గ్రంథకర్త: దేవదాసు అయ్యగారు
(క్రైస్తవ మతము వలన హానిలేదు)
ప్రభువునందు ప్రియులారా!
(1) ఎవరినైనా తృణీకరింపకుండుట గొప్ప అంతస్థు. ఏ మతమునైనను, ఏ మనిషినైనను దూషించుట, ద్వేషించుట; మా మతములోనికి వచ్చి తీరవలెనని బలవంతపెట్టుట, భ్రమపెట్టుట మానవుల దైవమతముకాదు.
భైబిలు గ్రంథములోని మొదటిభాగముగు పాతనిబంధనలో క్రీస్తు చరిత్ర మరుగున ఉన్నది. అనగా ప్రవచన రూపముననున్నది, యూదులలో మిగుల స్పష్టముగ కనబడుచున్న దైవమతమగు యూదుల మతము క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టెను. యూదులలో యెహోవా మతముగనునన్న దైవమతము, క్రీస్తు వచ్చిన తరువాత బహిరంగముగా క్రీస్తుమతమై ప్రసిద్ధిలోనికి వచ్చినది. ఇది బైబిలులోని రెండవభాగమగు క్రొత్త నిబంధనలో విశదముగా కనబడుచున్నది. ఈ క్రైస్తవమతము వలన హానిలేదు. ఇదే ఈ పత్రికాంశమైయున్నది. క్రైస్తవమత సిద్ధాంతముల వలన హానిలేదు గాని వాటి ననుసరించని వారికి హాని కలుగును.
- 1. దేవదూతలను, ఆకాశమును, భూమిని మనుష్యులను కలుగజేసిన సృష్టికర్తయైన దేవుని మాత్రమే ఆరాధింపవలెననియు, ప్రార్ధింపవలెననియు క్రీస్తుమతములో నున్నది. కనుక హానిలేదు.
- 2. ఎవరి మీదగాని, దేనిమీదగాని ఉండవలసిన ప్రేమకన్న దేవునిమీదనే యెక్కువ ప్రేమయుండవలెనని క్రీస్తు మతములో నున్నదిగనుక హానిలేదు.
- 3. దేవునిమాత్రమే నమ్మియుండవలెనని క్రీస్తు మతములో నున్నది. గనుక హానిలేదు.
(2) తల్లిదండ్రులను, పెద్దలను, అధికారులను గౌరవించవలెనని క్రీస్తు మతములో నున్నది. కనుక హానిలేదు.
(3)
- 1. ఒకరిని కొట్టకూడదనియు, చంపకూడదనియు, చంపుకొకూడదనియు క్రీస్తు మతములో నున్నది. గనుక హానిలేదు.
- 2. దేవాలయముయొక్క ఆవరణములోనున్న పశువులను, పక్షులను కొట్టక క్రీస్తు వాటిని బయటకు తోలివేసెను. దీనినిబట్టి చూడగా జీవరాశులను కొట్టకుండుటయు, పశ్వాదులకు ఉపకారము చేయుటకు క్రీస్తు మతముయొక్క వాడుకయైయున్నది. కనుక హానిలేదు.
- 3. బీదలకు సహాయము చేయవలెనని క్రీస్తు మతములోనున్నది కనుక హానిలేదు.
- 4. నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమించుమని క్రీస్తుమతములో నున్నది కనుక హానిలేదు.
- 5. శరీరమును యొల్లప్పుడును శుద్ధిచేసుకొనవలెనని క్రీస్తు మతములో నున్నది గనుక హానిలేదు.
(4)
- 1. స్త్రీ పురుషులలో ఒకరియెడల ఒకరికి శరీర సంబంధమైన దుర్వాంఛకూడదని క్రీస్తుమతములో నున్నది కనుక హానిలేదు.
- 2. భార్యాభర్తలు నిత్యమైన ప్రేమ కలిగియుండవలెనని క్రీస్తుమతములో నున్నది కనుక హానిలేదు.
- 3. తల్లిదండ్రులు తమ పిల్లలను దైవశిక్షణలోను, బోధలోను, పెంచవలెనని క్రీస్తుమతములో నున్నది కనుక హానిలేదు.
- 4. వివాహము అన్ని విషయములలోను ఘనమైనదని క్రీస్తు మతములో నున్నది కనుక హానిలేదు.
(5)
- 1. దొంగతనము చేయవద్దని క్రీస్తుమతములో నున్నది. కనుక హానిలేదు.
- 2. ధనాపేక్షలేని మనస్సుగలవారై మీకు కలిగిన వాటితో తృప్తిపొందుడని క్రీస్తు మతములో నున్నది కనుక హానిలేదు.
(6) అబద్ధమాడవద్దని క్రీస్తుమతములో నున్నది. కనుక హానిలేదు.
(7) క్రీస్తుసువార్త ఒక దేశముననే కాక అన్ని దేశములకు అనగా లోకమంతటికిని ప్రకటింపవలెనని క్రీస్తు మతములో నున్నది. కనుక హానిలేదు (సువార్త అనగా హానిచేయని మంచి సందేశము)
(8) క్రైస్తవ మతము ఆచరించవలసిన వాటివలన హానిలేదు. అవేవనగా:-
- 1. ప్రతి దినము బైబిలు అను గ్రంథము చదివి దేవుని చిత్తమును తెలుసుకొనవలెను.
- 2. అనుదినము కుటుంబములోనివారు కూడుకొని దైవప్రార్ధన చేసుకొనవలెను.
- 3. తమ్మును గురించి మాత్రమే కాక లోకవాస్తవ్యులందరిని గురించియు, అన్ని అంశములను గురించియు దేవుని ప్రార్ధింపవలెను.
- 4. బైబిలు చెప్పుచున్న బోధ ప్రకారము నడుచుకొనుటకు ప్రయత్నింపవలెను.
- 5. తమకు తెలిసిన విషయములు యితరులకు చెప్పుచుండవలెను. మరియు తమ అనుభవమును గురించియు ఇతర క్రైస్తవుల అనుభవము గురించియు ఇతరులకు ప్రకటింపవలెను.
- 6. ఆరాధన దినమున సహ క్రైస్తవులతో కలిసి దేవాలయమునకు వెళ్ళవలయును.
- 7. మతాభివృద్ధి నిమిత్తమును, అక్కరలో ఉన్నవారి నిమిత్తమును చందాలు వేయుచుండవలయును.
- 8. మత విషయములను హెచ్చరించు సమాజములకు వెళ్ళుచుండవలయును.
- 9. దైవభక్తిని వృద్ధిచేసికొనుటకు మంచి మంచి పుస్తకములను, పత్రికలను చదువుచుండవలెను.
- 10. రోగులను, కష్టస్థితులలోనున్న వారిని పరామర్శింపవలెను.
- 11. శత్రువులను ప్రేమింపవలెను. వారి క్షేమము నిమిత్తమై ప్రార్ధింపవలెను. వారిని క్షమింపవలెను. వారిని దీవింపవలెను.
- 12. బేధాభిప్రాయములున్నంత మాత్రమున ఇతరులను దూషింపరాదు, ద్వేషింపరాదు.
- 13. పాపవిషయము లన్నింటిని విసర్జింపవలెను. తలంపు, మాట, ప్రయత్నము, క్రియ ఇవి ఎప్పటికప్పుడే శుద్ధిచేసికొనవలెను.
- 14. అన్ని మతములు, అన్ని బోధలు పరిక్షించి మంచివని తోచినవాటిని అనుసరింపవలెను.
- 15. బైబిలు తరగతులు పెట్టి పనివారిని సిద్ధపరుపవలెను.
- 16. ప్రత్యేక సమయములో కూడ ప్రార్ధనలు జరుపవలెను. ఉదయమున పడకనుండి లేచిన సమయమందు, భోజన సమయమందు, రాత్రి పరుండ సమయమందు, పనిలోనికి వెళ్ళు సమయమందు, ప్రయాణ సమయమందు, ప్రధాన సమయమందు, పెండ్లి సమయమందు, జన్మ సమయమందు, వ్యాధి సమయమందు, ఆపద సమయమందు, సంతోష సమయమందు, విజయ సమయమందు, ఇతరులు ప్రార్ధనకోరు సమయమందు, మరణ సమయమందు, భూస్థాపన సమయమందు, వర్షములేని సమయమందు, ఎండ, గాలి ఎక్కువుగానున్న సమయమందు, కలహముల సమయమందు, యుద్ధసమయమందు, పంట పండిన సమయమందు, పంట నష్టమైన సమయమందు, క్రొత్త ఇండ్లు కట్టుకొను సమయమందు, కోర్టు వ్యవహార సమయమందు, పాఠశాల పరీక్షల సమయమందు, దుష్టస్వప్న సమయమందు, ప్రార్ధన నెరవేరిన సమయమందు, ప్రార్థన నెరవేరని సమయమందు, కరువు సమయమందు, భూకంప సమయమందు, దుర్వార్త సమయమందు... ప్రార్ధనలు జరుపవలెను.
(9) క్రైస్తవ దేశములు మన కాలములో చేయుచున్న మేళ్ళు క్రీస్తు మతములో నున్నవే. కనుక హానిలేదు. అవేవనగా
- 1. పాఠశాలలు,
- 2. వైద్యశాలలు,
- 3. చేతిపనుల శాలలు,
- 4. అనాధశరణాలయాలు,
- 5. పుస్తకములు అచ్చువేయు ముద్రాక్షర శాలలు,
- 6. గ్యాస్ లైట్లు, ఎలక్ట్రిక్ లైట్లు, బేటరీలైట్లు, అగ్గిపెట్టెలు దుర్చిణీలు, టెలిగ్రాములు, టెలివిజన్లు, గ్రాముఫోనులు, బాడ్ కాస్టులు, మైక్ లు, కండ్ల అద్దాలు, గడియారములు, ఫోటోగ్రాపులు, మ్యాజికులాంతర్లు, సినిమాలు, రైళ్ళు, కార్డు, బస్సులు, సైకిళ్ళు, విమానములు, స్టీమర్లు, కలములు, క్రొత్త క్రొత్త బండ్లు, ఎక్సరేలు, ఇంజక్షన్లు, ఆపరేషనులు, టైపురైటింగు మిషనులు.
(10) మానవుని పారమార్ధిక విషయములు వృద్ధి చేయుటకు గల సాధనములు క్రీస్తు మతములోనున్నవి. కనుక హానిలేదు.
- 1. దైవ విషయములు తెలిసికొనుటకు పద్నాలుగు వందల యాభై భాషలలో అచ్చుపడిన బైబిలు గ్రంథము
- 2. పారమార్ధికమైన బోధలు సర్వలోకమునకు వివరింపవలసిన ఏర్పాటులు
- 3. బైబిలు గ్రంథములోని విషయములు ప్రజలకు బోధపడుటకై అనేకమైన వ్యాఖ్యానములు ప్రకటింపవలసిన ఏర్పాట్లు
- 4. దైవగ్రంథమగు బైబిలునుబట్టి అన్ని దేశములలో దైవమతమగు క్రైస్తవ సంఘములు స్థాపింపవలసిన ఏర్పాటులు.
(11) దేవుడును మన నిమిత్తమై మనుష్యుడునైన క్రీస్తు చరిత్రయే శరీర జీవితమునకు, పారమార్ధిక జీవితమునకు వృద్ధిపొందుటకు ముఖ్యాధారమైయున్నది. ఈ చరిత్ర బోధ క్రీస్తు మతములో నున్నది కనుక హానిలేదు.
ఆ చరిత్ర యేదనగా: యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకమునకు రాకముందు ఆయన రాకడ దేవుని అనాది సంకల్పనయైయున్నది. అనగా దేవదూతల లోకమును,
ఆకాశమును, భూమియును కలుగకముందే సంకల్పములోనున్నది. తరువాత ఆయన లోకమునకు రానైయున్నాడను ప్రవచనము నాలుగువేల సంవత్సరముల వరకు నరులకు వినబడుచునే యుండెను. ఆ తరువాత ఆయన పాలస్తీనాలోని బెత్లేహేమను పట్టణమున జన్మించి, యేసుక్రీస్తు అను నామమును ధరించెను. రక్షించుటకు ఏర్పాటైన వ్యక్తియని ఈ పేరున కర్ధము. ఆయన పెద్దవాడై మోక్షమార్గ ధర్మములు బోధించెను. పాపాత్ములకు, పాప పరిహారము ప్రకటించెను. వ్యాధి గ్రస్థులకు ఔషదములు లేకుండగనే తన ప్రభావమువలన స్వస్థపరచెను. ఆకలిగొన్నవారికి అద్భుతమైన రీతిగా రొట్టెముక్కలు సృజించి ఐదువేల మందికంటె ఎక్కువమందికి వడ్డించెను. తుఫాను రాగా దోనెలోనున్న శిష్యులకు భీతి కలిగెను. అప్పుడు తన వాక్కుచేత గాలిని సముద్రమును గద్దించి ఆపద తప్పించెను. మృతులను కొందరిని బ్రతికించెను. తన వాక్కువలన భూత పీడితులకు విమోచన కలిగించెను. పాపాత్ములు, అల్పులు భోజనమునకు పిలిచినప్పుడు వెళ్ళి ఉపకార బోధలు వినిపించెను. తాను బోధించిన ప్రకారము నడిచి చూపించెను. కొందరు ఆయనమీద లేనిపోని నేరములు కల్పించి అవమానవరచిరి. ఆయనను గ్రహింపని యూదయు మతాధికారులు ఆయనను సిలువ వేయించి చంపిరి. గాని ఆయన ఊరుకొనెను. మూడవ దినమందు బ్రతికివచ్చి నలువది దినములు భక్తులకు కనబడి తన పునరుత్థానమును రుజువు పరచుకొనెను. అటు తరువాత మహిమ శరీరముతో ఆయన మోక్షలోకమునకు ఆరోహణమాయెను. మీరు లోకమంతటికి నా బోధ వినిపించి, నమ్మినవారికి బాప్తిస్మమియ్యుడనియు నేను మరల వచ్చెదననియు చెప్పెను. అందుచేతనే క్రైస్తవులు రక్షణార్ధమై నమ్మినవారికి బాప్తిస్మ
మిచ్చుచున్నారు ఆయన రెండవసారి రాకముందు కొన్ని గురుతులు జరుగునని చెప్పి వెళ్ళెను. అవి మనకాలములో జరుగుచున్నవి. కనుక ఆయన మేఘాశీనుడై వచ్చి భక్తులను ప్రాణముతోనే తీసుకొని వెళ్ళు సమయము మిగుల సమీపించుచున్నది. క్రైస్తవ బోధకులమైన మేము అన్ని ఉపకార విషయములు బోధించి ఒక్క రెండవరాకడ విషయములో భోధింపని యెడల మా ఉపకారము లోపముగల ఉపకారమగును. రెండవ రాకడ సమయములో జరుగు సంగతులు యేవనగా,
- 1. క్రీస్తుప్రభువు మేఘాసీనుడై రాగా మొదట భక్తులు అనగా అదివరకు మృతులైన భక్తులు మేఘములోనికి వెళ్ళుదురు.
- 2. బ్రతికియున్న భక్తులు మరణము లేనివారై నూతన శరీరధారులై ప్రాణముతోనే మేఘములోనికి వెళ్ళుదురు. ఎందుకనగా క్రీస్తు ప్రభువు వారినాకర్షించును. ఈ పని రెప్పపాటులో జరుగును. అప్పుడు సిద్ధపడుట పడదు. అంతకముందే సిద్ధపడి యుండవలెను. దైవసన్నిధి ప్రార్ధనవలననే సిద్ధపడగలము. (అందుకే ఇప్పుడు విరివిగా సువార్త ప్రకటింపబడుచున్నది)
భూమిమీద శేషించినవారిలో గొప్ప ఆందోళన కలుగును. చదువరులారా! మరణము లేకుండా మేఘములోనికి ఎగిరి వెళ్ళుట మీకిష్టమైన యెడల వెంటనే సిద్ధపడి యుండండి. సందేహముగల ప్రశ్నలవలన మేలు కలుగును. ఆయన ఎప్పుడు వచ్చునో నిశ్చయముగా తెలియదు. కనుక ఇప్పుడే సిద్ధపడవలెను. రెండవ రాకడవలన పాపములు, పాపఫలితములు అన్నియు నాశనమగును. కనుక క్రీస్తు మతమువలన హానిలేదు. రాకడను గురించి మాకు తెలిసిన యెడల మేముకూడ సిద్ధపడియే యుందుము అనియు మిగిలిన క్రైస్తవులతో మిగిలిన ఇతరులందురు.
(12) సర్వలోక రక్షణార్ధమై మానవుడు తెలిసికొనవలసిన విషయములు గల బైబిలు గ్రంథమును మరుగున నుంచక పద్నాలుగు వందల ఏబది భాషలలో క్రీస్తుమతము ముఖ్య గ్రంథముగ వెల్లడించినది. కనుక హానిలేదు.
- 1. చెడుగును విసర్జించునట్లును మంచిని అనుసరించునట్లును మంచి చెడ్డలుగల చరిత్రలు బైబిలులో లిఖితమైయున్నవి.
- 2. మన నరజాతి నిమిత్తమై దేవుడు గతకాలమందు ఏమిచేసెనో ఇప్పుడు ఏమి చేయుచున్నాడో ఇకముందునకు ఏమిచేయనై నున్నాడో ఈ విషయములు బైబిలులో గలవు.
- 3. ప్రార్ధన చేసినయెడల దేవుడు మన కోరికలన్నియు నెరవేర్చునని బైబిలు వలన తెలియుచున్నది.
- 4. దేవదూతలకును మానవులకును దేవుడు తనలోని స్వాతంత్ర్య లక్షణమునుబట్టి స్వాతంత్ర్యమనుగ్రహించినాడు. కనుక నరులు ఏమిచేసినను ఊరుకొనవలసి వచ్చినది. ఊరుకొనక అడ్డము వెళ్ళినయెడల స్వాతంత్ర్య మిచ్చిన ప్రయోజనమేమి? స్వాతంత్ర్యము దుర్వినియోగపరచుచున్నవారికి ఒకదరినుండి యుక్త కాలమందు కష్టములు కలుగుచుండును. తుదకు న్యాయ పద్ధతినిబట్టి దేవుడు అందరికిని తీర్పు విధించుకాలము వచ్చును. ఈ సంగతులు బైబిలులో ప్రత్యక్షమైనవి.
- 5. బైబిలులోని కొన్ని విషయములు అర్ధము కానప్పుడు ప్రార్ధనచేసి తెలిసికొనవచ్చును. తెలియని యెడల యుక్త సమయమందు తెలియునని ఊరుకొనవలెను.
- 6. జ్ఞానము చెప్పినను, మనస్సాక్షి చెప్పినను, సజ్జనులు చెప్పినను, దేవుడు చెప్పినను కొందరు వినరు, కాని సైతాను చెప్పినదే వినుటకు ఇష్టపడుదురు. అందుచేత దేవుడు అట్టివారిలో ప్రవేశించుటకు సాతానుకు సెలవిచ్చును. ఇట్టి వృత్తాంతములు కూడ మన మెళకువ నిమిత్తమై బైబిలులో కనబడుచున్నవి. ఏది చెడుగో అది మనుష్యులకు తెలియును.
- 7. జీవాంతమందు మోక్షమునకు చేరవలసిన బోధలు బైబిలులో గలవు.
(13) భర్తలు చనిపోయిన స్త్రీలకు సహాయమును క్రైస్తవ మతమే ఏర్పరచుచున్నది. గనుక హానిలేదు.
(14) కోర్టువారు పిలిచిన క్రైస్తవులకు న్యాయమైన రీతిగా సహాయము చేయుట క్రైస్తవమత సంఘము పూనుకొనుచున్నది. కనుక హానిలేదు.
(15) తల్లిదండ్రుల మాటలు వినక తమ ఇష్టాను సారముగా నడుచుచు ఇతరులకుకూడ అభ్యంతరముగనున్న పిల్లలను చెఱసాల పేరుమీద సంస్కరణశాలకు చేర్చి వారికి చదువు, చేతిపనులు, నీతి బోధ చేయించుచున్నది క్రైస్తవ ప్రభుత్వమే. కనుక హానిలేదు.
(16) పనిచేయలేని వృద్ధులను చేర్చి వారికి సహాయము చేయగల పరిచారకులను ఏర్పరచుట క్రైస్తవ మతములోనున్నది. కనుక హానిలేదు.
(17) చక్రవర్తికి పన్ను చెల్లింపవలెనని క్రీస్తుప్రభువు చెప్పుట వలన ప్రభుత్వమునకు తన అనుచరులు విధేయులై యుండవలెనని కనబరచెను. కనుక క్రైస్తవులు వారున్న దేశములో ప్రభుత్వము వారికి లోబడియున్నారు; ఇది క్రైస్తవ మతములోని యొక చట్టము. కనుక హానిలేదు. మరియు క్రైస్తవులు ప్రభుత్వము వారి ఆజ్ఞలకు లోబడవలెననుటయు, వారి పనులలో సహాయపడవలెననుటయు క్రైస్తవమత బోధయైయున్నది. కనుక హానిలేదు.
- 1. క్రైస్తవమతము వెళ్ళిన దేశములలో ప్రజలకు నాగరికత నేర్పుచున్నది. కనుక హానిలేదు.
- 2. క్రైస్తవమతము మనుష్యుల రోగ నివారణార్థమై వైద్యశాలలు స్థాపించుట మాత్రమేకాక పశ్వాదుల రోగముల నివారణార్థమైకూడ వైద్యశాలలు స్థాపించుచున్నది. కనుక హానిలేదు.
(18) ఇతర మతములను దూషింపవలెనను సిద్ధాంతము క్రైస్తవ మతములో లేదు, కనుక హానిలేదు. క్రైస్తవ గ్రంథకర్తలు ఇతర గ్రంథములలోని విషయముల నంగీకరింపనప్పుడవి అనంగీకారములని వ్రచురించినమాట నిజమే. కాని దూషింపలేదు. ఏ మతమునుగాని, ఏ వ్యక్తినిగాని దూషించుట క్రైస్తవ మతాచారముకాదు. ఎవరినైన ఒక వ్యక్తి దూషించిన యెడల మతమంతయు దానికి ఉత్తరవాదికాదు. క్రీస్తుప్రభువు యూదా మతాధికారులలో దురాచారములు కనిపెట్టినప్పుడు దూషింపలేదు. కాని అయ్యో! అని పలికి జాలిపడెను. అదే క్రైస్తవుడు ఆచరింపవలసిన పద్ధతి. యెరూషలేముమీదికి గొప్ప నాశనము రానైయుండుట తన దివ్యదృష్టికి కనబడినందున క్రీస్తుప్రభువు ఏడ్చెను. ఇదికూడ క్రైస్తవుని లక్షణమైయుండవలెను. (అందుచేతనే) మన కాలములో అనేకమంది క్రైస్తవులు యేసుప్రభువుయొక్క రెండవ రాకడ సమీపమని బోధించుచున్నారు. ఆయన మేఘాసీనుడైవచ్చి భూమిమీదనున్న భక్తులను ప్రాణముతోనే తీనికొనిపోవుననియు మిగిలిన వారికి గొప్ప కష్టములు గలుగుననియు జాలిగల మనస్సుతో క్రైస్తవులు ప్రకటించుచున్నారు. రాకడకు సిద్ధమగుటవలన గొప్ప మేలు గలుగుననియు, సిద్ధపడక పోవుటవలన హింసలు ప్రవేశమగుననియు, చెప్పుట ఉపకారమే, కాని అపకారముకాదు. భ్రమపెట్టుటకాదు, భయపెట్టుటయుకాదు. తెలియజేయుట క్షేమ వార్తయైయున్నది.
(19) కష్టసుఖములు దేవునికి తెలియజేయుటకై శాంతార్థమైన ప్రార్ధనలు అనుదినము చేయుట క్రైస్తవమత పద్ధతి. కనుక హానిలేదు. కొందరు క్రైస్తవులు ప్రార్ధన సమాజములు ఏర్పరచుకొనుట మాత్రమేకాక దైవసన్నిధి కూటములుకూడ ఏర్పరచుకొని దైవధ్యానము చేయుచున్నారు. ప్రార్ధన మూలముగా మానవులు దేవునితో మాటలాడుదురు. అనగా ప్రార్ధానంతమందు కనిపెట్టు మూలముగా దేవుడు మానవులతో మాటలాడును.
(20) క్రీస్తుప్రభువు లోకముయొక్క భారము ఎత్తుకొనెను.
- 1. “సమస్తమైన వారలారా! నాయొద్దకు రండి అని క్రీస్తు అందరిని పిలిచినాడు. అలాగే క్రైస్తవ సంఘముకూడ అందరిని తనయొద్దకు రమ్మని పిలుచుచున్నది.
- 2. శత్రువుల క్షేమము కొరకు క్రీస్తు ప్రార్థించెను. అలాగే క్రైస్తవమతముకూడ అందరిక్షేమము కొరకు ప్రార్థించుచున్నది.
- 3. క్రీస్తు తన విషయములు అందరికి ప్రకటించవలెనని చెప్పెను. అలాగే సంఘము కూడ అందరికి క్రీస్తుబోధ వినిపించుచున్నది. క్రీస్తు ఉపకార కార్యములు చేసెను. అలాగే క్రైస్తవమతముకూడ ఉపకార కార్యములు చేయుచున్నది. ఈ ఉపకార కార్యముల జాబితా అన్ని దేశములవారికి తెలిసిన విషయమే.
షరా:- అందరిని పిలుచుటలోను, అందరికొరకు ప్రార్ధన చేయుటలోను, అందరికి బోధించుటలోను, అందరికి ఉపకార కార్యము చేయుటలోను, క్రీస్తువలె సంఘముకూడ లోకభార మెత్తుకొని యున్నది. కనుక హానిలేదు.
(21) క్రీస్తునకు గొఱ్ఱెపిల్ల అను నొక బిరుదు గలదు. గొఱ్ఱెపిల్ల హాని చేయనిది. క్రీస్తు హాని చేయనివాడు. “అతడు దౌర్జన్యమునొందెను బాధింపబడినను అతడు నోరు తెరువలేదు. వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెడట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు” అని యెషయా ప్రవచించెను (యెషయా. 53:7). క్రీస్తువలెనే ఆయన భక్తుల సంఘమగు క్రైస్తవమతమును దౌర్జన్యమనుభవించుచున్నను మౌనముగా నున్నది. అనగా తిరిగి దౌర్జన్యము చేయనిదియై యున్నది. గనుక హానిలేదు.
(22) కొన్ని క్రైస్తవ బోధలవలన ఇతర మతములకు కోపము రాకమానదు అయినను ఆ బోధలు బైబిలునకు అనుగుణ్యముగాను, ఉపకార బుద్ధితోను చెప్పినవిగాను ఉన్నందున హానిలేదు.
- 1. విగ్రహారాధన చేయకూడని బైబిలు మిగుల స్పష్టమైన మాటలతో చెప్పుచున్నది.
- 2. భర్తలు పోయిన స్త్రీలకు వివాహము చేయుట బైబిలు ప్రకారము నిషేదముకాదు.
- 3. బాల్య వివాహము చేయుట బైబిలునకు ప్రతికూలము
- 4. కులము బైబిలునకు ప్రతికూలము.
- 5. జన్మాంతర బోధ బైబిలునకు ప్రతికూలము, మనుష్యులు, జంతువులుగాను, ఇతర కులస్థులుగాను అనేక పర్యాయములు జన్మమెత్తవలెనను ఈ సిద్ధాంతము బైబిలునకు ప్రతికూలము. పావముచేసిన మనుష్యుడు మరణ సమయమందైనను దేవునియొద్ద పాపమొప్పుకొన్నయెడల వెంటనే క్షమించి మోక్షమునకు చేర్చుకొనుననునది బైబిలు సిద్దాంతము.
- 6. శక్తిపూజ ఏమాత్రమును కూడదని బైబిలు ఖండించుచున్నది.
- 7. చనిపోయిన భర్తయొక్క శవముతోపాటు భార్యయు దహనము కావలెనను ఆచారము బైబిలునకు ప్రతికూలము.
- 8. పిల్లలను దేవతలకు బలివేయుట బైబిలునకు ప్రతికూలము.
- 9. దేవాలయములో యౌవన స్త్రీలను నివాసముగా నుంచుటయు కుల భోగము స్త్రీలచేత పండుగలలో పాటలు పాడించుటయు బైబిలునకు ప్రతికూలము.
- 10. ఒక్క క్రీస్తు మాత్రమే రక్షకుడని బైబిలు బోధించుచున్నది.
అన్ని బోధలకంటే ఈ ఒక్కబోధయే ఇతరులకు ఎక్కువ కోపము పుట్టించు బోధ, అయినను బోధింపక తప్పదు. ఇది అపోస్తలుల కార్యము 4:12లో నున్నది. “మరి ఎవని వలనను రక్షణ కలుగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశముక్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము”. మరియొకచోట దీనికి సంబంధించిన విషయమున్నది. ఫిలిప్పీ 2:1-11. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికయైనను, ఏ దుఃఖోపదేశమైనను ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారస వాత్సల్యమైనను ఉన్న యెడల మీరు ఏకమనస్కులగునట్లుగా, ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగానుండి, ఒక్కదానినే మనస్మరించుచు నా సంతోషమును సంపూర్ణము చేయండి. కక్షచేతనైనను వృధాతిశయము చేతనైనను, ఏమియుచేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటే యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును తన స్వకార్యములను మాత్రమేగాక ఇతరుల కార్యములనుకూడ చూడవలెను. క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్ట కూడని భాగ్యమని ఎంచుకొనలేదుగాని, మనుష్యులపోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్నుతానే రిక్తునిగా చేసికొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్నుతాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలోగాని, భూమిమీదనున్న వారిలోగాని, భూమిక్రింద ఉన్నవారిలోగాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతినామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను.
దైవప్రార్ధనచేయు క్రమము
- 1. అనుకూల సమయమందును, ఏకాంత స్థలము నందును దైవసన్నిధిని చేరి మోకరించి కన్నులు మూసికొని సృష్టికర్తయైన దేవుని మాత్రమే తలంచుకొనవలెను. ఇతరమైన చెడ్డ తలంపులుగాని, మంచి తలంపులుగాని మనస్సులోనికి రానీయరాదు.
- 2. దేవునియెదుట పావములన్నియు ఒప్పుకొనవలెను.
- ౩. ఇకమీదట ఏ పాపమును చేయకుండుటకు ప్రయత్నింతునని తీర్మానించుకొని దేవునికి చెప్పవలెను.
- 4. సమస్తమును దేవుని వశము చేయవలెను. అనగా శరీరమును, ఆత్మను, గృహమును, ఆస్థిని, కాపుదల నిమిత్తమై దేవా! నీ వశము చేయుచున్నానని చెప్పవలెను.
- 5. దేవుడు నీకు చేసిన మేళ్లు తలంచుకొని ఆయనను స్తుతించవలెను.
- 6. ఇప్పుడు నీకు ఉన్న మనవులన్నియు దేవునికి చెప్పుకొనవలెను.
- 7. నీ ప్రార్ధనలన్నియు ముగించిన తరువాత కొంతసేపు నిశ్శబ్దముగా నుండవలెను. అప్పుడు దేవుడు నీ మనస్సులో నీ ప్రార్థనలకు జవాబులు పుట్టించును. ప్రార్ధన గదిలోనుండి వెళ్ళిపోవునపుడు మరల దేవుని స్తుతించి మరి వెళ్ళవలెను.
ముగింఫు
1. బైబిలు కాల ప్రవచనములను, తరువాతి కాల ప్రవచనములును యుక్త కాలమున నెరవేరుచుండును.
- 1. దేశ జనులకు స్వాతంత్ర్యము కావలెనని ఈ మధ్య మన ఇండియావారు కోరిరి. అది జరిగినది. ఈ సంగతి వార్తాపత్రికలవలన తక్కిన దేశములకు తెలిసినది. ఆ దేశస్థులు కూడ ఇదే కోరికి.
- 2. పరదేశస్థులు ముఖ్యముగా తెల్లవారు ఇండియాలోనుండి వెళ్ళిపోవలెనని ఇండియావారు కోరిరి. అది జరిగినది. ఈ సంగతి వార్తాపత్రికలవలన తక్కిన దేశములకు తెలిసినది. ఆ దేశస్థులుకూడ ఇదే కోరిరి.
- 3. క్రీస్తుమతము పరదేశ మతము గనుక ఇండియాలో హిందూముతముండగా ఇదెందుకని హిందువులలో కొందరనుచున్నారు. ఈ సంగతి వార్తాపత్రికల వలన తక్కిన దేశములకు తెలిసినది. ఆ దేశస్థులుకూడ ఇదే కోరుచున్నారు.
2. క్రైస్తవమతము మా దేశమునుండి వెళ్ళిపోవలెనని అన్ని దేశములవారు గట్టిపట్టుపట్టినప్పుడు క్రైస్తవులు ఏదేశమునకైన వెళ్ళుటకు దేశములుండవు. మీరు సమస్త జనముల వలన ద్వేషింపబడుదురని క్రీస్తు ప్రవచనము ఇప్పుడు ఎక్కువగా నెరవేరుచున్నది. అప్పుడు ఆయన మేఘాసీనుడై వచ్చి తన విశ్వాసులను అకస్మాత్తుగా ఒక రెప్పపాటు కాలములో మోక్షమునకు తీసికొనివెళ్ళును. క్రైస్తవ మతమునకు కలుగుచున్న ఇక్కట్లు క్రీస్తుయొక్క రెండవరాకడకు సరియైన ముంగుర్తులై యున్నవి. కనుక సిద్ధపడండి.
3.
- 1. కష్టకాలమందే ఎక్కువ వృధ్థియగుట క్రైస్తవ మత శక్తియైయున్నది. ఈ పత్రికయును, క్రీస్తుమతాభివృద్ధియను పత్రికయును చదువు వారికి, బైబిలు చదువువారికి, సంఘచరిత్ర చదువు వారికి ఈ సంగతి బోధపడును.
- 2. ఈ ఇక్కట్లు కాలములో ఇండియాలోనే దేవుడు బైబిలు మిషనును బయలుపరచుటయును, దానిని ఎత్తి అందరికి చూపించుమని చెప్పుటయును, క్రీస్తుమత ప్రకటనకు ఇండియా మూలస్థానమగునని ప్రవచించుటయును ఆశ్చర్యముగా నున్నది. మరియు క్రైస్తవులనేకులు నమ్మని రెండవ రాకడను గురించి కొందరు పత్రికలలో తీవ్రముగా వ్రాయు చున్నారు. ఆయాచోట్ల క్రీస్తు కొందరికి దర్శనమిచ్చి “ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను” అని చెప్పుచున్నాడు. కొన్నిచోట్ల కొందరు దైవసన్నిధి కూటములు పెట్టుకొని ప్రార్థించి కనిపెట్టుచుండగా క్రీస్తును, పరలోక భక్తులును వచ్చి మాటలాడుచున్నారు. ఆ మాటలలో ముఖ్యమైనమాట రెండవరాకడను గురించియే. క్రైస్తవులును, ఇతరులును, నమ్మగలవారును, నమ్మలేనివారును, పాపమును విసర్జింపలేనివారును దైవసన్నిధి కూటము అనుదినము పెట్టుకొనవలెనని నా సలహ. దానిలో అన్ని నమన్యలు పరిష్కారమగును. ప్రయత్నించి చూడండి.
4. బైబిలు మిషను విషయము, సువార్తకు ఇండియా మూలస్థానమను విషయము, దేవుడు దర్శనమిచ్చుచున్నాడను విషయము, ఈ మూడును ఉపకారములే కేనుక క్రీస్తు మతము వలన హానిలేదు. ఒక్క క్రీస్తుమత ప్రకటనవలన మాత్రమేకాక అది చేయుచున్న లోకోపకారములవలన కూడ అందరకు సుఖము కలుగుచున్నది. కనుక క్రీస్తుమతమువలన హానిలేదు.
“క్రీస్తు కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగములచేతను, వేదనలచేతను పీడింపబడిన వ్యాధిగ్రస్థులనందరిని దయ్యము పట్టినవారిని, చాంద్రరోగములను, పక్షవాయువుగలవారిని వారు ఆయనయొద్దకు తీసుకొనిరాగా ఆయన వారిని స్వస్థపరచెను” (మత్తయి. 4:24).
షరా: చదువరులారా! ఈ పత్రికలలోను, మా ఇతర పత్రికలలోను ఉన్న విషయములు ఎంతవరకు నిజమో దేవుని అడిగి తెలిసికొనండి.
దేవా! సృష్టికర్తా! నన్నును సమస్తమును కలుగజేసిన తండ్రీ! నాకు కనబడుము, నాతో మాటలాడుము. అందరికి కనబడుము, అందరితోను మాటలాడుము. నాకు సత్యమును తెలియజేయుము. నీవు తెలియజేసిన సత్యము ననుసరించుటకు నాకుధైర్యమును, శక్తిని దయచేయుమని ప్రార్థించండి.