(దేవుని స్వరము, మరనాత మర)

గ్రంథకర్త: Father M. Devadasu



దేవుని స్వరము

దేశీయులారా! సహమానవులారా! మీకు శుభము కలుగునుగాక!


ఆదిలో దేవుడు మానవుని కలుగజేసినప్పుడు మనిషియొక్క శరీరములో ఒక గొప్ప మర అమర్చియున్నాడు. ఆ మర ఏమిటో చెప్పగలరా? ఆ మర నీలోను, నాలోను, అందరిలోను ఉన్నది. మన శరీరమునకు దేవుడు కాళ్ళు, చేతులు మొదలైన అవయవములు అమర్చినప్పుడు ఆ మరకూడ అమర్చియున్నాడు. ఆ మర అందరికి తెలిసిన మరయేగాని ఈ సమయమున దానిపేరు మీకు జ్ఞాపకమునకు రాకపోయినను, ఆలోచించండి! రైలుబండికి మర ఉన్నది. దాని కేక మనకు వినబడును. ధాన్యపు మిల్లునకు మర ఉన్నదిగదా! దాని కేకకూడ మనకు వినబడును. దేవుడు మనిషిలో పెట్టిన మరకుకూడ గట్టిస్వరమున్నది గాని మనకు వినబడదు. దగ్గరనున్న వారికికూడ వినబడదు. ఆ మనిషికే వినబడును. మాకు సువార్త చెప్పుటకు ఒక మర ఉన్నది. దానిది గట్టి స్వరము. అది ఒక అర మైలు దూరము వినబడును. దేవుడు మనిషిలో పెట్టిన ఆ మర ఇంతకన్నా గట్టిదిగాని దాని స్వరము ఎవరికి వినబడదు.


మేము బోధచేయు ఆ మర పేరు "మరనాత" మర. దీనిలో మేము "వినండి" అని చెప్పిన మీకు "వినండి" అని వినబడును 'కూర్చొనండి' అనిచెప్పిన "కూర్చొనండి" అని వినబడును. "జ్ఞాపకముంచుకొనండి" అని చెప్పిన 'జ్ఞాపకముంచుకొనండి' అని వినబడును. అలాగుననే మనిషిలో దేవుడు పెట్టిన మరకూడా బోధచేసే మర. మనము పుట్టినప్పటినుండి ఆ మర నీలోను, నాలోను, అందరిలోను ఉన్నది. ఆ మరపేరు ఏమిటో ఇప్పుడైనా చెప్పగలరా? మమ్మును చెప్పమంటారా?

మనిషిలోనున్న ఆ మరకు రెండు ఉద్యోగములున్నవి.
మొదటి ఉద్యోగము - "ఇది మంచి పని గనుక చేయుము" అని చెప్పు ఉద్యోగము.
రెండవ ఉద్యోగము - "ఇది మంచిపనికాదు గనుక చేయవద్దు" అనిచెప్పు ఉద్యోగము. ఈ రెండు ఉద్యోగములు మహాగొప్ప ఉద్యోగములు కావా! ఈలోకములో బ్రతుకవలసిన దినములన్నిటిలోను మనిషి తెలిసికొనవలసినవి ఈ రెండు విషయములేకదా! మంచి, చెడుగు; చెడుగు, మంచి. ఏవి చెడుగో తెలిసిన యెడల, మనిషి వాటిని మానివేయవచ్చును. అప్పుడు కీడు కలుగదు. ఏది మంచియో తెలిసిన యెడల ఆ మంచిని చేయవచ్చును. అప్పుడు మేలు కలుగును. కీడు కలుగకపోవుటయును, మేలు కలుగుటయును ఈ రెండు విషయములు దేవుడు పెట్టిన మర చెప్పును. ఈ రెండు ఉద్యోగములు ఆ మర చేయును.


ఓహో! దేవుడెంత ఉపకారి! మనలో మంచిచెడ్డలు చెప్పించు మర పెట్టినాడు. మనలో ఆ మర దేవుడు అమర్చక పోయినయెడల మనము మంచిచెడ్డలు తెలినికొనకపోదుము. మంచి చెడ్డలు తెలిసికొనకపోయిన మనము ఏలాగు నడుచుకొనగలము? ఏలాగు బ్రతుకగలము? ఏలాగు వర్ధిల్లగలము? మంచి దారి ఏదైనది, చెడ్డ దారి ఏదైనది తెలిసికొనకపోయిన ఎక్కడికి వెళ్ళగలము? మంచిదారి, చెడ్డదారి అనిపించును. చెడ్డదారి, మంచిదారి అనిపించును. దేవుడు ఈ మర మనలో పెట్టినాడు గనుక భయములేదు. ఇప్పుడు ఆ మరపేరు చెప్పండి. ఆమర దుర్జనులలోను, సజ్జనులలోను ఉన్నది. చెప్పినమాట వినువారిలోను, విననివారిలోను ఈ మర ఉన్నది. మేము మా సువార్తమరలో చెప్పుమాటలు ఇష్టములేనివారికి వినబడును, ఇష్టమున్న వారికికూడ వినబడును. దేవుడు పెట్టిన ఆ మరయొక్క స్వరము, మనిషికి ఇష్టమున్ననూ, ఇష్టములేకపోయిననూ వినబడును. గనుక మనమందరము దేవుని యెదుట మోకాళ్ళూని సాష్టాంగ నమస్కారముచేసి మ్రొక్కవలయును. అట్టి మర మనలో ఉంచినందుకు దేవునికి వందనములు చెప్పవలెను. రోడ్లమీద తిరుగు మరలుచూచి మనము ఆశ్చర్యపడుచున్నాము. మన శరీరములో దేవుడు పెట్టిన ఆ మరను చూచి ఎప్పుడైన ఆశ్చర్యపడినామా! ఆ మర పేరు ఏమిటో పెద్దవారికి తెలిసియుండవచ్చును. చదువుకొను పిల్లలకుకూడ తెలిసి ఉండవచ్చును. ఆ మర పేరు ఏమైయుండును? ఆ మరను ఏమందురు?


దాని పేరు చెప్పనుగాని దాని బిరుదు మాత్రము చెప్పుదును. పెద్దలు దానికి "దేవుని స్వరము" అనుపేరు పెట్టిరి. ఎంత గొప్ప బిరుదు! మా సువార్త మరకు "మరనాత మర" అని బిరుదు. దేవుడు పెట్టిన మరకు "దేవుని స్వరము" అని పేరు. ఇది తగిన పేరు. మేము మరలో మాటలాడినపుడు ఆ మాటలు మా మాటాలా లేక మరమాటలా? మా మాటలేగదా! అలాగుననే దేవుడు పెట్టిన ఆ మర పలుకు మాటలు దేవుని మాటలు. అందుచేత దానికి "దేవుని స్వరము, దేవుని శబ్దము" అని బీరుదు వచ్చినది. ఈ బిరుదు గాక ఆ మరకు ఒక పేరు ఉన్నది. ఇప్పుడు దానిపేరు చెప్పవచ్చును. ఆ మర పని మంచిచెడ్డలు చెప్పు పని గనుక దానిపేరు మంచిచెడ్డలు చెప్పే మరి అని పేరుపెట్టిన బాగుండును. అదే మనము పెట్టవలసిన పేరు. ఆ మర మీలో ఉన్నది లేనిది ఒకసారి గుండెలు తడిమి చూచుకొనండి. దేవుడు పెట్టిన ఆ మరను మనము జాగ్రత్తగా వాడుకొనవలయును. అది మన దేవుడైన తండ్రి అనుగ్రహించిన మర. మనము వాడిననూ, వాడకపోయిననూ ఆయన ఇచ్చివేసినాడు గనుక అది మనదే. ఆ మర ఏమి చేసికొనవలెను? దాని మాట వినిన బాగుపడుదుము. విననియెడల చెడిపోవుదుము. ఆ మర నీలో ఉన్నది. ఆ మర ఎటువంటిది? ఎంతకాలము ఉండును? మనిషి చనిపోవువరకు వానిలోనే యుండును. మనిషి చనిపోయిన తర్వాత అతడు ఎక్కడికి వెళ్ళిన ఆ మర అక్కడికే వచ్చును. అది మనిషితోకూడ ఉండును. అది మన ఆస్తి. దేవుడు మనకు ఇచ్చిన దానము. మనకు ఉచితముగా దొరికిన బహుమానము. మానవ జన్మములో మనిషికి, దేవుడు హరణముగా ఇచ్చివేసినది. హరణముగా ఇచ్చినది దేవుడు తిరిగి తీసికొనునా? తీసికొనడు. అది నీ జన్మహక్కు నీవు హక్కుదారుడవు గనుక ఆ మరను బాగుగా వాడుకొనుము. ఆ మరమాట విని, దాని ప్రకారము చేయుము. నీకు శుభము కలుగును గాక! దైవకటాక్షము నీకు లభించునుగాక! దేవుని దీవెన నిన్ను వెంటాడును గాక! ఇంత ప్రసంగము చెప్పినారు. ఆ మర పేరు చెప్పలేదని అనుకొనుచున్నారా? పేరు చెప్పెదను గాని దానిమాట మారు వినకపోయిన యెడల, పేరు చెప్పిన లాభమేమి? అయినను చెప్పెదను. దానిపేరు మనస్సాక్షి. మనస్సాక్షి అనగా మనిషియొక్క మనసులో ఉండునది. "సాక్షి" అనగా సాక్ష్యము చెప్పునది.

(అబ్బాయి - మామిడి దొంగ)

ఒక కథ చెప్పెదను:- ఒక అబ్బాయి ఉన్నాడు. మామిడి తోటలోనికి వెళ్ళినాడు. అటు ఇటు చూచినాడు. నాలుగు కాయలు కోసి, ఒడిలో వేసికొని పారిపోవుచున్నాడు. పారిపోవుచు వెనుకకు చూచుచున్నాడు. ఎందుచేతననగా తానుచేసిన పని మంచిపనికాదు గదా! లోపల మనస్సాక్షి గద్దించుచున్నది. "అబ్బాయీ! నీవు చేసిన పని మంచిదికాదు" అని గద్దించుచున్నది. ఆ అబ్బాయి ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే గద్దించినది. "నీవు మామిడికాయల దొంగతనమునకు వెళ్ళుచున్నావు, అది మంచి పనికాదు సుమీ" అని గద్దించినది. కాని వింటాడా! మనస్సాక్షి మాట వినకుండ చొరవ చేసికొని తోటయొద్ధకు వెళ్ళినాడు. అప్పుడు మనస్సాక్షి మరింత గట్టిగా గద్దించినది. "రావద్దు అని అంటే వచ్చినావు. ఏమియు బాగుగా లేదు. ఇది మంచి పనికాదు. ఇంటికి పొమ్ము" అని చెప్పినది. వినిపించుకొంటాడా! చెట్టు ఎక్కినాడు. అప్పుడు మరలా గద్దించినది. మానివేసినాడా! కాయలు కోయుచున్నాడు. వద్దు, వద్దు, వద్దు అని మనస్సాక్షి పోరు పెట్టినది. కాయలు కోయకుండా ఉన్నాడా! ఇన్ని పర్యాయములు మనస్సాక్షి చెప్పినా వినలేదు. చెట్టుదిగినాడు కాయలు తీసికొనిపోవుచున్నాడు. మనస్సాక్షి గద్దించుట మానలేదు. ఆ అబ్బాయి దొంగతనము చేయుట మానలేదు. కథ ఏలాగు ముగించవలెను? దానికి ముగింవు ఏమున్నది? ఎక్కడ ముగించుకొనవలెనో అక్కడే ముగించవలెను. మనస్సాక్షి తన పని మాత్రము ముగించదు. ఆ బాలుడు దొంగతనము మానివేసినప్పుడే ముగింపు. దొంగ బుద్ధికి ముగింపే, మనస్సాక్షియొక్క హెచ్చరిక ముగింపు.


ఇంకొక సంగతి కనిపెట్టండి: మనస్సాక్షిమర ఆ అబ్బాయిని గద్దించునపుడు, అతని గుండె కొట్టుకొనుచున్నది. మనస్సాక్షి ఆ అబ్బాయిలో నున్నదని తెలిసికొనుటకు అదే గురుతు. దడదడ కొట్టుకొనుటయే గురుతు. ఆ మరలేకపోయిన గుండె కొట్టుకొనదు. ఓహో! మనస్సాక్షియొక్క పని ఎంత గొప్పపని! ఫలితమున్నను, లేకపోయినను పని మాత్రము చాలా గొప్పది. మనము చేయుపని 'తప్పు' అని బోధించుట ఎంత గొప్పపని! నీవు చేయుచున్న పని తప్పు. ఎవరు నిన్ను చూడలేదనుకొనుచున్నావు. తోటగలవాడు చూడకపోయిననూ మనస్సాక్షిమరను పెట్టిన దేవుడు చూచుచున్నాడు. చీకటి రాత్రియైనను ఆయన చూడగలడు. చాటున చేసినను ఆయన చూడగలడు అని మనస్సాక్షి గద్దించును. ఇది మహాగొప్ప పని, భేషైనపని! మహాదివ్యమైన పని. గనుక మనస్సాక్షిమరను మనము మెచ్చుకొనవలసినదే! మనస్సాక్షి మరను గౌరవించవలసినదే! మనస్సాక్షిమర ఉన్నందుకు మనము ఆనందించవలసినదే. మనస్సాక్షి గద్ధింపు లాభకరమైన గద్ధింపుకాదా? పనికివచ్చే గద్దింపు కాదా? మేలైన గద్దింపు కాదా? తప్పుచేయకుండా చేసే గద్దింపు కాదా? మనస్సాక్షి పని ఎంత గొప్ప పనియో గ్రహించండి. మనిషియొక్క గుండె కొట్టుకొనునట్లు చేయు పని, కాళ్ళు గడగడ వణకునట్లు చేయుపని, ముఖమును గందరగోళమచేసే పని, తప్పుచేయు వారి వెంటబడేపని, తప్పుచేయుచోటికి వెళ్ళకుండా వెనుకకు లాగుపని; ఇది గొప్పపని కాదా? మనస్సాక్షి మర మనకు ఉపకారి కాదా? మన ఉపకారిని మనము మర్యాద చేయవలెను. మన్నన చేయవలెను. మన ఉపకారి మాట మనము శిరసావహించ వలెను. ఇదివరకు మనము ఈ మర పెట్టిన దేవుడు గొప్ప ఉపకారియని చూచినాము. ఇప్పుడు దేవుడుపెట్టిన ఆ మర గొప్పఉపకారి అని చూచుచున్నాము. దేవుడు ఉపకారి, మనస్సాక్షిమరకూడ ఉపకారి. ఆ ఉపకారే ఈ ఉపకారి. వీరిద్దరిని జ్ఞాపకముంచుకొనవలెను. ఆ ఉపకారి చెప్పు మాటలే ఈ ఉపకారికూడ చెప్పును. ఆ ఉపకారి రాజు. ఈ ఉపకారి బంటు. ఆ ఉపకారి మోక్షములో నుండు రాజు, ఈ ఉపకారి కోటలోనుండు బంటు. మన దేహమే ఆ కోట. బంటుమాట వినవద్దా! బంటుమాట వినినయెడల రాజు మాట వినినట్టే కదా! రాజు చెప్పినదే బంటు చెవ్పును. ఓహో, సోదరులారా! మనము చేతులుకట్టుకొని, ఆ పరమదేవునికి మొక్కి దేవా! రాజా! "దేవరాజా! నా దేహమను కోటలో ఇంత గొప్ప బంటును, ఉహకారిని పెట్టినందుకు నీ కనేక నమస్కారములు" అని చెప్పవలయును. బంటునే మెచ్చుకొనిన యెడల బంటును నిలువబెట్టిన దేవరాజును అంతకంటె ఎక్కువగా మెచ్చుకొనవలయునుగదా! "తండ్రీ! తండ్రీ! మామీద నీకు ఎంత దయ! మేము పెడదారిని నడువకుండా మమ్ములను మళ్ళించే ఒక రాజబంటును మాలో పెట్టియున్నావు. ఇది ఎంత ఉపకారము! నీకనేక వందనములు" అని చెప్పవలెను.

(అమ్మాయి - జామచెట్టు)

రెండవ కథ:- ఒక అమ్మాయి ఉన్నది. జామతోటలోనికి వెళ్ళినది. వెంటనే మనస్సాక్షి మర "అమ్మాయీ! నీవు దొంగదానవు తప్పు సుమా!" అని గద్దించెను. ఆ అమ్మాయి వినలేదు. మనస్సాక్షిమాట పెడచెవిని పెట్టినది. చెట్టు మొదలు దగ్గరకు వెళ్ళినది. చెట్టు ఎక్కుటకు బట్టలు సర్దుకొనుచున్నది. అప్పుడు మనస్సాక్షిమర 'ఎక్కకు, ఎక్కకు' అని గద్దించినది. ఆ బాలికయొక్క గుండె దడదడ కొట్టుకొనుచున్నది. దేవుడు ఆ అమ్మాయిలో మనస్సాక్షిమర పెట్టినాడని ఆమెకు తెలియదు. తెలియకపోయినను మనస్సాక్షి మాట ఆ అమ్మాయి విన్నది. వెంటనే ఇంటివైవునకు మళ్లినది. వెళ్ళిపోయినది. చెట్టు ఎక్కనూలేదు, పండు కోయనూలేదు. చూచినారా! ఈ అమ్మాయి మనస్సాక్షి మాట విన్నది. మొదటి కథలోని అబ్బాయి పండ్లు కోసినందుకు తోటగల ఆసామి తరిమి పట్టుకొని కొట్టినాడు. మనస్సాక్షి మాట విననందువలన దెబ్బలు పడవలసి వచ్చెను. మనస్సాక్షి మాట విననివారికి ఈ లోకములోనూ శిక్ష, చనిపోయిన తరువాత నరకములోను శాశ్వతమైన శిక్ష ఉన్నది. కాని మొదట భూలోకములో ఈ శిక్షకూడ ఉన్నది. ఆ అమ్మాయి మనస్సాక్షి మాట విన్నది. గనుక శిక్ష తప్పినది. ఆ బాలునియొక్కయు, ఈ బాలికయొక్కయు కథలలో మనుష్యులందరియొక్క కథ ఉన్నది; నా కథ, నీ కథ కూడ ఉన్నది. మనస్సాక్షి మాట వినే కథ, మనస్సాక్షి మాట విననికథ ఉన్నది. శిక్షపడే కథ శిక్ష తప్పించుకొను కథ ఉన్నది. మీకు ఏ కథ కావలయును? మీ కథ ఏలాగుండ వలయునని మీ కోరిక? మా కథ ఆ అబ్బాయి కథ వంటిదా? లేక ఆ అమ్మాయి కథ వంటిదా? ప్రియులారా! ఈ రెండు కథలు మీకు ఇదివరకు తెలియనివి కావు. చెప్పుట కొత్తగాని మీకు తెలిసియుండుట క్రొత్తగాదు.

(అధికారి - పనివాడు)

ఓపిక యుంటే ఇంకొక కథ చెప్పుదును:- ఇది జరిగిన కథ. ఒక అధికారి ఇంటిలో ఒక పనివాడు ఉన్నాడు. పని బాగుగా చేసికొనుచున్నాడు. అతడు ఆ అధికారియొక్క దృష్టిలో నమ్మకముగా ఉండెను. కాని ఒకనాడు పాడుకాలము వచ్చినది. దొరగారు తమ ఆఫీసుగదిలో 200 రూపాయలు మరచి, మేడమీదికి వెళ్ళిపోయెను. ఇతడు ఆ అధికారి వెళ్ళిపోవుట చూచినాడు. రాత్రి సమయము కావచ్చినది గనుక ఈ పనివాడు బంగళా తలుపులన్నివేసి ఇంటికి వెళ్ళవలెను. అయితే సొమ్ముసంచి తీసికొని ఇంటికి పోవుచున్నాడు. "డబ్బుసంచి తీసికొనిపోవలెను" అని అతడు అనుకొన్నప్పుడే, మనస్సాక్షి మర పలకరించినది. "వద్దు, తప్పు సుమా! అది నీ సొమ్ముకాదు. చిక్కులలో పడిపోతావు. పైన దేవుడు ఉన్నాడు. నీ తలంపులు ఆయనకు తెలియును" అని మనస్సాక్షి గద్దించినది. కాని అతడు వినలేదు. దొంగిలించిన డబ్బు ఇంటికి తీసికొనివెళ్లెను. పెట్టెలో దాచినాడు. స్నానము చేసినాడు. భోజనముకూడ చేసినాడు. ఇంటిలో ఆ పని ఈ పని చక్కపెట్టినాడు. కాని ఆ మర ఇంకను మ్రోగుచూనే యున్నది. ఇంకను పలుకుచూనే యున్నది. ఒకటే పలుకు: ఆఫీసులో అదే పలుకు, తలుపులు వేసేటప్పుడు అదే పలుకు, రోడ్డుమీద అదే పలుకు, పెట్టెలో దాచినప్పుడు అదే పలుకు, స్నానము చేయునప్పుడు అదే పలుకు, భోజనము చేయునప్పుడు అదే పలుకు. అతడు మొండి అయిపోయినాడు. మనస్సాక్షిమర ఇన్ని పలుకులు పలికినా, అతడు వినుపించు కొనుటలేదు. రాటుదేరిపోయినాడు. గుండె రాయిచేసికొన్నాడు. మనసాక్షి మాత్రము తన ఉద్యోగము మానలేదు. సొమ్ముసంచి తెచ్చుకొనిన పెద్దమనిషి హాయిగా పండుకొన్నాడు. గాని ఏమిలాభము? నిదురపట్టడములేదు. మనస్సాక్షి మర ధ్వని ఇప్పుడు మరింత ఎక్కువగా వినబడుచున్నది. అంతా నిశ్శబ్దముగా నున్నది గనుక ఈ ధ్వని భయంకముగా వినబడుచున్నది. తలుపు వేసికొనినను వినబడుచున్నది. ఇదేమి చిత్రమో! ప్రియులారా! మనిషికి సుఖములేదు. కంటికి కునుకులేదు. ఇంకొక చిత్రము! ఇప్పుడు రెండు స్వరములు వినబడుచున్నవి. ఆ సేవకుడు తన కడుపులో ఇద్దరు జట్టీలు పట్టియున్నారని తలంచియున్నాడు. ఒకడు "సంచి తీసికొని వెళ్ళి ఆ దొరగారికి ఇచ్చివేయుము" అని అనుచుండెను. రెండవ జట్టీ "ఎందుకేమిటి, ఇచ్చివేయుట?" అనుచుండెను. మొదటి జట్టీ అంటున్నాడు: "ఎలాగైన దొరగారు నీమీద అనుమానపడకమానరు. నిన్ను అడుగకమానరు. నీ తబ్బిబ్బు మాటలవలన నీవు పట్టుబడక మానవు. గనుక ఇప్పుడు నామాట విని వెళ్ళి, నీ తప్పు ఒప్పుకొనుము" అని అనుచుండెను. రెండవజెట్టీ - "వెళ్ళెదవుసుమీ! తప్పు ఒప్పుకొనెదవుసుమీ! నేలకుబోయేది నెత్తికి వ్రాసికొన్నట్టు ఉండును. గొప్ప కుమ్మరము తెచ్చుకొనెదవు. ఆ దొర నిన్ను పట్టుకొని కొట్టుట మాత్రమే కాకుండ, ఈలాగు ఎన్ని పర్యాయములు ఎత్తికొనిపోయినావని, లేనిపోని దొంగతనములు కూడ నీ మీదకి వచ్చును. సుఖముగా నిద్రపొమ్ము. ఒప్పుకొనుటలేదు, చెప్పుకొనుటలేదు. ఎవరికి తెలియనీయకుము. కండ్లు మూసికొనుము. దుప్పటి కప్పుకొనుము" అనుచుండెను. ఎవరిమాట వినను! ఎవరిపోరు పడను! అని ఆ పనివాడు ఎటూ తోచకయుండెను. ఈ పనివానియొక్క కథలో ఇంకొక కథ కలిసినది. అనగా ఇంకొక మర కనబడుచున్నది. అది ఎక్కడనుండి వచ్చినది? అది ఎవరు పెట్టినారు? శనిగాడు. దేవుడు పెట్టిన మరచెంతనే వాడు ఆ మర అమర్చినాడు. ఇద్దరు జెట్టీలు. ఒక జెట్టీ దేవుడు పెట్టిన జెట్టీ. ఇంకొక జెట్టీ శనీశ్వరుడు పెట్టిన జెట్టీ. ఒక మర తప్పుచేయవద్దు అని చెప్పుమర. ఇంకొకమర "పరవాలేదు, తప్పుచేయవచ్చు" అని బోధించే మర. మనిషి దేవుడు పెట్టిన మర మాట వినవలెను. సైతానుపెట్టిన మరమాట వినకూడదు.


సహోదరులారా! ఈ రెండు మరలు మా శరీరములోనున్నది లేనిది పరీక్షించుకొనండి. ప్రతివారిలోను గలవు. మనిషిగా జన్మించిన తరువాత మంచి చెడ్డ తెలియకుండ ఉండునా? తప్పక తెలియును గాని మనిషి మంచి చేయడు. అక్కడనే కిటుకంతయు ఉన్నది. తుదకు మంచిమనిషికి చెప్పినమాట వినని మనిషి అయినాడు. దేవుడు కలుగజేసినప్పుడు మనిషి మంచివాడేగాని రానురాను చెడిపోయినాడు. ఎప్పుడు చెడిపోయినది ఎందుకు? చెడిపోయినది ఇపుడు మనకు ఎందుకు? చెడిపోయినాడనే కథ తెలిసినది. గనుక కథలోనికి పోవుదము. ఆ సేవకుడు ఉదయమున లేచి, సంచిపట్టుకొని ఆ దొరగారియొద్దకు వెళ్ళి తన నేరము చెప్పుకొని క్షమించుమని వేడుకొన్నాడు. ఈ సొమ్ము ఇచ్చివేయవలసినదని ఆ అధికారి అడిగినాడు. అప్పుడా రాత్రి జరిగిన కథ అంతయు ఆ పనివాడు చెప్పినాడు. "అయ్యా! రాత్రి పరుండియుండగా నాలో ఇద్దరు జెట్టీలు రాత్రి అంతయు కలహించుకొనుచు నా నిద్ర చెడగొట్టినారు. ఒక జెట్టీ "ఆ సొమ్ము సంచి ఇచ్చివేయి" అని ఎన్నోమారులు అన్నాడు. మరియొక జెట్టీ ఇచ్చితివా ముప్పు తెచ్చుకుంటావు అని అన్నాడు. తెల్లవారులు ఈ సంభాషణ జరుగుచూనే ఉన్నది. నేను మొదటి జెట్టీ మాట విని సంచి ఇచ్చి వేసితిని. ఇప్పటికి ఆ జెట్టీల పోరాటము అగి, ప్రాణము సుఖముగా నున్నదని, సంగతి అంతా చెప్పినాడు. ఈ చిత్రమైన కథ జ్ఞాపకముంచుకొనండి. ఈ కథ మన బ్రతుకులో ఎప్పుడైన జరగకమానదు. అప్పుడు ఈ జెట్టీల కథ జ్ఞాపకము తెచ్చుకొని చెడుగు మానివేయుము. అప్పుడు మీ ప్రాణము సుఖముగా నుండును. ఇప్పటికి మనస్సాక్షిని గురించి చెప్పలసినది చాలా భాగము ముగిసెను.

(మనస్సాక్షి - శుద్ధి)

మరియొక సంగతి వినండి: ఒక మనిషి ఏదైనా తప్పుదారిలో నున్నపుడు "అది వద్దు" అని మనము చెప్పుదుము. ఎంత చెప్పినా అతడు వినడు. తుదకు మనము ఏమి చేయుదుము? చెప్పుట మానుకొందము. ఆ మనిషి తన ఇష్టప్రకారము చేసి ముప్పు తెచ్చుకొనును. మనస్సాక్షికూడ మనకు చెప్పిచెప్పి కొంతకాలమైన తరువాత చెప్పుట మానివేయును. మనస్సాక్షి చెప్పుట మానివేసెను గదా! అని మనిషికి సందు దొరికి, తన ఇష్టము వచ్చినట్లు నడుచుకొనును. అప్పుడతనికి తప్పు ఒప్పు, మంచి చెడ్డ ఏమియు తెలియవు. త్రాగినవానివలె పడినది కానడు, పడనిది కానడు. ఎవరు ఏమి చెప్పినా నచ్చవు గనుక వానికి చెప్పుట మానివేయుదురు. అలాగే మనస్సాక్షి కూడ మానివేయును. ఇట్టి స్థితి ఈ మా బోధ వినువారి కెవ్వరికిని ప్రాప్తించకుండును గాక! మనమందరము మనస్సాక్షి మాట వినుట అలవాటు చేసికొందుము గాక! మొదట కొంచెము కష్టముగా ఉండునుగాని అలవాటుపడిన తర్వాత మనస్సాక్షి మాట ప్రకారము చేయుట సుళువగును.


నా లెక్కప్రకారము మొదటి మనిషి జన్మించి పాపములో పడి, సుమారు ఆరువేల సం॥లు అయినది. ఆరువేల సంవత్సరములకు ముందు మనిషి బాగానే ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు గనుక మనిషిని పరిశుద్దునిగానే కలుగజేసియున్నాడు. గాని అతడు కొన్నాళ్ళకు దేవుని మాట విననందున పాపాత్ముడైనాడు. దేవుని మాట వినకపోవుటయే పాపాత్ముడగుట. దేవుడు మనిషిలో మనస్సాక్షి నుంచుటవలన దేవుడు చెప్పవలసిన మంచిచెడ్డలు, మనస్సాక్షి ద్వారా మనిషి వినడము జరుగుచున్నది. లోకములో నుండు మనుషులందరు మనదగ్గరకు వచ్చి, తమ తమ మనస్సాక్షిని గురించి చెప్పవలెననినా చాలా పెద్ద కథయగును. మనస్సాక్షి చెప్పినమాట వినుట మనిషి బాగుగా నేర్చుకొనవలెను. ఇప్పుడొక చిక్కు వచ్చినది. లోకములో పాపము ప్రవేశింపక ముందు మనస్సాక్షి బాగుగానే ఉన్నది. అయితే పాపము ప్రవేశించిన తర్వాత చెడిపోయినది. గనుక ఇప్పుడు మనస్సాక్షి మంచి, చెడ్డలు సరిగా చెప్పుట కష్టము. అందుచేత ముందు మనసాక్షిని శుద్ధిచేసికొనవలెను. అప్పుడు దానిమాట వినవచ్చును. అది ఏలాగు అని అంటారా? మా సువార్త మర (బూర) ఇప్పుడు బాగుగానే పలుకుచున్నది. స్వరము బాగుగానే వినబడుచున్నది. అయితే మేము ఆ మరను బాగుగా వాడకపోయిన రంధ్రములు పడును. అప్పుడు బాగుగా పలుకదు. ఎందుకు? అసలు మర, అసలు మరవలె లేదు. చెడిపోయినది. అలాగే మనస్సాక్షి మొదట దేవుడు పెట్టిన మనస్సాక్షివలె లేదు. చెడిపోయినది. సరిగా పలుకుటలేదు. గనుక శుద్ధి చేసికొనవలెను. గనుక శుద్ధిచేసికొను ఒక మార్గము చెప్పుదును. మీకు శుద్ధి చేసికొనవలెనను కోరిక ఉన్న యెడల చెప్పుదును. మర చెడిపోతే మధ్య మనిషి దగ్గరకు వెళ్ళిన ఏమి లాభము? మరచేసినవాని దగ్గరకు వెళ్ళవలెను. గనుక మనస్సాక్షి మర చేసిన దేవుని దగ్గరకు వెళ్ళీ మరమ్మత్తు చేయించుకొనవలెను. అప్పుడు సరియగును. గనుక దేవుని దగ్గరకు వెళ్ళవలెను. 'మనస్సాక్షి మర చేసిన దేవుని దగ్గరకు వెళ్ళుట ఏలాగు? దేవుడు ఎక్కడో పరలోకములో ఉన్నాడు' అని అంటారు. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసికొనుము. దేవుడు అక్కడ ఉన్నాడని నమ్మి కండ్లుమూసికొని, మోకాళ్ళూని దేవుని ప్రార్ధించుము. అప్పుడు నీ మనస్సాక్షిమర సరియగును.


దేవుని ఏమని ప్రార్ధించవలెను? "ఓ దేవా! సమస్తమును కలుగజేసిన తండ్రీ! నన్ను కలుగజేసిన తండ్రీ! నాలో ఉన్న మనస్సాక్షిని కూడ కలుగజేసిన తండ్రీ! నీకనేక వందనములు. నీవు ఇచ్చిన మనస్సాక్షి మాట విననందున నా మనస్సాక్షిమర చెడిపోయి నీ దగ్గరకు మరమత్తునకు వచ్చినది. గనుక నీ దగ్గరకే తీసికొని వచ్చితిని గనుక బాగుచేయుము. నా మనస్సాక్షి కాని పలుకులు పలుకకుండ నీవు చెప్పు పలుకులు పలుకుశక్తి దయచేయుము. అది ఎప్పటివలెనే సరిగా పలుకునట్లు చేయుము" అని ఈ ప్రకారము దేవునికి ప్రార్ధన చేయవలయును. అప్పుడు చూచుకో, మన మనస్సాక్షి దేవుడు చెప్పినదే పలుకును. మంచికి మంచి, చెడ్డకు చెడ్డ విడదీసి చెప్పును. ఆ మాట నీవు వినినయెడల మహాధన్యుడ వగుదువు. లోకములో కొన్ని మంచి సంగతులు వినబడుచున్నవి. మంచి బోధలు వినబడుచున్నవి. దుర్బోధలు వినబడుచున్నవి.


ఎక్కడైన ఒక సంగతి జరిగినప్పుడు ఒకరు ఒక రీతిగాను, మరియొకరు ఇంకొక రీతిగాను చెప్పుదురు. ఏది నమ్ముట? ఏది నిజము? ఈ వివరము ఎట్లు తెలియును. దేవుడు మనకిచ్చిన జ్ఞానమునుబట్టి మంచి చెడ్డలు పరిశీలించవలెను. ఒక సంగతి నీ దృష్టికి అయోగ్యముగా కనబడును. ఇంకొకరి దృష్టికది బహు చెడ్డదిగా కనబడును. అప్పుడుకూడ ఏది నిజమో! అనిపించును. వారికి నచ్చజెప్పుట కూడ కష్టము. లోకములో ఇన్ని మతములున్నవి. మా మతము నిజమని ఒకరు, మాది నిజమని మరొకరు; కాదు అన్ని మతములు ఒకటని ఇంకొకరు చెప్పుచున్నారు. నిజము తెలిసికొనుట ఎట్లు? ఎవరిమాట వారు జరుపుకొనుటకు సభలు పెట్టుకొని వివాదములోనికి దిగుచున్నారు. పత్రికలలో తమ అభిప్రాయము వెల్లడించుచున్నారు. గొప్పగొప్ప గ్రంథములు ప్రచురించుచున్నారు. అనేక సాదృశ్యములు తీసికొని బుజువు పరచుచున్నారు. గనుక ఎవరిమాట నిజమని తీర్మానించుకొనగలము? ఈ వివాదములు తీరుట ఏలాగు? లోకములో ఇప్పుడు మత సంబంధమైన గర్జనలు రద్దీగా జరుగుచున్నవి. గనుక దేవుని ప్రార్థించుట వలననే శాంతి పొందగలము. అదే విరుగుడు. అందరు అలాగు చేయవలయునని మా కోరిక. ప్రతివారు ముందు తమ స్వాభిప్రాయములను ఒక మూలపెట్టి, అప్పుడు దేవుని సన్నిధినిచేరి ప్రార్ధించవలెను. ఆ ప్రకారము చేయకపోయినయెడల ప్రార్ధనలోనికి వెళ్ళిన తరువాత స్వాభిప్రాయములే మనసులోనికి వచ్చును. అది ఎంత హాని! దైవకృప మీకు తోడైయుండును గాక! సర్వసత్యములకు మూలకర్తయైన దేవుడు మీకు సత్యమును బయలుపర్చునుగాక!


ఒక స్థలమున జరిగిన సంగతి మూకలో ప్రవేశించినపుడు, వారు విడిపోయిన తర్వాత అందరు అన్ని విధములుగా చెప్పుకొందురు. తమ కల్పనకూడ అందు చేరియుండును. అసలు సత్యము దొరకదు. అయితే, ఆ సంగతి జరిగిన వెంటనే, అది చూచిన ఆయన స్వయముగా ఒక కాగితముమీద వ్రాసి అచ్చువేసి, అందరికి పంచిపెట్టినయెడల నిజము తెలిసిపోవును. మాట మార్చినట్టు వ్రాత మార్చలేము. ఒకవేళ మార్చిన యెడల కల్పన స్పష్టముగా కనిపించును. మీరు చేయవలసిన ఒక పని చెప్పుదును. ఒక కాగితము తీసికాని ఒక కథ చక్కగా వ్రాయుము. అది కొందరికి చదివి వినిపించుము. మొదటివాడు వెళ్ళి రెండవవానికి ఆ కథ చెప్పవలెను. ఆ రెండవవాడు వెళ్ళి మూడవవానికి చెప్పవలెను. ఈ ప్రకారము పది దినములలో పదిమందికి దానిని వినిపించవలెను. ఆ పదియవ మనిషిని ఆ కథ వ్రాయుమని చెప్పుము. అతడు వ్రాసినది నీవు వ్రాసినది, దగ్గర పెట్టుకొని చదివిచూడుము. అప్పుడు ఆ కథలో ఎంతో తేడా కనిపించును. ఈ తేడా ఎందుకు వచ్చినది? కథ మాటలలో తిరుగుచు వచ్చినది గనుక మారినది. ఇది ఎందుకు చెప్పితిననగా, దేవుడు మనిషిలో నున్న మనస్సాక్షికి చెప్పుచూనే ఉండును. మనస్సాక్షి మునువటివలెనే నుండినయెడల దేవుని మాటలు ఎప్పుడును దేవుని మాటలుగానే ఉండును. మనస్సాక్షి చెడిపోయినది గనుక మనిషి దేవుని మాటలను మార్చి చెప్పుచున్నాడు. మారినట్లు తనకు తెలియదుగాని తన ఊహలుకూడ దేవుని మాటలతో కలిసి వచ్చుచుండును.


పూర్వకాలమందు దేవుడు తన భక్తులకు ప్రత్యక్షమై, కొన్ని మాటలు చెప్పి అవి పుస్తకములో వ్రాయించెను. అవి వ్రాయని యెడల ఒకరినోటనుండి ఒకరినోటికి అందుచు, చివరికి ఆ మాటలలో భేదము కలుగును. అందుచే దేవుడు ఆ మాటలు పుస్తకములో వ్రాయించెను. ఆ పుస్తకము చదువుకొనిన యెడల దేవుని మాటలు తెలిసికొనవచ్చును. లేనియెడల దేవుడు ఒకటి చెప్పినా, మనస్సాక్షి మరియొకటి చెప్పును, మనిషి ఇంకొకటి చెప్పును. ఇది బుజువుపర్చుటకు ఒక సంగతి చెప్పుదును.


ఒక చెవిటివానితో దుప్పటి తీసికొని రమ్మని చెప్పితిని. అతడు కుంపటి తెచ్చెను. నేను చెప్పుట తప్పా అతడు వినుట తప్పా? నేను "దుప్పటి" అని చెప్పినాను. అతని చెవికి కుంపటి అని వినబడినది. అది అతని చెవి తప్పు. అలాగే దేవుడు మనిషికి ఒకటి చెప్పిన అతనికి ఇంకొక విధముగా వినబడినది. ఎందుకనగా మనిషి చెడిపోయినాడు. చెవిటివాడు ఆస్పత్రికి వెళ్ళి చెవి బాగుచేయించుకొనవలెను. అప్పుడు చెప్పినట్లుగా వినబడును. ఇదివరకు చెప్పినమాట మరలా చెప్పుచున్నాను. మనస్సాక్షిని బాగుచేయించుకొనుటకు దేవునియొద్దకు వెళ్ళి, ప్రార్ధన కుదురువరకు, నీకు సంతుష్టి కలుగువరకు ప్రార్ధించవలెను. ఈ పని చేయలేక అనేకులు బద్దకించి, తప్పుడు మనస్సాక్షితోనే కాలము గడుపుచున్నారు. గడుపుకోనివ్వండి. ఎంతకాలము గడుపుకొందురో! నిజము తెలిసికొనవలసిన అవసరమున్నపుడే ప్రార్ధన చేయవలెను. మేము నమ్మునది నిజమా? కాదా? అను ప్రశ్న ఎప్పుడు మీకు వచ్చును? మా ఎదుట మేము బోధించు బోధలుకాక వేరు బోధలు వినబడునప్పుడు ఏది నిజము? అను ప్రశ్న వచ్చును. ఆ ప్రశ్న వచ్చినప్పుడు, ఆ ప్రశ్న పట్టుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో పెట్టి నిజము తెలిసికొనవలెను.


దేవుడు నరలోకమునకు అన్ని సంగతులు ఒక్మమారే తెలియజేయడు. మొదటి మనిషి కలిగినప్పుడు ఒక సంగతి తెలియజేసెను. తరువాత కొన్ని వందల ఏండ్లకు కొన్ని సంగతులు తెలియజేసెను. మరికొన్ని వందల యేండ్లకు కొన్ని సంగతులు తెలియజేసెను. ఈ ప్రకారముగా దేవుడు పెద్దలకు కొత్త సంగతులు తెలియజేయుచున్నాడు. ఎవరికి బయలువర్చవలెనో వారికే బయలుపరచు చున్నాడు. పెద్దలకేకాదు, పిల్లలకుకూడ బయలుపర్చుచున్నాడు. ఒక తరములో దేవుడు తెలియజేయనపుడు, సంగతులు, మరొక తరములో తెలియజేసిన ఆ రెండవతరమువారు నమ్ముదురా? నమ్మరా? అంగీకరించుదురా? లేదా? మహాబాగున్నదని అంటారా! మనకు తెలిసినట్లు కొందరు నమ్ముదురు కొందరు నమ్మరు. ప్రతి తరములోను నమ్మువారు, నమ్మనివారు ఉందురు. దానికి మనము ఏమి చేయవలెను? మన పెద్దల కాలములో లేని సంగతులు, మనకాలములో ఉన్నవా, లేవా? అని చూచుకొనవలెను. వారి కాలములో లేని బస్సులు మన కాలములో ఉన్నవా? లేవా? అని చూడవలెను. మతములలోని వారికి క్రొత్తసంగతులు తెలియుచున్నవి. రాజ్యముల నేలువారికి క్రొత్త సంగతులు తెలియుచున్నవి. లోకములో ఎన్ని వృత్తులున్నవో, అన్ని వృత్తులవారికి దేవుడు కొత్త సంగతులు బయలు పరచుచున్నాడు. ఈ విమానాలు, క్రొత్తరకపు మరలు మన కండ్ల ఎదుటనే బయలుపడినవి గదా! రాను రాను లోకమందు జ్ఞానము అభివృద్ధి పొంది, క్రొత్త సంగతులు తెలియుచునేయున్నవి. వాటిని చూచి తృణీకరించు వారిని మనమేమి అనగలము? ఏ క్రొత్తది అయినా, మనము సరిగా వాడుకొనవలెను. లేనియెడల హాని. విద్యుచ్చక్తి క్రొత్తదేగాని సరిగా దానిని వాడనియెడల, శరీరము కాలి చనిపోవుదురు. అలాగే అన్ని సంగతులు సరిగా గ్రహించుకొనవలెను. దేవుడు బయలుపరచునవి తృణీకరించినయెడల దేవునిని తృణీకరించినట్లే.

(మనస్సాక్షి - బైబిలు)

ఇదివరకు చెప్పినదే మరలా చెప్పుచున్నాను. నిజము తెలిసికొనుటకు దేవుడు మనకు ఒక పుస్తకమును అచ్చువేయించి ఇచ్చినాడు. ఆ పుస్తకము పేరు బైబిలు. దేవుడు మనిషికి చెప్పవలసిన మాటలన్నీ అందులో నున్నవి. నిద్ర ముఖముతో చదివిన ఒక మాట, ఇంకొక మాటగా కనబడును. కండ్లు బాగుగా కడుగొని చదివినయెడల, ఉన్నది ఉన్నట్లుగా తెలియగలదు. అలాగే మనస్సాక్షిని దైవప్రార్థనవల్ల బాగుగా శుద్ధిచేసికొని, బైబిలును చదివినయెడల ఉన్నది ఉన్నట్లుగా తెలియగలదు.


ఇంకొకమాట: బైబిలు మూలగ్రంథము. దానిలో క్లుప్తముగా దేవుని మాటలున్నవి. గనుక ఆ వాక్యము చదివిన తర్వాత దేవుడు వాటి అర్ధమును తెలియజేయగలడు. అది ఆయనను అడిగితేనే, ఆయనను ప్రార్ధిస్తేనే ఆయనను ఆశ్రయిస్తేనే జరుగును. అడుగుట ఏలాగు? ప్రార్ధించుట ఏలాగు? ఆశ్రయించుట ఏలాగు? అని అడుగుదురా? యధాప్రకారముగానే దేవుని యెదుట మోకాళ్ళూని, తండ్రీ! నీవు ఈ బైబిలు గ్రంథమును ఇచ్చినావు గనుక నీకనేక వందనములు. ఈ గ్రంథము చదువుకొనుచుండగా, ఇందులోని అర్థమును బయలు పర్చుము అని ప్రార్ధించవలెను. చదివిన అధ్యాయమునకు అర్ధము తెలిసిన సరే. ఒకవేళ తెలియకపోతే, విద్యార్థి ఉపాధ్యాయుని అడగడా? ఆ విధముగానే దేవుని మాటలు వివరముగా తెలియకపోయినా దేవునిని అడుగవలెను. అప్పుడాయన మన మనసులో వాటి అర్ధములు తెలియపర్చును. ఆయనే మనకు తోచునట్లు చేయగలడు. ఒక తరమువారికి తోచనటువంటి అర్ధములు, మరియొక తరమువారికి తోచినవి. రెండవతరము వారికి తోచని అర్థములు, మూడవతరము వారికి ఈ విధముగా అర్ధములు తొమ్మిదవ తరమువారికి తోచినవి. ఈ ప్రకారముగా లోకాంతము వరకు బైబిలులోని క్రొత్తసంగతులు తెలియుచుండును. ఒకరికి తెలియనివి ఇంకొకరికి తెలియును. బైబిలులో ఒక చిత్రమైన వాక్యము జ్ఞాపకమునకు వచ్చును. దేవుడు జ్ఞానులకును, వివేకులకును సంగతులు మరుగుచేసి పసిబాలురకు బయలుపర్చినాడని ఉన్నది. మత్త 11:25. ఇది ఎంత చిత్రముగా ఉన్నది! చిత్రమన్నా చిత్రమా! ఎంత చిత్రమో! అనగా పండితులకు తెలియని సంగతులు పండితులుకానివారికి దేవుడు తెలియజేయుట. ఆయనకు ఏమియు అసాధ్యము కాదు. "మేము వేదాంత పండితులము, అనుభవశాలురము, దీర్ఘకాల సేవకులము; మాకు తెలియని సంగతులు ఈ సామాన్య జనులకు ఏలాగు తెలిసినవి! ఇదంతా వట్టిదే" అని వారు అనినయెడల, సంగతులు బయలుపడ్డవారు ఏమందురు? మత్తయి 11:25 చూపింతురు. అందులో నున్నది ఇదివరకు చెప్పితినికదా!


దేవుడు జ్ఞానులకును, వివేకులకును సంగతులు మరుగుచేసి, పసి బాలురకు బయలుపరచును. బైబిలంతటిలో బయలుపడిన సంగతులు చెప్పెదను. దేవుడు వొదట మానవుని నివిత్తము ఆకాశమును భూమిని కలుగజేసినాడనియు, మనిషి పాపములో పడిన తర్వాత భూలోకమునకు ఒక రక్షకుని పంపెదనని వాగ్ధానము చేసినాడనియు, ఆ రక్షకునికొరకు లోకము నాలుగువేల సంవత్సరములు కనిపెట్టగా, ఆ కనిపెట్టినవారు మోక్షమునకు వెళ్ళిరనియు, తుదకు నాలుగువేలయేండ్లకు ఆ రక్షకుడు అనగా దేవుడే నరుడై జన్మించి, యేసుక్రీస్తను పేరున భూమిమీద వెలసి ప్రసిద్ధి కెక్కినాడనియు, ఆ యేసుక్రీస్తు ప్రభువే మన పాపభారమంతయు ఎత్తుకొని, సిలువ మ్రానుపై మరణమై, మూడవ దినమందు బ్రతికివచ్చి, మహిమశరీరముతో పరలోకమునకు వెళ్ళినాడనియు, ఆ వెళ్ళిన ఆయనే రేపో మాపో వచ్చి, నమ్మినవారికి చావు రానియ్యకుండ అమాంతముగ మోక్షమునకు తీసికొని వెళ్ళుననియు బెబిలులో బైలుపడినది. అదే మేమును బోధించుచున్నాము. బైబిలు చదువగా, ధ్యానించగా, పరీక్షించగా, తరచగా, ఇంకా అనేక సంగతులు బైలుపడినవి. అవికూడ మేము బోధించుచున్నాము. యేసుక్రీస్తు వారు భక్తులను పరలోకమునకు తీసికొని వెళ్ళిన తరువాత మిగిలిపోయినవారికి, ఈలోకములో ఎక్కడ ఎప్పుడులేని శ్రమలు 7 సం॥లు కలుగును. తరువాత యేసుక్రీస్తువారు లోకములో ధర్మపరిపాలన చేయుదురు. అప్పుడు దయ్యములుగాని, పాపములుగాని, శత్రువులుగాని, అడవి మృగములుగాని మనిషిని బాధింపవు. ఆయన వెయ్యేండ్లు పరిపాలన చేయును. అప్పుడే క్రీస్తుమతము పూర్తిగా ప్రకటన యగును. అదే దేవుడు మనిషికిచ్చు ఆఖరి గడువు.


ఆ తరువాత భూమిపుట్టినది మొదలుకొని అప్పటివరకు సమాధులలో ఉన్న భక్తిహీనులను క్రీస్తుప్రభువు లేపి, వారికి తీర్పు విధించును. తుదకు ఏమి జరుగుననగా ఆయనను నమ్మని పాపులకు నరకము; వారికి మాత్రమే కాదు. నరులచేత పాపము చేయించిన సాతానును, దయ్యములను ఆయన నరకములో పడవేయును. అయితే ఆయనను నమ్ముకొన్న పాపాత్ములను క్షమించి, మోక్షములో చేర్చుకొనును. ఈ సంగతులు బైబిలులో నున్నవి.


ఈ బోధ ఆరంభమందు మనస్సాక్షిని గూర్చి ఎత్తుకొని, తుదకు కథ యావత్తు చెప్పివేసినాము. మనస్సాక్షియొక్క మాట విననివారు ఎవరో చెప్పుకొనగలరా? దుర్జనులా? సజ్జనులా? ఇదివరకు దుర్జనులని చెప్పినాను కదా! సజ్జనులుకూడ మనస్సాక్షి మాట వినరని తుదకు చెప్పవలసి వచ్చుచున్నది. ఏలాగనగా బైబిలు చదువుకొను వారందరు దేవుని నమ్మువారు. నమ్మినవారు సజ్జనులు. ఆ నమ్మినవారు బైబిలులో నున్నవన్నియు నమ్ముచున్నారా? నమ్ముటలేదు. మనస్సాక్షి చెప్పిననూ నమ్మరు. ఎందుచేతననగా, "ఈ క్రొత్త సంగతులు మన పెద్దలు చెప్పలేదు గనుక నమ్మకూడదు" అని నిశ్చయించు కొనుచున్నారు. వారిని ఏమనగలము? వారు పెద్దలు, తెలిసినవారు, ఏమిచేయగలము? ఎందుకైనామంచిది అని తెలిసినవారికి తెలియనివారికి, మంచివారికి, చెడ్డవారికి పిల్లలకు, పెద్దలకు, స్త్రీ, పురుషులకు, ఇదివరకు విన్నవారికి అన్నిమతముల వారికి మా క్రైస్తవులకు ఈ క్రొత్త సంగతులు అనగా క్రొత్తగా బైబిలులోనుండి బయటకు తీసిన సంగతులు ప్రకటించుచున్నాము. ఈలాగు ప్రకటించుచున్నందులకు మాకెన్నో చెడ్డపేరులు వచ్చుచున్నవి. ఆ చెడ్డపేరులు మా మెడలోని పేర్ల దండయైనది. చెడ్డపేరు వస్తే మాత్రము మంచిబోధ మానుదుమా! దేవుడు మా మనస్సాక్షికి బయలుపరచిన సంగతులు బోధించకుండ ఉండగలమా! క్రైస్తవ మతబోధకులు ఒప్పుకొనకపోయినను వివరించకుండ ఉండగలమా? వివరించకపోతే నేరస్థులము కామా? వారి మనస్సాక్షికి ఈ సంగతులు దేవుడు ఎందుకు బయలుపర్చలేదు అని అడుగుదురా? అది మాకు తెలియదు, అది మాకు తెలియదు.... అది మాకు తెలియదు.


దీవెన : దివ్య దేవుడు నిన్ను - దీవించును గాక! భూమి చేసినవాడు - పోషించును గాక! రక్షకుండౌ క్రీస్తు - రక్షించును గాక! పరమవైద్యుడు స్వస్థ - పరచుచుండును గాక! దైవాత్మ ధైర్యంబు - తెచ్చుచుండును గాక! అంతాన మోక్షంబు - అందజేయును గాక! = విజయము ఈ పాట వినువారి కామెన్ !

మనస్సాక్షి - వచనములు

వచనము మనస్సాక్షి
యోహాను 8:9 మనస్సాక్షిచే గద్దింపబడెను అని భాషాంతరము.
అపో. కార్య. 23:1 మంచి మనస్సాక్షి గలవాడనై.
రోమా 2:15 మనస్సాక్షి సాక్యమిచ్చుచుండగ.
9:3 పరిశుద్ధాత్మయందు మనస్సాక్షి సాక్ష్యము.
13:5 మనస్సాక్షినిబట్టి లోబడియుండుట.
1కొరిం. 8:7 మనస్సాక్షి బలహీనమైనదై.
10:29 ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తము.
2కొరిం. 1:12 మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుచున్నది.
4:2 ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట
1తిమో. 1:5. మంచి మనస్సాక్షినుండి కలుగు ప్రేమ.
1:9 మనస్సాక్షిని కొందరు త్రోసివేసి.
3:9 పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారు.
4:3 వాతవేయబడిన మనస్సాక్షి
2తిమో. 1:3 నిర్మలమైన మనస్సాక్షి
తీతు 1:15 మనస్సాక్షి అపవిత్ర పర్చబడియున్నది.
హెబ్రీ. 9:14 మనసాక్షిని శుద్ధిచేయును.
10:2 మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు.
10:22 మనస్సాక్షికి కల్మషము తోచకుండుట.
19:18 మంచి మనస్సాక్షి కలిగియున్నాము.
1పేతురు 3:21 నిర్మలమైన మనస్సాక్షి కలిగియుండుట.