2-5-1946వ సం||లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము

ప్రార్థనలో ప్రార్థన

బోధకుడు ఇక్కడ ప్రార్థన చేయుచుండగా నీవు అక్కడ ప్రార్థన ఆలకించుచుండగా, నీ మనస్సులో ప్రార్థన ఊరుచుండును. బోధకుడు మా దేశమును కాపాడుమనగా, "మా దేశమునే కాదు, అన్ని దేశములను కాపాడుమని" నీకు ప్రార్థన వచ్చును గదా! అదే ప్రార్థనలో ప్రార్థన. జబ్బు మనిషిని గూర్చి బోధకుడు ప్రార్థించుచుండగా, ఇంకొక రోగిని గూర్చి నీ మనస్సులోనికి రావడము పరిశుద్ధాత్ముని పని. ఇది కూడ ప్రార్థనలో ప్రార్థనే. నీ ప్రార్థన బోధకునికి తెలియదు గాని ఆయన ప్రార్థన నీకు తెలుసు. అదే ప్రార్థనలో ప్రార్థన. బోధకుని ప్రార్థనలో ఏకీభవించి, అప్పుడప్పుడు నీ మనస్సులోనికి వచ్చేది చేయుటే ప్రార్థనలో ప్రార్థన.


బైబిలులో బైబిలు

నీవు బైబిలు చదువుచుండగా లేదా వినుచుండగా ఇంకొక సంబంధ వాక్యము జ్ఞాపకమునకు వచ్చుచుండును. ఒక వాక్యము చదువుచుండగా, మనోనిదానము చెడకుండా దాని అన్వయ వాక్యము వచ్చుచుండును. ఉదా: "ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడియుందురో, అక్కడ నేను ఉన్నాను" అని ప్రభువు చెప్పినది బోధకుడు చదువుచుండగా, అదే సమయమందు యోహాను 14:14 లోని వాక్యము, బోధకుడు కాదుగాని ఆత్మ తండ్రి నీకు జ్ఞాపకము చేయును. అదే బైబిలులో బైబిలు.


బోధలో బోధ

బోధకుడు నిలువబడి ప్రసంగించుచుండగా, అనగా పరలోకము వెళ్ళిన పిదప పాపము వల్ల, రోగమువల్ల బాధలేదని బోధించుచుండగా, నీ మనస్సులోనికి "అక్కడే కాదు ఇక్కడకూడ నీకును, వాటికిని సంబంధము లేకుండా యేసుప్రభువు చేయునని" ఆత్మ అందించును. నీకును, బోధకునికి ఆత్మ అందించుచుండును. ఒకరికి అందనివి మరొకరికి అందించుచుండును. ఇది నేను చెప్పిన బోధలో బోధ. ప్రార్థనలో ప్రార్థన, పఠనములో పఠనము, ఈలాగు క్రొత్త విషయములు ఊరుచుండును.


చందాలో చందా

గుడిలో చందా వేసేటప్పుడు, తన మనస్సులో ఎవరు క్రొత్తగా ఎక్కువగా చందా వేసిరో, వారిని గూర్చి బోధకుడు వినిపించుచుండగా, నీ మనస్సులో - "సొమ్ము వుంటే ఆమె వలే నేనును వేసేదానినిగదా! ప్రభువా నాకెక్కువ సొమ్ము ఇమ్ము, ఇంతకంటే ఎక్కువ ఇస్తాను, అని అనుకొనుటలేదా! సంఘములో వచ్చిన చందా విషయములో మీ ఆత్మలోనికి వచ్చినదే చందాలో చందా.


ఉపన్యాసములో ఉపన్యాసము

మీరు వీధిలోనికి వెళ్ళి బోధిస్తుండగా, అందరూ వింటూ ప్రశ్నలు వేస్తుండగా, దానికి జవాబు మీరు ఇచ్చుచుండగా, "ఆ జవాబుకాదు, ఇంకొక జవాబు" అని మనస్సులోనికి వచ్చును. ఇంకొకరు మోటు ప్రశ్నవేయగా అయ్యో! అది ఎవరు చెప్పగలరు అని అందరు అనుకొనుచుండగా, నీ మనసులో "నన్ను చెప్పమంటే చెబుతాను" అనుకుంటావు. అదే ఉపన్యాసములో ఉపన్యాసము.


సేవలో సేవ

"నాకే ధనము ఉంటే లోకమంతా తిరిగి అందరికి ప్రకటిస్తానని" నీ మనసులోనికి రావడమే సేవలో సేవ. ఈ ప్రకారముగా క్రైస్తవుని జీవితములో అనేక అంశములున్నవి. అంశములలో అంశములు చాలా ఉన్నవి.


ఆరోహణములో ఆరోహణము

యేసుప్రభువు ఆరోహణమాయెను. రేపు సంఘము ఆరోహణమగును. నేను ఆ రాకడలో పాల్గొని, నేనును అరోహణమగుదును, గుర్తులు జరుగుచున్నవి. బోధకులు సిద్ధపడమంటున్నారు. ఆలాగే నీ మనస్సులో రాకడ జ్ఞాపకము వస్తున్నది. అదే ఆరోహణములో ఆరోహణము. ఆరోహణ సంఘటనలో ఈ సంగతి ఉన్నది. ఇద్దరు వ్యక్తులు నిలువబడి,11 మంది శిష్యులతో ఆయన తిరిగి సంఘాన్ని తీసికొని వెళ్ళుటకు వస్తాడని చెప్పిరి. అదే ప్రభువు కూడ చెప్పెను. ఇదే ఆరోహణములో ఆరోహణము.


రాకడలో రాకడ

యేసుప్రభువు ప్రాణముతో వెళ్ళినట్లు మరణముతో సంబంధము లేకుండా వెళ్ళినట్లు మనమును వెళ్ళతాము. ఎంత ధన్యత! ఆలాగే ఆయన ఆరోహణములో మన ఆరోహణము, ఆయన రాకడలో మన పోకడ, ఆయన పునరుత్ధానములో మన పునరుత్ధానము ఇమిడియున్నవి.


పునరుత్ధానములో పునరుత్ధానము

మీరు చనిపోయినవారై ఉన్నారు. అయినను ప్రభువుతో లేచినవారై ఉన్నారని పౌలు వ్రాసెను. మనము చనిపోయినవారమై ఉండగా; క్రీస్తు పునరుత్ధానమువలన లేచినవారము. పునరుత్ధానమునకు ఆరోహణమునకు సంబంధము ఉన్నది. పునరుత్ధానము అనగా సమాధిలోనుండి లేచుట. ఆరోహణము అనగా భూమి మీద ఉన్న సర్వ కష్టాలలో నుండి లేచుట. "అనుదినము పాపములలోనుండి పునరుత్ధానమగుచుంటే ఎప్పుడో ఒకప్పుడు ఆరోహణమగుదుము. ఈలాగు మనము ఆరోహణమునకు సిద్ధపడుదుము. మనము ఏడవక, సంతోషించే ఒక గడియ వస్తున్నది. సిద్దముగా ఉన్నప్పుడు మన ఆరోహణము వచ్చును.


గొలుసులో గొలుసు

క్రిస్మసుకు మనము రంగు కాగితములు అతికికించునపుడు, మెరుపు తీగెలు అల్లునపుడు, ఒకదానిలో ఒకటి అతికించునట్లు, మనము ప్రభువును తెలుసుకొన్న నిమిషము మొదలు పరలోకము వెళ్ళే నిమిషమువరకు ఒక గొలుసు. ప్రార్థన, బైబిలు చదువుట మరొక గొలుసు. సేవా పరిచర్య ఇంకొక గొలుసు. ఇదే గొలుసులో గొలుసు.


అనుభవములో అనుభవము

ఇదికూడా ఒక గొలుసే, ఆలాగే బ్రతుకంతా గొలుసే. ఆయన నిర్వివాదముగా బ్రతికి, జయసీలుడై, పరలోకము వెళ్ళినట్లు మనమును వెళ్ళుదుము. కొందరు మృతులై పరలోకమునకు వెళతారు. కొందరు సజీవులై వెళ్ళతారు. అయ్యో వారికి మృతుల గుంపు ఎందుకు? వీరికి ఇది ఎందుకు! అనకూడదు. అందరము ఒక్క వరసలోనే ఉంటాము. ఆయన మన కన్నీళ్ళు తుడుచుననేది ఎంత గొప్ప ధన్యతగును!