(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

రాకడ ధ్వని



త్వరగా రానున్న యేసూ! - త్వరగానే రమ్ము తండ్రీ= త్వరగా వచ్చు ప్రభువా చురుకు - తనమిమ్మునే త్వరపడగలను ॥త్వరగా॥


(1900 ఏండ్ల క్రిందట వచ్చిన "యేసుక్రీస్తు ప్రభువే నేడు మరల రానైయున్న రాకకే" రెండవ రాకడ అని పేరు.)


1. ప్రశ్న:- యేసుప్రభువు రెండవమారు వచ్చునని కొందరనుచున్నారు. మనము ప్రార్థించునప్పుడెల్ల ఆయన మనయొద్దకు వచ్చుచునేయున్నాడు గనుక రెండవమారు వచ్చుట అనునది లేనేలేదని మరికొందరనుచున్నారు.


జవాబు:- మొదటిమారు వచ్చునని ప్రవక్తలు చెప్పినది నెరవేరినది. నేను రెండవమారు వచ్చెదనని ప్రభువు చెప్పినదికూడ నెరవేరును. “నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును” (యోహాను 14:3). “గలిలయ మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మియొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.” - (అపో.కార్య. 1:11). పౌలు ప్రవచించెను:- "సహోదరులారా, నిరీక్షణలేని ఇతరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారినిగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు. యేసు మృతిపొంది తిరిగిలేచెనని మనము నమ్మినయెడల అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు ఆగమన పర్యంతము సజీవులమై నిలచియుండు మనము నిద్రించిన వారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్ధముతోను, దేవునిబూరతోను పరలోముకము నుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము. కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి". (1థెస్స. 4:13-17).


2. ప్రశ్న:- మిక్కిలి త్వరలోవచ్చునని కొందరనుచున్నారు. ఈ మాట చాలా కాలమునుండి వినుచున్నాము. ఇంకను రాలేదేమి?


జవాబు:- త్వరగా వచ్చుటకు ఆయనకు అడ్డమేమియు లేదు. గుర్తులు జరుగవలెను అను సంగతి ఈ మాటకు ముందువ్రాసి చదువవలెను - గుర్తులు అయిన తరువాత ఆయన వస్తారు అని చదవండి. త్వరగా వచ్చుచున్నాను అను మాట ఒక నాస్తికుడు విని, అలాగైతే ఆయన ఎప్పుడుబడితే అప్పుడే వచ్చునన్నమాట అని పలికెను. ఔను ఇదే దాని అర్ధము. ప్రభువు త్వరగా వచ్చెదనని అనినయెడల త్వరగానే వచ్చును. ఆయన తననుబట్టి మాత్రమే చెప్పవలసి వచ్చునప్పుడు త్వరగా వచ్చునుగాని, మనలనుబట్టి ఆయన ఆలస్యము చేయవలసి వచ్చుచున్నది. “కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్ధానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్చయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు. 2పేతురు 3:9.


3. ప్రశ్న:- గురుతులన్నారు ఆ గురుతులేవి?


జవాబు: 1) యూదులు: దైవనియమిత జనులగు యూదులు దైవాజ్ఞలను మీరినందున అన్ని దేశములకు చెదరిపోవలసి వచ్చెను. ఇప్పుడు క్రీస్తు రెండవసారి వచ్చుననగా వారు తమ స్వదేశమగు పాలెస్తీనాకు వచ్చెదరని ఆ ప్రవచనములో కనబడుచున్నది. (యెహెజ్కేలు 37:21-22; జెఫన్యా 3:19-20). నేడు వారు పాలస్తీనాకు వచ్చుచున్నారని వార్తాపత్రికలవల్ల తెలిసికొనుచున్నాము కాబట్టి ఆయన రాకడ దగ్గరబడినది.


2) బస్సులు: క్రీస్తు ప్రభువు వచ్చి విశ్వాసులను కొంచుపోగానే లయకర్తయైన అంతెక్రీస్తుయను క్రీస్తు విరోధి భూమినేలనారంభించి మిగతా విశ్వాసులను అనేక విధములుగా ఏడేండ్లు హింసించును. గనుక క్రీస్తు రాకడయును అంతెక్రీస్తు రాకడయును వెంటవెంటనే రావలసియుండును. ప్రభువు వచ్చుననగా బస్సులు, కారులు తిరుగునని ఒక ప్రవచనములో నున్నది. (నహూము 2వ అధ్యా.) నహూము ప్రవక్తకు మనకాలపు బస్సులు దర్శనములో కనబడినవి. వాటినే ఆయన రథములనెను. “వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి, రాజమార్గములలో రథములు యొక దానిమీద నొకటి పడుచు పరుగెత్తుచున్నవి, అవి దివిటీలవలె కనబడుచున్నవి, మెరుపులవలె అవి పరుగెత్తుచున్నవి. (నహూము 2:4)


ఈ మాటలు మన బస్సులకు ఎంతగా సంబంధించు చున్నవో చూడుడి. కాబట్టి ఆయన రాకడ దగ్గరబడినది. పూర్వకాలమందు నహూము ప్రవక్త నినెవే పట్టణ నాశనమునుగూర్చి ప్రవచించినప్పుడు ఈ మాటలు చెప్పెను. అప్పుడు రథములు వెళ్ళియుండిన యెడల అవి ఈ కాలములోని బస్సులకు ముంగుర్తులైయున్నవి.


3) ఉద్యోగములు దొరుకక పోవుట: క్రీస్తు వచ్చుననగా పనులు దొరకని ఇబ్బందికాలము వచ్చును అని ఒక ప్రవచనము గలదు. “ఆ దినములకు ముందు మనుష్యులకు కూలి దొరకక యుండెను, పశువుల పనికిబాడుగ దొరకకపోయెను.” (జెకర్యా 8:10) ఇది మనకాలములో జరిగినది గనుక ప్రభువు రాకడ దగ్గరబడినది.


4) పరిశుద్ధాత్మ బాప్తిస్మము: యేసు వచ్చుననగా సర్వజనులమీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునని ప్రవచనము గలదు (యోవేలు 2వ అధ్యా॥) పెంతెకోస్తునాడు ఒక్క యూదుల జనాంగము మీదనే పరిశుద్ధాత్మ కుమ్మరింపబడెను. అయితే మన కాలములో అన్ని దేశములవారిమీదను దేవుడాత్మను కుమ్మరించుచున్నాడు. దీనికే పరిశుద్ధాత్మ బాప్తిస్మమని పేరు. ఇది క్రీస్తుప్రభువు పరిశుద్దాత్మతో మనకిచ్చు బాప్తిస్మము ఇదివరకు మనము పొందిన బాప్తిస్మము నీళ్ళతో పాదిరిగారిచ్చిన ఆత్మీయ జీవన జన్మమునకు సంబంధించిన బాప్తిస్మము. క్రీస్తుప్రభువిచ్చుచున్న పరిశుద్దాత్మబాప్తిస్మము ఆత్మీయ జీవనముయొక్క వృద్ధికి సంబంధించిన బాప్తిస్మము, ఈ బాప్తిస్మము అంత్యదినములయందు ఇయ్యబడునని (అపో.కార్య. 2:17)లో నున్నది. అంత్యదినమనగా సంఘము యొక్క అంత్యకాలము. ప్రభువీవేళ వచ్చి విశ్వాసుల సంఘమును తీసికొని వెళ్ళితే అది సంఘముయొక్క అంత్యకాలమైయుండును. రాకడకు సిద్ధపడేటందుకు దేవుడీకాలమందు కోరిన అందరకు పరిశుద్దాత్మ బాప్తిస్మము ఇచ్చుచున్నాడు. ఇది ఆత్మస్నానకాలము గనుక ప్రభువు రాకడ దగ్గర బడినది.


5) కలత కాలము: లోకనివాసులను భయపెట్టు సంగతులు అనేకములు జరుగును యని ప్రభువు ప్రవచించెను. (మత్తయి 24; మార్కు 14; లూకా21 బాగుగా చదువుడి) యుద్ధములు, కరువులు, భూకంపములు, ఆకాశ మండలములందు మార్పులు, సముద్రమందలి ఘోష ఈ మొదలైనవి చూచి ప్రజలు లోకమునకు ఇకముందు కెట్టిమార్పు రానై యున్నదో యని భయపడిపోదురు.


ఇవి మనకాలములో జరుగుచున్నవి కదా! ఇట్టివి ఇదివరకు జరుగలేదా? యని కొందరడుగుచున్నారు. ఒక భేదమున్నది. నేడొక దేశమున యుద్ధము రేగుచున్నట్లనుమానమున్న యెడల ఆ సంగతి అన్ని దేశములకు మరునాడే తెలిసిపోవును. అందుచే సర్వ జనాంగములవారికి దిగులు పుట్టును. పూర్వమైతేనో వార్తలంత త్వరగా వ్యాపింపలేదు. నేడు త్వరగా వ్యాపింపజేయు సాధనములు గలవు. గనుక భీతి సర్వలోక భీతిగాని ఏదోయొకదేశ భీతిగాదు. ఇట్టి భీతికాలము మనకాలమే గనుక ప్రభువు రాకడ దగ్గరబడినది.


రాకకుముందు వచ్చు కష్టములు వేరు. రాకకు పిమ్మట అంతెక్రీస్తు పరిపాలనలో ఏడేండ్లు వచ్చు కష్టములు వేరు.


నేడున్నవి ఒక విధమైన గందరగోళములు కావు. అవి యనేకములు. రాజ్యాంగ విషయములో తర్కములు, కలహములు ఇందువలన ప్రజలకు నెమ్మది యుండదు. మత విషయములో తర్కములు, కలహములు ఇన్ని రకములైన బోధలుంటే ఏది నిజమో తెలియక మా మతులు చెడిపోవుచున్నవి అని ప్రజలు చెప్పుచున్నారు. ఈ కాలపు పిల్లలు తల్లదండ్రులమాట వినుటలేదు. కనుక కుటుంబములో నెమ్మదిలేదు. ఇన్ని గందరగోళములలో లోకమునకు భీతి యుండదా? ఉన్నది నేడు.


6) అబద్ధ ప్రవక్తలు - నేనే క్రీస్తును (అనగా నేనే లోక రక్షకుడను) అని చెప్పుకొనువారు లేతురని ప్రభువు ప్రవచించెను. ఇట్టివారు మనకాలములో నలువదిమంది వెడలినట్లొక వార్తపత్రికవలన తెలిసినది. ఇది మనకాలమే గనుక ప్రభువు రాకడ దగ్గరబడినది.


క్రీస్తు రక్షకుడు కాడని వీరి బోధకర్థము. సంఘము ఎత్తబడితేనేగాని అంతెక్రీస్తురాడు. గాని అట్టివారు అనగా క్రీస్తు విరోధులు ప్రతి శతాబ్ధములోను ఉన్నారు. “చిన్నపిల్లలారా! ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధివచ్చునని వింటిరిగదా! ఇప్పుడును అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు. ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదటినుండి దేనిని వింటిరో అది మీలో నిలువనియ్యుడి; మీరు మొదటినుండి వినినది మీలో నిలిచినయెడల మీరుకూడ కుమారునియందును, తండ్రియందును నిలుతురు. (యోహాను 2:18-21). (ఇప్పుడున్నవారు అబద్ధ క్రీస్తులు).


7) అబద్ధ ప్రవక్తలు : రాకకుముందు అబద్ధ ప్రవక్తలు లేతురని ప్రభువు ప్రవచించెను. పైకి గొర్రె చర్మధారులై క్రూరమైన తోడేళ్ళుగా నుండువారే అబద్ధ ప్రవక్తలని ప్రభువు వివరించెను. (మత్తయి 7:15-20) (అబద్ధ ప్రవక్త అంతెక్రీస్తునకు సహాయము చేయుటకు వచ్చును) (ఇప్పుడు రాడు) ఇప్పుడు వచ్చియున్నవారు అబద్ధ ప్రవక్తలు.


“ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, ఏ ఆత్మ ఒప్పుకొనునో యది దేవుని సంబంధమైనది; ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అని దేవుని సంబంధమైనది కాదు; దీనినిబట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినినసంగతి ఇదే; ఇది వరకే అది లోకములో ఉన్నది. (1యోహాను 4:1-3). క్రీస్తు రక్షకుడని ఒప్పుకొనని వారు అబద్ధ ప్రవక్తలు.


8) అక్రమ వృద్ధి : 'అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును' (మత్తయి 24:12) అని ప్రభువు ప్రవచించెను. 'అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము ఏలాగనగా మనుష్యులు స్వార్ధప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవునికంటె సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునైయుందురు” (2తిమోతి 3:1-4) అని పౌలు ప్రవచించెను. ప్రజలు వృద్ధియైన కొలది వారితోపాటు పాపమును వృద్ధియగుచున్నది. మనోవాంఛను నెరవేర్చుకొనుట పాపముకాదని కొందరి వాదము. పాపమునకు శిక్ష తప్పదు. నరకము తప్పదు అని ప్రజలను భయపెడితే, ప్రపంచము నడవదనియు, వర్తకము సాగదనియు మరికొందరి వాదము. నేరస్థులు కారనువారు ఎందరు? నిరపరాధులను అపరాధులనుగా బుజువుపరచువారెందరు? దేవుని నమ్మకపోవుట అను పాపమునకు అవిశ్వాసమని పేరు. ఇది దేవుడు చేయు మేలును అనుభవింపనియ్యదు. అవిశ్వాసము దేవుడు తొలగింపగోరు కీడును తొలగింప నియ్యదు. అవిశ్వాసమెంత కీడో, పాపమో చూడండి.


ఈ కాలములో ఇది వ్యాపించియున్నది. 'దేవుడు తాను ఏర్పరచుకొనినవారు దివారాత్రులు తన్నుగూర్చి మొర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారి విషయమేగదా ఆయన ఆలస్యము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద విశ్వాసము కనుగొనునా? (లూకా 18:7-8). వాక్యము తరచి లోకములోని గుర్తులు కనిపెట్టి ప్రార్ధన పూర్వకముగా ఆలోచించి క్రీస్తు ప్రభువు రాకడ దగ్గరపడినది అని విశ్వాసులు చెప్పుచున్న మాటలు నమ్మక హేళన చేయువారికి వాక్యమే జ్ఞాన విశ్వాసోదయము కలిగించుగాక!


9) స్వానుభవము: రాకడ సమీపము కాదనుకొనువారికి ఒక సలహా. పదియాజ్ఞల వివరములనుబట్టి మీ హృదయములు మరల పరీక్షించుకొని పాపక్షమాపణార్థమగు ప్రార్ధన చేసికొనండి. తర్వాత రాకడ వాక్యములు, ఇతరుల అభిప్రాయములు ఆలోచించండి. ఆ తర్వాత దైవసన్నిధిలో మోకరించి రాకడను గురించి బైలుపరుపవలసినదని వేడుకొనండి. పిమ్మట మీకు తృప్తి కలుగువరకు సన్నిధిలో నిశ్శబ్ధముగా నుండండి. అప్పుడేమి జరుగును? సత్యమేదో, అసత్యమేదో తెలిసిపోవును. ఇది మా దృష్టికన్నిటికంటె గొప్పగుర్తుగదా! (ప్రభువా! నీవు నాకు సత్యము తెలియపరచిన నేను నమ్మి తప్పకుండ అదే ప్రకటింతును యని ముందుగా ప్రమాణము చేయవలెను.)


4. ప్రశ్న:- ఎవరెత్తబడుదురు. క్రైస్తవులందరునా?


జవాబు:- ప్రభువు చరిత్రలో ముఖ్యాంశము లేవనిన జన్మము, సాతానుపై విజయము, బోధ, అద్భుత క్రియోపకారములు, పవిత్ర జీవనము, మరణము, పునరుత్ధానము, ఆరోహణము అని ఇదివరకే జరిగిపోయినవి. ఇకముందు జరుగవలసినది. రెండవరాకడ ఇదియును ఆయన చరిత్రలోనిదేగదా? కాబట్టి దీనిని నిర్లక్ష్యముగా చూడరాదు. అన్నియు నమ్మినవారెట్లు పూర్ణవిశ్వాసులై యుండగలరు? ఆవగింజంత విశ్వాసముంటే చాలదా! అని అందురేమో! ఆవగింజ బద్దకాదు, అది సంపూర్ణమైన విత్తనము. అది పరిమాణమునకు చిన్నదిగాని లక్షణమునకు చిన్నది కాదు. విత్తనమున కుండవలసిన లక్షణములన్నియు నున్నవి. క్రీస్తు సంగతులన్నియు నమ్మునదియై యుంటేనే విశ్వాసము. సంపూర్ణ విశ్వాసముతో ఎవరెత్తబడుదురో పేర్లు చెప్పలేము. రెండు గుంపులవారెత్తబడుదురని బైబిలులో నున్నది. మొదటి గుంపు క్రీస్తునందు మరణించిన మృతులు. రెండవగుంపు సిద్ధపడిన సజీవులగు విశ్వాసులు, వీరికి మరణముండదు. వీరి శరీరము వెంటనే అంతర్ధానమగును. వీరికి మహిమ శరీరము కలుగును.


5. ప్రశ్న:- విద్యలోను, నాగరికతలోను, వర్తక వ్యాపారములలోను, క్రొత్త సంగతులు కనిపెట్టుటలోను, ఎవరిమతము వారు సంస్కరించుటలోను లోకము నేడెంతో వృద్ధిపొందుచుండగా క్రీస్తు నాశనము చేయుటకు ఇంత త్వరలోనే వచ్చునా? ఇట్టి మాటలు జెప్పి ప్రజలను భయపెట్టుట ఎందుకు?


జవాబు:- క్రీస్తురాకడ మరణముకాదు. లోకాంతమును కాదు. భయమెట్లుండును? అందరిని నాశనము చేయుటకు ఆయన వచ్చుట లేదు. భూమిమీదకి శ్రమలు రాబోవుచున్నవని ఆయనకు తెలుసును కనుక తనవారిని తీసికొని వెళ్ళుటకు ఆయన వచ్చును. భయమెందుకు? సంతోషము గదా! “ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి,” “మీ విడుదల సమిపించుచున్నది.” అని ప్రభువు చెప్పెను (లూకా 21:28). “ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము. కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి” అని పౌలు చెప్పెను. (థెస్స 4:17,18).


ఈ ఇద్దరి మాటలలో భయపెట్టుమాటేది? క్రిస్మస్ రోజున దూత శుభవార్త తెస్తే కథాసందర్భము తెలియక గొల్లలు భయపడిరి. అట్లే కొందరు రాకడ వార్త విని భయపడుచున్నారు. దీనికేమి చేయగలము?


6. ప్రశ్న:- క్రీస్తు వచ్చిన తరువాత ఇంకను లోకముండునా?


జవాబు:- ఉండకేమి? ఎప్పటివలె నుండును. సిద్ధపడినవారే వెళ్ళుదురు. తక్కినవారందరు అన్ని మతములవారు నుందురు. నామక క్రైస్తవులు నుందురు.


7. ప్రశ్న:- లోకముంటే ఏమేమి జరుగును?


జవాబు:- వెంటనే అంతెక్రీస్తు అను క్రీస్తు విరోధి సర్వలోకమును ఏలును. మిగతా విశ్వాసులను అనేక విధములుగా హింసించును. ఇవి సహింపలేనివి. చావు కోరుకొందురు. రాదు. బాధపోదు. ఇది ఏడేండ్ల పరిపాలన. అతని పాలనకు సహాయకారులు అబద్ధ ప్రవక్తయును, దయ్యములును. చివరకు క్రీస్తుకును, అంతెక్రీస్తుకును హర్మగెద్దోనువద్ద యుద్ధము. క్రీస్తు గెలుచును. అంతెక్రీస్తును, దయ్యములను ఆయన నరకములో వేసి, సాతానును చెరసాలలో బంధించును. తర్వాత క్రీస్తు ఈ లోకములో వెయ్యేండ్లు శాంతి పరిపాలన చేయును. చివరకు సాతానుకు విడుదల కలుగగా అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవును. సాతానుని క్రీస్తు నరకములో వేయును. మరియు సజీవులకును, మృతులకును తీర్పు విధించును. ఆ తర్వాత అంత్యతీర్పు.


8. ప్రశ్న:- అబ్బో! ఇంత కథ యున్నదా?


జవాబు:- ఉన్నది. ప్రకటన గ్రంథము బాగుగా చదవండి. కార్యక్రమము తెలిసికొనగలరు.


9. ప్రశ్న:- ఇంక ప్రశ్నలు లేవుగాని ప్రభువు వచ్చినప్పుడు సిద్ధముగా నుండలేనేమో! అను ఒక దిగులు పట్టుకొన్నది. సిద్ధపడుట ఎట్లో?


జవాబు:- ఆయన రావడము సిద్ధపడినవారిని తీసికొని వెళ్ళడము ఒక్క క్షణములో జరుగును. గనుక ఇప్పుడే సిద్ధపడి యుండవలెను. ఆ క్షణము తప్పితే ఇక పుట్టగతులులేవు.


10. ప్రశ్న:- సిద్ధపడిన వారు చివర గడియలో తప్పిపోవడముండునా?


జవాబు:- పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్యకలలో మిగిలిపోయినవారి సంగతి చూడండి. వారు కన్యకలే. వారును బయలుదేరినవారే. వారును దివిటీలు పట్టుకొన్నవారే, ఎదుర్కొనే మనసు గలవారే. వారును అర్ధరాత్రి కేక విన్నవారే. వారును నిద్రనుండి మేల్కొన్నవారే. వారును మొదటి అయిదుగురు జట్టులోనివారే. (వారును వీరును కునికిరి) వరుని ఎదుర్కొన రండి అను ఒక కేక వినబడినప్పుడు రెండవ జట్టువారికి నూనె లేకపోయెను. కొనుక్కొనవెళ్ళిరి. అంతలో వరుడువచ్చెను. రెండవ ఐదుగురు ఉండిపోయిరి. ఎంత విచారకరమైన సంగతి? ఏదోయొక లోటున్నందున వెళ్ళుటకు వీలులేదు అని తెలిసికొనండి. (కన్యకలే వెళ్ళలేకపోతే తక్కినవారిగతి ఏమి?) (యోహాను 3:29 ప్రక. 9:7-9) ప్రక. 22:17).


11. ప్రశ్న:- ఆయన రాకడ ప్రభువునకే తెలియదట మీ కెట్లు తెలుసును?


జవాబు:- మాకు తెలుసునని చెప్పుటలేదు. గుర్తులనుబట్టి సమీపమని చెప్పుచున్నాము. (ప్రభువుయొక్క మానుష్యత్వమునకు తెలియదు గాని దైవత్వమునకు తెలియదా?)


12. ప్రశ్న:- సువార్త ప్రకటన కానిదె ప్రభువు వస్తాడా?


జవాబు:- పెండ్లికుమార్తెగా పోల్చబడిన విశ్వాసుల గుంపు వెళ్ళిపోయిన తర్వాత, ఏడేండ్ల శ్రమలు ముగిసిన తర్వాత, ఆ తర్వాత వచ్చు వేయ్యేండ్లు క్రీస్తు పరిపాలనలో సువార్త అన్ని బాషలలో ప్రతి మనుష్యునికి ప్రకటింపబడును. అప్పుడు అంతము వచ్చును.


13. ప్రశ్న:- ఆయన రాకడ మన కాలములోనే వచ్చునా?


జవాబు:- జాడలు చూచినట్లయితే అట్లే కనబడుచున్నది. ఆయన ఎప్పుడు వచ్చినను మనము నిత్యము సిద్ధపడియుండుట క్షేమకరము గదా! ఆ తలంపు లేకుండుట ఎట్లు క్షేమకరము కాగలదు? ఆ తలంపు లేనియెడల సిద్ధపడుట అనునదే యుండదు. నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని దాసుడు తన మనస్సులో అనుకొనును. ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చును అని ప్రభువు చెప్పిన సంగతి జ్ఞాపకము తెచ్చుకొనండి. (మత్తయి 24:43-51; లూకా 12:35-40).


14. ప్రశ్న:- మన కాలములోనే వస్తే సిద్ధపడుట ఎట్లో తెలియకున్నది.


జవాబు:- క్రీస్తు వస్తాడని యూదులు వందలాది సంవత్సరములు కనిపెట్టి కనిపెట్టి తీరా ఆయన వచ్చిన తరువాత నమ్మరైరి. నేటికాలపు ప్రజలలో అనేకులు కూడ అట్లే నమ్మకుందురు. దేవునికి సమర్పణ చేసికొనండి. పరిశుద్ధాత్మయే మిమ్మును సిద్ధపరచును.


15. ప్రశ్న:- ఇంకను కొన్ని వాక్యములు చెప్పగలరా?


జవాబు:- ప్రభువుయొక్క ప్రత్యక్షతకు ఆపేక్షింపవలెను అని 2తిమో. 4:8వల్లను, ఆయన ప్రత్యక్షత కొరకెదురు చూడవలెనని 1కొరి. 1:7 వల్లను ప్రభువు భోజనము పుచ్చుకొన్నప్పుడెల్ల రెండవ రాకడకూడ జ్ఞప్తికి వచ్చునని 1కొరి. 11:26వల్లను అర్థమగుచున్నది. జల ప్రళయ కథ - ఆది 24 దాని. 2వ అధ్యా; దాని. 7వ అధ్యా॥.


16. ప్రశ్న:- మీరు నాకు ఇవ్వవలసిన సలహాలు ఇంకా ఏమైనా ఉన్నవా?


జవాబు:- ఎ) హనోకుయొక్క ఆరోహణమును గూర్చియు, (ఆది 5:21-24) జలప్రళయమును గురించియు, (ఆది 6,7,8,9 అధ్యా॥!)
ఏలీయా ఆరోహణమును గురించియు, (2రాజులు 2వ అధ్యా॥) ఇస్సాకు వివాహమును గురించియు, (ఆది 24 చదవండి) మరియు సొలొమోను పాట, ప్రకటన గ్రంథము బాగుగా చదవండి.


బి) ప్రభువు రాకడ సమీపమని నమ్మువారు అన్ని పనులు మునుపటికంటే ఎక్కువ చేయవలెను (కట్టివేసి కూర్చుండరాదు).


ప్రార్ధన: అన్ని మతములవారిని గురించియు, అన్ని దేశములను గురించియు, పది యాజ్ఞలలో మనకు జ్ఞాపకమువచ్చు ఒక్కొక్క పాపమునకు లోనైన ప్రతివారిని గురించియు, మీరెరిగిన ప్రతివారిని గురించియు, మీ ప్రార్థన కోరిన ప్రతివారిని గురించియు, ప్రతి అంశముమీద మీ ప్రార్ధనలు ముగించండి. వార్తాపత్రికలు చదువుచూయుంటే ప్రార్ధనకు కొత్త క్రొత్త అంశములు దొరుకును. మరియు మీరు స్వంత ఉపయోగము నిమిత్తము చేయవలసిన ప్రార్ధనలుకూడ ముగించండి. ఆ విధముగానే మీరు ఒప్పుకొనవలసిన పాపము లొప్పుకొనండి. విసర్జింపవలసినవి విసర్జించండి.


బైబిలు పూర్తిగా మరొకమారు చదివివేయండి. ఏమియు మిగల్చవద్దు. అంశముల ప్రకారముగా గూడ ముగించండి.


సువార్త ప్రకటన: మీరెందరికి సువార్త ప్రకటింపగలరో ఆ అందరికి ప్రకటించివేయండి. ప్రతివారికి రక్షణవార్త పూర్తిగా చెప్పివేయండి. ఈ విధముగా క్రైస్తవుని విధులన్నియు పూర్తిగా నెరవేర్చండి.


సి) సహవాసము: సువార్తికుడైన యోహాను క్రీస్తుప్రభువును భూలోకములో బాగుగా ఎరుగును. స్వయముగా ఆయనను చూచి, ఆయన మాటలు విని, ఆయనతో మాటలాడి, ఆయన లక్షణములు నిదానించి చూచి, ఆయన అద్భుత కార్యములను, శ్రమలను, మరణమును ఎరిగినవాడై యుండెను. ప్రభువు పరలోకమునకు వెళ్ళిన కొన్నాళ్ళకు యోహాను పత్మసు ద్వీపమున పరవాసియై యుండగా ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు చూచి తాను పాలస్తీనాలో చూచిన యేసేయని గ్రహించెను. మహిమకు భయపడినను, మిగుల ఆనందించెను. క్రీస్తు ఆయనకు క్రొత్త క్రీస్తుకాడు. మనము ఇక్కడ క్రీస్తును బాగుగా ఎరిగియుంటే ఆయన వచ్చినప్పుడు బహుగా ఆనందింతుము. గనుక ఈ అనుభవము ఇక నెక్కువ సంపాదించుటకు రాకడ పేరు మీద మరొకమారు నాలుగు సువార్తలు బాగుగా చదువుదము.


17. ప్రశ్న:- నిజము తెలుసుకోవడము కష్టముగదా?


జవాబు:- బైబిలు చదివితేగూడ కష్టమా, కడవరి కాలములో అబద్ధ ప్రవక్తలు వచ్చెదరని బైబిలులోనున్న సంగతి మరచిపోయి వారి బోధ ఎట్టిదో అదికూడ మరచిపోయి, కొందరు వారి జట్టు చేరి మోసపోవుచున్నారు. ఇదియొక రకము జనము. కొందరు దుర్బోదకులను గురైరిగి జాగ్రత్త పడుచున్నారు. ఇదొకరకము జనము. కొందరు అబద్ధ ప్రవక్తలను గురించియు, అబద్ధ బోధకులను గురించియు వివరించుచు మనము ఇదివరకు బైబిలు అర్ధములలో నేర్చుకొన్న సంగతులలో ఇంకా కొన్ని సంగతులుకూడ నేర్చుకొనండి అని బోధిస్తూయుంటే ఇట్లు బోధించువారే అబద్ధ ప్రవక్తలని మరికొందరు వారి మంచిమాటలు వినక మోసపోవుచున్నారు. ఇదొక రకము జనము. కొందరికి దొంగ వచ్చినా దొంగయే. దొర వచ్చినా దొంగయే.


18. ప్రశ్న:- రాకడ ఎప్పుడో తెలియునా?


జవాబు:- వినుడి. "జాగ్రత్త పడుడి మెళకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆ కాలమెప్పుడు వచ్చునో మాకు తెలియదు" ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి ప్రతివానికి వానివాని పని నియమించి మెళకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచిపోయినట్లే (ఆ కాలము ఉండును) ఇంటి యజమానుడు ప్రొద్దు క్రుంకి వచ్చునో, అర్ధరాత్రికి వచ్చునో చూచునేమో గనుక మీరు మెళకువగా నుండుడి నేను మీతో చెప్పుచున్నది మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగావచ్చి మీరు నిద్రపోవుచుండుట... అందరితోను చెప్పుచున్నాను. "మెళకువగా నుండుడి" అని ప్రభువు చెప్పెను. (మార్కు 13:33-37).


1. సాయంకాలము: అనగా యూదుల మత సంఘకాలములోని చివరికాలము. ఇదే క్రైస్తవమత సంఘకాలములోని ప్రారంభకాలము. ఆది సంఘకాలము (శిష్యుల కాలము) అప్పుడు ప్రభువు రాలేదని మనకు తెలుసును.


2. అర్ధరాత్రి కాలము: అనగా క్రైస్తవమత సంఘ కాలములోని మధ్యకాలము (మతోద్ధారణ కాలము) అప్పుడాయన రాలేదు.


3. కోడికూత కాలము: అనగా మధ్యకాలమైన వెనుక వచ్చిన కాలము. (మిషనెరీలకాలము) అప్పుడాయన రాలేదు.


4. తెల్లవారు కాలము: అనగా మన కాలము (మిషనెరీలవల్ల విన్న వార్త మనము స్వయముగా బోధించుకాలము) గనుక ఆయన ఇప్పుడే వచ్చేటట్టుగా నున్నది. ఇంత స్పష్టముగానుంటే నమ్మకూడదా!


19. ప్రశ్న:- దేవుడు రేపో మాపో వచ్చెదనని మీకు చెప్పినాడా ఏమి?


జవాబు:- దేవుడు రేపో మాపో రాడని మీకు చెప్పినాడా ఏమి?


20. ప్రశ్న:- సరే మాకు చెప్పలేదు. మీకు చెప్పలేదు. ఊరుకొందామా?


జవాబు:- మనము ఊరుకుంటే రాకడ ఊరకుండునా ఏమి? (మత్తయి 25:5-6).


21. ప్రశ్న:- ఆ దినమును గూర్చియు గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోక మందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. (మార్కు 13:32) దీనిని గురించి వ్యాఖ్యానకర్తలు ఏమి చెప్పుచున్నారు?


జవాబు:- అప్పుడు దేవుడు కేవలము మనిషి వరుసలోయున్నాడు. గనుకను ఫిలిప్పీ 2:7 ప్రకారము తన్ను తానే రిక్తునిగా చేసికొనెను గనుకను ఆయనకు తెలియదంటే ఆశ్చర్యము కాదు. ఆయన దేవుడు గనుక తెలియును. మనుష్యుడు గనుక తెలియదు. దినము గడియ తెలియదని యున్నది. గాని కాలము సంవత్సరము తెలియదని యున్నదా?


22. ప్రశ్న:- ఇంతకాలము లేని రాకడ బోధ ఇప్పుడెందుకు మీరు బోధించుచున్నారు?


జవాబు:- ఎందుకా? గురుతులు అయిపోయినవి గనుకను. ప్రపంచమంతయు గందరగోళములో దిగిపోయినది గనుకను రాకడను గూర్చి విపరీత బోధలు వ్యాపించుచున్నవి. గనుకను రాకడ సమీపములో ముమ్మరముగా బోధించక మరెప్పుడు బోధించుట?


23. ప్రశ్న:- ఆది సంఘకాలములో వస్తాడని కొందరనుకొన్నారు. ఐరోపా యుద్ధమప్పుడు ఇదిగో వస్తాడని కొందరన్నారు (1914-1918).
ఈలాగు ప్రతి శతాబ్ధములో ఎవరో ఒకరు అంటూనేయున్నారు. ఇప్పుడు మీరు అదే అంటూయున్నారు. గనుక నమ్మడమేలాగు?


జవాబు:- వారు వీరు అంటున్నారు అని మీరు అంటున్నారు. గాని బైబిలులో ప్రవచింపబడి మన కాలములో కనబడిన గురుతులు అంటూ యున్నవని మీ రెందుకు అనుటలేదు. ఇన్ని బుజువులుంటే నమ్మకపోవడము ఎట్లు? ఎప్పుడు చెప్పినను రాకడ ఇప్పుడు రాదు. ఇప్పుడు బోధించకండి అని అంటూయుంటే ఎప్పుడు బోధించుట? ఆయన వచ్చే రోజునకూడ ఇట్లే అంటారు.


24. ప్రశ్న:- ప్రభువు దొంగవలె వచ్చునని బైబిలులో నున్నది గదా! రేపో మాపో వచ్చునని మీరెందుకంటున్నారు?


జవాబు:- రాకడకు సిద్ధపడని అవిశ్వాసులకు క్రీస్తు రాకడ చెప్పకుండ వచ్చే దొంగ రాకడవలే నుండక, చెప్పివచ్చే దొర రాకడవలె నుండునా? రాకడకు సిద్ధమగుచున్న విశ్వాసులకు క్రీస్తు రాకడ చెప్పి వచ్చే దొర రాకడవలె నుండును గాని, దొంగరాకడవలె నుండునా?


యూదుల జనాంగము క్రీస్తును నమ్మలేదు

1. వారి వేదశాస్త్రమగు పాత నిబంధనలో క్రీస్తు మొదటి రాకడను గురించిన ప్రవచన వాక్యములు, ఆయన చరిత్రలో ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుచుండుట స్వయముగా చూచినను వారు నమ్మలేదు.


2. ఎవరిని మహానుభావుడని వారు గౌరవించినారో ఆ మహర్షియగు యోహాను చెప్పి క్రీస్తును చూపించినను వారు నమ్మలేదు.


3. క్రీస్తు రోగులను బాగుచేయుట, దయ్యములను వెళ్ళగొట్టుట, మృతులను బ్రతికించుట మొదలగు మహోపకారములు చేసినను నమ్మలేదు.


4. క్రీస్తు నీళ్ళు ద్రాక్షారసముగా మార్చుట, ఐదు రొట్టెలు ఐదు వేలమందికి సరిపడు రొట్టెలుగా వృద్ధి చేయుట మొదలగు అద్భుతములు చేసినను వారు నమ్మలేదు.


5. క్రీస్తు ఆశ్చర్యానందము కలగించిన దివ్యోపదేశము వినిపించినను వారు నమ్మలేదు.


6. క్రీస్తు శిక్షింప సమర్దుడైనను వారు పెట్టిన హింసలు సహించుచు అద్భుతకరమగు శాంత స్వభావము కనబరచినను వారు నమ్మలేదు.


7. దైవజనులకు, పరజనులకు ఆయనను గురించి మంచి సాక్ష్యము ఇచ్చినను వారు నమ్మలేదు.


8. ఆయన మరణకాలమందు చీకటి మూలముగాను, భూకంపము మూలముగాను సృష్టి ఆయన మహత్తును ప్రత్యక్ష పరచినను వారు నమ్మలేదు.


9. ఆయన మరణము కాగానే సమాధులలోనుండి పరిశుద్ధులు లేచివచ్చి కనబడినను వారు నమ్మలేదు.


10. చనిపోయిన మూడవనాడు ఆయన సమాధిలోనుండి బ్రతికి వచ్చినను వారు నమ్మలేదు.


11. ఆయన సన్నిధి భాగ్యమనుభవించిన శిష్యులు చెప్పినను వారు నమ్మలేదు.


క్రైస్తవ జనాంగము క్రీస్తు రెండవ రాకడ సమీప బుజువును నమ్ముటలేదు

1. రెండవ రాకడకు ముందే ఏయే గురుతులు జరుగునని బైబిలులో నున్నదో ఆయా గుర్తులు జరుగుచున్నవని సృష్టియు, లోక చరిత్రయు తెలియపరచుచున్నను నమ్ముటలేదు.


2. కొందరు విశ్వాసులు దైవ వాక్యములను, జరిగిన గుర్తులను ఎత్తి పత్రికాదులలో ప్రచురించుచు బుజువు పరచుచున్ననూ నమ్ముటలేదు.


3. మరికొందరు విశ్వాసులు దైవసన్నిధిలో రాకడను గురించి ప్రార్ధనా పూర్వకముగా చెప్పుచున్ననూ నమ్ముటలేదు.


4. బైబిలులోని సర్వాంశములు నమ్ముచూ ఈ ఒక అంశమునే నమ్మని భక్తులు మరొకమారు మా బైబిలు మిషను వంక మీద తమ మనస్సాక్షియొక్క సాక్ష్యమును, ఉన్నత విద్యవలన విస్తరించిన జ్ఞానముయొక్క సాక్ష్యమును ఆలకింపవలెనని రాకడ విశ్వాసులిచ్చే సలహాలోని యదార్థతనైనను నమ్ముటలేదు.


5. ప్రభువు మాకు దర్శనములో కనబడి చెప్పినాడని వేరే కొందరు విశ్వాసులు చెప్పుచున్నను నమ్ముటలేదు. మీరుకూడ ప్రార్థిస్తే మీకును చెప్పునని చెప్పుచున్నను నమ్ముటలేదు.



క్రీస్తు రాకడయందు నమ్మికయుంచుడి, నిత్యనివాసములోని మహిమను వెదకుడి.
యేసుప్రభువు వచ్చుచున్నాడిదిగో వినరండి ...

Maranatha