స్వాతంత్రోత్సవ ధ్యానములు


ప్రార్థన: ప్రభువా! మమ్మును మీ స్వరూపమందు సృష్టించి, మీ లక్షణమైన స్వాతంత్ర్యమును అనుగ్రహించి, మీ సన్నిధిని చేరు స్వతంత్రతను దయచేసినందుకు వందనములు. మీరిచ్చిన స్వాతంత్ర్యమును వాడుకొను బలమును శక్తిని కూడా మాలో పెట్టిన ప్రభువా! మేము బలహీనులము కాకుండు నిమిత్తము ఎల్లపుడు మీ నీడన బ్రతుకు ధన్యతను దయచేయుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.

వాక్య భాగము:
2 కోరింథీ 3:17 ప్రభువే ఆత్మ ప్రభువుయొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.

గలతి 5:1 ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కు కొనకుడి. 5:13 సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి.

యాకోబు 1:25 అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.

పరిచయము

బైబిలుమిషను మన దేశ స్వాతంత్ర్యమునకు ముందే స్థాపింపబడినది. దేవదాసు అయ్యగారు యునైటెడ్ దేశం కొరకు మరియు భారతదేశ స్వాతంత్ర్యం కొరకు ప్రత్యేకముగా ప్రార్థనలు చేయించేవారని, చివరకు అదే తేదీలలో స్వాతంత్ర్యం లభించుట ఆనందదాయకమని, విశ్వాసులు స్వాతంత్ర్య దినోత్సవమును ప్రభువు మహిమార్థమై జరుపుకొనవలెనని సూచించినట్లు పూర్వికులు ఆగస్టు 15న ఆరాధన జరిపేవారు.

దేవదాసు అయ్యగారి రచనలు విశ్లేషించగా, స్వాతంత్ర్యమును గూర్చి కరపత్రములు, వ్యాసములు, పద్యములు, ప్రత్యేక ఆరాధన మొదలగు సాహిత్యం లభించినందున; మరియు "భూలోకమంతటికి సువార్త పోవుటకు ఇండియా ప్రధానమని" ప్రభువు సెలవిచ్చినందున స్వాతంత్ర్యమును ధ్యానించి వాడుకొనుట ఆవశ్యకము. ఆగష్టు 11 నుండి 15 వరకు అనగా స్వాతంత్ర్యమునిచ్చు ప్రభువు యొక్క ఆత్మను అందుకొనుటకు ఈ 5 రోజులు ప్రత్యేకముగా ధ్యానించుట మంచిది.

1. దేశ క్షేమము కొరకు, దీర్ఘకాల శాంతి సమాధానముల కొరకు, దేశ స్వస్థత కొరకు ప్రార్థించుట
2. భూలోకమంతటికి మన దేశం నిజమైన వెలుగుగా ఉండుటకు; అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సత్యము, జీవములో గల సంతోషమును వెదజల్లుటకు
3. బలహీనులమైనను క్రీస్తు బలమును ఆశ్రయించు శక్తిమంతులమగునట్లు ఈ సమయమును ఉపయోగించుట లోకమునకు అశీర్వాదకరము.

స్వాతంత్ర్యము - దైవలక్షణము

స్వాతంత్ర్యం దైవలక్షణము. దేవుని అధికారమునకు లోబడినది. భూలోకమునకు, ఒక దేశమునకు గాని, ఒక జాతికి గాని స్వాతంత్ర్యమిచ్చుట దేవుని ప్రణాళిక కావున మొదటి స్వతంత్ర ఉద్యమం మనదేశములో క్రైస్తవులతో మొదలైనది. మొదట విద్యా స్వతంత్రత, అరోగ్య స్వతంత్రత, మూఢనమ్మకములనుండి స్వతంత్రత, స్త్రీ స్వతంత్రత దేశములో అందరికి అందాలని విశ్వాసులు బ్రిటీషువారిని కోరిరి.


దేశ స్వాతంత్ర్యం కోసం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(INC) ఏర్పాటు విషయములోను, క్రైస్తవ విలువలు పరిరక్షణకై 1914లో స్థాపింపబడిన ఆల్ఇండియా కాన్ఫెరెన్స్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్స్(AICIC) స్వాతంత్రోద్యమం మత్రమే కాకుండా, స్వాతంత్ర్యం తర్వాత సమాఖ్య దేశంకోసం(అప్పుడు చిన్న చిన్న రాజ్యములుగా ఉండేది), క్రైస్తవేతరులైన మిగిలిన వారికి కూడ వోటు హక్కు కోసం, మతసామరస్యము, స్వతంత్ర స్వయం పాలన రాజ్యాంగము కొరకు పోరాడినది.


దేవదాసు అయ్యగారు మన దేశ క్షేమముకొరకు "ఏ మతమును గాని, ఏ మిషనును గాని,ఏ మనుష్యుని గాని ద్వేషింపరాదు, దూషింపరాదు. తెలియని విషయములు దేవుని అడిగి తెలుసుకొనవలెను" అను సిద్ధాంతముతో కులాలు, మతాల మద్య తేడాను తగ్గించి, సామరస్యత నెలకొల్పుట ద్వారా అనేక అగ్రకులములవారు దేవుని హత్తుకొనిరి. ద్వేషము దైవలక్షణమైన ప్రేమ, జీవమును తీసివేసి సత్యమునుండి మనిషిని తొలగించుటద్వారా స్వాతంత్రతను కోల్పోజేయును కావున, ద్వేష బావమును దరిచేరనీయవద్దు అని శిష్యులకు ఆజ్ఞాపించిరి.


స్వాతంత్ర్యము అల్పమైన యెడల దాసత్వము(బానిసత్వం, బంధకములు) వచ్చును. స్వాతంత్ర్యము అధికమైన యెడల స్వేచ్చ, విచ్చలవిడితనము పెరుగును. గనుక స్వాతంత్ర్యమును దేశపౌరసత్వ భాద్యతగా కొనసాగించవలెను.


దేవదాసు అయ్యగారి పద్యములలో స్వాతంత్ర్యము యొక్క స్వరూపము, కాపాడుకొను సూత్రములు, దైవలక్షణమైన స్వతంత్రతను అభ్యాసములో పెట్టుట మొదలగు విషయములు గ్రహించగలము. పద్యములను జాగ్రత్తగా పరిశీలించిన, ఈ క్రింది విషయములు గ్రహించగలము.

  • 1. స్వాతంత్ర్య హరణం - స్వాతంత్ర్యం దొంగిలించబడుట, ఏ ఏ పరిస్థితులలో హరణం జరుగును అను వివరము. ఇది బౌతిక పరమైనది. సత్యమును ప్రేమించు ప్రజలు ఉందురు కాని, అసత్య వ్యాప్తిని అన్యాయమును అరికట్టరు.

  • 2. స్వాతంత్ర్య మరణం - స్వాతంత్ర్యం చంపబడుట, ఇది ఆత్మ సంబంధమైనది. జనులు అబద్ధమును, అసత్యమును ప్రేమించుట ద్వారా స్వాతంత్ర్యం సన్నగిల్లి మాయమై పోవును.

  • 3. స్వాతంత్ర్య కారణం - స్వాతంత్ర్యము యొక్క మనుగడకు(Maintaining Independance, sustainability) మార్గదర్శకములు. స్వాతంత్ర్య వ్యాప్తి సూత్రములు.

  • 4. స్వాతంత్ర్య ధరణం - స్వాతంత్ర్యానుభవము. స్వతంత్రతను ఆచరించుటలోగల ఆనందము. The essence of the freedom.

  • 5. స్వాతంత్ర్య కిరణం - స్వాతంత్ర్యమునకు జీవనాధారము. మరణములో కూడ చిరజీవమైన క్రీస్తు కిరణము.

దేశం దేవునికి దూరమై ప్రభువు ఆత్మ నడిపింపును తిరస్కరించుట ద్వారా సత్యమునుండి తొలగి స్వాతంత్ర హరణం జరుగును.


దేశములోని భక్తులు దేవునివైపు తిరిగి వేడుకొనుట ద్వారా క్రీస్తు కిరణము ప్రసరించి, దేవుడు తన సత్యాత్మను అనుగ్రహించుట వలన విడుదల, గొప్ప విజయము కలుగును.


ప్రజలు స్వేచ్చను కోరుకొనుట తప్పు కాదు గాని, అసత్యమును ప్రాక్టీస్ చేయుట(practice of lawlessness) పాపము.


దేవుడు - మనిషి, మద్యలో సాతాను; దేవుడు మనిషికి శాశ్వతంగా ఇవ్వాలనుకొన్నది, సాతాను వ్యతిరేకించినది; లూసిఫర్కి మనిషికి మద్య ఘర్షణకి మూలకారణం స్వాతంత్ర్యము. సాతాను అంతిమ లక్ష్యం మనిషి స్వాతంత్ర్యమును హరించుట. దేవుని నిత్య రక్షణ స్వాతంత్ర్యమునిచ్చు ఆత్మను అనుగ్రహించుట.

మన స్వాతంత్రతను ఎవరును అపహరింపకుండా దేవుడు మనకు రక్షణ కలుగజేయును గాక! ఆమేన్.

ఆగస్టు 11 - 15 వరకు ప్రతిరోజు స్వాతంత్ర్యములో గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యదినోత్సవ పండుగ.


స్వాతంత్ర్య ధ్యానముల కొరకు ఏర్పాటు చేయబడిన అయ్యగారి పద్యములు జోడించిన ప్రసంగముల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.