Mungamuri Devadasu Ayyagaru - ముంగమూరి దేవదాసు అయ్యగారు
Founder of Bible Mission
ముంగమూరి దేవదాసు అయ్యగారు 1840 లో జేగురుపాడు అనే ఊరిలో జన్మించి, 120 సంవత్సరములు జీవించి, ఆయనకు ఊహ తెలిసినప్పటి నుండి ఆద్యాత్మిక భావాలతో దైవ మరియు మనుష్య మన్ననలను అందుకొన్నారు. ఈయన తన జీవితకాలములో సిరిని ముట్టలేదు, పరిశుద్ద బ్రహ్మచారిగా, యోగిగా, ఋషిగానే యుండి దేవ సాన్నిధ్యాన్ని ప్రత్యక్షముగా చూడడమే కాక, తన అనుచరులకు రాజమండ్రి సమీపమున గల "సూది కొండ" అను ప్రదేశములో ఆ ప్రత్యక్షతను చూపించారు. హిమాలయాలలోని కైలాస మహర్షి, సాదు సుందర్ సింగ్ లాంటి భక్తులతో ఆత్మీయంగా సంభాషించేవారు. జీవము, పరిశుద్ధత, సత్యము, ప్రేమ, దైవ భయము, భక్తి, దైవ నీతి అను లక్షణములతో నిత్యమూ, సర్వాంతర్యామిగా, సర్వశక్తిమంతుడుగా వెలుగుచున్న దేవుడు, ఆయన మార్గమును స్థిరపర్చిన యేసు క్రీస్తు, మరియు ఇప్పుడు మనలను ఆధరించి, బలపర్చి సర్వసత్యములోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ; అను త్రియేక దేవుని తెలుగు ప్రజలకు విపులముగాను, శక్తివంతముగా ప్రకటించారు. ఈయన గుంటూరు జిల్లాలోని, పెదకాకాని అను ఊరిలో చివరి జీవితము గడిపి, దైవ జ్ఞానము, సంపూర్ణ స్వస్థత, పరలోక అనుభవములతో తన పరిచర్యను కొనసాగించారు.
దేవుడు ముంగమూరి దేవదాసు అయ్యగారికి ఆద్యాత్మిక సాహిత్య వేదికగా పేరొందిన రాజమహేంద్రవరములో ది.వి 31 జనవరి, 1938 సంవత్సరంలో బైబిలు మిషనును బంగారపు అక్షరాలతో గాలిలో చూపించి, మునుపెన్నడూ లేని నూతన దైవ సన్నిధిని ప్రపంచానికి అందించమని ఆజ్ఞాపించారు. దేవుడు తెలుగు ప్రజలకు దైవ సంబంధమైన నూతన సంస్క్రతి, ఆధ్యాత్మిక అనుభవము, సహవాసాన్ని బైబిలు మిషను ద్వారా పరిచయం చేసారు. దేవదాసు అయ్యగారు దైవ జ్ఞానానికి, బైబిలు సారాంశమతటికి సరిపడు కీర్తనలు, పద్యాలు, భజనలు, అనేక మర్మములు గల దైవ సాహిత్యాన్ని తెలుగులో రచనలు చేసారు. ఆయన హిందూ దేశ ప్రతిభను, కళలను బ్రిటిష్ మరియు ఆమెరికన్ దేశీయులకు, క్రిష్టియన్లకు, మిషనరీలకు, ప్రజలకు మన స్వాతంత్రానికి ముందు, తర్వాత చాటి చెప్పారు. అంతేగాక భూలోకమంతటికి నిజమైన దైవ సందేశం అందించడానికి భారతదేశము ప్రదానము అని, ఎక్కడా లేని దైవ భక్తి, ఆధ్యాత్మిక ఛింతన ఈ దేశంలోనే గలదని ఆనాటి విదేశీయులకు తన రచనల ద్వారాను, ముఖాముఖి చర్చల ద్వారా తెలియజేసారు. బైబిలు మిషను మరియు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సంగీత విలువలతో కర్ణాటిక, హిందూస్తానీ, కాపి రాగ తాళాలతో, పద్యాలు అందరికి సుళువుగా అర్ధమయ్యే చందస్సుతో రచించారు. అత్యాధునిక, అద్వితీయ ఆత్మీయ శాస్త్రవేత్తగా అనేక బైబిలు వ్యాఖ్యానములు ప్రభువు సన్నిధిలో అందుకొని భోదించగా అనేక క్రీస్తు ప్రభువు భక్తులు నోట్ చేసుకొని భద్రపరుచుకొన్నారు.
దేవుడు ఈ భూమిని దర్శించినప్పుడు ఆయా ప్రాంతాలలో కొంతమంది ఋషులు, ప్రవక్తలు లేచి అక్కడి స్థితి గతులను సంస్కరించడం ద్వారా ఆయా దేశాలలో శాంతి, సమాధానం మరియు ఊహకందని అభివృద్ధి జరిగింది. దేవుడు, దేవదాసు అయ్యగారికి అందించిన రచనల ప్రకారం, దేవుడే తన ఆత్మను స్వదేశీ యోగులకు నింపి వారి వారి స్వభాషలో దైవసంకల్పమును నరులకు తెలియజేయడం ద్వారా మానవ సమాజంలో శాంతి సామరస్యాలను నెలకొల్పి, తద్వారా మానవాత్మలకు రక్షణ దయచేసి వారికి పరలోక భాగ్యమును అనుగ్రహించాడు. దైవ భక్తి, దైవారాధన, నాగరికత ఈ భారత దేశములో తప్ప, మరి ఏ దేశములో కూడ నిలకడగా కనిపించదు. కాని దేవుడు అందించిన అనేక దర్శనాలు, వాగ్దానాలు అర్దం చేసుకొనడంలోను, ఆచరించడంలోను కొంత ఆంధోళనలో మన దేశం కొన్ని వేల సంవత్సరాలు అనేక ఒడిదుడుకులకు లోనయింది. ఇటీవల కాలములో దేవుడు భారత దేశమును ప్రేమించి అనేకమందికి తన ఆత్మను కుమ్మరించి శాశ్వత మార్గాన్ని స్థిరపరచడానికి కొంతమందిని ఏర్పరుచుకొన్నాడు. వారిలో మహాత్మ గాంధీజి, రామకృస్ట పరమహంస, స్వామి వివేకానంద ... ఇంక అనేక స్వాతంత్ర సమరయోధులు ప్రముఖులు. అదే కాలములో దేవుడు తన సంపూర్ణ ఆత్మను, శక్తిని ముంగమూరి దేవదాసు అయ్యగారిలో నింపి; దైవ శక్తి సంపూర్ణతను, సత్యమును భోధించి అనేకమందికి, మతములకు వెలుగుగా వుంచారు.
దేవదాసు అయ్యగారు గొప్ప దేశభక్తులు. అందుకే అయ్యగారు మన దేశ సౌభాగ్యముకొరకు, అభివృద్ధి, నాగరికత కొరకు బహుగా ప్రార్ధించగా; దేవుడు మన దేశమునకు మంచి వాగ్ధానములు దయచేయగా వాటిని పాటలలో, పద్యములలో పొందుపర్చారు. అయ్యగారి రచనలలో భారతదేశ స్థితిగతులను గూర్చి, రాకడ సమయములో బైబిలుమిషను పోషించవలసిన పాత్ర గురించి వివరముగా వ్రాసిరి.
భూలోకమంతటికి సువార్త అందించడములో భారత దేశం ప్రధానమని దేవదాసు అయ్యగారు చెప్పారు. ఇతర దేశ సొమ్ము ఈ దేశ ఆధ్యాత్మికతకు అవసరం లేదని, అంత్య కాలములో భారతదేశములో నుండే అనేక సువార్తికులు ఇతరదేశములకు వెళ్ళి సువార్త ప్రకటించి వారిని ఆదరిస్తారని ప్రవచించారు(ఇప్పటికీ బైబిలు మిషను సువార్తికులు ఇతర దేశ ఆర్ధిక సహాయము లేకుండా మన దేశమునుండి వెళ్ళి అనేక దేశాలకు సువార్త ప్రకటించుచున్నారు).
సర్వేజన సుఖినోభవంతు; ఏ మతమును గాని, ఏ మనుష్యుని గాని ద్వేషించరాదు, దూషించరాదు. తెలియని విషయములు దేవునినడిగి తెలుసుకొనండి అని భోధించిన బైబిలు మిషనును ప్రపంచానికి చూపినపుడు, అందరికి సంపూర్ణ జీవితం ప్రసాదింపబడును. దేవుడు అందరికి కనబడి(ప్రత్యక్షపరచుకొని) మాట్లాడును అను సత్యమును నిజముగా నిరూపించిన దేవుని దూత అయ్యగారు.
మిషను సారాంశము: దైవావేశం వలన వ్రాయబడిన సత్య గ్రంథమే బైబిలు. బైబిలులో యేసు క్రీస్తు ప్రభువు ఋజువులతో నిరూపించి, నేర్పించిన భక్తి మార్గమే సత్య మార్గము. క్రీస్తు మతము దైవ మతము. ప్రభువైన యేసుక్రీస్తు మనకొరకు ఈ భూమిమీద అవతరించి, ప్రాణముపెట్టి, తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై, తన పరిశుద్ధాత్మను విశ్వాసులకు ధారబోయుచున్నారు. త్వరగా రానైయున్న ప్రభువుయెదుట సంపూర్ణులమై నిలుచునట్లు అనుదినము దైవ సాన్నిధ్యమును అనుభవించుచు రాకడ కొరకు సిద్ధము చేయుటయే బైబిలు పని (మిషను).