేజ్ లోని వాక్యాలు సత్యమైతే అది మంచి ఫలితాన్నిస్తుంది. అవే మాయ మాటలైతే అది యెంతో కాలం నిలువదు. క్రీస్తు ప్రభువు తన మాటలను బైబిలు గ్రంథములో వ్రాయించి, ఆ వాక్యములను గూర్చి "వాక్యమే సత్యము" అనే మాట చెప్పెను. మరియు నేనే సత్యము అని చెప్పెను. కాబట్టి ఇక ఎవరివైపు చూడవలసిన అవసరములేదు.
అయితే ఏమిటి?
సినిమాలు చూడొద్దు; వీడియో గేమ్స్ ఆడొద్దు; సిగిరెట్ , మందు తాగొద్దు, పిచ్చి తిరుగుళ్ళు తిరగొద్దు; భార్య భర్తలు తిట్టుకుని కొట్టుకోవద్దు ... ఇట్లాంటివయితే అప్లికెబుల్ గా ఉంటాయి గాని, ఈ దైవ సన్నిధి, రాకడ, అనాది, వధువు లాంటి అర్థం కాని పదాలు ఎందుకు అనిపించవచ్చు. చికిత్స కంటే నివారణ మంచిది కదా! జీవితాంతం చెడు అలవాట్లు మానుకోవడానికే, స్వస్థత, ఆస్తులు, అంతస్తులు కొరకే ఖర్చు చేస్తే దేవుని మహిమను చూచేదెప్పుడు?
దేవుని విషయములో అభ్యంతరపడక విశ్వాసముతో ముందుకు సాగిపోవడమే క్రైస్తవ జీవితం. మనముందు పెద్ద పెద్ద ఉద్దేశాలు, పనులు, ప్రాజెక్ట్స్ ఉండొచ్చు. వాటివిషయమై ఇంకా స్పష్టత రాకపోతే అవి ఇంకా అనాదిలో ఉన్నట్టే.
అర్జంటుగా
దైవ సన్నిధి చేరి స్పష్టమైన వాగ్ధానము పొందుకోవాలి. తర్వాత వాటి వివరాలను సేకరించి ఆది వరకు తీసుకొని వెళ్ళాలి. మనము సాధించవలసిన గమ్యాన్ని సృజించి, సృష్టించి, నిర్మించి ముగించు వరకు పట్టు వదలకుండా ముందుకు సాగిపోదుము గాక! ఈ క్రమములో అన్ని అడ్డంకులను తొలగించే సామర్ధ్యాన్ని దైవాత్మ ద్వారా పొందుకొందుము గాక!
దేవుడు మన ఆత్మలకు తన పరిశుద్ధాత్మ ద్వారా జీవమునిచ్చును గాక!
పదజాలము (Recap)
- విశ్వాసము = దైవ వాగ్ధానము + నిర్మాణము యొక్క స్వరూపము ను ముందు అలోచనలో సృష్టించుట
- నమ్మకము = విశ్వాసము + విషయ పరిజ్ఞానము + కావలసిన వనరులు (మనీ, మనుష్యులు) సమకూడుట
- విశ్వసనీయత = నమ్మకము + కార్య సిద్ది (నిర్మించిన, ముగించిన పనులను ఇతరులు నమ్ముట)
విశ్వాసమునకు కర్తయైన దేవుని దగ్గరకు చేరితే, ఆయన విశ్వాసమును తప్పకుండా దయచేయును. విశ్వాసము గలవానికి ఈ భూమిమీద అసాధ్యమైనది ఏదియు లేదు.
ప్రభువైన యేసుక్రీస్తు స్ఠాపించించిన దైవ రాజ్యము పై మనకు పూర్తి విశ్వసనీయత ఉంది. అయితే మనకింకా పరలోక రాజ్యము అనాది స్థితిలోనే ఉన్నది. కొంతమంది భక్తులు ఆత్మపూర్ణులై పరలోక రాజ్యమును చూచి వచ్చినారు గాని, ఆ రాజ్యములోనికి ఇంకా ప్రవేశించలేదు గనుక ప్రత్యక్ష అనుభవములో లేదు.
దైవరాజ్యము యెడల ఎంత నమ్మకము ఉందో, పరలోకరాజ్యము యెడల అంత విశ్వాసము ఉండుటయే రాకడ విశ్వాసము.
మన శరీరమును పరిశుద్ధ వాక్య, విశ్వాసముతో పెంచితే, దీనిలో మహిమ శరీరము దాగి ఉన్నది. రెండవ రాకడలో దీని స్వరూపము, వైభవము బయలుపడును.