తుఫాను పాట (బుర్రకథ)

రచన: ముంగమూరి దేవదాసు అయ్యగారు

మరాటి పాట రాగము చాయ : బళానోయ్ బళ తమ్ముడా

మత్తయి 8:23-27, మార్కు 4:35-41 లూకా 8:22-25

మాతృ భూజనులార వినండి జై
మహనీయమౌ కథ వినరండి జై
భూలోకమునకు మధ్యను జై
పాలెస్తీనా దేశమున్నది జై
పాలెస్తీనా మధ్యను జై
గలిలయ జిల్లా యున్నది జై
గలిలయ జిల్లాకు మధ్యను జై
ఘనమైన కోనేరున్నది జై
ఆ కోనేటి మధ్యను జై
ఒక చిన్న దోనె యున్నది జై
ఆ చిన్న దోనె మధ్యను జై
పన్నెండు మంది యుండిరి జై
పన్నెండు మంది మధ్యను
శ్రీయేసు క్రీస్తు వారుండిరి
జై
విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము
వివరముగా (రెండుసార్లు)
జై
ఆ కోనేటి పొడుగును జై
చూడగ పన్నెండు మైళ్ళు జై
దాని వెడల్పు చూడగ జై
ఏడు మైళ్ళ దూరముండును జై
అందుకే ఆ దేశ వాసులు జై
దానిని సముద్రమన్నారు జై
తిబెరియ సముద్ర మన్నారు జై
దానిని మరియొక నామము జై
గెన్నెసరెతు సరస్సు జై
ఆ కోనేటి చుట్టును జై
ఆ గొప్ప మడుగు చుట్టును జై
ఆ పెద్ద చెరువు చుట్టును జై
ఆ నీటి గుంట చుట్టును జై
గ్రామాలు పట్నాలు ఉన్నవి జై
తోటలు మెండుగ నున్నవి జై
చలువ కోసము ఊళ్ళ వాసులు జై
ఎండకాలమందు అక్కడా
ఉండుట కెంతో వీలగును
జై
విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము
విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము
జై
యేసుని బోధ వినుటకై జై
ఊళ్ళ ఊళ్ళ నుండి వచ్చిరి జై
నీటి యొడ్డున యేసు నాధుడు జై
నిలుచుటకు వీలు లేదాయె జై
గనుక దోనె యెక్కి కూర్చుండి జై
ప్రజలకు ఆయన బోధించె జై
ఆ సముద్రంబు మీదను జై
జాలర్లు దోనెలు నిత్యము జై
వృత్తి మీదను ఆడు చుండెను జై
ఒడ్డున చిన్న చిన్న దోనెలు జై
కట్టివేయబడి యున్నవి జై
దోనె ప్రసంగ పీఠము జై
అయినది యేసు ప్రభువునకు జై
పాలెస్తీనా దేశమంతయు జై
యూదులకు దేవుడిచ్చెను జై
యూదులకు దైవ జనాంగము జై
పరజనులు కూడా ఉన్నారు జై
ఆ పాలెస్తీనా దేశము జై
పాలు ప్రవహించిన దేశము జై
పచ్చిక గల దేశము జై
పశువులకు మేతున్న దేశము జై
ఆ పాలెస్తీనా దేశము జై
తేనె ప్రవహించిన దేశము జై
ఏ డొంక చూచిన తేనె పట్టుండు జై
ఏ చెట్టు చూచిన తేనె పట్టుండు జై
పాలు తేనెలు పారు దేశము జై
ఫల భరితమైన దేశము జై
ఆ దేశమందు జరిగినా కథ
చెప్పుదు నాలకించండి
జై
విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము
వివరముగా (రెండుసార్లు)
జై
సాయంత్రము పడినప్పుడు జై
శ్రీ యేసు క్రీస్తు రక్షకుడు జై
పన్నెండుగురి శిష్యులం జూచి జై
దోనెక్కి అద్దరికి వెళ్ళుదము జై
అని చెప్పగా వారు విన్నారు జై
యేసు ముందె దోనె యెక్కెను జై
శిష్యులా వెనెక యెక్కిరి జై
క్రీస్తువారు వెంట వెళ్ళుట జై
వారికి ఆచారమైయుండె జై
ఇప్పుడెకాదు ఎప్పుడు జై
యేసుని వెంబడించుట జై
వారికి ఆనంద కార్యము జై
మనముకూడ ఆరీతిగా జై
క్రీస్తువెంట వెళ్ళువాడుక జై
గలిగియుండుట గొప్ప క్షేమము జై
ఆయన నీటిపై వెళ్ళిన జై
వారును నీటిపై వెళ్ళిరి జై
ఆయన పర్వత మెక్కిన జై
వారును పర్వత మెక్కిరి జై
ఆయన ఊళ్ళోకి వెళ్ళిన జై
వారును ఊళ్ళోకి వెళ్ళిరి జై
ఆయన అడవికి వెళ్ళిన జై
వారును అడవికి వెళ్ళిరి జై
ఆయన ఎక్కడికి వెళ్ళిన జై
తీసుకొనివెళ్ళెను వారిని జై
అక్కడికి వెళ్ళుచుండిరి జై
గనుక ఈ వేళ ఆయన జై
దోనె యెక్కంగ వారును జై
అదోనె యెక్కి వెళ్ళిరి జై
మనమును ఆరీతి చొప్పున జై
క్రీస్తువెంట వెళ్ళవలయును జై
గొల్లబోయెడు తన గొర్రెలన్ జై
రాళ్ళును, ముండ్లును ఉన్నట్టి జై
చోటికి నడిపించి యున్నచో జై
అవికూడా ఆదారి వెళ్ళును జై
పచ్చిక, నీళ్ళున్న చోటికి జై
నడిపించిన యెడల అవియును జై
అక్కడికై వెంట వెళ్ళును జై
ఎక్కడికి వెళ్ళిన కాపరి జై
ఉండును గనుక వాటికి జై
భయమేమాత్ర ముండదు జై
అవి తమ కాపరిని చూచి జై
వెళ్ళును గనుక నిర్భయముగ
కథలోనికి వెళ్ళిపోదాము
జై
విన్నారా మీరందరు శ్రీయేసుని వాక్యము
వివరముగా (రెండుసార్లు)
జై
శిష్యులు దోనె త్రోసిరి జై
తెడ్డువేసి నడ్పుచుండిరి జై
దోనె చక్కగ వెళ్ళుచున్నది జై
కోనేరు నెమ్మదిగ ఉన్నది జై
ఇంతలో యేసునాధుడు జై
అమరము మీద తలగడ జై
వేసుకొని నిద్ర బోయెను జై
దినమంత బోధించినందున జై
అలసి అలసి యున్నారు జై
గనుక వెంటనె నిద్ర పట్టెను జై
ఆయన ఆమరము మీదను జై
తల వాల్చుకొని నిద్రపోయెను జై
అంతలో ఏమి జరిగెను? జై
కొంత దూరము దోనె వెళ్ళగ జై
గాలికొండల సందుగావచ్చెను జై
ఆ సముద్రము మీద వీచెను జై
క్రమముగా ఆ గాలి రేగగా జై
కెరటాలు అధీక మాయెను జై
అవి దోనెను కొట్టుచుండెను జై
క్రిందకి పైకి ఆ దోనె జై
దిగుచు ఎక్కుచు నుండెను జై
ఈ ప్రక్క కాప్రక్కకా దోనె జై
ఊగిసలాడు చుండెను జై
ఇది వినగా నా కొక్కటి జై
తోచినది అది ఏమనిన జై
దోనెలో ఉన్న శిష్యుల జై
మీద గాలి తిరుగబడిన్నది జై
మానవులు పాపాత్ములగుటచే జై
సృష్టి వారిని ఎదిరించెను జై
గాలి లేకుండా బ్రతుకుట జై
కష్టంబుగాదా ప్రియులారా! జై
మన మేలు కొఱకే దేవుడు జై
గాలిని కలుగజేసెను జై
మనము పాపాత్ములమౌటచే జై
గాలి వల్ల మనకు నష్టము జై
ఎంతయు కల్గుచున్నది జై
గాలి వల్లనె దోనెల్ ముల్గును జై
దోనెలోనివారు చత్తురు జై
గాలి వల్లనె యిండ్లు కూలును జై
అందువల్ల నరులు చత్తురు జై
మేలుచేయు గాలి మనమీద జై
తిరుగబడినందున ఆపద జై
అపద పైన అపద జై
గాలివల్లనె నీళ్ళు కదిలినవి జై
కెరటాలు పైకి లేచినవి జై
దోనెలు కొట్టుచునుండెను
ఆప్రక్క ఈప్రక్క దెబ్బలే
జై
విన్నారా మీరందరూ శ్రీయేసుని వాక్యము
వివరముగా (రెండుసార్లు)
జై
ఆ సముద్రము పొంగి పొర్లెను జై
రుస రుస మనుచు వచ్చెను జై
నురుగులు కట్టుచు వచ్చెను జై
కోపముతో మింగివేయును జై
వచ్చునా యన్నట్టు వచ్చెను జై
దోనెలో ఉన్న శిష్యుల జై
మీద నీళ్ళు తిరగబడినవి జై
మానవులు పాపాత్ములగుటచే జై
సృష్టి వారిని ఎదిరించెను జై
నీళ్ళు లేకుండా బతుకుట జై
కష్టంబు కాదా ప్రియులారా జై
మన మేలు కొఱకె దేవుడు జై
నీళ్ళను కలుగజేసెను జై
మనము పాపాత్ములమౌటచే జై
నీళ్ళు వల్ల మనకు నష్టము జై
ఎంతయు కల్గుచున్నది జై
నీటి వరదకు ఇండ్లు కూలును జై
నీటి వరదకు చేలు పోవును జై
నీటివరదకు నరులు చత్తురు జై
కధలోకి తిరిగి వెళ్ళుదము జై
విన్నారా మీరందరూ శ్రీయేసుని వాక్యము
వివరముగా (రెండుసార్లు)
జై
గాలిని నీటిని శిష్యులు జై
ఎదిరించి తెడ్లు వేసిరి జై
నీటి ప్రయాణము వారికి జై
అలవాటె వారు జాలర్లు జై
నీటి కాకులు కదా వారలు జై
మునిగిన తేలి రాగలరు జై
తేలియాడుటకు మునిగి పోగలరు జై
ఈది ఒడ్డునకు రాగలరు జై
మునిగి ఎన్నడు వారు చావరు జై
చేపలు పట్టుకొను వారలు జై
చేపవలె ఈదికొని రాగలరు జై
గాలి అన్న వారు బయపడరు జై
అయినను వారు ఈవేళ జై
చాల భయపడి పోయిరి జై
నావ మునిగి నశించును జై
మనము మునిగి నశింతుము జై
నీటి తుఫాను మనలను జై
బ్రతుక నియ్యదని వారికి జై
జంకు తోచినది ఆ రాత్రి
హడలి పోయినారు వారంతా
జై
విన్నారా మీరందరూ శ్రీయేసుని వాక్యము
వివరముగా (రెండుసార్లు)
జై
పేతురు భయపడినాడు అయ్యయ్యో! జై
ఆంద్రెయ జడిసెను అయ్యయ్యో! జై
యాకోబు బెదరెను అయ్యయ్యో! జై
యోహాను జంకెను అయ్యయో! జై
పిలిప్పునకు భీతి అయ్యయ్యో! జై
బర్తలోమయి వణకె నయ్యయ్యో! జై
తోమాకు సందియ మయ్యయ్యో! జై
మత్తయి కృంగెను అయ్యయ్యో! జై
యాకోబు కధైర్య మయ్యయ్యో! జై
తద్దయికి దిగులయ్యయ్యో! జై
ఇస్కరియోతు యూదా సరేసరి జై
అల్లకల్లోలము అయ్యయ్యో
వెర్రికేకలు వేసిరయ్యయ్యో!
జై
విన్నారా మీరందరూ శ్రీయేసుని వాక్యము
విన్నారా మీరందరూ శ్రీయేసుని వాక్యము
జై
దోనెలో ప్రభువు ఉన్నారు జై
వారున్న దోనెలో ఉన్నారు జై
చెంతనె ప్రభువు ఉన్నారు జై
వారికింత భయము ఎందుకు జై
ప్రభువు ఉన్న నావ మునుగునా? జై
ఏమి వెర్రి యిది వీరికి జై
గాలి దేవుని కూల్చివేయునా? జై
నీళ్ళు దేవుని ముంచివేయునా? జై
మన కెన్నియో కష్టముల్ వచ్చును జై
మ్రింగివేయునట్లు కనబడును జై
నిజముగా మనలను మ్రింగునా? జై
ప్రభువు వారిని మ్రింగనిచ్చునా? జై
కష్టాలలో కాపాడడా? జై
ఇంత గొప్ప పిరికితనమెందుకు? జై
గాలి తుఫాను కష్టంబులు జై
రాబట్టి శిష్యులు ప్రార్థించిరి జై
గాలి తుఫాను వారిచే జై
ఎట్లయిన ప్రార్ధన చేయించె జై
మన కష్టములు మన చేతను జై
ప్రార్థన చేయించి తీరును జై
అశ్రద్దగా ఉన్న వేళను జై
కష్టాలు ప్రార్ధన చేయించు జై
కాబట్టి కష్టాలు వచ్చిన జై
విసుగక ప్రార్థన చేయండి జై
అప్పుడా కష్టాలు గతియించు జై
దైవ భక్తిని గానవచ్చును
విశ్వాసము వృద్ధినొందును
జై
విన్నారా మీరందరూ శ్రీయేసుని వాక్యము
వివరముగా (రెండుసార్లు)
జై
ఇక్కడొక సంగతి నాకిట్లు జై
తోచుచు ఉన్నది ప్రియులారా! జై
ఆదికూడ మీరాలకించండి జై
లోకము కోనేటి వంటిది జై
దోనె క్రీస్తుమతము వంటిది జై
గాలి మన కష్టాలు వంటివి జై
కెరటాలు కష్టాలు వంటివి జై
క్రైస్తవ మత సంఘమున్నది జై
ఈ లోకమున బైలుదేరినది జై
ఇద్దరిని బైలుదేరినది జై
అద్దరికి వెళ్ళవలసియున్నది జై
మోక్షలోకము వెళ్ళవలసినది జై
ఈ లోగా ఎన్నో కష్టాలు జై
ఈ లోగా ఎన్నో శోధనలు జై
ఎన్నెన్నో గొప్ప ఆపదలు జై
మనలను జడిపించు సంగతులు జై
సందేహము గలిగించు అడ్డాలు జై
ఉపకారియైనట్టి గాలియు జై
అపకారియై పోవుచుండును జై
ఉపకారియైన నీరును జై
అపకారియై పోవుచుండును జై
ఆధారమైయున్న దోనేయు జై
మునిగిపోవునట్లుండును జై
మన మనుకున్నదంతయు జై
మునిగిపోవునట్లుండును జై
సంఘము మునుగునట్లుండును జై
సంఘస్టులకు భీతి కల్గును జై
శిష్యులు ఎటువంటి వారలు జై
అద్భుతాల్ చూచిన వారలు జై
క్రీస్తు బలమెరిగిన వారలు జై
యేసు దయ ఎరిగిన వారలు
అయినను ఎంతో జడిసిరి
జై
విన్నారా మీరందరూ శ్రీయేసుని వాక్యము
వివరముగా (రెండుసార్లు)
జై
మన కథకూడ అంతేను జై
ఎన్ని బోధలు విన్న జడుపెగా జై
ఎన్ని వింతలు చూచిన మరుపెగా జై
ప్రభువున్నట్లు ఎరిగిన భయమెగా జై
కష్టాలు రాగానె కలతెగా జై
అపదలు రాగానె అడ్డులుగా జై
చిక్కులు రాగానె చింతగా జై
చావు రాకముందు చావుగా జై
ఏమని చెప్పుదు మనవార్తా
కథలోనికి తిరిగి వెళ్ళుదము
జై
విన్నారా మీరందరూ శ్రీయేసుని వాక్యము
వివరముగా (రెండుసార్లు)
జై
శిష్యులు కేకలు వేసిరి జై
యేమని కేకలు వేసిరి జై
కొందరేమని అరచిరి? జై
ఓ బోధకుడా! మేమిదిగో జై
నశియించి పోవుచున్నాము జై
నీ కేమియు చింత లేదా? జై
ప్రభువా నశించుచున్నాము జై
అని యిట్లు కొందరు అరచిరి జై
విన్నారా వీరి ప్రార్థనలు జై
విన్నారా వీరి శబ్దాలు జై
విన్నారా వీరి అరుపులు జై
వారిమొరలు పరికింపగ జై
మనకేమి తోచుచున్నది జై
చింత లేదా అని అడిగిరి జై
ప్రభువును అట్లు అనవచ్చునా? జై
ఆయనకు చింత ఉండడా! జై
ఆయనకు జాలి ఉండదా! జై
కష్టములో ఉన్నవారిని జై
చూడగ కనికరింపడా? జై
శిష్యులు మునిగిపోవుట జై
గురువైన యేసున కిష్టమా? జై
వారి మొరలు పరికింపగ జై
మన కేమి తోచుచున్నది జై
మేము నశించు చున్నాము జై
అని కేకలు వేసి యున్నారు జై
నిజముగ నశించు చున్నారా? జై
వారి భయమేగాని వారలు జై
ఎప్పటికి నశింపరు జై
ప్రభువుండ ఎట్లు నశియింతురు జై
సంఘములో ప్రభువుండగా జై
సంఘమెట్లు నాశనమౌను? జై
మనలో ప్రభువు ఉండగా జై
మనమెట్లు నాశనమౌదుము?
ప్రియులారా మరియొక సంగతి
జై
విన్నారా మీరందరూ శ్రీయేసుని వాక్యము
వివరముగా (రెండుసార్లు)
జై
జోరుగ గాలి రేగిన జై
కెరటాలు దోనెను కొట్టిన జై
యేసు దోనెలో నీరు చేరిన జై
హాయిగ నిద్ర పోయెను జై
ఇట్టి నెమ్మది మనకున్నదా! జై
గాలిలో దయ్యాలు రేగిన జై
దయ్యాలు దరికి వచ్చినా జై
కష్టంబులు దండెత్తినా జై
ఇట్టి నెమ్మది మనకున్నదా? జై
వాటిని లెక్కచేయని జై
యేసు నెమ్మది మనకున్నదా? జై
క్రీస్తు నెమ్మది మనకున్నదా? జై
అవి నన్ను ఏమి చేయును జై
ఇవి నన్ను ఏమి చేయును జై
వారు నన్నేమి చేతురు జై
వీరు నన్నేమి చేతురు జై
ప్రభువుండగ నాకు భయమేమి జై
అని మనము నిర్భయంబుగ
ఉండగలమా ఏమి చెప్పండి
జై
విన్నారా మీరందరూ శ్రీయేసుని వాక్యము
వివరముగా (రెండుసార్లు)
జై
శ్రీ యేసునాధుడు దేవుడు జై
ఆయన దైవత్వమునకు జై
శిష్యుల కష్టముల్ తెలుసును జై
వారి ప్రయత్నముల్ ఎరుగును జై
వారి నవి చేసుకొన నిచ్చెను జై
వారి యత్నము నేరవేరదు జై
అప్పుడాయన శక్తి చూపును జై
తాను దేవుండని చూపును జై
అంతవరకు ఊరుకొన్నాడు జై
తమ శక్తి చాలదని శిష్యులు జై
తెలుసుకొను పర్యంత మాయెన జై
ఊరుకొన్నాడు ఎరుగనట్టుగ జై
మనకు కష్టాలు రాగానె జై
ప్రభువు తొలగింపడు వెంటనె జై
అంతలోనె మనము విసుగక జై
సహాయము చేయు వరకును జై
ప్రార్ధన చేయు చుందుము జై
ఇంకొక్కటి ఆలకించండి జై
శిష్యులందరుకూడి ప్రార్ధన జై
చేయువరకు ఊరుకొన్నాడు జై
అందరికి ఆపద గనుకనె జై
అందరు ప్రార్ధింప వలయును జై
అంతవరకూ ఊరుకున్నాడు జై
దేశ ఆపదలు చూచి మనమును జై
దేవస్థులమైన మనమును జై
అందరము ప్రార్దింపవలయును జై
అప్పుడు అపద తప్పిపోవును జై
సంఘ ఆపద కాలమందును జై
సంఘమంతయు కలసి ప్రార్థన జై
జేసిన ఆపద తొలగును జై
గ్రామ ఆపద కాలమందున జై
గ్రామ మంతయు కలసి ప్రార్థన జై
చేసిన ఆపద తొలగును జై
ఇంటి ఆపద కాలమందున జై
గృహవాసు లందరు ప్రార్థన జై
చేసిన ఆపద తొలగును జై
కష్ట కాలమందు మనమును జై
ప్రయాస పడుచు నుండుగ జై
ప్రభువు ఊరుకున్నట్టు తెలియును జై
అదివరకు మన హృదయము నందున జై
ఉన్న విశ్వాస మప్పుడే జై
ప్రభువు పరీక్షీంచి చూచును జై
ఎప్పటికి ఊరుకొని యుండడు జై
యుక్త సమయమందు ఆయన జై
మన కష్టములు తొలగించును జై
అప్పుడు మన మనస్సునందున జై
సంపూర్ణ శాంతి లభించును జై
ఇంకొకటి తిలకించండి జై
ప్రభువు నిద్రపోవుచుండెను జై
మనవలె నిద్రించు చుండెను జై
ఆయన మన నిమిత్తమైన జై
మానవుండైన దేవుడు జై
కాబట్టి నిద్ర అవసరం జై
మనము నిద్రయందు ఉండగ జై
బైట సంగతులు తెలియవు జై
ఆయన మానవుడు గనుకను జై
శిష్యుల బాధలు తెలియవు జై
ఆయన దైవత్వమునకు జై
శిష్యుల ఆపదలు తెలుసును జై
ఆయన మానుషత్వమునకు జై
శిష్యుల ఆపద తెలియదు జై
కేక వేసిన శిష్యులు జై
నింద మాటలు మాట్లాడుచు జై
ఆయనను లేపి వేసిరి జై
అప్పుడు ఆయన లేచెను జై
గాలి కాయన లేవలేదుగా జై
ధూళి కాయన లేవలేదుగా జై
అలల కాయన లేవలేదుగా జై
వరద కాయన లేవలేదుగా జై
దోనె సడికి లేవలేదుగా జై
తెడ్లసడికి లేవలేదుగా జై
శిష్యుల కేకకు లేచెను జై
శిష్యుల ప్రార్ధనకు లేచెను జై
శిష్యుల మొరలకు లేచెను జై
ఇదియేమి చిత్రమో గాని జై
ఎన్ని లేపిన లేవలేదుగా జై
వారు లేపంగ లేచెను జై
తండ్రి సంగతులిట్టులుండును జై
కోడి కూసిన తల్లి లేవదు జై
పిల్లి కూసిన తల్లి లేవదు జై
కుక్క అరచిన తల్లి లేవదు జై
నక్క కూసిన తల్లి లేవదు జై
పిల్ల మెదిలిన తల్లి లేచును జై
తల్లి ప్రేమయిట్టు లుండును జై
దైవ ప్రేమ యిట్టులుండును జై
నరులు మొర్ర పెట్టగ జై
దేవుడు వచ్చి సహాయము చేయును
కథలోనికి వెళ్ళిపోదాము
జై
విన్నారా మీరందరూ శ్రీయేసుని వాక్యము
వివరముగా (రెండుసార్లు)
జై
శిష్యుల ప్రార్ధన శ్రీయేసు జై
అలించి మేల్కొని నిల్వంగ జై
రెండు తుఫానులు ఎదురాయె జై
అవి ఎమిటో మీకు తెలుసునా జై
నీళ్ళను ప్రేరేపించిన జై
గాలి తుఫాను ఒక్కటి జై
అది మీకు ఇదివరకె తెలుసును జై
ఇంకొక తుఫాను ఉన్నది జై
ఇది ఏమిటో మీరు చెప్పండి జై
శిష్యుల హృదయమునందున జై
ఉన్నట్టి గందర గోళము జై
రెండవ తుఫానై యున్నది జై
మొదటి తుఫాను కెంటెను జై
రెండవదె గడ్డు యైనది జై
మొదటి తుఫాను వేళను జై
గాలి భయంకరమైనది జై
రెండవ తుఫానప్పుడు జై
చింత భయంకరమైనది జై
గాభర భయంకరమైనది జై
నిరాశ భయంకరమైనది జై
దేవుడు మానవుని గురువును జై
ఉపకారియునైన ప్రభువును జై
నిందించుట ఎన్నటికిని జై
మించిపోయిన తుఫానుగ జై
అందుచేతను యేసునాధుడు జై
మొట్టమొదట తన శిష్యులన్ జై
గద్దించి జ్ఞానము చెప్పెను జై
వారిలోనున్న తుఫాను జై
హానికరమైన తుఫాను జై
ఏమని గద్దించి యుండెను? జై
ఓ అల్ప విశ్వాసులారా! జై
ఎందుకు జడియు చున్నారు? జై
మీ విశ్వాసము ఎక్కడా? జై
అని ఈ రీతిగా ప్రభువు జై
వారిని గద్దించినాడు జై
ప్రభువు పన్నెండు మందిని జై
గద్దించినప్పుడు వారికి జై
ఏమియు కోపము రాలేదు జై
ఏ మాత్రమును సణుగుకొనలేదు జై
గద్దెంపుకు లోబడినారు జై
మన బలహీనతల్ దేవుడు జై
చూచి గద్దించినప్పుడు జై
మన మేమియు సణుగకూడదు జై
ఆయన గద్దింపు వల్లను జై
మనకు మేలే సమకూడును జై
బాగుచేయుటకే దేవుడు గద్ధించు జై
తను నమ్మువారిని జై
భయముకూడ తప్పిదంబే జై
అని మనము ఈ కథ యందున జై
నేర్చుకొనుచున్నాము గాన జై
దేవుని స్తోత్రించుదము జై
అపనమ్మికయను గుణమె జై
భయమునకు పుట్టిల్లు నుండి జై
ఆ యిల్లు విడువంగవలయు జై
భయవపడుచున్న మనలను జై
చింతించుచున్న మనలను జై
నిందించుచున్న మనలను జై
నమ్మకున్నట్టి మనలను జై
నేడును ప్రభువు గద్దించును జై
తర్వాత ఏమి జరిగినది జై
గాలిని గద్ధించినాడు జై
నీటిని గద్దించినాడు జై
గాలి సద్దణగి పోయెను జై
నీటిపొంగు అణగి పోయెను జై
అంతయు నిమ్మళమాయెను
కథలోనికి తిరిగి వెళ్ళుదము
జై
విన్నారా మీరందరూ శ్రీయేసుని వాక్యము
వివరముగా (రెండుసార్లు)
జై
గాలియు, నీరును అణుగగా జై
శిష్యుల కాశ్చర్యమాయెను జై
ఏమని చెప్పుకొన్నారు జై
ఈయన ఏలాటి ఆయన జై
గాలియు సముద్రము వీరికి జై
లోబడి పోవుచున్నవి జై
అని యిటుల చెప్పుకొనిరి జై
గాలికి నీళ్ళకు ఈయన జై
అజ్ఞాపింపగా లోబడె జై
ఈయన ఎవ్వరో ఎవ్వరో జై
క్రీస్తు శక్తిని చూచి శిష్యులు జై
ఎంతయు ఆశ్చర్య మొందిరి జై
మీరు యేసు మహిమను జై
ఎప్పుడైనను చూచియుండి జై
ఆయన విషయమందున జై
మీరెట్టి సాక్ష్య మిత్తురు జై
ప్రియులారా వినుడి ఒకమాట జై
గాలిని, నీటిని పొంగును జై
తొలగించెను యేసునాధుడు జై
గాలిని చేసిన దెవ్వరు జై
గాలిని గద్దించినట్టి జై
శ్రీయేసు నాధుడే దానిని జై
కలుగజేసి యున్నాడు జై
లేనిచో సద్దణగి యుండదు జై
సృప్టికర్త గనుక అణిగెను జై
ఈ రెండు అద్భుతాలు ఆయన జై
చేసినందువల్లనే కదా జై
ఆయన దేవుడని తెలిసెను జై
మన కష్టములు తొలగించును జై
గాలియంత కష్టమున్నను జై
ధూళి క్రింద ఎగురగొట్టును జై
అలలంత కష్టాలు లేచిన జై
మీదికి పొర్లి వచ్చినా జై
అణచివేసి శాంతి పరచును జై
కాబట్టి ప్రియులారా మీరు జై
ప్రార్థన చేయ మానకుడి జై
ప్రార్థన విడువక చేసిన జై
ఈ లోక కష్టాలు తొలగును జై
ఈ లోక భాగ్యాలు కలుగును జై
అత్మీయ కష్టాలు తొలగును జై
పరలోక భాగ్యాలు కలుగును
కథలోనికి తిరిగి వెళ్ళుదము
జై
విన్నారా మీరందరూ శ్రీయేసుని వాక్యము
వివరముగా (రెండుసార్లు)
జై
నావ అవతల ఒడ్డు చేరెను జై
యేసు ప్రభుని ఆశ్రయించిన జై
ఆవలి యొడున చేరుదము జై
మనమున్న లోకంబు ఇద్దరి; జై
ఆ మోక్షలోకంబు అద్దరి జై
ఇద్దరి పయనామైనాము జై
అద్దరికి చేరిపోవలెను జై
క్రీస్తు మతము మన ఓడ జై
ఓడ నాయకుడు శ్రీయేసు జై
మధ్య ఎన్ని తుఫానులు జై
వచ్చిన పర్వాలేదుగా జై
ఆయనె సురక్షితంబుగ జై
మోక్షమునకు కొంచిపోవును జై
రేపో మాపో ఆయనే జై
రెండవమారు వచ్చును జై
మహిమ మేఘమెక్కి వచ్చును జై
ఆయన త్వరగా వచ్చును జై
అని సిద్దపడినవారిని జై
వారినే కొంచుపోవును జై
వారికి మరణ ముండదు జై
వారికి మహిమ శరీరము జై
ఇక్కడనే లభించును జై
ఈ పాప దేహము వెంటనే జై
అంతర్ధానమై పోవును జై
మహిమగల శరీరంబుతో జై
నూతన యెరూషలేమను జై
మోక్ష లోకంబు చేరుదము జై
అక్కడ శాశ్వత కాలము జై
అత్యానందముతో నుండి జై
ముఖాముఖిగా దేవుని జై
చూచుచు పాటల్ పాడుదము జై
తండ్రి కుమార, శుద్దాత్మ జై
అను త్రైక దేవునికి స్తోత్రంబు జై
అను త్రైక దేవునికి స్తోత్రంబు జై
అను త్రైక దేవునికి స్తోత్రంబు జై
శిష్యులకు యేసునాధుడు జై
నేర్పిన ప్రార్ధన విన్నారా జై
క్రైస్తవ సంఘము అది యిట్లు జై
చేయుచున్నది నేను చెప్పుదును జై
పరలోకమందున్న మా తండ్రీ! జై
నీ పేరు పరిశుద్ధ నీయంబు జై
నీ రాజ్యము వచ్చునుగాక జై
నీ చిత్తము పరలోక మందున్న జై
జరుగుచున్న విధంబుగా జై
భూమిపై కూడా జరుగును జై
మా జీవనోపాధియైనట్టి జై
ఆహారమును నేడు మాకిమ్ము జై
మా యెడలను నేరముల్ చేసి జై
యున్నట్టివారిని మేమెట్లు జై
క్షమింతుమో అట్లు మాకున్న జై
అపరాధముల్ క్షమియించుము జై
మమ్ముశోధనలోకి తేకుండ జై
కీడులోనుండి తప్పించుము జై
రాజ్యంబు, శక్తియు, మహిమయు జై
నిత్యంబు నీవియే తధాస్తు! జై
ప్రియులారా కథ చెప్పినాను జై
పూర్తిగా చెప్పియున్నాను జై
పాపమె నరులకు హాని జై
గాలివాన కంటె హాని జై
మునిగి పోవుటకంటె హాని జై
పాపాల వల్లనె వ్యాధులు జై
పాపాల మూలమున కరువులు జై
పాపాల మూలమున మరణము జై
పాపాల మూలమున నరకము జై
నరకమే ఆఖరుపు హాని జై
అన్నిటికంటె హాని జై
మునగకుండ తన శిష్యులన్ జై
రక్షించిన యేసునాధుడు జై
నమ్మిన వారినెల్లను జై
నరకములో పడకుండను జై
రక్షించును క్రీస్తునాధుడు జై
మోక్షలోకంబు లోనికి జై
చేర్చును ప్రభువైన యేసు జై
యేసు క్రీస్తువారి బోధ జై
వినువారలు ధన్యాత్ములు జై
ఆయనమాట ప్రకారము జై
చేయువారు ధన్యాత్ములు జై
కథ విన్నయో మిత్రులారా జై
దేవుడు దీవించు గాక!
మీకు శుభము కలుగును గాక!
జై
విన్నారా మీరందరూ శ్రీయేసుని వాక్యము    
వివరముగా (రెండుసార్లు)
జై
ఈ దోనెతోపాటు మరికొన్ని జై
చిన్నదోనెలు బైలుదేరినవి జై
ఇక్కడొక సంగతి నా మదికి జై
తోచుచు ఉన్నది ఏమనిన జై
దైవభక్తిని గోరు మతములు జై
సత్యమును వెదకెడి మతములు జై
మోక్షమును కోరెడి మతములు జై
నీతి మార్గము కోరు మతములు జై
చెడుగు విసర్జించు మతములు జై
ఈ లోకమున బైలుదేరినవి జై
మోక్షలోకము బైలుదేరినవి జై
కథ జరిగి యుండిన దోనెకు జై
వెంట వెళ్ళిన చిన్నదోనెలకు జై
గొప్ప భేధంబొకటి యుండెను జై
దీనిలో యేసుకీస్తున్నాడు జై
వాటిలో శ్రీయేసు లేడు జై
ఇదియె రెండింటికి యున్న భేధము జై
ఇది గొవ్చ బేధము గాదా? జై
ఇది గొప్ప బేధము గాదా జై
అన్ని లోకాలు చేసి జై
లోక భారము వహించి జై
మోక్ష బోధలు వినిపించి జై
తనయొద్దకు వచ్చునట్టి జై
వారి పాపాలు జబ్బులు జై
పరిహారము చేసివేసి జై
సర్వలోక పాప భారము జై
తనమీద వేసికొన్నందున జై
శిలువ మరణము పొంది జై
మరణమున్ గెల్చివేసి జై
మోక్ష లోకమునకు వెళ్ళి జై
మనకోసము ఎదురుచూచు జై
చున్నట్టి శ్రీయేసు క్రీస్తు జై
ఉన్నట్టిదీ క్రీస్తుమతము జై
లోకమంతట నీ మతము జై
స్థాపించిన బోధలన్ని జై
వినిపించుచున్న యేసు జై
ఉన్నట్టిదీ క్రీస్తమతము జై
మోక్ష మేఘమెక్కి త్వరలో జై
బహుశ మన కాలమునందె జై
వచ్చుచున్నట్టి శ్రీయేసు జై
ఉన్నట్టిదీ క్రీస్తుమతము జై
నమ్మి సిద్దంబుగానున్న జై
వారిని చావు లేకుండ జై
చేసి మోక్షమునకు వారిని జై
తీసుకొని వెళ్ళనై యున్న జై
శ్రీయేసు క్రీస్తువారున్న జై
మతమె క్రైస్తవ మతము జై
కాబట్టి ప్రియులారా మీరు జై
క్రీస్తునే పూజింతురేని జై
మోక్ష భాగ్యము మొందగలరు జై
నను కలుగ జేసిన తండ్రికి జై
శాశ్వతంబైనట్టి స్తోత్రము జై
అవతారమెత్తిన తండ్రికి జై
శాశ్వతంబైనట్టి స్తోత్రము జై
నాలోని ఆత్మ తండ్రికి జై
శాశ్వతంబైనట్టి స్తోత్రము జై
త్రైకదేవుండైన తండ్రికి జై
శాశ్వతంబైనట్టి స్తోత్రము జై
ఆనందమౌ తధాస్తు జై
ఆనందమౌ తధాస్తు జై
ఆనందమౌ తథాస్తు జై
అందరికి మరనాత!