క్రీస్తుప్రభువు రెండవ రాకడ
(ద్వితీయాగమనము)
గ్రంథకర్త: యం. దేవదాసు అయ్యగారు
ప్రియులారా!
ప్రతి సంవత్సరమును డిసెంబరులో వచ్చే అడ్వెంటుకాల మందలి ఆదివార ప్రసంగములలో ప్రభువుయొక్క రెండవరాకడను గురించి బోధకులు ప్రసంగించుట మన లూథరన్ మిషను యొక్కయు మరికొన్ని మిషనుల యొక్కయు, సంఘపంచాంగాచారమై యున్నది. (క్రిస్మసు అనగా) ప్రభువుయొక్క మొదటి రాకడను గూర్చిన పండుగ ఎంత శ్రద్ధగా ఆచరించుచున్నామో రాబోవు రెండవరాకడను గురించిన పండుగకూడా అంత శ్రద్ధతో ఆచరించవలెనని జ్ఞాపకము చేయుచున్నాను. సద్విషయములనే నా పుస్తకములో అనగా పరిశుద్ధాత్మ బాప్తీస్మమునుగూర్చి వ్రాసిన పుస్తకములో యిది ఇదివరకే జ్ఞాపకము చేసియున్నాను. అడ్వెంటు కాలములోని ఒక వారమంతయు ప్రతిరోజు ఆరాధనలు పెట్టుకొనుట మంచిది.
“ఈ సంగతులను సహోదరులకు వివరించిన యెడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధసంబంధమైన వాక్యములచేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై యుందువు” అని తిమోతి 4:6లో నున్నది. గనుక ఆ ప్రకారము నేను విశ్వసించిన సంగతులను ఈ పుస్తకమందు వ్రాయుచున్నాను. మరియు నేను గ్రామ సంచారము చేయుచున్న సమయమందు కొందరు వేసిన ప్రశ్నలలో కొన్ని ముఖ్య ప్రశ్నలును వాటికి నేనిచ్చిన క్లుప్తమైన జవాబులును యిందులో వ్రాసియున్నాను. ఇట్లు వ్రాసి ప్రచురించిన యెడల అనేకులు చదివి మేలు పొందుదురని కొందరనుభవశాలురు సలహా యిచ్చినందుననే వ్రాసి ఇట్లు ప్రచురించుచున్నాను గనుక దయతో చదువండి.
1వ ప్రశ్న - రెండవ రాకడ అనేది ఒకటి ఉన్నదా?
జవాబు :- ఉన్నది. ప్రభువు పరలోకమునకు వెళ్లుచుండగా పైకి తేరిచూచుచున్న పదునొకండుమంది శిష్యులకు ధవళవస్త్రధారులైన ఇద్దరు కనబడి “గలిలయ మనుష్యులారా! మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే యేరీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగివచ్చును” అని చెప్పిరి (అపో.కార్య. 1:10-11). ఈ వాక్యమునుబట్టి చూడగా ప్రభువు తిరిగివచ్చుట నిజము. రాకడలు మూడు
- ఎ) బేత్లెహేములో జన్మించి వచ్చిన రాకడ,
- బీ) అనుదినము విశ్వాసుల సభలకు వచ్చే రాకడ
- సి) విశ్వాసులను పరలోకమునకు మహిమ శరీరముతో తీసికొని వెళ్ళేటందుకు వచ్చు రాకడ.
2వ ప్రశ్న - శరీరముతో వచ్చెదరా?
జవాబు :- అవును పునరుత్ధానమైన తర్వాత శిష్యులకు కనబడిన మహిమ శరీరముతోనే ఆయన వచ్చును (అపో. కార్య. 1:11).
3వ ప్రశ్న - ఆయన రాకముందు జరుగవలసిన గుర్తులేవి?
జవాబు :- లూకా 21వ అధ్యాయములో యిట్లున్నది
- (1) యెరూషలేము నాశనమగును
- (2) యూదులు దేశసంచారులగుదురు.
- (3) అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూషలేము అన్యజన పరిపాలన క్రిందనేయుండును.
- (4) అన్యజనుల పరిపాలన పూర్తియగు చుండు సమయమున యూదులు తిరిగి పాలెస్తీనా దేశమునకు వచ్చెదరు (ఇది 24వ వచనభావము. యూదులు తిరిగి వచ్చెదరనే సంగతి పాతనిబంధనలోనున్నది).
1) రక్తపు వర్షము:- ఇటలీలో కొందరియొద్దనుండి ఇటలీలో రక్తము కురియుచున్నది అను అంశముగల్టిన కొన్ని వార్తాపత్రికలు వచ్చినవవి. వారి స్థలములో రక్తవర్ణముకల్లిన ఎర్రని వర్షము ఒక గంట కురిసినదట! ఈ ఆశ్చర్యకరమగు సంగతిని ఇటలీలో శాస్త్రజ్ఞులు వివరించలేకపోయిరి.
2) రక్తపు నీరు:- పోర్టుహోరోన్ , మిచ్చిగన్ లోనున్న ఒకరిట్లు వ్రాయుచున్నారు. "ఈ స్థలములోని ఒక జలప్రవాహము కొంతసేపు ఎర్రగా మారిపోయినది". వందలకొలది జనులు చూచుటకు వచ్చియున్నారు. ఇచ్చటివారు కొందరు సీసాలలో ఆ నీటిని పట్టి అమ్మిరి. శాస్త్రజ్ఞులు దానిని పరీక్షించి "రక్తపునీరు" (Blood water) అని పేరిడిరి.
3) ఆకాశములో ఖడ్గము:- 1935వ సం॥ము నవంబర్ 24వ తేదీన పాలెస్తీనాకును దాలాస్ కును మధ్య ఆకాశములో మండుచున్న ఒక అగ్నిఖడ్గము కన్పించెను. ఇది ఏలవచ్చినదో జ్యోతిష్కులు వివరించలేక పోయిరి. దాక్టరు జె.డి. బూన్. సధరన్ మెథడిస్టు యూనివర్సిటీ ప్రొఫెసరుగారు, యీ సమయమందిట్టిది జరుగునని మేము కనిపెట్టుచుండ లేదని వ్రాసిరి.
4) అబద్ధ ప్రవక్తలనుగూర్చి:- గతించిన కొన్ని సంవత్సరములలో నేనే లోకరక్షకుడననియు, నేనే మెస్సియాననియు చెప్పుకొనువారు నలుబది నలుగురు వచ్చియున్నారు.
మరియు ఒక నీగ్రోదేశస్థుడు అమెరికాలో మతబోధచేస్తూ దైవజనకుడు అనుపేరుమీద ప్రసిద్ధిలోనికివచ్చి అనేకమందిని శిష్యులనుగా చేసుకొనుచున్నాడు. (J.M. Divine) (Negro Messaiah). “అనేకులైన అబద్ధ ప్రవక్తలువచ్చి పలువురుని మోసపరచెదరు” అని మత్తయి 24:11లో ప్రభువు చెప్పినట్టుగా ఇప్పుడు జరుగుచున్నది. వీరు విద్యను అధికముగా అభ్యసించి, తమ్మును కొనిన క్రీస్తును విసర్జించుచు, తమ స్వంతజ్ఞానము నాధారము చేసికొని మాట్లాడుచు వాక్యమును వ్యతిరేకించుచున్నారు.
5) యుద్ధములనుగూర్చి: - “జనముమీదికి జనమును, రాజ్యముమీదికి రాజ్యమును లేచును. మరియు మీరు యుద్ధములను గూర్చియు, యుద్ధసమాచారములను గూర్చియు వినబోదురు” మత్తయి 24:6-7. యుద్ధము జరుగుననుటకిక సందియములేదు. ఖండము లంతయు ఖడ్గములతోను తుపాకీలతోను మెరయుచున్నది. ఇంతకు ముందెన్నడును ఎరుగని యొకవిధముగ భయము ప్రతి దేశమును పట్టి యున్నది. అందుచేత సేనలు యుద్ధమునకెల్లప్పుడు సిద్ధముగానే యున్నవి.
రష్యాలో బాల్ షివిక్కుల రాబోయేయుద్ధముగాలిలోనే జరుగునని యెరిగినవారై రాత్రింబగళ్ళు విరాములేకుండ మందు సామానులను గాలి విమానములను సిద్ధము చేసికొనుచున్నారు. Rev. Oswald J. Smith.
ఇక చెప్పుటకేమున్నది! ఏదోయొకటి జరుగుటతోడనే లోకమంతయు యుద్ధమందు మండిపోవును. రాబోయే యుద్ధమెట్లుండునో మార్షల్ ఫోక్ (Marshal Foch) గారిట్లు వర్ణించియున్నారు. రాబోవు యుద్ధము అన్నివిధముల ప్రపంచయుద్ధ మైయుండును దాదాపు రాజ్యములన్నియు అందుపాల్గొనును. పురుషులు మాత్రమేకాదు స్త్రీలు పిల్లలుకూడ పోరాడుదురు. బాంబులు విడచుటవలన విషవాయువులు వ్యాపించి కొన్ని నిమిషములలో అనేకులకు మరణము కలుగజేయును. ఫాస్ ఫరస్ బాంబులు ఒక అరనిమిషములో మానవుల శరీరమును ఎముకలను సహకాల్చివేయును. "పైన ఆకాశమునుండి పరిమితిలేకుండ మందు సామాను కురిపించుటచేత ఆకాశము చీకటి కమ్మును."
యుగాంతము (The end of the age) అను పుస్తకములో జేమ్స్ హెచ్ . మెకాంకర్ (James H.Mc Conker) అను సుప్రసిద్ధులైన భక్తులు ఈలాగు చెప్పుచున్నారు. "ప్రస్తుత కాలమందు లోకచరిత్ర అతి త్వరితముగా జరిగిపోవుచున్నది. అంతయు రక్తమయమైయున్నది. ఒక రాత్రిలోనే రాజ్యములు లేచుచున్నవి, పడిపోవుచున్నవి సింహాసనములు కదలుచున్నవి. యుద్ధసేనలు భూమిమీదను, సముద్రముమీదను, ఆకాశమందును పోరాడుచున్నవి, నరపుత్రులు లక్షలకొలది హతులగు చున్నారు. నవనాగరికత పురాతనకాలపు మోటుతనము క్రూరత్వముల లోనికి జారిపోవుచున్నది. సంఘముయొక్కయు, ప్రభుత్వములయొక్కయు పునాదులు భూకంపములవలన జోగుచున్నవి". లోకముమీదికి రాబోవుచున్న వాటివిషయమై భయముకలిగి మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యము చెడికూలుచున్నారు.
6) ఆకాశమందు కనబడిన వ్రాత:- లూకా 21:11. ఈ మధ్య నార్వేలో ఒక వింతయగువ్రాత ఆకాశమందుకనబడెను. “ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను” అను మాటలు ఆకాశమందు వ్రాయుబడెను (Emmanuel Bible Tract Depot).
7) ఆశ్చర్యకరమైన గుర్తులు ఆకాశమందు కనబడుట:- కొద్దికాలము క్రిందట ఇంగ్లాడులో ఆశ్చర్యకరమగు గురుతులు ఆకాశమందు అనేకమైనవి కన్పించెనని ప్రకటింపబడెను. మానవుని కన్నులెప్పుడును ఇట్టి చిత్రములనుచూచి యుండలేదని ఒకరు వ్రాయు చున్నారు. ఇంగ్లాడులో వీటి ఫోటోగ్రాపులు తీసియున్నారు అవియేవనగా:
- 1) మూడు వెలుగు స్తంభములు
- 2) ఈ మూడు వెలుగు స్తంభములు ఒకటిగా మారుట.
- 3) ఇది మరల సిలువయగుట.
- 4) ఈ సిలువ నాలుగు మూలలు గల్గిన నక్షత్రముగా మారుట.
మొదటిరెండును త్రియేకదేవునిని, మూడవది. 'సిలువ' ఏ లోక రక్షణ కాధారమనిని, నాల్గవది ఈ సిలువ క్రీస్తేత్ వరగా వేకువచుక్కగా రాబోవుచున్నాడని సూచింపవచ్చును (Defender. Magazine).
ఈ కొద్ది సంవత్సరములలో ఆకాశమందు కనబడిన విపరీత సంగతులు వార్తాపత్రికలయందు ప్రకటింపబడిన యెడల, ప్రజలు భయాత్రాంతులగుదురని ప్రముఖుడైన యొక జ్యోతిష్య శాస్త్రజ్ఞుడు చెప్పుచున్నాడు.
8) అగ్గివాన:- (అగ్నిని కనపరచెదను యోవేలు 2:30; అపో. కార్య. 2:19) గుంటూరు తాలూకాలో తిమ్మ సముద్రము అనే గ్రామములో 28-10-1936 తేదీని నాలుగు విధములైన వర్షము కురిసినది. అందులో ఒకటి నిప్పులవాన; నిప్పులవానవలన క్రైస్తవపేటలో పదిమందికి దేహములపైన బొబ్బలు లేచినవి. ఒక యింటిలో వేరుసెనగా బస్తాలు కాలిపోయినవి. ఆ గ్రామములో ముగించబడిన ఆలయము బలమైన పునాదిగల గోడలు, కిటికీలు, రాళ్ళు కాలిపోయినవి. బడి, ఇల్లు, సామానుతోపాటు అంతయు కాలిపోయినవి అని ఆ గ్రామ నివాసియెన కందుల బెంజిమెన్ గారు నవంబర్ 19వ తేదీ రవిలో ప్రచరించిరి. ప్రవచనములు మనకాలములో ఎంత అక్షరరీతిగ నెరవేరుచున్నవి. ఇట్టి గుర్తులుచూడగా ప్రభువు రాకడ సమీపించుచున్నదని చదువరులు గ్రహింతురుగాక!
9) అక్రమము విస్తరించుటనుగూర్చి:- “అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును. అంతమువరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును” మత్తయి 24:12-13. ఆదివారమనగా లెక్కచేయని నామధేయ క్రైస్తవులెందరో నున్నారు. వనభోజనములు, విందులు, ఆటపాటలు, వర్తక వ్యాపారములు మొదలగు వాటికి నిరభ్యంతరముగా ఈదినము ఉపయోగింపబడుచున్నవి (Prophecy Magazine).
“అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్ధప్రియులు ధనాపేక్షులు, అహంకారులు, అపవిత్రులు, క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె నుండియు దానిశక్తిని ఆశ్రయించని వారైయుందురు” 2తిమోతి 3:1-5. లోకప్రసిద్దులైన హెచ్. జి. వెల్స్ (H.G. Wells) గారు ప్రస్తుతపు పరిస్థితులనుగూర్చి ఈలాగు వ్రాయుచున్నారు. “ఇకముందుకెపుడో నాగరికత నాశనమగుననికాదు. మనకండ్ల యెదుటనే అది నాశనమగు చున్నది. నాగరికతనే ఓడ 50 సంవత్సరములలో లేక 5 సంవత్సరములలో మునిగిపోవునని కాదు. ఇదిగో ఇప్పుడే అది మునిగిపోవుచునేయున్నది.
ఫిలదెల్ఫియయందు ప్రచురింపబడు 'ది లూథరన్ (The Lutheran) అను మాస పత్రికలో జులై చరిత్రకారుడగు డాక్టరు: ఏ. ఆర్. వెంట్స్ ఈ క్రిందివిధముగా వ్రాయుచున్నారు.
ఐహికత్వము లౌకికాత్మయే అనగా అనిత్యమైన మానవలాభము కొరకు ఆత్మీయమైన వాటిని సర్దుకొనుట లేక వదలుకొనుట. విచారకరమైన విషయమేమనగా, "అమెరికాలోని క్రైస్తవసంఘములు. నాగరికతకు తోడ్పడగలవని నిరూపించుటకు చేసిన ప్రయత్నములలో నాగరికత నియమములకే లోబడిపోయి లౌకికత్వములోనికి పూర్తిగా దిగిపోయినవి" అయితే ప్రియులారా! అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసు క్రీస్తు అపోస్తలులు ఇదివరలో మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసికొనుడి. "అట్టివారు ప్రకృతి సంబంధులును ఆత్మలేనివారునైయుండి బేధములు కలుగజేయుచున్నారు” యూదా 17:19. క్రైస్తవ సంఘములలో ఆత్మశక్తి లేనివారెందరో ఉన్నారు. చదువరి! నీసంగతిఏమి? నీస్థితి ఏలాగున్నది? ఆలస్యముకాకముందే ఆలోచించు కొనుము.
10) పందెమువేసి ప్రసంగించుట:- 1936 సం॥ము నవంబర్ 8వ తేదీ “Sunday Times” (సన్ డే టైమ్స్ ) అనే పత్రికలో అట్లున్నది. (బైబిలులోనున్న ప్రవచనములు ఈకాలమందు ఎట్లు నెరవేరుచున్నవో అవి క్రీస్తుయొక్క రెండవరాకడను ఎట్లు చూపించుచున్నవో యూదులు పాలెస్తేనాకు చేరుకొనుటవల్ల ప్రవచనములు ఎంత నిజమగు చున్నవో క్రీస్తుప్రభువు చెప్పినట్లు ఆపత్కాలములు భూమిమీదికెట్లు వచ్చుచున్నవో ఈ మొదలైన సంగతులు డబ్లియు. హెచ్. హిల్ అనే దొరగారు ఇంగ్లాండులో ఉపన్యాసముల మూలముగా పందెము వేయుచు ప్రకటించుచున్నారు).
JESUS CHRIST TO RETURN
AND A NEW EMPIRE
Coming of Jesus (Christ and a new world empire are close at hand, according to the Christadelphians of Britian, who have started a lecture campaign throughtout the country.
Their object is to show how the application of Bible prophecy to current and future world events point to the second coming of Christ.
The return of the Jews to Plaestine said Mr. W.H. Hill, the leader of the movement, definitely shows that the prophecies are coming ture.
RUSSIA’S POWER
There were other Biblical lndications too Christ prophesied His second coming at a time when there would be distress of nations with perplexity, the sea and the waves roaring, men’s hearts failing them for fear and for looking after those things that are coming on earth.
Mr. Hill chall challenges his hearers to describe present conditions in a more accurate way than this Biblical prophecy did.
The movement, which dates back to 1848, gives a Bible prophecies that “Russia will become a great miltary power and invade Palestine”.
4వ ప్రశ్న - యూదులు క్రీస్తుసంగతి ఆలోచిస్తున్నారని విన్నాను అది ఎలాగున్నది?
జవాబు :-
- 1) యూదులను క్రీస్తుతట్టు త్రిప్పుటకై ప్రత్యేకముగా ఒక మిషను ఉన్నది చాలమంది తిరిగినారుగాని, యూదుల జనాంగమంతయు తిరుగలేదు.
- 2) క్రీస్తును సిలువవేసిన నేరమును బట్టి యూదులు నానాదేశములకు చెదిరిపోయిరి. ఇది వారికొక శాపముగా నున్నది. అందరు క్రీస్తును తెలిసికొనుటకు దేవుడు వారికి మరొక సమయమును అనుగ్రహించుచున్నాడు. వారు యెరూషలేము వచ్చిన తర్వాత ఆ సమయము తెలిసికొందురు.
- 3) యూరప్ యుద్ధకాలమందు వారిదేశము ఇంగ్లీషువారికి వచ్చినందున వారు నిర్భయముగా స్వదేశము వెళ్ళుచున్నారు.
- 4) ఈమధ్య యూదులలోని ప్రముఖులు ఒక గొప్ప సభచేసిరి. నాడు మాట్లాడుకొన్న అంశము “క్రీస్తు పొందినతీర్పును” గూర్చి నేరస్తుడై సిలువవేయబడెనా? అన్యాయముగా సిలువవేయబడెనా? అను అంశము ఎత్తికొని ఉపన్యాసములిచ్చిరి.
ఇప్పటికి యూదులు కొన్ని లక్షలమంది పాలెస్తీనాకు వచ్చియున్నారు, ఇంకా వచ్చుచున్నారు. యూదులు పాలెస్తీనావెళ్ళి తమ హెబ్రీభాషను నేర్పించే పాఠశాలలు పెట్టినారు. భూములు సాగుబడి చేయుచున్నారు. అనేక సంవత్సరముల నుండి బీడుగా పడిపోయియున్న దేశము ఇప్పుడు మరల ఫలభరితమైన దేశమగుచున్నది. ఇది బైబిలు ప్రవచనముల నెరవేర్చు.
5వ ప్రశ్న - ప్రభువు రెండవసారి ఫలాన సంవత్సరము ఫలానా తేదీన వచ్చునని మనము నిర్ణయించగలమా?
జవాబు :- “ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెళకువగా నుండుడని ప్రభువు సెలవిచ్చెను” (మత్తయి 25: 13) అందుచేత మనము నిర్ణయించలేము.
6వ ప్రశ్న - విశ్వాసులలో ఒకరు ఒకరీతిగాను ఇంకొకరు మరియొక రీతిగాను చెప్పిన నిజమేలాగు తెలియును?
జవాబు :- జవాబు చెప్పితినిగాని, నీకు సంతుష్టి కలుగలేదు. సమయము తెలియదు గనుక ఎప్పుడును సిద్ధపడియుండుటవల్ల నష్టము లేదుగదా? సిద్ధపడకపోతే మాత్రము నష్టమున్నది. త్వరగా వచ్చెదరని చెప్పిన యేసుప్రభువును తలంచుకొని “ప్రభువైన యేసూ! రమ్ము” అని యోహాను చేసిన ప్రార్ధన చేయుట యెంతో మంచిది.
7వ ప్రశ్న - మెళకువ పడడమనగా నేమి?
జవాబు :- ఆయన ఎప్పుడు వచ్చినాసరే సిద్ధముగానుండవలెను.
- (1) మిక్కిలి ఓపికతో ఆయన రెండవరాక కొరకు కనిపెట్టవలెను (1థెస్స. 1:9,10; 2థెస్స 8:5; యాకోబు 5:7).
- (2) ఎదురు చూడవలెను (ఫిలిప్పీ 3:20-21; రోమా 8:23; హెట్రీ. 9:28).
- (3) రాకడను అపేక్షించవలెను. అనగా ఆయన వచ్చునని భయపడకూడదుగాని సంతోషించవలెను. కోరుకొనవలెను. (2తిమోతి. 48).
- (4) ఆయన వచ్చుచున్నాడు గనుక వచ్చుచున్నాడనే ఉద్దేశముతో సేవ మరింత ఎక్కువగా చేయవలెను (లూకా 19:13; 1కొరింధి. 15:58).
- (5) ప్రార్థించుచునే యుండవలెను (ప్రక. 22:17-29).
8వ ప్రశ్న - ఆయన త్వరగా వచ్చుచున్నట్లు 1800 సంవత్సరముల క్రిందటనే చెప్పబడియున్నదిగదా? ఇప్పుడు బహు సమీపమని ఎట్లు నమ్మగలము?
జవాబు :- త్వరగా వచ్చుచున్నాడనే ఒక్కమాటే పట్టుకొంటే అర్ధము పూర్తిగా తెలియదు. గుర్తులు జరుగును అనునది మొదట చదువుకొని తర్వాత వచ్చుననేది త్వరగా చదివిన యెడల అర్ధము పూర్తియగును. తన మాటలు నమ్మని యూదులతో ప్రభువేమి చెప్పెను? “మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను - మీరు పడమటనుండి మబ్బు పైకి వచ్చుట చూచుచున్నప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు అలాగే జరుగును. దక్షిణపుగాలి విసరుట చూచునప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు అలాగే జరుగును. వేషధారులారా! మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు. ఈ కాలమున మీరు గుర్తింపనెరుగరేల” లూకా 12:54-56. రెండవరాకడ త్వరగా వచ్చునని కాలమును బట్టియు, గుర్తుల యొక్క వైఖరినిబట్టియు గ్రహించి నమ్మనివారికి ఈ వాక్యము ఒక మందలింపు వాక్యముయైయున్నది. రాకడ సమీపమును గురించి ప్రవచనములు ఒకదరినుండి నెరవేరుచుండగా ఇప్పుడు నమ్మకపోతే మరెప్పుడు నమ్మడము?
ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు. గనుక త్వరగా యీ సంగతి అందరకు చెప్పుచు త్వరగా సిద్ధపడవలెననేది నా సలహా.
9వ ప్రశ్న - ఇదిగో ఆయన వచ్చుచున్నాడని ఇదివరకే కొందరు నిరీక్షించి రాకపోవుటచూచి నిరుత్సాహపడి తుదకు మరణించినట్లు చెప్పుకొనుచున్నారు ఇది నిజమా?
జవాబు :- నిజమే. గుర్తులు జరుగనికాలములో అనగా వారి జీవిత కాలములో ప్రభువు వచ్చునని వారనుకున్నారు. యూదులందరు యెరూషలేము రాకముందు ప్రభువు రాకడ జరుగును.
10వ ప్రశ్న - మనకాలములో క్రీస్తురాకడనుగురించి చదువుట ఆలోచించుట ప్రార్ధించుట, సిద్ధపడుట అంత అవసరమా?
జవాబు :- అవసరమే. ప్రభువుయొక్క జీవిత కాలమంతటినిగూర్చి ఆలోచించుట అవసరమే. ఆయన జన్మము, ఆయన బోధలు, ఆయన అద్భుత కార్యములు, ఆయన సిలువమరణము, ఆయన పునరుత్ధానము, ఆయన ఆరోహణము ఏలాగు ఆయన చరిత్రకు సంబంధించినావో, అలాగే ఆయన రెండవ రాకడనుకూడ ఆయన చరిత్రకు సంబంధించినదే మనము ఇతరులకు బోధించేటప్పుడు క్రీస్తు రాకడను విడిచిపెట్టి తక్కినవి బోధించితే మనము చెప్పే సువార్త సంపూర్ణ సువార్తకాదు. రాకడను గూర్చి చెప్పి అంతకుపూర్వ సంగతులు బోధించుట తగ్గించినయెడల అదియు అసంపూర్ణ సువార్త. రాకడ రెప్పపాటులో జరుగును గనుక మారుమనస్సు పొందుటకుగాని సిద్ధపడుటకుగాని సమయం దొరకదు అందుచేత ముందుగానే మారుమనస్సుపొంది సిద్ధపడుట, ఎంతో అవసరము.
11వ ప్రశ్న - బైబిలులో ప్రభువు రెండవరాకడను గూర్చి ఎక్కడెక్కడ వ్రాయబడియున్నది?
జవాబు :- ప్రభువు రాకడను గూర్చి ఎక్కడున్నదో అక్కడే అంతకుపూర్వపు సంగతులను అటుతర్వాత సంగతులను కలిసేయుండును.
- ఎ) దావీదు కీర్తన 45లో ప్రభువు మహిమతో వచ్చుటను గూర్చియు సంఘమును పెండ్లికుమార్తె చేర్చుకొనబడుటయు ఉపమానరీతిగా వివరింపబడుట యున్నది.
- బి) మత్తయి 21వ అధ్యాయము, 25వ అధ్యాయము, మార్కు 13వ అధ్యాయము, లూకా 21వ అధ్యాయమును శ్రద్ధతో చదువవలెను. అలాగే ప్రభువుయొక్క రెండవరాకడను గురించి యున్న మొదటి థెస్సలోనికై పత్రికయును, ప్రభువు దినమును గూర్చియు ప్రభువు రాకడను గూర్చియు ఉన్న రెండవ థెస్సలోనికై పత్రికయును, నాశనదినమునుగూర్చియు ప్రభువు రాకడను గూర్చియు ఉన్న రెండవ పేతురు మూడవ అధ్యాయమును జాగ్రత్తగా చదువవలెను.
- సి) ప్రకటన గ్రంథములోని సంగతులు చదువక పూర్వము యూదా పత్రికలోని సంగతులు చదువదగినవి. ఎందుకనగా ప్రభువు వచ్చే సమయమందు లోకము ఎట్టి స్థితిలోనుండునో అది దీనిలో వివరింపబడి యున్నది. ఇది చూపులకు ఒక అధ్యాయమే అయియున్న పత్రికయైనను విషయములను బట్టి మహాగొప్ప గ్రంథముగా భావించుకొనవచ్చును.
- డి) శరీర సంబంధమైనట్టియు, లోక సంబంధమైనట్టియునైన తలంపులను మనస్సులోనికేమాత్రమును రానివ్వక పరమ గీతమనే పుస్తకమును పూర్తిగా చదివినయెడల క్రీస్తు ప్రభువునకును విశ్వాసులయొక్క సంఘమునకును గల పరలోక వివాహ సంబంధమైన అతిపరిశుద్ధమగు ప్రేమ, ఐకమత్యత, నిత్యనివాసము అనువాటిని గురించి తెలిసికొనగలము. పరలోకపు పెండ్లికుమార్తె వరుసలోనికి రాగోరేవారందరును ఈ పుస్తకమును మోకాళ్ళమీద చదువవలెననేది నాసలహాయైయున్నది. అలాగే ఎస్తేరు గ్రంథముకూడ చదువదగినది.
12వ ప్రశ్న - ఇంత త్వరలోనే క్రీస్తుప్రభువువస్తే చాలామంది సిద్ధపడనివారు సువార్త విననివారున్నారు. గనుక వారిపనియేమగును? అందులో తీర్పులోనికి వెళ్ళవలని ఉంటుంది. ఎత్తబడేవారు బహుకొద్దిమందే అయి ఉంటారు. ఇంతమందికి నష్టము వచ్చునని ప్రభువుకు తెలుసునుగదా? ఇంతత్వరలో వస్తాడా?
జవాబు :- మిగిలిపోయేవారికి శ్రమలో సిద్ధపడే సమయము దొరుకునుగదా! ప్రభువువస్తే రెండవరాకడ విశ్వాసులను మాత్రమే తీసుకొని వెళ్ళును. తక్కినవారినందరిని విడిచిపెట్టునుగాని వారి నాశనమునకు పంపడు. లోకము అప్పుడు అంతముగాదు. వెళ్ళేవారికి మరణమేలేదు, ఉండేవారికి అప్పుడు మరణము కలుగదు.
13వ ప్రశ్న - ప్రభువు దొంగవలె వచ్చుమాటకు అర్థమేమి?
జవాబు :-
- 1) దొంగవచ్చి ప్రశస్తమైన నగలు వెలగల సామానులు తీసుకొనిపోవును. చెత్తగా నున్నవి విడిచిపెట్టిపోవును. అలాగే రాకడ విశ్వాసులను మాత్రమే క్రీస్తుతీసుకొనివెళ్ళి తక్కినవారిని విడిచిపెట్టి వెళ్ళును గనుక ఆ విషయములో మాత్రమే ఆ పోలిక.
- 2) ఆ దినములు అకస్మాత్ముగా మీమీదికి ఉరి వచ్చినట్లు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉ ండునని ప్రభువు చెప్పెను (లూకా. 21:34) దీనినిబట్టిచూస్తే అవిశ్వాసులకు అది అకస్మాత్తుగాను ఉరిగాను వచ్చును. విశ్వాసులకుకాదు ఎందుకంటే వారు సిద్ధపడేనుందురు (ప్రక. 3:3).
14వ ప్రశ్న - పరమగీతములో ఒక సంగతి వినగోరుచున్నాను వివరించండి?
జవాబు :-
- ఎ) ఈ పుస్తకము యౌవనవంతులు చదువకూడదని పెద్దలు చెప్పుదురు. ఇది మంచిదే అయితే అది చదువవలసిన కాలము వచ్చినప్పుడు చదువవచ్చునుగదా? యౌవనస్థులు ఈ పుస్తకమును ఒంటరిగా చదువక ఏ సంఘాధ్యక్షునిచేతనైనను చదివించుకొంటే మంచిది.
- బి) ప॥గీ॥ 2:4 వివరిస్తాను. పరిశుద్ధాత్మ అనే పావురమును కలిగియున్న సంఘముకూడ క్రీస్తుప్రభువువల్ల పావురముగా అనగా నిష్కళంకమైన సంఘముగా ఎంచబడుచున్నది. క్రీస్తు రక్తమువలన పవిత్రపరచబడినది. అందుచేతనే తత్పూర్వ వాక్యములోనున్న సుందరవతీ! అను పేరునకు తగియున్నది. సంఘమీలోకములో ఉన్నంతకాలము, లోపములు గలిగియున్నప్పటికిని ఇక ముందుకు మారని పరిశుద్ధ స్ధితి గలుగునని ప్రభువునకు తెలుసును. సంఘముయొక్క విశ్వాసమునకు తెలుసును సంఘమనే పావురము బండ సందులలో అనగా క్రీస్తు అనే బండయొక్క గాయములలో నుండెడిది. అదే తన దాగుచోటు, క్రీస్తు ప్రవాహపు గాయములవల్ల తనపై నున్న కీడు తొలగెను. అక్కడ దాగొన్నయెడల ఏ హానియురాదు. మహాక్షేమములు గలుగును పాపబంధకములును పాప ఫలిత బంధకములును ఉండుటవల్ల సంఘము స్వేచ్చగా తిరుగలేదుగాని సిలువపైనున్న క్రీస్తు ధారబోసిన వస్తువువల్ల బంథకములు వదలిపోయి స్వేచ్చగా ఎగురగలదు క్రీస్తులో అనేదే దాని నివాసము. ఆయనే ఆశ్రయస్థానము “నిత్య మౌశిలానను, నీదు ప్రక్కదాచుము” అను 342వ కీర్తన పాడుకొనుము. సంఘము ఏడేండ్ల శ్రమకాలములో పరలోకమందు క్రీస్తులోనే యుండును. గనుక శ్రమ తననుతాకదు. ఆ అనుభవము కొంత ఈలోకములోనే కనబడుచున్నది. మన కష్టాలన్నియు క్రీస్తు సిలువ మ్రానుమీద తనపైని వేసికొన్నాడనే ధైర్యముతో దైవజనులు శ్రమలను లెక్కచేయకుండ తిరుగుచున్నారు. పావురమువలె ఎగురుచున్నారు.
“మనయెడల ప్రత్యక్షముకాబోవు మహిమయెదుట ఇప్పటికాలపు శ్రమలు ఎన్నతగినవికావని యెంచుచున్నాను” (రోమా 8:18 వెయ్యేండ్ల పరిపాలనలో మరింత ఎరుగుదురు. ఇదే క్రీస్తు రక్తబలము. సిలువను చూడగానే క్రైస్తవుని పాపపు మూట ఊడిపోగా అతనికెంత తేలికైనది). యాత్రికుని ప్రయాణ పుస్తకము చదువుము. సిలువమీద క్రీస్తు ఆ మహాగొప్ప కార్యము చేయనియెడల మనపని యేమగును?
15వ ప్రశ్న - ఇంకొక వాక్యము వివరించండి?
జవాబు :- ప॥గీ॥8:4 వివరించెదను. సంఘము ఈలోకములో చేసే చివరి ప్రార్థన యిందులోనున్నది. లేడి ఏ ప్రకారముగా త్వరగా పరుగెత్తుకొని వచ్చునో ఆప్రకారముగానే ప్రభువైన యేసును త్వరగా రమ్మని భూలోక సంఘము పిలుచుచున్నది. ఇది రెండవరాడకు సంబంధిచిన ప్రార్ధన. రెండవ రాకడను గురించి ఉన్న ప్రకటన గ్రంథములో చివర ఇట్టి ప్రార్ధనేయున్నది. “ప్రభువైన యేసూ రమ్ము”.
16వ ప్రశ్న - ప్రకటనలోని సంగతులు మిక్కిలి క్లుప్తముగా అధ్యాయములను బట్టి చెప్పండి?
జవాబు :-
- మొదటి అధ్యాము: ప్రభువు యోహానుకు మహిమ స్వరూపముతో ప్రత్యక్షమై అంత్యదినములలో జరుగవలసిన సంగతులు నీకు చెప్పవచ్చితినని చెప్పుట.
- 2) రెండు మూడు అధ్యాయములు: ఏడు సభలయొక్క తప్పులును, ఒప్పులును ప్రభువిచ్చిన వర్తమానములును యిందులో ఉన్నవి. ఏడు సభలును కలిసి ఒక క్రైస్తవ సంఘమగును. క్రైస్తవ సంఘములోని విశ్వాసులు భక్తినిబట్టి ఏడు తరగతులుగానున్నారు. మాదిరికి ఒక్కొక్క పట్టణములోని సభనుగూర్చి యోహానుకు ప్రభువు చెప్పెను.
- 3) నాల్గయిదు అధ్యాయములు: పెండ్లికుమార్తె ఎత్తబడి సింహాసనము ఎదుట ప్రార్ధనలు జరుగుట. భూమిమీద నున్నవారికి కలుగబోయే శ్రమలను గురించిన వివరము వ్రాయబడియున్న గ్రంథమును విప్పి దానిలోని సంగతులును తెలియపర్చే దేవుని గొర్రెపిల్లనున్నట్టు పరలోక నివాసులు తెలిసికొనుట.
- 4) ఆరవ అధ్యాయము: భూమిమీద శ్రమలు కలుగుట. ఇట్టి శ్రమలు అదివరకెన్నడును కలుగలేదు.
- 5) ఏడవ అధ్యాయము: శ్రమకాలములో కొందరు రక్షింపబడుట.
- 6) ఎనిమిది, తొమ్మిది అధ్యాయములు: శ్రమలు యింకా జరుగుట.
- 7) పదియవ అధ్యాయము: బలిష్టుడైన యొకదూత పరలోకమునుండి దిగివచ్చుట ఆయన క్రీస్తే. ఆయన చేతిలో నొక చిన్నపుస్తకమున్నది.
- 8) పదకొండవ అధ్యాయము: ఇద్దరు సాక్షులు పరలోకమునుండి దిగివచ్చుట. శ్రమకాలములో నున్నవారికి బోధించుట.
- 9) పన్నెండవ అధ్యాయము: స్త్రీని గురించియు ఘటసర్పమును గురించి యిందులో నున్నది. స్త్రీ అనగా విశ్వాసులయొక్క సంఘము. ప్రత్యేకముగా యూదుల సంఘముగాదు గాని క్రీస్తు భక్తులయొక్క సంఘము. సర్పమనగా సాతాను. ప్రకటనలోని సంగతులన్నియు మిక్కిలి క్లుప్తముగా యోహాను ఈ అధ్యాయములో యిమిడ్చినాడని చెప్పవచ్చును.
- 10) పదమూడవ అధ్యాయము: ఏడేండ్ల మహాశ్రమ కాలములో అంతెక్రీస్తు ఉండుట. అంతెక్రీస్తు అనగా క్రీస్తువిరోధి. అలాగే అబద్ధ ప్రవక్తకూడ వచ్చుట.
- 11) పదునాల్గవ అధ్యాయము: గొర్రెపిల్లయును, పరిశుద్దులును ప్రత్యక్షమగుట.
- 12) పదునైదవ అధ్యాయము: పరలోకములోని స్పటికపు సముద్రమును, హతసాక్షులయొక్క గుంపునుగూర్చి దీనిలోనున్నది. వీరు విమోచన స్తుతికీర్తన పాడిరి.
- 13) పదునారవ అధ్యాయము: శ్రమలు ఇంకాజరుగుట.
- 14) పదునేడవ అధ్యాయము: భూమిమీదనున్న మహా వేశ్యను గూర్చి యిందులోనున్నది. విశ్వాసులయొక్క సంఘమునకు విరోధముగానున్న అవిశ్వాసులయొక్క సంఘమని దీనికర్థము.
- 15) పదునెనిమిదవ అధ్యాయము: బబులోను వేశ్యగతించిపోవుట
- 16) పంతొమ్మిదవ అధ్యాయము: పరలోకములో జరుగబోవు గొర్రెపిలయొక్క వివాహమునుగూర్చియు, భూలోకములోని అంతెక్రీస్తుకును, క్రీస్తుప్రభువుకును హర్మగెద్దోను వద్ద ఏడేండ్ల శ్రమకాలాంతమున జరుగవలసిన యుద్ధమును గురించియు యిందులో నున్నది. క్రీస్తుప్రభువు జయించును. అంతెక్రీస్తును అబద్ధ ప్రవక్తయును అగ్నిగుండములో వేయబడుదురు, సాతాను ఒక్కడే మిగిలిపోయెను, అప్పటికింకా నిత్యశిక్షరాలేదు.
- 17) ఇరువదవ అధ్యాయము: సాతానును వెయ్యిసంవత్సరముల వరకు బంధించుట, వెయ్యేండ్ల పరిపాలన. ఇప్పుడే క్రీస్తు ప్రభువును ఆయనయొక్క భక్తులును ఈ భూమిమీద నీతిపరిపాలన చేయుదురు. వెయ్యేండ్లలోనే సువార్తప్రకటన పూర్తియగును. తర్వాత చెరలోనున్న సాతాను విడిపింపబడగా అతడు యుద్ధముచేసి ఓడిపోవును. అప్పుడు నిత్యాగ్నిగుండములో అతడు వేయబడును. వెయ్యేండ్ల పరిపాలన అయిన తర్వాత ఆదాముకాలము మొదలుకొని ఆ కాల పర్వంతము వరకును సమాధులలోనున్న అవిశ్వాసులు లేచెదరు. ఇదియే రెండవ పునరుత్థానమని చెప్పబడును. క్రీస్తుప్రభువు ఒక్కడే వారికి తీర్చు విధించును.
- 18) ఇరువది ఒకటవ అధ్యాయము: పైనున్న నూతన యెరూషలేమును గురించి యిందులో నున్నది.
- 19) ఇరువది రెండవ అధ్యాయము: అంతములేని కాలమునుగురించి యిందులోనున్నది. విశ్వాసులు దేవునితో శాశ్వత కాలము సుఖముగానుందురు.
17వ ప్రశ్న - ప్రకటన గ్రంథ వివరము పూర్తియైనదా?
జవాబు :- నేను వివరించలేదు. అంశములు చూపించినాను.
18వ ప్రశ్న - ఈ అంశములు క్లుప్తముగా వివరించండి?
జవాబు :- ప్రతీదీ వివరిస్తూ కూర్చుంటే అడ్వెంటు పండుగ నాటికి పుస్తకములండవు. మరియొకసారి వివరిస్తాను. వివరించుటకు చాల రోజులు పట్టును పుస్తకముకూడ పెరిగి పెద్దదగును.
19వ ప్రశ్న - ప్రకటన గ్రంథము ఏ విషయములో గొప్పదో కొద్దిగా వివరించండి?
జవాబు :- ప్రభువు మహిమ మేఘములోవచ్చి, రాకడకు సిద్ధముగా నున్నవారిని మాత్రమే తీసికొని వెళ్ళును. ఇన్ని సంవత్సరములనుండి సాతానువల్ల బాధింపబడుచున్న విశ్వాసులకు విడుదలయును, బహుమానమును కలుగును, సాతానుకును అతనిని అనుసరించిన వారికిని అంతెక్రీస్తుకును అబద్ధ ప్రవక్తకును నిత్యమైన శిక్ష కలుగును. తన కడ పరిస్థితి లోకులకు ఈ పుస్తకముద్వారా తెలుసును గనుకనే సాతాను ఇది చదువకుండా చేస్తున్నాడు. క్రీస్తుప్రభువు విషయమై కష్టపడి సేవ చేసేవారికి భక్తిగానడువ ప్రయత్నించే వారికి జబ్బులవల్ల, నిందవల్ల, శత్రువులవల్ల, ఇబ్బందులవల్ల కష్టాలు అనుభవించే వారికి ఈ పుస్తకము గొప్ప ఆదరణగల పుస్తకమైయున్నది. మారుమనస్సు పొందుటకై గడువు యివ్వకుండ దేవుడు ఎవరిని తీర్పులోనికి తీసుకొనివెళ్ళడని యిందులో కనబడుచున్నది. సువార్త పని చేయవలెని యిష్టమున్నవారికి చేయుటకు ప్రస్తుతము సమయము దొరకకున్నను తుదకు దొరుకునని యిందులో అగపడుచున్నది. ప్రతి సత్క్రియకు, ప్రతి శ్రమానుభవమునకు, ప్రతిసేవకు ప్రతి సద్భోధకు దేవుడు మంచి బహుమానము యిచ్చునని దీనియందున్నది.
20వ ప్రశ్న - ప్రకటన చదువకూడదనియు అర్ధము చెప్పకూడదనియు ఇది మనకాలములో నెరవేరదు గనుక చదువనవసరము లేదనియు, భయము కలిగించే సంగతులున్నందునను అర్ధము కానందునను ఈ పుస్తకము చదువరాదనియు కొందరనగా నేను విన్నాను దీనికి మీరేమి సమాధానము చెప్పుదురు?
జవాబు :-
- 1) చదువకూదని పుస్తకమైతే బైబిలులో నుండదుకదా?
- 2) ప్రకటన 1:3లో చదువువాడును, వినువాడును, గైకొనువారును ధన్యులని యున్నదికదా?
- 3) ప్రకటన అనగా అందరకు ప్రకటింపవలసిన గ్రంథమని ఆమాటలోనే యున్నదికదా?
21వ ప్రశ్న - ప్రకటన గ్రంథములోని సంగతులన్నియు జరిగిపోయినవని కొందరును, ఇంకా జరుగలేదని కొందరును అందురు ఏది నిజము?
జవాబు :-
- 1) మొదటి అధ్యాయములోనున్న నంగతులు జరిగిపోయినవి.
- 2) రెండు, మూడు అధ్యాయములలోని సంగతులు సంఘ వృత్తాంతములోనివే గనుక అవి ఇప్పుడు ఇంకను జరుగుచున్నవి.
- 3) నాల్గవ అధ్యాయమునుండి చివరి అధ్యాయము వరకును ఉన్న సంగతులు ఇకముందు రాబోవు కాలమున జరుగవలసిన సంగతులైయున్నవి.
22వ ప్రశ్న - ప్రభువు రెండవసారివచ్చి వెళ్ళిన తర్వాత యింకా లోకముండునా? అదే అంత్యదినముకాదా?
జవాబు :- పెండ్లికుమార్తెయగు విశ్వాసులు సంఘమును తీసికొని వెళ్ళుటకు వచ్చునదే ఆయన రెండవరాకడ. క్రీస్తుప్రభువు మేఘముమీద వచ్చినప్పుడు ఆదాము మొదలుకొని ఆకాల పర్వంతము సమాధులలోనున్న విశ్వాసులైన మృతులును సజీవులమైన మనమును మేఘములమీదికి వెళ్ళుదుము (1థెస్స. 4:13-18). ఇదే మొదటి పునరుత్ధానము. దీనిలో పాలుగలవారు ధన్యులు. తర్వాత ఏడేండ్ల శ్రమకాలముండును. అటుతర్వాత వెయ్యేండ్ల శాంతి పరిపాలన యుండును. ఆ మీదట అంత్యదినము వచ్చును. అప్పుడే అవిశ్వాసులైన మృతులు లేచి తీర్పులోనికి వచ్చుదురు. దీనికే రెండవ పునరుత్ధానమని పేరు.
23వ ప్రశ్న - శ్రమకాలమనగా ఇప్పుడు జరుగుచున్నవి శ్రమలుకావా?
జవాబు :- ఈ శ్రమలు వేరు. ఏడేండ్ల శ్రమలు వేరు.
24వ ప్రశ్న - ప్రభువు రెండవసారి వచ్చుటకు గల కారణమేమి?
జవాబు :- మనకు మరణములేకుండాజేసి మహిమ శరీరమనుగ్రహించి పరలోకమునకు తీసికొని వెళ్ళుటకు ఆయన రెండవసారి వచ్చును. మొదటిసారి ఆత్మరక్షకుడుగా వచ్చెను. రెండవసారి శరీర రక్షకుడుగా వచ్చును. ఇప్పుడు మనము ఎంత రక్షణ పొందియున్నను శరీరమునకు బాధలు తప్పుటలేదు. మహిమ శరీరము ధరించినప్పుడు శరీర బాధలుండనే యుండవు.
25వ ప్రశ్న :- అబద్ధ ప్రవక్తలు వచ్చెదరని వాక్యములో నున్నదిగదా? వారెవరు? క్రీస్తురాకడ సమీపించినదని చెప్పేవారే అబద్ధ ప్రవక్తలని కొందరు చెప్పుకొంటున్నారు. దీనికేమి జవాబు చెప్పవలెను?
జవాబు :-
- 1) క్రీస్తుయొక్క దైవత్వము నొప్పుకొననివారు అబద్ధ ప్రవక్తలై యున్నారు.
- 2) ఆలాగే బైబిలులోని వాక్యములకు తప్పు అర్ధము చెప్పే వారుకూడా అబద్ధ ప్రవక్త ప్రవక్తలైయున్నారు. “ప్రియురాలా! అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బైలువెళ్ళియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనదికాదు. దీనినిబట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతేగదా? ఇదివరకే అది లోకములో ఉన్నది. చిన్న పిల్లలారా! మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాటికంటె గొప్పవాడు గనుక మీరు వానిని జయించి యున్నారు (1యోహాను 4:1-4).
- 3) పరిశుద్దాత్మ బాప్తీస్మమును గూర్చియు రెండవరాకడ సమీపకాలపు గుర్తులను గురించియు బోధించనివారు అబద్ధ ప్రవక్తలా? బోధించేవారు అబద్ధ ప్రవక్తలా? బైబిలులోనున్న సంగతి బొత్తిగా ఎత్తనివారా? ఎత్తి బోధించేవారికి అడ్డము వచ్చేవారా అబద్ధ ప్రవక్తలు?
ఈ వాక్యములను చదివి బేధము తెలిసికొనుము:- మత్తయి 24:24 మార్కు 13:21-23; 2కొరింథి. 11:13; యిర్మియా 5:31; 29:9; 14:14 23:25; ద్వితీ. 13:1 1రాజులు 13:11-32; హోషెయా 9:7 మత్తయి 7:15-23 తాను బోధించు సత్యమును తానే అనుసరించనివాడు అబద్ధప్రవక్త. అతడు వాక్కుమూలముగాకాక క్రియ మూలముగా అబద్ధ ప్రవక్త (మత్తయి 5:19).
26వ ప్రశ్న - ప్రభువెందుకింత ఆలస్యంచేయుట?
జవాబు :- “కొందరు ఆలస్యమని ఎంచుకొనునట్లు ప్రభువు తన వాగ్ధానములను గూర్చి ఆలస్యము చేయువాడుకాడుగాని ఎవడును నశింపవలెనని యిచ్చయింపక మారుమనస్సు పొందవలెనని కోరుచు మీయెడల దీర్ధశాంతముగలవాడైయున్నాడు” (2పేతురు 3:9). ప్రభువు ఆలస్యముచేయునని అనుకొనవద్దు (మత్తయి 24:48-51).
27వ ప్రశ్న :- నేటి ముఖ్యబోధలు ఏవి?
జవాబు :-
- 1) అందరు పరిశుద్దాత్మ బాప్తీస్మము పొందవలెను? ఎందుకంటే రాకడ సమీపించుచున్నది.
- 2) క్రీస్తు రాకడ కాలము మిక్కిలి సమీపించినది. గనుక అందరును సిద్ధపడుట అనే మహాకార్యమును చేయవలయును.
షరా:- ఈ బోధలను ఆక్షేవించుటకంటె వీటినిగూర్చి చదువుటయు, ధ్యానించుటయు, పరీక్షించుటయు, ప్రభువును అడుగుటయు ఉత్తమకార్యములైయుండును. మేము చెప్పవలసిన వంతు అయిపోయినది. అవలంభించవలసిన వంతు మీది. అచ్చువేయించి పెట్టేవారుంటే ఇంకా అనేక సంగతులు ఇంక క్లుప్తముగా కాక మిక్కిలి వివరముగా ప్రచురించగలను. ఆక్షేపణలు చేయుటవల్ల తర్కములోనికి దిగుటవల్ల ఆలోచింపకపోవడమువల్ల పరమభాగ్యములను పోగొట్టుకొందుము. ప్రియులారా! నేడు అనేక స్థలములలో రెండవ రాకడను గురించి అనేకులు ఆలోచించుచూ సిద్ధపడుచుండగా మనము నిర్లక్ష్యముగా నుండుట ఏమియును బాగుండలేదు. గుర్తులు జరుగుట మనము చూచి మన తలలు పైకి ఎత్తికొని మన విడుదల సమీపించినదని సంతోషించవలెను (లూకా 21:27,28) తలలు దించుకొని లోకముతట్టు చూడకూడదు.
రెండవ రాకడ అనేది ఒకవిధముగా అంత్యదినమే గనుక అంత్యదినములయందు ఆత్మను కుమ్మరిస్తాననే వాగ్ధానమును బట్టి (యోవేలు 2:28,29) మనమందరము ఆత్మకుమ్మరింపు పొందవలెను. చదువరీ! బైబిలులోనున్న ప్రతి చిన్న సంగతి నీవు నమ్మినప్పటికిని రెండవరాకడ సమీపించినది గుర్తులనుబట్టి తెలుసుకొని నమ్మనియెడల సిద్ధపడలేవు. క్రీస్తు వచ్చే సమయమందు సిద్ధపడలేమాయని అనుకొనేవారు అవివేకులైన 5గురు కన్యకలను పోలియుందురు (మత్తయి 25:1-31).
- (1) ఆ 5గురు కన్యకలు బయలుదేరినారు ఇది మంచిస్వభావమే.
- (2) పెండ్లికుమారుని ఎదుర్కొనవలెనని ఉద్దేశము కలిగియుండిరి ఇదియు మంచిదే.
- (3) వారు తమ దివిటీలను పట్టుకొని వెళ్ళిరి ఇదియు మంచిదే.
- (4) నూనె తీసుకొని వెళ్ళలేదు, ఇదే వారిలోనున్న లోపము.
- (5) నూనె కొనుటకు వెళ్ళిరి ఇదియు సరిగానేయున్నది.
- (6) సిద్ధపడియున్నవారు పెండ్లివిందుకు వెళ్ళిరి. వివేకులైన ఆ 5గురు వెళ్ళలేదు. ఎందుకనగా సిద్దపడలేదు గనుక ఇదే వారిలోనున్న చివరి తప్పిదమైయున్నది. వారు చేసె పనులలో కొన్ని బాగుగానేయున్నవి గాని సిద్ధపడకపోవడమనేది ఏమాత్రము బాగుండలేదు. వారి ఉద్దేశము మంచిదే. బయలుదేరుట మంచిదే. దివిటీలు తీసుకొని వెళ్ళుట మంచిదే. నూనె అప్పు అడుగుటకూడ ఒక విధముగా మంచిదే. కొనుటకు వెళ్ళుట మంచిదేగాని సిద్ధపడక పోవడమనేది హానికరమైన సంగతి.
చదువరి! నీలో ఏలోపమున్నదో చూచుకొనుము. ఎన్ని మంచి కార్యములు చేస్తే ఏమిలాభము? సిద్ధపడకపోయిన, తర్వాత దైవమహిమార్ధమై జరిగే ప్రతిచిన్న పనిని దేవుడు దీవించుగాక! రెండవ రాకడ యొక్క భాగ్యము చదువరులకు లభించునుగాక!
ప్రార్ధన మెట్లు
1) మనోనిదానపు మెట్టు:- ప్రార్థన ప్రారంభించక ముందు మనస్సులోనికి ఇతర తలంపులు రాకుండజేసుకొని ప్రభువును మాత్రమే తలంచుకొనవలెను.
2) ఒప్పుదల మెట్టు:-
- ఎ) ఏ మనుష్యునికి విరోధముగా పాపము చేసితివో ఆ మనిషియొద్దకువెళ్ళి నీ పాపము ఒప్పుకొనవలెను.
- బి) దేవునియొద్ద అన్ని పాపములు ఒప్పుకొనవలెను.
3) తీర్మానపు మెట్టు:- ప్రభువా! నాకు తెలిసిన ఏ పాపమును చేయకుండ ప్రయత్నముచేసెదనని దేవునియెదుట చెప్పుకొనవలెను.
4) సమర్పణ మెట్టు:- దేవా! నా శరీరము, ఆత్మ నాకు కలిగిన సమస్తము నీకు సమర్పణచేయుచున్నాను. నా చిత్త ప్రకారము కాక నీ చిత్తప్రకారమే నడిచెదనని దేవునియెదుట చెప్పుకొనవలెను.
5) స్తుతి మెట్టు:- దేవా! నా పాపములు క్షమించినావనియు నా తీర్మాన సమర్పణలు అంగీకరించినావనియు విశ్వసించి నిన్ను స్తుతించుచున్నానని పలుకవలెను.
6) అంశ ప్రార్ధన మెట్టు:- ఇప్పుడు నీ ఇష్టమువచ్చిన అంశము మీద ప్రార్ధింపవచ్చును. నీకు కావలసినదేదైన అడుగవచ్చును. పట్టుకు ఒకటి మాత్రమే అడిగిన మంచిది.
7. ఎ) స్తుతి మెట్టు:- దేవా! నా ప్రార్ధన ఆలకించినావని నిన్ను స్తుతించుచున్నానని చెప్పవలెను.
7. బి) కనిపెట్టు మెట్టు:- ఆమెన్ అన్నతర్వాత కొంతసేపు దైవ సన్నిధిలో ఊరకనే యుండవలెను. అప్పుడు మన ప్రార్ధనకు జవాబుగా దేవుడు మనకు మంచి మంచి తలంపులు పుట్టించును. ఈ సమయములోనే దేవుడు మానవునితో మాట్లాడును.
షరా:- చదువరి! నీవు అంశప్రార్థన మెట్టుమీదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తీస్మమును గూర్చియు రెండవ రాకడను గూర్చియు ప్రభువును అడిగి తెలుసుకొనుము.
విశ్వాసమువలన మనము ఏమి పొందగలము?
- 1) పాపక్షమాపణ పొందగలము
- 2) పాపమును జయించే బలమును పొందగలము
- 3) వాక్యమును గ్రహించే శక్తిని పొందగలము
- 4) ప్రార్థించే శక్తిని పొందగలము
- 5) స్తుతించే నైజమును పొందగలము
- 6) సువార్త ప్రకటించే వాక్కును పొందగలము
- 7) దేవుని సహవాసములు పొందగలము
- 8) దేవుని ఆత్మను పొందగలము
- 9) రెండవ రాకడలో ఎత్తబడగలము
- 10) మన శరీరాత్మలకు కావలసిన సమస్తమును పొందగలము.
విశ్వాసము కలుగుటకు ఏమిచేయవలెను?
- 1) దేవునివాక్యము చదువుటవలన, వినుటవలనను విశ్వాసము వచ్చును.
- 2) అడగండి మీకు ఇవ్వబడుననియున్నది గనుక విశ్వాసము కొరకు ప్రార్థించవలెను.
షరా:- విశ్వాసమువలన అన్నీ పొందగలము. అవిశ్వాసమువల్ల ఉన్నవి ఊడిపోవును. రావలసినవి రానేరావు?
ప్రవర్తన
- 1) నీ ప్రవర్తన చక్కగానుండవలెనని నీవు కోరినయెడల అనుదినము దేవుని సన్నిధిలో ఒక గంట సమయము గడుపుము.
- 2) అనుదినము దేవునివాక్యము శ్రద్ధతోను, భక్తితోను చదువుకొనుము.
- 3) అనుదినము దేవునివాక్యము నేర్చుకొనుము.
- 4) నేర్చుకొన్న సంగతులు అనుదినము ధ్యానించుము.
- 5) ఏనాటి పాపములానాడే దేవునిదగ్గర ఒప్పుకొనే ప్రార్ధన చేసుకొనుము.
- 6) అనుదినము పాపవిసర్జన చేయుము.
- 7) అనుదినము సువార్తను ప్రకటించుము.
- 8) నీ మనవులున్న ప్రార్థనలను చేసుకొనుము.
- 9) వరములను కోరుకొనుము.
- 10) నీ వరములను వాడుకొనుము.