ప్రార్ధన మెట్లు (Prayer Pattern)

Introduction

దైవప్రార్ధన చేయునప్పుడు ఉపయోగించు క్రమము

  1. "విశ్వాసము లేకుండా దేవునికి యిష్టుడై యుండుట అసాధ్యము. దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడవనియు నమ్మవలెనుగదా" (హెబ్రీ 11 : 6)

  2. "ఇద్దరు ముగ్గురు నా నామమున యెక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్య వుందు" నని యేసు ప్రభువు చెప్పెను. మత్తయి(18 : 20)

  3. "నేను మీకు యేయే సంగతులను ఆజ్ఞాపింతునో వాటినన్నింటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగోనేను యుగసమాప్తి పర్యంతము సదాకాలము మీతో కూడ వున్నాను అని ప్రభువు వినిపించెను. (మత్తయి 28 : 20)

  4. ఒకసారిచేసిన ప్రార్ధన మరల చేయక దానికి బదులు యెన్ని పర్యాయములైనను స్తుతి చేయవచ్చును. కొందరు ఒక అంశమును గూర్చి ప్రార్ధనచేసి, తరువాత స్తుతిచేసిన సంతుష్టి లేనివారై మరల ప్రార్ధనలోనికి దిగుదురు; ఇది మంచివాడుక కాదు. స్తుతి మాటలు మాత్రమేగాక, స్తుతి పాటలుకూడా అంగీకారమే. నీవు హృదయ పూర్వకముగా ప్రార్ధించినయెడల ప్రభువు అన్ని మెట్లలో నీకు మంచి తలంపులు పుట్టించును.

  5. "నీవు ప్రార్ధన చేయునప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్ధన చేయుము. అప్పుడు రహస్యమందుచూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును" అని ప్రభువు వచించెను. (మత్తయి 6:6)

  6. "అడుగుడి మీకియ్యబడును వెదకుడి మీకుదొరుకును" అని ప్రభువు సెలవిచ్చెను. (మత్తయి 7 : 7)

  7. "నా యొద్దకు వచ్చువాని నేనెంతమాత్రమును బయటకు త్రోసివేయను" అని ప్రభువు పలికెను. (యోహాను 6 : 37)

  8. "వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనునది నిశ్చయముగా పట్టుకొందము" (హెబ్రీ 10:23)

  9. నానామమును బట్టి మీరు నన్నేమి అడిగినను నేనుచేతును" అని ప్రభువు వక్కాణించెను (యోహాను 14 : 14)

  10. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన మెరిగిన యెడల, మన మాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము" (యోహాను 4:15)

  11. ఒక వైద్యుడు మన యొద్దకు వచ్చి మన జబ్బుకు ఫలానా వస్తువులు చేర్చి చేసినయెడల మాత్రలు తయారగునని చెప్పును అతడు చేసియిచ్చును. అతడు లేనప్పుడు మనము చేసికొనుట యెట్లు? గనుక మనముకూడ నేర్చుకొనవలెను. అట్లే విశ్వాసముకూడ యెవరిమట్టుకువారు నేర్చుకొనవలెను. నిత్యము వైద్యుని చేతనే మాత్రలు కట్టించుకొన్నయెడల నీవు కట్టుటెప్పుడు? కష్టకాలమందు విశ్వాసము అభ్యాసము చేసికొనుము.

  12. విశ్వాసమువలన రెండు మేళ్ళు:- 1). అన్ని కీడులు పోవును. 2). మేళ్ళుకలుగును.

  13. అవిశ్వాసమువలన రెండు నష్టములు:- 1). కీడు పోను పోదు 2). మేలు రాను రాదు.

  14. దేవుడు నా ప్రార్ధన విన్నాడని నమ్ముట, మురియుట స్తుతించుట, సంతోషముతో తిరుగుట అడిగిన దానికంటె యెక్కువ యిచ్చునని నమ్ముట విశ్వాసమగును.

  15. ఏ మతస్థులైనను సరే! ఏ దేశస్థులైనను సరే యెంత దుర్జనులై ననుసరే, దయ్యము పట్టిన వారైనను సరే, పిచ్చివారైననుసరే. ప్రార్ధనమెట్లు క్రమము ననుసరించి బలవంతముగా ప్రార్ధన అభ్యసించినయెడల తుదకు దైవ మతమేదో తెలిసికొని మోక్షభాగ్యము పొందగలరు. మనస్సులో గందరగోళమున్నను సరే, అవిశ్వాసము బలిసి యున్ననుసరే ప్రార్ధనేంతో బాగుగా చేయవలెనని అన్నను, అది నామకార్ధములోనికి దిగిననుసరే ప్రార్ధన సమయములలో వేలకొలది దుష్ట బుద్దులు దండెత్తివచ్చినను సరే యీ ప్రకారము యా వత్తుజరిపినయెడల తుదకు మహా ధన్యులౌదురు. ఇది యెవరిమట్టుకు వారే చేసికొన వచ్చును.

  16. ఇది వారమున కొకసారియైనను వాడుకొనుము.

  17. మనోనిదానము యే మెట్టు యొద్ద కుదరదో ఆ మెట్టు యొద్ద కొంతసేపు ఆగి మరల ప్రార్ధింపవచ్చును.

  18. దేవా! నా ప్రార్ధన నెరవేరకపోయినను నెరవేరినదని, మార్కు (11 : 24) ను బట్టి భావించి నమ్ముచున్నాను, నీవు నమ్మతగిన దేవుడవు అని చెప్పుట విశ్వాసము.

  19. స్తుతి ప్రార్ధన:- నా ప్రార్ధన నెరవేరక పోయినను నెరవేరినదని నమ్మినమీదట నేరవేర్పు నిమిత్తమై నిన్ను స్తుతింతును, నీవు స్తుతింపదగిన వాడవు.

ఒక నాస్తికుడు మారినకథ:- ఒక నాస్తికునికి ఒక క్రైస్తవ బోధకునికి జరిగిన సంభాషణము.

క్రై: మీరు దేవుడు లేడని చెప్పుచున్నారు. దేవా! నీవు వున్నావా అని మీరెప్పుడైనా అడిగినారా?
నా: లేనివానిని అడుగుట యెట్లు?

క్రై: పర్వాలేదు. మోకరించి ప్రార్ధన చేయండి, ఉంటే జవాబిస్తాడు లేకపోతే లేనే లేదు.
(షరా:- ఆయనను పిలువనిదే ఆయనలేడని మీరనుట గొప్పదోషము కనుక నాతో మోకరించండి అడుగవలసిన రీతి నేర్పింతునని చెప్పిక్రైస్తవుడు నాస్తికుని బలవంతముగా మోకరింప జేసెను.)

క్రె: దేవా! నీవు నాకు ప్రత్యక్షమగుము. దేవా! పాపినైన నన్ను కరుణించుము అని పలకండి.
నా: నాకు నమ్మకములేనిదే యెట్లు పలుకుదును?

క్రై: మీ నమ్మికతో మీ కేమియు పనిలేదు. నేను చెప్పినదే చెప్పండి.
నా: దేవా ! పాపినైన నన్ను కరుణింపుము.

క్రై: ఆగండని నేను చెప్పేవరకు యీ మాటలు చెప్పుచుండండి.
(షరా: ఇట్లు నాస్తికుడు అనేక పర్యాయములు చెప్పిన తర్వాత అయ్యో ! నేనెంతపాపిని ! దేవా, నీవున్నావని యిప్పుడు తెలిసినదని పెద్దకేకవేసెను. చూచినారా! దైవ ప్రార్ధనచేసినయెడల సత్యము యెట్లు తెలియగలదో)

1. ప్రార్ధనవలన యేమిపోవును?
జ: పాపములు, వ్యాధులు, యిబ్బందులు, అన్నివిధములైన కష్టములు మొదలగునవి పోవును. మనకేమి వుండకూడదో అవన్నియు పోవును.

2. ప్రార్ధనలవలన యేమి వచ్చును?
జ: పాపక్షమాపణ, పాపమును జయించుబలము, దైవచిత్తానుసారముగా నడచుకొనగల సత్ప్రవర్తన. దైవవాక్యములను గ్రహింపగల జ్ఞాపకశక్తి, దైవ వాక్యములను యితరులకు బోధింపగల వాక్ ధోరణి, ఆరోగ్యము, సమృద్ది, దైవసహవాస భాగ్యము, సర్వకార్య సాఫల్యము ఆరోగ్యము, రక్షణగల మరణము, మోక్షనివాసము ఈ మొదలగున వన్నియు లభించును.

1. మతవిషయములు నచ్చజెప్పుట మా పని
2. నమ్ముటయు ప్రార్ధించుటయు మీ పని
3. మన ప్రార్ధనలు నెరవేర్చుట యేసు ప్రభువు పని. దేవుడు నీ యెడుట వున్నాడనియు ఆయన నీకు ప్రతిఫల మనుగ్రహించునని ప్రార్ధనాది నుండి ప్రార్ధనాంతరమువరకు నమ్ముచునే యుండవలయును.

ఈ దిగువనున్నమెట్లు ప్రార్ధనచేసికొనుటకొక క్రమమును బోధించును.

Step 1

మనోనిదానము

(చెమటోడ్చి కష్ట పడవలెను)

  1. చెడ్డ విషయములు మరచి పోవలెను
  2. మంచి విషయములుకూడ మరువవలెను
  3. రాబోవుసంగతులను మరచిపోవలెను
  4. గతకాల విషయములుగూడ మరచిపోవలెను
  5. క్రీస్తుప్రభువును జ్ఞాపకము తెచ్చుకొనవలెను
  6. విశ్వాసము, స్తుతి.

మొదటి మెట్టు వివరము

స్నేహితుడా ! దైవ ప్రార్ధన సరియైనరీతిగా చేయగోరినయెడల మంచి సమయము, స్థలము, వీలు యీ మూడు చూచుకొనవలెను. బైటపనులేవియూ లేకుండా చేసికొనవలెను. అప్పుడు మనో నిదాన మారంభింపవలెను. తలుపు వేసికొన్న నీ గదిలో మోకరించుము. నేత్రములు మూసికొనుము ! చెడ్డసంగతులుగాని, మంచి సంగతులు గాని, నీ మనస్సులోనికి రానీయకుము. అవి వచ్చినయెడల నీప్రార్ధనకాటంకము కలుగును. యేసుప్రభుని మాత్రమే తలంచుకొనుము. దేనిని తలంచుకొనవద్దు, నీ కష్టములు తలంచుకొనవద్దు, నీ పాపములు తలంచుకొనవద్దు, నీ కష్టములు తలంచుకొనవద్దు, నీ శరీర బాధలు, యిబ్బందులు తలంచుకొనవద్దు. క్రీస్తుప్రభువును మాత్రమే తలంచుకొనుము. కొంతసేపు యీ తలంపు మీదనే యుండుము.

  • ప్రభువు జ్ఞాపకము వచ్చినాడా?
  • ఆయన యిక్కడున్నాడను తలంపు కుదిరినదా?
  • ఆయన యిక్కడున్నాడను నమ్మిక కలిగెనా?
ఈ మూడు ప్రశ్నలు వేసికొని నీ యంతట నీవే జవాబు చెప్పుకొనుము.

"ఇద్దరు ముగ్గురు నా నామమున యెక్కడ కూడియుందురో అక్కడ నేను వారిమధ్య వుందునని యేసుప్రభువు చెప్పినారు గదా? (మత్తయి18:20). గనుక యిక్కడాయన వున్నాడని గ్రహింపవలెను. ఆయన లేడు అని అనుకొనవద్దు, ఉన్నాడని వాక్యము చెప్పుచున్నది, లేదని నీ వెట్లనుకొనగలవు?

"మరియు మీరు ప్రార్ధనచేయునప్పుడు వేషధారులవలె వుండవద్దు. మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరము లోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్ధన చేయుట వారికిష్టము. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతోచెప్పుచున్నాను. నీవు ప్రార్ధన చేయునప్పుడు నీ గదిలోనికివెళ్ళి తలుపువేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్ధన చేయుము. అప్పుడు రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతి ఫల మిచ్చును" (మత్తయి 6:5) అని యేసుప్రభువు ఉపదేశించినారు గదా! దీనిని బట్టి చూడగా; నీ ప్రార్ధన వినుటకు తండ్రి యెప్పుడును సిద్ధముగానే యున్నాడు గనుక తండ్రిని తలంచుకొనుము.

"అటువలె ఆత్మయు మన దౌర్భల్యమును చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా, మనము యుక్తముగా యేలాగు ప్రార్ధన చేయవలెనో మనకు తెలియకో గాని, ఉశ్చరింప శక్యముగాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు." అని (రోమా 8:26) లో వ్రాయబడి యున్నది. దీనిని బట్టి చూడగా పరిశుద్ధాత్మ మనకు ప్రార్ధనకార్యములో సహాయము చేయునని కనబడుచున్నది గనుక ఆయనను తలంచుకొనుము.

నీవు ప్రార్ధనలో ఉన్నంత సేపు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను త్రైక దేవుని తలంపు మీదనే యుండుము. అప్పుడు నీ ప్రార్ధన ప్రయత్నము జరుగును, ప్రార్ధనవాలు కుదురును. మరియు ప్రార్ధన సిద్ధించును. మనో నిదానము లేకుండా జేయు ప్రార్ధన నామకార్ధమైన ప్రార్ధన యగును. మరల చెప్పుచున్నాను నీ ప్రార్ధనాంశము "దేవునిని మాత్రము తలంచుకొనుము". ఇదే మనోనిదాన కార్యము. నిదానము లేకుండా యే పని చేసినను నెరవేరదని నీకు తెలుసునుగదా: ప్రార్ధన పని మాత్రమెట్లు నెరవేరగలదు? మనోనిదానము కలిగియున్నప్పుడె దైవసన్నిధి నీకు తట్టును.

దేవుడు నీకు స్వప్నములోనైన దర్శనములోనైన కనబడక పోవచ్చును, అంతమాత్రమున ఆయన నీ యొద్ద లేడు అని అనుకొనవద్దు. ఆయనవున్నాడనియే అనుకొనవలెను. ఇట్లు అనుకొనుటకు నీ కాధారమేది! ఆయన వాగ్ధానవాక్యమే (మత్తయి18:20). మధ్య మధ్యను మనోనిదానము చెదిరిపోవుచున్న యెడల మనోనిదాన యత్నము మరల ప్రారంభించుము. దీనికి గొప్ప శక్తి, గొప్పవరము అవసరములేదు. అట్టిశక్తి 'సహజశక్తి'. నీలో యిదివరకే వున్నది. దేవుడు నిన్ను కలుగ జేసినప్పుడే నీ కవసరమైన శక్తులను కూడ గలుగజేసెను. నాకు మనోనిదానము కుదరదు అని అనవద్దు. ఈ విషయములో యెవరి సహాయమైన కోరవచ్చును. గాని రాదని మానవద్దు, నీవు మానవుడవు గనుక తప్పకుండా మనో నిదానము కుదురును. అది కుదుర్చుకొనవలెను, అను ఉద్దేశముతో మోకాళ్ళ మీద వున్నావు గనుక దైవ సన్నిధిలోనున్నావు; అందుచేత కుదురును, దైర్యము తెచ్చుకొనుము. తండ్రి నిన్ను దీవించునుగాక.

విశ్వాసము - స్తుతి

మనోనిదానము కుదిరిన తర్వాత దేవుని స్తుతించుము. ఏమని ?
ఓ దేవా! తండ్రీ, యింతసేపటికి నాకు మనోనిదానము కుదిరినది అని యిట్టి మాటలతో స్తుతింపవలెను. ఇప్పుడే మరొక స్తుతి కూడ చేయవచ్చును. ఎట్లనగా
దేవా ! నివే నా తండ్రివి నీవే నా పోషకుడవు నీవే నా కాపుదలకర్తవు; నీవే నా రక్షకుడవు; నీవే నా వైద్యుడవు; నీవే నా సర్వమై యున్నావు. నిన్నే పూజింతును, ధ్యానింతును. నీకు నా కృతజ్ఞతాస్తోత్రములు.

మరియొక విధమగు మనోనిదానము గురించి కూడావినుము, నీకు జబ్బు రావలెనని కోరను గాని నీకు జబ్బు వచ్చినయెడల యెవరిని తలంచెదవు ? వైద్యుని తలంచుదువు గదా! నీ తలంపులో బాధ, వైద్యుడు, మందు యీమూడు వుండును. అ ట్లే నీ తలంపులో దేవుడు కూడ వుండవలెను. కష్ట కాలమున ఆయనవైపు చూడవలెను. ఇది అభ్యాసము చేసికొనవలెను దీనినే మనో నిదానమందురు. నీకుబహుమానములు వచ్చినప్పుడు యెవరినితలంచుకొందువు ? బహుమానములు పంపినవారిని తలంచెదవు గదా! దేవుడు నీ కెన్నిబహుమానములు ఇచ్చినాడో ఆలోచించుకొనుము అన్నము, కూర, నీళ్ళు, చెంబులు, బిందెలు యిండ్లు యీ మొదలగునవి దేవుడు నీకిచ్చుబహుమానములు కావా ?

ఆయనను తలంచుకొని సంతోషించుము. సౌఖ్యకాలమందు, విశ్రాంతి కాలమందు ఆయనను తలంచుకొనుటయే మనోనిదానము.

ఒక్క ప్రార్ధన సమయములలో మాత్రమే కలిగియుండవలెనని నేను చెప్పుటలేదు. అన్ని సమయములలో దైవధ్యాన మనోనిదానము కలిగియుండవలెనని చెప్పుచున్నాను. మనోనిదానము లేకుండా యేపనియు సాగదు. ప్రార్ధనలో మనోనిదానము అభ్యసించినయెడల అది అన్నిటిలోను కుదురును.

Step 2

ఒప్పుదల

(దుఃఖభాష్పములు)

  1. నీవు అపరాధము చేసినయెడల నరులయొద్దనీపాపములను ఒప్పుకొనవలెను
  2. దేవునియొద్ద నీపాపములను ఒప్పుకొనవలెను
  3. పది యాజ్ఞలనుబట్టి నీ పాపములను తెలిసికొని ఒప్పుకొనవలెను
  4. జంతువులయెడల గనపర్చిననిర్దయా పాపములనొప్పుకొనవలెను
  5. చేయవలసిన విధులు మానిన పాపములు ఒప్పుకొనవలెను
  6. చేయగూడనివి చేసిన పాపములు ఒప్పుకొనవలెను
  7. నీ అయోగ్యత ఒప్పుకొనవలెను
  8. వస్తువులు సరిగా ఉపయోగింపని లోపములు ఒప్పుకొనవలెను
  9. దుష్ట స్వప్నముల బలహీనత ఒప్పుకొనవలెను. తప్పుడు దర్శనముల బలహీనత ఒప్పుకొనవలెను
  10. తలంపులోని పాపములను ఒప్పుకొనవలెను. చూపులోని పాపములు ఒప్పు కొనవలెను.
  11. వినుటలోని పాపములు ఒప్పుకొనవలెను.
  12. ప్రయత్నములోని పాపములను ఒప్పుకొనవలెను
  13. క్రియలోని పాపములను ఒప్పుకొనవలెను
  14. విసుగుదల, కోపము, అసూయ, అవిశ్వాసము, తొందరపడునట్టి బలహీనత, అధైర్యము, పిరికితనము, నిరాశ, సోమరితనము, తిండిబోతుతనము, త్రాగుబోతుతనము, ధనాపేక్ష, పిసినారితనము, పరజన సంపాదనాపేక్ష ... యీ మొదలగునవన్నియు దేవునియెదుట ఒప్పుకొనవలెను
  15. విశ్వాసము - స్తుతి.

2వ మెట్టు వివరము:-

నీవు దేవుని సన్నిధిలో నున్నావు గనుక; ప్రార్ధనా స్తుతులు చేయబోవుచున్నావు గనుక; ఆయనసన్నిధిలో కొంత సేపైనను కనిపెట్టుకొని యుండబోవుచున్నావు గనుక; యీ మెట్టు మీద నీపాపముల నొప్పుకొనుట వలన నీ హృదయమును శుద్ధిచేసికొనవలెను. అధికారుల యొద్దకు వెళ్ళవలసినపుడు నీవు స్నానము చేసి, శుబ్రమైన బట్టలు ధరించుకొని వెళ్ళుదువుగదా? పరిశుద్దుడైన దేవుని సన్నిధికి వెళ్ళునప్పుడు మరింత శుద్దిగా సిద్దపడివెళ్ళవలెను గదా. శరీరమును, హృదయమును శుద్దిచేసుకొనవలెను. "హృదయశుద్దిగవారు ధన్యులు వారు దేవుని చూచెదరని ప్రభువు చెప్పలేదా? (మత్తయి 5:8)

పరిశుద్దత లేకుండా యెవడును ప్రభువును జూడడు అని పౌలు వ్రాయుచున్నాడు (హెబ్రి 12:14). నీలో యే దోషమైన మిగిలియున్న యెడల అది నీ ప్రార్ధనకు ఆటంకముగా వుండును. ప్రతి పాపమునకు క్షమాపణ పొందునట్లు ఒప్పుకొనుము. అప్పుడు నీ ప్రాణము హాయిగా ఉండును. ప్రార్ధన ధారాళముగా వచ్చును. పాపము లొప్పుకొనునప్పుడు నీ మనస్సు నిండా దఃఖముండవలెను. ఎన్ని పర్యాయములు తప్పుచేసినను దేవుడు క్షమించును గనుక మరల తప్పు చేసిన పరవాలేదు అని తలవంచుచు పాపములు ఒప్పుకొన్నయెడల దోషివగుదువు. అట్టి తలంపు దేవుని క్షమాపణను లోకువ గట్టుట యగును. ఒప్పుకొను తలంపును, యికమీదట తప్పుచేయను అను తలంపును ఒప్పుదల సమయమందె కలిగియుండుము.

మరొకసంగతి; పాప మొప్పుకొన్నయెడల ప్రస్తుతము నీకున్న కష్టము తొలగునను తలంపుతో ఒప్పుకొనుట నిజమైన ఒప్పుదల కాదు. కష్టము తొలగినను, తొలగకపోయినను, తొలగించుకొనుటకు పాపమొప్పుకొనుము. పాపక్రియవలన నాకు హాని తెచ్చుకొంటిని గదా అను విచారముతో పాటు దేవుని దుఃఖ పెట్టితిని గదా అను విచారము కలిగియుండుట మహా ధన్యతయై యున్నది. తమ పాపములను తలంచుకొని ప్రార్ధించునప్పుడు కొందరు నేలమీద పడి దొర్లుదురు. కొందరు శోకమెత్తి యేడ్తురు. కొందరు మౌన వ్రతముదాల్చి మనోవేదన గలవారై తిరుగుదురు. కొందరు పాపక్షమాపణ నిశ్చయత యెరుగక ప్రా ర్ధించినదే ప్రార్ధింతురు. చెప్పుకొన్నవే చెప్పుకొందురు. ఇట్టివారిని ఆక్షేపింపరాదు.

విశ్వాసము - స్తుతి

ఓ దేవా ! నా పాపములు ఒప్పుకొనగల కృప దయచేసినావు గనుక నీ కనేక వందనములు. పాపములు క్షమింతునని నీ వాక్యములో తెలియపర్చిన సంగతి నిమిత్తమై నీకు నా కృతజ్ఞతా వందనములు. నన్ను క్షమించినావని నమ్ముచున్నాను. ఆమెన్. కీర్తన 85: 2; యెషయా 43:25; హెబ్రీ 8:12;

ఆనంద బాష్పములు కలిగి యుండుము.

Step 3

తీర్మానము

(రక్త స్వేదమొల్కుపని)

  1. చెడుగు మానెదను
  2. మంచినే చేయుదును
  3. విధులు నెరవేర్తును
  4. కష్టములలో నిన్నే స్తుతింతును
  5. ప్రార్ధన నెరవేరనప్పుడు స్తుతింతును
  6. బైబిలు నేర్చుకొందును
  7. ప్రార్ధన ధ్యానము మానను
  8. సువార్త బోధింతును
  9. చందా వేతును
  10. మనుష్యుల దయయందును దేవుని దయయందును పెరుగుదును
  11. లేనిపోని కోరికలు కోరను అని యిట్లు నిశ్చయించుకొనవలెను
  12. విశ్వాసము, స్తుతి

3వ మెట్టు వివరము

ఈ మెట్టుమీద ఒక ప్రార్ధన చేసిన బాగుగా నుండును. దేవా! నేను యిదివరకు చేసిన తప్పులు యిక మీదట యేమియు చేయను. నాకు తెలిసిన తప్పులు చేయను. నాకు తెలిసిన మంచిని అవలంభింతును. చెడుగును విసర్జించుటకు మంచిని అవలంబించుట నాకు నాశక్తికొలది ప్రయత్నము చేసెదను. నేను ముందుకు ఏదో ఒకపాపములో పడిపోదునో పడనో నాకు తెలియదుగాని, ప్రస్తుతమున్న నా మనోస్థితినిబట్టి పడననుకొనుచున్నాను. నీవు సహాయము చేయుదువు కదా! ఒకవేళ శోధనలు జయింపలేనని తెలిసినప్పుడు నీ సహాయము కోరుదును నా తీర్మానము ముద్రించుము - ఆమెన్

  • తరచుగా పడిపోవు నరులు యెన్ని గొప్పగొప్ప తీర్మానములు ప్రమాణములు చేసిన ప్రయోజనమేమి ?
  • మానవులు ప్రమాణములు నిలుపుకొనగలరా అని ప్రశ్నింతువేమో?
గత కాలమందు పడిన పాపములో మరల పడుదుననియు యిక ముందుకు క్రొత్తపాపములో గూడ పడుదుననియు నీవు ప్రవచింపలేవు గదా ! ఆ రెండు అనుమానములెందుకు నీకు ? దేవునిమీద భారమువేసి ప్రమాణము చేయుము. ప్రార్ధన మెట్లమీద వుండగా నిన్ను గురించి నీకు రెండు అనుమానములు వున్న యెడల పడిపోదువు. అనుమానమే ఆ పడుటలోని మొదటి పడుటయై యుండును. పేతురు నీటిమీద బాగుగానే నడిచెనుగాని అలల ధాటికి జంకెను గనుక మునిగెను. ఎందుచేత? మునుగుటకుగల కారణము "ఎందుకు సందేహ పడితివి"?(మత్తయి 14;31) అని ప్రభువే మందలించిన ప్రశ్నలో కనబడు చున్నది. కావున సందేహపడవద్దు.

నేను సందేహపడలేదు గాని పడిపోతిని, యెందుచేత అని రేపు నన్ను అడుగుదునేమో? అడుగక మోకాళ్ళూని క్షమ నిమిత్తమైన ప్రార్ధన చేసి మరల నడక ప్రారంభింతును. పేతురు పడిపోవుచుండగా చేసిన ప్రార్ధన ఆయన తర్వాత నీటిమీద నడక ప్రారంబింపలేదా ? ఎందుకు సందేహ పడితివి ? మునుగకపోతిని ? ఎందుకు అలలు జూచి బెదిరితిని ? అని యిట్టి ప్రశ్నలమీద వున్న యెడల పేతురు యేమగును ? ఇట్టి ప్రశ్నల సందడిలో వున్న పక్షమున నీ పని యేమగునో చూడుము. పుట్టగతులే యుండవు గనుక పడినను లెమ్ము నడువుము. నిన్ను రక్షించు ప్రభువు నీదరినె వున్నాడు. పడబోవు చున్న పేతురు చెంత ప్రభువు లేడా? పడను అను తీర్మానము మాత్రము దిట్టముగా నుండవలెను.

"తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లుజాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరియేదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మతగినవాడు; మీరు సహింప గలిగినంత కంటె యెక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు; సహింప గలుగుటకు ఆయన శోధనతో గూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును" (1 కొరింథి 10:12,13) "భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును ( 1 సమూయేలు 2:9) నీతి మంతుడు యేడు మారులు పడినను తిరిగి లేచును" (సామెతలు 24:16)

విశ్వాసము - స్తుతి :

ఓ దేవా ! నేనింత తీర్మానము చేసికొనగలకృప దయచేసినావు గనుక నీకు వందనార్పణలు. నేను పడకుండా నన్ను కాపాడుదువని నీవు వ్రాయించిన వ్రాతలనిమిత్తమై నీకు కృతజ్ఞతా నమస్కారములు.

Step 4

సమర్పణ

(స్వంత యిష్టముయొక్క శక్తులు ఉడిగిపోవుపని)

  1. దేవా! నీ చిత్తము
  2. నా చిత్తముగాదు
  3. నా యాత్నము, నా మనస్సును, నా శరీరమును, నా కలిమిని నా లోపములను నా కోరికలను, నా సేవను యీ మొదలగువాటినన్నిటిని నీ కర్పించుచున్నాను. అని యిట్లు చెప్పవలెను.

మెట్టు వివరము:

ప్రభువు మనకిచ్చినవె ఆయనకిచ్చి వేయవలెను ? అప్పుడవి శుద్ధి యగును. వాటిని మనము సద్వినియోగపరుప వలయును ప్రతి ప్రార్ధనకు చివర నీ చిత్తము సిద్ధించునుగాక ! అని చెప్పవలెను. యేసుప్రభువు సైతము "నీచిత్తమే" అని ప్రార్ధించెను. (మత్తయి 26:39-42) "నీ చిత్తము" అని ప్రార్ధించెను. తర్వాత దైవ చిత్తప్రకారము చేయనియెడల నీ సమర్పణకు విలువయుండదు.

దైవచిత్తమెట్లు తెలియును ?

    దీనికి రెండుజవాబులు:
  1. ఏది మంచిదో అది దేవుని చిత్తమే
  2. దేవుని గ్రంధము లోని బోధ యావత్తు దేవుని చిత్తమే.

మిత్రుడా నీవు నీ చిత్తమును విసర్జించి దేవుని చిత్తమునే ఆచరింపబూనుకొన్నయెడల నీకు ఆయన చిత్తమును నెరవేర్పు వారికి దానిని తెలుపక పోయిన మరియెవరికి తెలుపును? కొందరికి దర్శనవరము గలదు అట్టివారు యీ పని చేయనా, వద్దా అని ప్రార్ధనలో ప్రశ్నించునప్పుడు దేవుడు తన యిష్టమును స్పష్టముగా తెలియచేయును. వారి సంగతి అట్లుంచుము; దైవగ్రంధము లోని బోధ ప్రకారము చేయుము. నీ కిష్టమున్నను లేకున్ననను దైవచిత్తమునె సాగించుము. ఇది సమర్పణ ఫలితము నీ చిత్తము అని పలుకుట నేర్పినావని చెప్పి "దేవా ! నీ చిత్తమైతే నా పాపములు క్షమించుము" అని అనవచ్చునా ? అనకూడదు. ఎందుచేత ? పాపములు క్షమించుట దేవుని చిత్తమని మనకు బాగుగా తెలుసును గనుక నీ అంశమును గురించి నిష్కపటమైన హృదయముతో ప్రార్ధించుము. అప్పుడు దేవుడు యేదో యొక రీతిగా తన చిత్తమును బైలుపర్చును గాని ఆచిత్తమును నెరవేర్పని యెడల రెండవమారు దైవచిత్తము నీకు వెళ్ళడియగునని తలంపరాదు.

దైవచిత్తానుసారమైన రీతిగా నీకొక బాహ్యానర్ధము సంభవించినయెడల నీ చిత్తము ప్రభువా అని నేర్చుకొనుము. దేవుడు మిమ్ము నెందుకు గ్రుడ్డివారినిగా కలుగజేసినాడు అని ఒక పాఠశాలలో పరీక్షాధికారి పిల్లలనడుగగా, ఒక బాలిక "అవును తండ్రీ! యీలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను అని బల్లమీద వ్రాసెను (మత్తయి11:6). నీ కష్టకాలమందు నీవట్లన గలిగితే నీవు సమర్పణ ప్రార్ధనకు యోగ్యుడవె, నీకు కలిగియున్న ఆస్తి దేవుని వలన గలిగినదె గనుక దానిని భద్రముగా వాడుకొనవలెను. అశుభ్రముగా నుంచరాదు. పోగొట్టరాదు, దొంగలవశము చేయరాదు, నిర్లక్ష్యముగా చూడరాదు. అల్పముగా నెంచరాదు. దానిని గౌరవముగా నెంచుటయు యిది నా తండ్రి యిచ్చినది అని ఆనందించుటయు దైవచిత్తమై యున్నది. నీ సామానులు పాడగుట నీ యజాగ్రత్తవలన అయినప్పుడు క్షమించుమని ప్రార్ధించుము.

విశ్వాసము స్తుతి:

ఓ తండ్రీ! నేను యీ సమర్పణ చేయగల యిష్టమును కలిగించినందుకు నీకు కృతాజ్ఞతార్పణములు. సమర్పణను అనుసరించి నడచుకొన్నట్టు నాకు సమరత అనుగ్రహింతునని నమ్మి, నిన్ను స్తుతించు చున్నాను. - ఆమెన్.

Step 5

అంశ ప్రార్ధన

(సర్వలోక సంచార మనో కార్యము)

  1. ఇక్కడ నీ యిష్టము వచ్చిన సంగతి గురించి ప్రార్ధించకొనవచ్చును.
  2. "నా నామమునుబట్టి మీరు నన్ను యేమి అడిగినను జేతును" (యోహాను 14 : 14); విసుగక నిత్యము ప్రార్ధన చేయవలెను (లూకా 18 : 1) అని ప్రభువు చెప్పెను.
  3. ఎంత చిన్న సంగతి గురించియైనను ప్రార్ధింపవచ్చును. వెనుక తీయవద్దు.

5వ మెట్టు వివరము

మనముప్రార్ధించవలసిన అంశములు అనేకములుగలవు దినదినమునకుకొన్ని అంశములెత్తి ప్రార్ధింపవచ్చును.

    కొన్ని ముఖ్యాంశము నిందు పొందుపర్చు చున్నాము:-
  1. పాపక్షమాపణ
  2. పాపవిసర్జనాశక్తి
  3. భక్తిజీవనము
  4. బైబిలు జ్ఞానము
  5. ప్రార్ధనవాలు
  6. కష్టనివారణ
  7. శరీరారోగ్యము
  8. ఏది కావలెనో అది.
  9. మోక్షభాగ్యము
  10. ఇవన్నియు నిన్ను గురించియె.
  1. సంఘవ్యాపకము
  2. ఇతరమతములకు సందేశము
  3. బీదలకు పోషణ
  4. రోగులకు స్వస్థత
  5. పాపులకు మారుమనస్సు
  6. శత్రువులకు క్షమాపణ. మార్పు
  7. లోకములోని ప్రతి సత్కార్యవృద్ధి
  8. అధికారులకు న్యాయస్వభావము. కార్యసిద్ధి
  9. పాఠశాలల వృద్ది, బైబిలు సొసైటి పని. ట్రాక్టు సొసైటీ పని
  10. అన్ని వృత్తులవారివృత్తుల నెరవేర్పు
  11. ప్రయాణీకులక్షేమము
  12. ఇవి యితరులనుగురించి.
నీవీలోకము విడిచి పెట్టకముందే సర్వాంశములమీద ప్రార్ధనలు ముగింపవలెను. నీ వెరిగిన ప్రతివారిని గురించియు నీవు విన్న ప్రతి వారిని గురించియు, నీకు తెలిసిన అంశములన్నిటిని గురించియు ప్రార్ధనలు పూర్తిచేయుము.

"మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను, బ్రతుకు నిమిత్తము అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరి కొరకు రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్ధనలను, యాచనలను కృతాజ్ఞతా స్తుతులనుచేయవలెనని హెచ్చరించు చున్నాము." (1 తిమో 2:1-2).

విశ్వాసము - స్తుతి:

ఓ దేవా! ఏ యే అంశములమీద నేను ప్రార్ధింపవలెనో నేర్పించినావు గనుక నీ కనేక వందనములు. నా ప్రార్ధనలన్నియు ఆలకించినావని నమ్ముచున్నాను.

నేను ప్రార్ధనలోనికి వచ్చినప్పుడెల్ల దేనినిగురించి ప్రార్ధన చేయవలెనో జ్ఞాపకము చేయుదువని నమ్ముచున్నాను. లోకములోని విశ్వాసు లందరికి వారు ప్రార్ధింపవలసిన ముఖ్యాంశములు జ్ఞాపకము చేయుదువని నమ్ముచున్నాను.

నీ కిష్టము లేని అంశముమీద ప్రార్ధనచేయబోవుచుండగా అది ఆపుచేయుదువని నమ్ముచున్నాను నీ కనేక స్తోత్రములు.

Step 6

దైవలక్షణములు - స్తుతి

(కృతజ్ఞతా వందనము)

  1. దైవవ్యక్తి
  2. జీవము
  3. ప్రేమ
  4. న్యాయము
  5. శక్తి.
  6. జ్ఞానము
  7. పరిశుద్దత
  8. స్వతంత్రత
  9. సర్వ వ్యాపకత్వము
  10. త్రైకస్థితి
  11. లక్షణదానము (దూతలకు, నరులకు)
[షరా:- ఇవన్నియు అనాది లక్షణములును అనంత లక్షణములునై యున్నవి. గనుక వీటిని పూర్తిగా నెవరును వివరింపజాలరు]

6వ మెట్టు - వివరము:

దైవలక్షణము లిందులో వ్రాసి యున్నవి మాత్రమే కాదు ఇంకను అనేకములు గలవు. ఈ ముఖ్య లక్షణములుదహరించి తండ్రిని స్తుతించుటవలన ఆత్మానందమును దైవసహవాసమును వృద్ధి యగును దేవుడిట్టి శుభలక్షణముల దేవుడని తెలిసిన వారు ఆయన మీద విసుగుకొనరు.

ఆయన పనులను అనగా ఆయన దివ్యలక్షణములుచేయుపనులను అపార్ధముచేసికొనరు. దేవుని లక్షణములను పనులను తలంచుకొని ఆనందింతురు. దేవుడిట్టి లక్షణములు గలవాడని సృష్టినిబట్టి తెలిసికొనవచ్చును.

దైవగ్రంథ మందిలి యుదహరించబడినవి దేవుడు నరుని కలుగజేసినప్పుడు తన లక్షణములు పెట్టి కలుగజేసెను గనుక నరుడెంత కృతజ్ఞుడై యుండవలెను? నరునిలో యిప్పుడున్న దుర్గుణములు దేవుడు కలుగజేసినవి కావు ఇవి నరుడు శుభలక్షణములను వాడనందునవలన వచ్చినవి.

"దేవుడెవనిని శోధింపడు గనుక యెవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింపబడు చున్నావని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత యీడ్వబడి మరలుకొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించినదై పాపమును కనగా, పాపము పరిపక్వమైనదై మరణమును కనును" (యాకోబు 1:23-15)
[ శోధించుట అనగా పాపముచేయుటకు ప్రేరేపించుట]


మనలో దైవ లక్షణములను దుర్గుణములను మిళితమైయున్నవి గనుక దైవలక్షణధ్యానమువలన దుర్గుణ పరిహారము గావించుకొనవలెను. దైవప్రార్ధన యీ పనికి మిగుల సహాయకారి

[ సంభాషణ కనుకూలముగా నుండునట్లు దేవుడు ప్రేమగలవాడని యందుముగాని; దేవుడు ప్రేమయై యున్నాడనుట సరియైన లేఖనోక్తి (1 యొహాను 4:8)

1. దైవవ్యక్తి:- దేవుడు దేవుడై యుండు లక్షణము. దేవుడు అనగా దివ్యమైనవాడు గనుక అన్నిటికన్నా మొదటివాడు, గొప్పవాడు, మంచివాడు , నిత్యముండువాడు, దేవుడునిరాకారుడైనను ఒకవ్యక్తియై యున్నాడు.

విశ్వాసము - స్తుతి

దేవా! నీవు దేవుడవు గనుక మా ఊహకు అందునట్టి దేనికంటెను గొప్పవాడవు. నీ కనేక నమస్కారములు. నీవున్నావను తలంపు నీవె కలిగించినావు గనుక స్తొత్రము.

2. జీవము:- దేవుడు జీవము గనుక యేమియు పని చేయకుండా వుండలేడు నరుడు పాపములో పడిపోయినయెడల అతనిని రక్షింపనైన రక్షించును గాని మొదలే అతనిని సృజింపకుండా వుండలేడు జీవము అనునది తక్కిన లక్షణములలో కూడ వున్నది. అట్లే అన్ని లక్షణములు అన్ని లక్షణములలో యిమిడి యున్నవి. ఒకదానికొకటి సంబంధించి యున్నది. ఒకపని చేయవలసినప్పుడు అన్ని లక్షణములు ఒక లక్షణముగా పనిచేయును.

ఉదహరణము:- దేవుడొక మొక్కను మొలిపింప దలంచినప్పుడు దానిలో జీవము పోయును ఈ మొక్క మన ఉపయోగార్ధమై మొలచును గనుక ఆయన మన మీద నున్న ప్రేమచేతనే యీ మొక్కను మొలిపించుట. ఒకకొమ్మ యెండిపోయి నందున దానిని గాలి వచ్చి దులిపివేయును. లేదా దానంతటదే పడిపోవును యిట్లు జరుగుట న్యాయమే ఈ మొక్క కొన్నాళ్ళకు వృక్షమై చాలాకాలము నిలిచియుండును. ఇదిదైవశక్తి వలన కలుగును. ఆ చెట్టునకు మొడట పువ్వులు, తరువాత పిందెలు. ఆతరువాత కాయలు, అటు తరువాత పండ్లు ఈ క్రమము దేవుని జ్ఞానమువలన వచ్చినది. మొక్కను చూడుము ఎంత పరిశుద్దముగా నుండునో, ఆకులు, కాయలు, పండ్లు. గింజలు యెంతపరిశుద్దముగా నుండునో, పరీక్షించుము.

దేవుడు పరిశుద్ధుడుగనుక ఆయన కలుగజేసినదంతయు పరిశుద్దమైనదే ఈ విధముగా ప్రకృతిలోని ప్రతివస్తువులోను దైవలక్షణములు గలవని నిరూపించవచ్చును. తక్కిన లక్షణములను గురించి నీవు స్వయముగా ఆలోచించుకొనవచ్చును. మొక్కమీద ధూళిపడి అపరిశుభ్రమగును, ఇది సృష్టిలోనిదే కాదు. చీడపురుగు బయలుదేరి మొక్కను తినివేయును. ఇదికూడ సృష్టిలోనిదికాదు, పైనుండి వచ్చి మొక్కను చెడగొట్టనవి సృష్టికార్యములా! అది నరుడు సృజింపబడి నపుడు దేవునివలె పరిశుద్దుడేగాని మొక్కకు వెలుపలనుండి వచ్చిన ధూళితగిలినట్లు అతనికి పాపము తగిలినందుకు అపరిశుద్దుడాయెను. అయినను తోటమాలివచ్చి మొక్కను శిద్ధిచేయు రీతిగానే సృష్టికర్తవచ్చి ఆదిలో నరుని పాపపరిహారము మూలముగా పరిశుద్దునిగా జేసెను. నరుడు అనగా తానుచేసిన నరుడు చెడిపోతే దేవుడూరుకొనునా? ఆయన పరిశుద్దత ఊరుకొనునా? ప్రేమగల జీవముగల ప్రేమ న్యాయము గలశక్తి శక్తిగలన్యాయము. జ్ఞానము గలపరిశుద్ధత గల జ్ఞానము ఊరుకొనునా? ఆహా! దైవలక్షణములెంత అద్భుత కరములైనవి! ఎంతమెచ్చుకొనదగినవి! ఎంత ఆనందింపదగినవి! ఈ ఆనంద కాంతిలో జీవించుము.

విశ్వాసము - స్తుతి :

దేవా! నీవు జీవమై నాలో అనుదినము జీవము కలిగించువాడై యున్నావు గనుక నీకుస్తోత్రం. నీవు నాలో దారపోసిన జీవమునకు శక్తి తగ్గినప్పుడు నా జీవమును బలపరచువాడవై యున్నావు గనుక నీకు స్తోత్రము. నరులకు జీవము పూర్తిగాపోయి మరణము కలుగును గాని కొన్ని యేండ్లకు నీవు బ్రతికింతువు. జీవము కలిగింతువు. గనుక నీకనేక స్తోత్రములు శరీర జీవమునకు మాత్రమే గాక ఆత్మ జీవమునకు గూడ నీవే అధారమై యున్నావు. నేను ఆత్మజీవన విషయములో తగ్గినప్పుడు నాలో మరల నూతన జీవము దారపోయుదువు గనుక నీకు స్తొత్రములు. నాకు పరలోకములో నిత్య జీవము కలిగి యుండుటకు నాలో దానిని యిక్కడే ప్రారంభించినావు గనుక నీకనేక స్తోత్రములు. నాకు పరలోకములో నిత్యజీవము కలిగి యుండుటకు నాలొ దానిని యిక్కడే ప్రారంభించినావు గనుక నీకనేక స్తోత్రములు. నీవు అనంత కాలము పొడుగున జీవించుచునే యుండు రీతిగా నేనును నితో జీవించుచునే యుండగల కృప నాకు దయచేసినావు గనుక నీ కనేక స్తోత్రములు.

3. ప్రేమ:- దేవుడు ప్రేమయై యున్నాడు గనుక మనమెన్ని తప్పులు చేసినను క్షమించుచున్నాడు మనము పుట్టకముదే మనకు కావలసినవన్నియు దయచేసి యున్నాడు. అన్నియు మనకు యిచ్చి వేయుటకు ఆయన ప్రేమయొక్క లక్షణమై యున్నది.

విశ్వాసము - స్తుతి :

దేవా! నీవు ప్రేమస్వరూపివై యున్నందుకు నీకనేక వందనములు ఓ తండ్రీ! నీవు ప్రేమవు గనుక నన్ను కలుగ జేయకుండ వుండలేకపోయినావు. నీ సన్నిధి భాగ్యము నేను నిత్యము అనుభవింపవలెనని కోరి నన్ను సృజించినావు. గనుక నీకనేక వందనములు. నా మీద నీకున్న ప్రేమను బట్టి నేను జన్మింపకముందు నాకు కావలసినవన్నియు కలుగజేసి యుంచియున్నావు. నీకు నా యందు అధికమైన ప్రేమ గనుక నా రక్షణార్ధమై భూలోకమునకు నా రూపధారివిగా ప్రత్యక్ష మైనావు గనుక నీ కనేక వందనములు. ఈ సందర్భమున "దేవుడు లోకమును యెంతో ప్రేమించెను" అని చదువుకొని ఆనందించుచున్నాను. నీవు ప్రేమగలవాడవని బాగుగాగ్రహించునట్లు మనుష్యులలో మనుష్యులకు, జీవరాసులలో జీవరాసులకు ప్రేమ కలిగించినావు నీ ప్రేమాది సద్గుణములు నీ వాక్యములో బయలుపరచి నీ యాత్మచేత బోధపరచుచున్నావు. గనుక నీకనేక వందనములు.

4. న్యాయము:- దేవుడు న్యాయవంతుడు గనుక ప్రకృతి ధర్మమునకు భిన్నముగా యేదియు చేయడు. రెండు అయిదులు పది దీనిని తొమ్మిదిగా మార్చుము అని అడిగిన యెడల మార్చడు. అట్లు మార్చిన యెడల సృష్టి క్రమమునకు విరుద్దమగును! దేవుడు న్యాయస్థుడు గనుక బహుమానములను శిక్షలను నరులకు నిర్ణయించుటలో ధర్మానుసారముగానే నిర్ణయించును.

విశ్వాసము - స్తుతి :

ఓ దేవా! నీవు న్యాయస్వరూపివై యున్నావు గనుక నీకనేక స్తుతులు నీవున్యాయమైయున్నందున నేరస్థులను శిక్షించుచున్నావు. నీవు న్యాయస్థుడవై యున్నందున యెంతపాపియైనను ప్రార్ధించినపుడు ప్రార్ధించినాడు గనుక రక్షించుట న్యాయమే అన్ని చెప్పి రక్షించుచున్నావు. నీ కనేక స్తుతులు. నీవు న్యాయకారుడవు గనుక యెవరికి యే స్థితి అనుగ్రహింపవలెనో అవి దయచేయుచున్నావు. గనుక నీకనేక స్తుతులు. లోకములో చెడుగు జరుగుటయు, కష్టములు కలుగుటయు చూచి నీ వూరుకొనుచున్నావు. ఇది న్యాయమే ఎందుకనిన. నరులకు స్వతంత్రత యిచ్చియున్నావు. అడ్డము వెళ్ళవు మరియు పాప శిక్షార్ధమై న్యాయపు తీర్పు దినమొకటి యేర్పరచినావు. నరులు నీతట్టు తిరగ గలందులకు కావలసినంత గడువు దయచేయుచున్నావు. ఈ కారణములచేత నీవూరుకొనుచున్నావు కాబట్టి నీ కనేక స్తుతులు. నరులకు జ్ఞానాభివృద్ధియు మార్పును కల్గించు నిమిత్తమై కష్టకాలమున ఊరుకొనుచున్నావు గనుక నీకనేక స్తుతులు.

5. శక్తి:- దేవుడు శక్తిమంతుడు గనుక సమస్త కార్యములు చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది యేదియులేదు. (యిర్మియా 32:26 మత్తయి 19:26)

దేవుడు పాపము చేయగలడా అని ఒకరు ఒక క్రైస్తవ బోధకుని అడిగిరి అందుకాయన చేయలేడని జవాబు చెప్పిరి అప్పుడు ప్రశ్నకుడు అలాగైతే దేవుడు సర్వశక్తిగలవాడని అనకూడదు అని పల్కెను. అందుకా బోధకుడు యిట్లు ప్రత్యుత్తర మిచ్చెను. పాపము చేయుట పరిశుద్దతనుండి పడిపోవుటయై యున్నది. పడిపోవుట కూడ ఒక శక్తియేనా? ఒకరుపైనుండి పడిపోవుత చూచినప్పుడు అతడు మహాశక్తిగలవాడు గనుకనే పడిపోయినాడు అందురా?

విశ్వాసము - స్తుతి :

ఓ దేవా! నీవు శక్తిమంతుడవై యున్నావు గనుక నిన్ను కొనియాడుచున్నాను. ఓ తండ్రీ ! నా విషయమై నీకు చేయలేని యొక పని యుండదు. గనుక నిన్ను కొనియాడుచున్నాను. నేను చెడిపోయి అధోలోకమునకు వెళ్ళినను నీవు నన్ను అక్కడనుండి రక్షింపగల శక్తిమంతుడవు గనుక నిన్ను కొనియాడు చున్నాను. నేను చేయలేని పనులు నాతో చేయింపగల శక్తిమంతుడవై యున్నావు గనుక నిన్ను కొనియాడుచున్నాను. నాకు కావల్సిన వన్నియు తెచ్చిపెట్టగల శక్తిమంతుడవు. నాకు అక్కరలేనివి నన్ను బాధించునని పరిహారము చేయగల శక్తిమంతుడవు. నేను మోక్షమునకు యెగిరి రాలేను. అయినను నన్నక్కడికి తీసుకొని వెళ్ళగల శక్తిమంతుడవు. ఇవన్నియు తలంచుకొని నిన్ను నామనస్సులో కొనియాడుచున్నాను.

6. జ్ఞానము:- దేవుడు జ్ఞానస్వరూపియై యున్నాడు. అందుచేత ఆయనకు ఆలోచన చెప్పగల వారెవరునులేరు. నవీనకాలమానవులు తమ జ్ఞానమును యెంత యెక్కువాభివృద్ధి చేసికొన్నారో నూతన కల్పలనుబట్టి తెలిసికొనగలము. మానవ జ్ఞానమే యింత గొప్పదై యుండగా మానవులకట్టి జ్ఞానమిచ్చిన దేవుని జ్ఞానమెంత గొప్పదైయుండును? దేవుని జ్ఞానమెంత గొప్పదో తెలిసికొనుటకై మన అందరి జ్ఞాన మంతయు ఉపయొగించినను తెలిసికొన జాలము. వస్తువువంటి వస్తువు లేదు. మనిషివంటి మనిషిలేడు. జంతువు వంటి జంతువు లేదు. చెట్టువంటి చెట్టు లేదు ఇది అధిక పరీక్ష వలన తెలియును. "ఆహా! దేవుని బుద్ది జ్ఞానముల బాహుళ్యము తెంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును యెరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? ఆయన మూలముగను, ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి యున్నవి. యుగముల పర్యంతము ఆయనకు మహిమ కలుగునుగాక! ఆమెన్"

విశ్వాసము - స్తుతి :

ఓ దేవా! నీవు జ్ఞానస్వరూపివి అందుచేత నా కెంతో ఆనందము. నా తెలివి తక్కువ వలన నేనేదైనా యొకపని చేయుచున్నప్పుడు నీ జ్ఞానదీపముతో నా కొద్దిపాటి జ్ఞానమును వెలిగించి, నా చేత జ్ఞానయుక్తమైన పనులు చేయింతువు గనుక నాకెంతో ఆనందము. నీవు సర్వలోకమును కలుగజేసిన సృష్టి చరిత్ర చూడగా యెంతో గొప్ప క్రమము కనబడుచున్నది. నరులకు కావలసినవన్నియు మొట్టమొదట సృజించి పిమ్మట నరుని చేయుటలో నీ జ్ఞానలక్షణములోని గొప్పక్రమము కనబడుచున్నది. నీవు మొదట చేయవలసినవి పిదప, పిదప చేయవలసినవి మొదట చేయలేదు. ఎప్పుడు యేది చేయవలెనో అప్పుడది చేసినావు గనుక నాకెంతో ఆనందము. చేసిన వస్తువులను యెక్కడ యేమి అమర్చవలెనో అక్కడవి అమర్చినావు. అడవిలో నుండవలసినవి అడవిలోను, సముద్రములో వుండవలసినవి సముద్రములోను వుంచినావు. వస్తువులను అమర్చుటలో నీ జ్ఞానము కనబడుచున్నది. నీ జ్ఞానకార్యమువల్ల నా కెంతో ఆనందము.

7. పరిశుద్ధత:- పాపపుణ్యములు దేవుడే కలిగించినాడని కొందరు దురభిప్రాయపడుచున్నారు. పరిశుద్దుడయిన దేవుడెట్లు పాపము చేయగలడు? ఒకవేళ దేవుడుగాని పాపము చేసినయెడల ఆయన పాపులందరికంటె గొప్ప పాపియగును. పాపియైతే దేవుడెట్లు కాగలడు? వెలుగు చీకటిగాను వెలుగుగాను వుండగలదా?

విశ్వాసము - స్తుతి :

ఓ తండ్రీ! నీవు పరిశుద్ధుడవు గనుక సమస్తమును పరిశుద్ధముగానే సృజించినావు. నీకు స్తొత్రార్పణములు పాపినైన నన్ను పరిశుద్దునిగా జేతువు, తుదకు నన్ను యీ పాపలోకమునుండి తప్పించి పరిశుద్దస్థానమగు మోక్షలోకమునకు చేర్చెదవు గనుక నీకు స్తోత్రార్పణలు. కడవరి తీర్పు అయిన తరువాత నీవు యీ పాపలోకమును పరిశుద్ద లోకముగా మార్చి మోక్షలోకములో నొక భాగముగా జేర్చెదవు గనుక స్తోత్రార్పణలు. ఆతర్వాత భూలోకములో శేషించి యుండువారు పాపమెరుగనివారై యుందురు. అందుచేతను నేడు మోక్షములో నున్నవారు పాప మెరుగని వారై యుందురు. అందుచేతను నీకు నిత్య స్తోత్రార్పణలు. పరిశుద్దుడా, పరిశుద్దుడా, పరిశుద్దుడా! త్రికాలమునందు సర్వస్థలములందు రక్షితుల యందరియందు నీవె స్తోత్రార్పణకు పాత్రుడవు.

నీవు పరిశుద్దుడవు గనుక పాపమును కలుగజేయలేదు, నీకు స్తొత్రార్పణలు. పాపమునకైనను, పాపఫలితమునకైనను సృష్టికర్తవు కాదుకాబట్టి తండ్రీ! పరిశుద్దతకు మాత్రమే సృష్టికర్తవై యున్న తండ్రీ నీకు నిత్యానంద స్తోత్రార్పణలు.

8. స్వతంత్రత:- దేవుడు సర్వస్వతంత్రుడు గనుక ఆయన ఒకరి యిష్టము అనుసరింపవలసిన అవసరములేదు. ఒకరిమీద ఆనుకొని యుండవలసిన అగత్యము లేదు ఆయనకు పైగా యెవరును లేరు. గనుక ఆయన ఒకరికి లోబడవలసిన పని లేదు. ఆయన తనయిష్టానుసారముగా సర్వలోకములు చేయునప్పుడు అడ్డము అనునది యుండదు.

విశ్వాసము - స్తుతి :

ఓ తండ్రీ! నీవు సృష్టిలో స్వాతంత్ర్యము దయచేసినందుకు నాకెంతో మనసానందము నేను నిన్ను బలవంతముగా ఆరాధింపక నా యిష్టానుసారముగా ఆరాధింపగలందులకై స్వాతంత్ర్యము అనుగ్రహించినావు గనుక నీకు నా మనసానంద వందనములు. ఇవి తల్లిదండ్రులకు నీ స్వాతంత్ర్య మిచ్చి తోటలోని పండ్లు నిరభ్యంతరముగా తినవచ్చునని సెలవిచ్చినావు. మేమును యిట్టి సులువుగలవారమే. సృష్టిలోనున్న సమస్తమును మేమునిరభ్యంతరముగా అనుభవింపవచ్చును ఇట్టికృప నిమిత్తమై నీకు నా మనసానంద వందనములు, ఆత్మీయజీవములో విశ్వాసులకు సమస్త భాగ్యములు అమర్చిపెట్టి యుంచినావు అదిలేదు యిదిలేదు అనక సమస్తమును నేననుభవింపవలెనని నీవు కోరుచున్నావు గనుక నీకునామనసానంద వందనములు, " సమస్తమును మీవి పౌలైనను, అపొల్లోయైనను, కేపాయైనను, రాబోవునవి యైనను సమస్తమును మీవే మీరు క్రీస్తు వారు. క్రీస్తుదేవునివాడు" అని పౌలుచేత వ్రాయించిన మాటలు చదివి ఆనందించుచున్నాను. (1కొరింథి 3అ. 21,22,23 వ) గనుక నీకు నా మనసానందవందనములు.

9. సర్వవ్యాపకత్వము:- దేవుడు సర్వవ్యాపియై యున్నాడు ఆయన లేని చోటు లేదు గనుక నీవు యెక్కడేమి చేసినను ఆయనకు తెలుసును గనుక జాగ్రత్తగా మసలుకొనుము నీవాయనకు దాగియుండలేవు. నీ వంగీకరించినయెడల సర్వవ్యాపియైన ఆయన నీకు అన్ని స్థలములలో సహాయము చేయును. క్రీస్తు ప్రభువు శిష్యులు ప్రార్ధన గృహమందు సమావేశమై దైవాత్మ రావలెనని ప్రార్ధించుచుండగా ఆయన వారిలో ప్రవేశించునప్పుడు యొక ధ్వని కల్గెననియు అది వారు కూర్చుండియున్న గృహమంతయువ్యాపించియుండెననియు వ్రాయబడియున్నది. (కార్య2:1-4) దైవాత్మ వారిగృహమందును వారి హృదయమందును , వారి యావజీవము నందును వ్యాపించెను. నీ వంగీకరించినయెడల నీ హృదయ మంతయు ఆయన వ్యాపించి యుండును ఇది నీకు మహానందకరమైనవార్త కదా !

విశ్వాసము - స్తుతి :

ఓ తండ్రీ ! నీవు సర్వవ్యాపివై యున్నందున నీ కనేక స్తోత్రములు. నేను యింటిలోనున్నను బయటనున్నను, స్థలాతరములలో నున్నను, దేవాలయమున నున్నను, పాఠశాలయందున్నను, వృత్తిశాల యందున్నను నీవు నా యొద్దనే వుండగలవు. నేను సౌఖ్య స్థలములో నున్నను, అపాయకరమైన స్థలములో నున్నను నీవు నాయొద్ద వుండగలవు గనుక నీకు నా స్తోత్రములు. నేను యీ లోకములో వున్నను పరలెకమునకు వచ్చినను, నీవు నా దగ్గరనే వుండగలవు నేను నిద్ర మీద నున్నను, అజాగ్రత్తగా నున్నను. చీకటిలో నున్నను, వెలుతురులో నున్నను నీవు నా చెంతనే యుందువు గనుక నీ కనేక స్తోత్రములు. అనంతలోకము అనంతుడవైన నీవు అనంతకాలమునాయొద్దనే యుందువనియు. నేను నీ యొద్దనే యుందువనియు తలంచుకొని యిప్పుడే ఆనందించుచున్నాను. ఇట్టి జీవభాగ్యము నాకు కలుగును.

గనుక నీకు నా వందన సోత్రములు. నాతోపాటు పరిశుద్ధులను, దేవదూతలను నీ సన్నిధిలో వుందురు. ఈ తలంపు నాకానందముగా నున్నది నీకు నా వందన స్తొత్రములు.

10. త్రైకస్థితి:- దేవుడొక్కడే యైనను మనకు తండ్రిగాను, కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను, వాక్యగ్రంధమునకు ప్రత్యక్షమైనాడు. దేవుని గురించి మాట్లాడు నప్పుడు ఒక్కడు ముగ్గురుగాను, ముగ్గురొక్కరుగాను వున్నట్లు మాట్ల్లడుదుము. అయినను దేవుడొక్కడే. ముగ్గురు దేవుండ్లులేరు. ఆయన ముగ్గురుగా బయల్పడినాడని చెప్పి ముగ్గురు దేవుండ్లని అన్న యెడల ఆమూడు అను అంకె దైవవ్యక్తి విషయమై సరిపోదు తండ్రి సర్వలోకమును కలుగజేసెను. కుమారుడు సర్వలోక పాపభారమెత్తుకొనెను. పరిశుద్ధాత్మ సంగతులు వివరించును. జ్ఞానోదయము కలిగించును, శక్తి దయచేయును. ఈ త్రైకమర్మము మనకు అందనిది గనుక దీనిని గురించి దీర్గాలోచన చేయుట మానవలెను అయినను మనకు బయలు పడిన దానితో సంతుష్టిపడి ఆత్మానందము కలిగించుకొనుట మంచిది. జ్వాల కాంతి వేడిమి యీ మూడును కలిసి దీపమైనది. వీటిలో ఒకటి హరించిన తక్కిన రెండును అంతరించును వీటిని మూడువస్తువులని చెప్పముగాని వస్తువు ఒక్కటే అని చెప్పుదుము దీనినిబట్టి త్రిత్వ మొక్కటని గ్రయింపగలను.

ఓ తండ్రీ! నీవుతండ్రివిగాను,కుమారుడవుగాను, పరిశుద్ధాత్మ గాను బైలుపడిన మహత్తును ఒక్కడవైన నీవు ముగ్గురుగాను, ముగ్గ్రవైన నీవు ఒక్కడవుగాను, ప్రత్యక్షమైన మహత్తును స్మరించి నీకు ఆత్మానంద స్తొత్రము లాచరించుచున్నాను. తండ్రీ! నీవు త్రిత్వమైయున్నట్టు మేమును త్రిత్వమై యుండుటకై మాకు ఆత్మను జీవమును శరీరమును దయచేసినావు గనుక నీకు నా ఆత్మానంద స్తోత్రములు.

11. లక్షణదానము:- దేవుడు నరులను తన స్వరూపమందు సృజించెనని వ్రాయబడియున్నది. (ఆది 1:26,27) ఆయన స్వరూపమనగానేమి? ఆయన లక్షణములే ఆయన స్వరూపములు. దేవుడు తన లక్షణములు పెట్టి నరుని చేసెను (తండ్రి లక్షణములు కుమారునికి కలుగుచున్నవి కదా !) దేవునెరుగకముందె మనకాయన లక్షణములను దానముచేసెను దీనిలో దేవుని ప్రేమకనబడుచున్నది. ఆయన సృజించినవి గూడ మనకు దానము చేసెను దీనిలో దేవుని ప్రేమ కనబడుచున్నది. ఇందునుబట్టి ఆయన ప్రేమను తెలిసికొనుచున్నాము. ఆయన కలుగజేసినది యావత్తుమనకే కాబట్టి మనము మన హృదయములు కృతజ్ఞతతో నిలుపు కొనవలయును.

విశ్వాసము - స్తుతి :

ఓ దేవా ! నీ దివ్యలక్షణములను మాకు దానముగా నిచ్చిన నీ అత్యధిక కృపకు నీకనేకమైన ఆత్మానంద స్తోత్రములు. నీ పావన లక్షణములకు భిన్నమైన చెడులక్షణములు మాలో ప్రవేసించినందున నీకును మాకును చాల విచారమే. అయినను నీ దానములకు అపకీర్తి కలుగకుండునట్లునుమేము విచారము చేత నశించిపకుండునట్లును మాదుర్గుణములను పరిహరింప్చినట్టి నీ కుమారుని అమూల్యరక్తపద్దతి నేర్పర్చిన నీ జ్ఞాన లక్షణార్ధమై నీకు నా ఆత్మానంద స్తోత్రములు నీవుమాకనుగ్రహించిన భూదానములకంటెను నీ లక్షణ దానమే గొప్పది. ఇది తెలిసికొనుటకై యిచ్చిన వాక్యదానము మా హస్తములందున్న గొప్పదానమై యున్నది. అన్ని దానముల నిమిత్తము నీకు నాయాత్మానంద స్తోత్రములు. ఆమెన్.

Step 7

కనిపెట్టుట

(మునిపని)

  1. అన్ని మెట్లమీద దేవునితో మాట్లాడిన నీవు యీ మెట్టు మీద నీతో దేవుని మాట్లాడనీయవలెను.
  2. నీవు మునివలెనిశ్శబ్దముగా నుండవలెను. నీ ప్రార్ధనా స్తుతులు, పాటలు, చదువులు, ఆలోచనలు, కట్టివేయవలెను సమూయేలు చెప్పినట్లు దేవా! నీవేమిచెప్పుదువో నేను విందునని చెప్పవలెను. 1సమూయేలు 3:1-10
  3. నీవీమెట్టుమీద వున్నప్పుడు తండ్రి నీ మనస్సులో మంచి తలంపులు పుట్టించును లేదా నీకుదర్శనమిచ్చి చెప్పవలసినవి చెప్పును నీ కఠినమైన ప్రశ్నలన్నిటికి యిక్కడే జవాబు దొరుకును. ఒకవేళ నీకు యేమియు తెలియబడక పోయినను, యింతసేపు దేవునిసన్నిధిలో నుండగల భాగ్యము దొరికినది. అంతేచాలునని ఆనందింపవలెను.
  4. అన్ని మెట్లమీద సంగతులు యీ మెట్టుమీద పరిష్కారమగును

7వ మెట్టు వివరము:

ఒక అధికారియొద్దకు ఒక మనవి చేసుకొనుటకై వెళ్ళినవారు అధికారి యేదో యొకమాట చెప్పకముందె వచ్చివేయుదురా? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనవి జేసుకొన్ననీవు ఆయన యేమియు చెప్పకముందే ఆమెన్ అన్న వెంటనే వచ్చివేయుట ధర్మమా?

ఈ మెట్టు మీద నుండగా వచ్చు తలంపులు వ్రాసికొనవచ్చును ఇది చదువు నీవు యేమతస్థుడగా వచ్చు తలంపులు వ్రాసికొనవచ్చును ఇది ఏ మతస్థుడవైననుసరే యెంత దుర్జనుడవైననుసరే ప్రార్ధన రాకపోయినను సరే బలవంతముగా దినమున కొక గంటయైనను మోకాళ్ళమీద వుండుము.

అప్పుడు నీకు కలుగుమార్పు నాకు చెప్పకుండా వుండలేవు. సృష్టికర్తకు మహిమ గలుగుగాక ! ఆమెన్

విశ్వాసము - స్తుతి :

ఓ తండ్రీ నా ఆత్మకు సంతుష్టి కలిగించిన నీకు నాహృదయానంద వందనములు. నీ సన్నిధిలో పూర్ణానందము కలుగునని వ్రాయబడిన వాక్యము నిజమని నాకు తెలిసినది నీకనేక స్తోత్రములు (కీర్తన 16:11)

ఓ తండ్రీ ! అనుదినము నీసన్నిధిలో కనిపెట్టగల సమయము సంకల్పింతువని నమ్ముచున్నాను. పూర్వీకులైన భక్తుల్తో స్వయముగా మాట్లాడు చున్నందుకు నా హ్ర్డయానంద వందనములు సమర్పించుచున్నాను. దయగల తండ్రీ! యీ లోకములో పనులు, పాపములు కష్టములు విశేషముగానున్నందున నీ సన్నిధిలోకి వచ్చుటకు సమయమే దొరుకదు అయితే నేను పరలోకమునకు వచ్చిన తరువాత అంతయు సయమేనని యిప్పుడే ఆనందపడుచున్నాను నీ కోరిక నీపని. నీపని పద్దతి నీ నడిపింపు యీ మొదలగునవన్నియు సిద్దించుటవలన నీకే యుగయుగముల పొడుగున కీర్తికలుగు గాక! నన్ను నా ప్రార్ధనను, నా ప్రయత్నమును, నా కని పెట్టుటకు ప్రభు యేసు ద్వారా అంగీకరించుము ఆమెన్.

పరీక్ష - ఈ యేడు మెట్లమీద నడచిన వెనుకనీ నడక సరిగా వున్నదోలేదో పరీక్షించుకొనుము. నీవు జీవితమంతమువరకు యీ నడకమీద నుండగలనో పరీక్షించుకొనుము దేవుడు వినని ప్రార్ధ గలదా! ఒకప్పుడు దేవుడు మనలోని కోరిక నెరవేర్చును. ఒకప్పూడు నెరవేర్చడు మన ప్రార్ధనకు జవాబులే యిచ్చెదను జవాబే. యివ్వను జవాబే.

    రెండు పరీక్షలు
  1. ఇప్పుడు ప్రార్ధన కుదిరినదా ?
  2. ఇక ముందునకు గూడ ప్రార్ధన కుదురును నమ్మికగలదా?

ప్రభువు ప్రార్ధన

ఈ దిగువనున్న ప్రార్ధన యేసుప్రభువు నేర్పిన ప్రార్ధన దీనిలో మన మనవులన్నియు యిమిడియున్నందున ఇది అనీప్రార్ధనలకు మించినది. స్వంత ప్రార్ధ అయిన వెంటనే ప్రార్ధన పూర్తినిమిత్తమై యిది వాడుదురు కాని అనేకులు అనాలోచనగా వాడుట చాల దుఃఖకరమైన సంగతి. ఆలోచించు నెమ్మదిగా చేయగలుగువీలున్నప్పుడు మాత్రమే యిది వాడుట మంచిది. యిది సర్వజనసమ్మతమైన ప్రార్ధన యగుటచేత 1893 చికాగోపట్టనమున జరిగినసర్వమత జనసంఘస్థులందరు కలిసి చేసిరి. "పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ద పరుపబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమునందు జరుగునట్లు భూమిమీద జరుగునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా యెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించునట్లు మా అపరాధములు క్షమించుము మమ్ము శోధనలోకి తేకుము. కీడునుండి తప్పింపుము రాజ్యము శ్సక్తి మహిమ నిరంతము నీవియై యున్నవి. ఆమెన్" లూకా 11: 2-3: మత్తయి 7:10-13

యేసునామము:
ప్రతి ప్రార్ధనకు ముగింపులో యేసు నామము చేర్చినయెడల ప్రార్ధన నెరవేర్పు లభించును.

ఉ: ఓ దేవా ! ఈ మాప్రార్ధనలు నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తునుబట్టి ఆలకించుమని నిన్ను మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము. ఆమెన్. వ్రాత ప్రార్ధనలో యిది లేకపోయినను వాగ్రూపమున వాడవచ్చును.

దీవెన: ఆరాధనాంతమందు బోధకుడిట్లు దీవింప వలెను. "మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి నిత్యముతోడై యుండునుగాక." (2 కొరింథి 13:14)

పాతనిబంధనలోని దీవెనస్థాపన చరిత్ర:-
యెహోవా మోషేకు యీలాగు సెలవిచ్చెను నీకు అహరోను తోను అతనికుమారులతోను యీలాగనుము మీరు ఇశ్రాయేలీయులను యీలాగు దీవింపవలెను:- యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయుగాక! అట్లు వారు యిశ్రాయేలీయులమీద నామమును ఉచ్చరించుటవలన నేను వారిని ఆశీర్వదించెను సఖ్యా 6:22-26.

త్రైక దైవ స్తుతి :
తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును యిప్పుడు, యెల్లప్పుడు, యుగయుగములు మహిమ కలుగునుగాక. ఆమెన్.

ఆమెన్ = తథాస్తు

ప్రతి ప్రార్ధనానంతరమందు యిది వాడుదురు. నా ప్రార్ధన నెరవేరును అను భావమిందులో గలదు.

దేవదూతలు చేసినస్తుతులు:
  1. సైన్యముల కధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. యెషయా 6:3
  2. ఈ స్తుతి స్వరమునకు గడపకమ్ముల పునాదులు కదిలినవి: యిట్టి స్తుతి యెవరు చేయగలరు?
  3. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానము కలుగునుగాక. (లూకా2:14)
  4. భూతవర్తమాన భవిష్యత్కాలములలో నుండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు) (ప్రకటన 4. అ.)

Prayer Verses

ప్రార్ధనా వచనములు

S.No. ప్రార్ధన చేసినవారు వచన స్థానములు ప్రార్ధనాంశములు
1. అబ్రహాము ఆది 15:2 ఒకకుమారుని దయచేయుము
2. అబ్రహాము ఆది 17:18 ఇష్మాయేలును అంగీకరింపుము
3. అబ్రహాము ఆది 18:23 సొదొమాకు కృప చూపించుము
4. అబ్రహాము సేవకుడు ఆది: 24:12 ప్రయాణము సఫలము చేయుము
5. యాకోబు ఆది 32:11 ఏశావు చేతినుడి తప్పింపుము
6. మోషే నిర్గమ 32:12 నీ ప్రజలను క్షమించుము
7. మోషే నిర్గమ 33:13 నీ మార్గమును నాకు తెల్పుము
8. మోషే సంఖ్యా 10:35,36 దేవా మరలరమ్ము
9.మోషే సంఖ్యా11:11-17 ఇశ్రాయేలీయులనునడిపించుశక్తిదయచేయుమ
10.మోషే సంక్యా12:13 దేవా మిర్యామును స్వస్థ పరచుము
11.మోషే సంఖ్యా 14:13-19 ప్రజల దోషము క్షమించుము
12.మోషే సంఖ్యా 27:15 నీవు ప్రజలకు ఒక నాయకుని యేర్పరచుము
13.మోషే ద్వితి 3:25 కానానును నాకు చూపించుము
14.మోషే ద్వితి 9:26 నీ ప్రజలను క్షమించుము
15.ఇశ్రాయేలీయులు ద్వితి 21:6-8 నరహంతకుని ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము
16.ఇశ్రాయేలీయులు ద్వితి 26:5-10 ప్రధమ ఫలములు తెచ్చినాము
17. ఇశ్రాయేలీయులు ద్వితి 26:13-15 దేశమును ఆశీర్వదింపుము
18. యెహోషువ యెహోషువ 7.7-9 జయము కలిగింపుము
19. మనోహా న్యాయా 13:8-9 బిడ్డకుచేయునది మాకు నేర్పింపుము
20. సంసోను న్యాయా 16:28 ఫిలష్తీయులమీద పగదీర్చుకొననిమ్ము
21. హన్నా 1 సమూయేలు 1:11 ఒక కుమారుని దయచేయుము.
22. దావీదు 2వ సమూయేలు 7:18 నాకుటుంబమును స్థిరపర్చుము
23. దావీదు 2వ సమూయేలు 24:17 శిక్ష నాపుము
24. సొలొమోను 1 రజులు 3:5-9 నీ ప్రజలకు న్యాయము తీర్చుజ్ఞానమిమ్ము
25. సొలోమోను 1 రాజులు 8:23 నీ గుడిలోని ప్రార్ధన లన్నియు ఆలకించుము
26. ఏలియా 1 రాజులు 17:20 విధవరాలికుమారుని బ్రతికించుము
27. ఏలీయా 1 రాజులు 18:39 నా పని నీదేయని కనబర్చుము
28. ఏలీయా 1 రాజులు 19:4 నా ప్రాణము తీసికొను.......
29. ఎలీషా 2వ రాజులు 6:17 నా సేవకుని కండ్లు తెరువుము
30. ఎలీషా 2వ రాజులు 6:18 ఈ జనులను అంధత్వముతో మొత్తుము
31. హిజ్కియా 2వ రాజులు 19:15-19 అషూరురాజు చేతిలోనుంచి మమ్ము రక్షించుము
32. హిజ్కియా 2వ రాజులు 20:3 మరణమును తప్పించుము
33. యబ్బేజు 1దినవృత్తాంతము 4:10 నా సరిహద్దునువిశాలపర్చుము
34. దావీదు 1దిన : 29:10-19 కృతజ్ఞతస్తుతి అంగీకరించుము
35. సొలోమోను 2వ దినవృత్తాంతము 6:14 నీ గుడిలోని ప్రార్ధనలన్నియు ఆలకించుము
36. అసా 2వ దినవృత్తాంతము 14:11 యుద్ధములో జయమిమ్ము
37. యెహోషాపాతు 2వ దినవృత్తాతము 20:6 మోయాబీయులనుండి తప్పించుము
38. హిజ్కియా 2వ దినవృత్తాంతము 30:19 ప్రతివాని నిమిత్తము ప్రాయశ్చిత్తము క్షమించుము
39. ఎజ్రా ఎజ్రా 9:15 మేము నీ సన్నిధిని అపరాధులము క్షమించుము
40. నెహెమ్యా నెహెమ్యా 1:19 చెరలో నున్న వారిని రప్పించుము
41. నెహెమ్యా నెహెమ్యా 4:4 సన్ బల్లటు ఆటంకముసాగనీయకుము
42. లేవీయులు నెహెమ్యా 9 అ|| శత్రువుల బాధ తప్పించుము
43. దావీదు కీర్తన 51 నా పాపము క్షమించుము
44. ఆగూరు సామెతలు 30:1 కావలసినంత దయచేయుము
45. హిజ్కియా యెషయా 37:16 అషూరు రాజు చేతిలోనుండి మమ్మును రక్షించుము
46. హిజ్కియా యెషయా 38:3 మరణమును తప్పించుము
47. యిర్మియా యిర్మియా 14:7 కరువులో మాకు సహాయము చేయుము
48. యిర్మియా యిర్మియా 15:15-18 శ్రమలోనన్ను జ్ఞాపకము చేసికొనుము
49. యెహెజ్కేలు యెహెజ్కేలు 9:8 ఇశ్రాయేలీయులను నశింప జేయుదువా?
50. దానియేలు దానియేలు 9:16 యెరూషలేముమీద కీడు తొలగించుము
51. యోనా యోనా 2:2 మత్స్యగర్భమునుండి విమోచింపుము
52. హబక్కూకు హబక్కుకు 3:3 నీ కార్యము వర్ధిల్లచేయుము
53. కుష్టురోగి మత్తయి 8:2 నన్ను శుద్ధునిగా జేయుము
54. శతాధిపతి మత్తయి 8:6 నా దాసుని స్వస్థపర్చుము
55. ప్రభుశిష్యులు మత్తయి 8:25 తుఫానును అణచుము
56. యాయీరు మత్తయి 9:18 నాకుమార్తెను బ్రతికించుము
57. ఇద్దరు గ్రుడ్డివారు మత్తయి 9:27 మాకు చూపు దయచేయుము
58. యేసు ప్రభువు మత్తయి 11:25-26 తండ్రీ నీకు స్తోత్రము
59. కనాను స్త్రీ మత్తయి 15:22 నాకుమార్తెలోని దయ్యము వెళ్ళగొట్టుము
60. చాంద్రరోగి మత్తయి 17:15 నా కుమారుని స్వథపర్చుము
61. యేసు ప్రభువు మత్తయి 26:39 తండ్రీ నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించుము
62. యేసు ప్రభువు మత్తయి 27:46 తండ్రీ నీవు నాచెయ్యి యెందుకు విడిచితివి
63. బర్తమయి మార్కు 10:47 నాకు దృష్టి కలుగజేయుము
64. తప్పిపోయిన కుమారుడు లూకా 15:21 నీకుమారుడనిపించుకొన యోగ్యుడను కాను
65. అపోస్తలులు లూకా 17:5 మా విశ్వాసము వృద్ధిపొందించుము
66. సుంకరి లూకా 18:13 దేవా పాపిని కరుంఇచుము
67. 10మందికుష్టురోగులు లూకా 17:13 మా కుష్టు పరిహరించుము
68. యేసు ప్రభువు లూకా 23:34 వీరిని క్షమించుము
69. దొంగ లూకా 23:42 యేసూ నన్ను జ్ఞాపకముచేసికొనుము
70. యేసు ప్రభువు లూకా 3:46 తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను
71. సమరైయ స్త్రీ యోహాను 4:15 జీవజలమిమ్ము
72. ఒక ప్రధాని యోహాను 4:49 నా కుమారుని బ్రతికింపుము
73. యేసు ప్రభువు యోహాను 11:41-42 తండ్రీనీవునామనవి విన్నందుకు కృతజ్ఞతాస్తుతి
74. యేసు ప్రభువు యోహాను12:27-28 తండ్రీ ఈగడియ తప్పించుము
75. యేసు ప్రభువు యోహాను 17 అ. తండ్రీ అపోస్తలుల నైక్యపర్చుము
76. స్తెఫను కార్య 7: 60 వారిమీద ఏ నేరము మోపకుము
77. పౌలు కార్య 9:1-6 ప్రభువా నేనేమి చేయవలెనో తెల్పుము
78. పౌలు 2వ కొరింథి 12:8 శరీరములో ముల్లు తొలగించుము
79. పౌలు ఎఫెసి1:17-20 3:14-21;
ఫిలిప్పి 1:9-11. కొలస్సై1:6, 9;
1థెస్స3:10-13 2వ థెస్స 1:11,12 2:16-17:3-5
హెబ్రీ 13:20-21
సంఘములకు ప్రత్యక్షత యిమ్ము
80. సంఘ వధువు ప్రకటన 22-20 ప్రభువైన యేసూరమ్ము