యేసుప్రభువు స్వయముగా ఏర్పాటు చేసుకొన్న శిష్యులలో ఒకరైన తోమా, రూపములో హావభావాలలో ప్రభునకు ట్విన్/కవలగా ప్రవర్తించేవాడని ఆది సంఘము పేర్కొన్నది. ప్రభువు శిష్యుల రేంక్ లో తోమాది రెండవ రేంక్ (శిష్యులను ముగ్గురు-నలుగురు-ఐదుగురుగా విభజించిరి). మత్తయి 10:3, మార్కు 3:18, లూకా 6:15 లలో తోమా పేరు రెండవ వరస శిష్యులతో పాటు పేర్కొన్నారు కాని యోహాను సువార్తలో తోమా కార్యములు కూడా వ్రాయబడినవి.
పర్సనాలిటి:
తెలుగులో అయితే తోమా ప్రసంగం బాగుగా వచ్చును అని అయ్యగారు చమత్కరించేవారు. తోమా | మాతో . అద్దం ముందు ఎవరు ఉంటే వారి కవల తిరగేసి కనిపిస్తుంది. తోమాను తిరగేస్తే మాతో. తోమా పెద్ద హేతువాది. అంతా చెప్పిన తర్వాత ఒక పెద్ద ప్రశ్న వేసి అసలు సత్యాన్ని రాబట్టగలిగే తత్వం ఉంది కాబట్టి, ఆయన శిష్యులు తోమాను తరచుగా "తోమా మాతో ఉన్నావా" (అనగా మాతో అంగీకరించుచున్నావా?), "తోమా, మాతో లేవు", "తోమా మాతో వస్తావా" అనే సందర్బాలు యోహాను సువార్తలో లిఖించబడ్డాయి. తోమా సమాధానము: ఏది ఏమైనా "నీతో వస్తాను" అనే సమర్పణతో కూడినది.
బాహ్య రూపం దిదుమ అనగా కవల/ట్విన్, తోమా అనగా కూడ కవల/ట్విన్. దిదుమ అనబడిన తోమా అనగా ఇక 100% అచ్చుగుద్దినట్లు ప్రభువును అనుకరించేవాడని, ప్రభువుకు "అంతరంగ కవల" యైన యోహాను పేర్కొన్నారు.
తెగింపు:
హేతువాదులకున్న ఒక లక్షణమేమనగా "సత్యము అని నమ్మిన యెడల దాని కోసం చనిపోవుటకు వెనుకాడరు గాని సత్యమును వదలరు. "ఆయనతో కూడ చనిపోవుటకు మనమును వెళ్లుదమని తనతోడి శిష్యులతో చెప్పెను" - యోహాను 11:16. మూడున్నర సంవత్సరములలో ఒక్క మాట మాట్లాడని తోమా ఒక్క మాటతో ప్రభువు చెంతకు(1వ రాంక్) చేరెను. సంఘములలో కూడ అప్పటివరకు కనిపించరు కాని ఆపద వచ్చినపుడు గట్టిగా నిలబడేవారు తోమాకు కవలలు.
యేసు ప్రభువు అంత్యకాల విషయములు, పరలోక విషయములు అంతా చెప్పిన తర్వాత ఒక ప్రశ్న వేసెను.
యోహాను 14:5 అందుకు తోమా ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగు తెలియునని ఆయన నడుగగా 6. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. => ప్రభువు చెప్పిన సమాధానము సార్వత్రిక సత్యము.
యోహాను వ్రాసిన ప్రాముఖ్యమైన విషయము:
యోహాను 20:24 యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను
20:26 ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగును గాక అనెను.
20:27 తరువాత తోమాను చూచినీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.
20:28 అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను.
తోమా | నీతో
తోమా నమ్మిన ప్రతీ విషయములో "నీ శ్రమ అంతటిలో నీతోనే వస్తాను" అనే సమర్పణ కవల. ప్రభువు శ్రమలో నీతో వస్తాము అని చెప్పిన తోమా పేతురు చేపలు పట్టుటకు వెళ్ళెదమనగా నీతో వస్తాము అనిన ప్రధమ లిస్టులో తోమా పేరు ఉన్నది.
21:2 సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అనుఊరివాడగు నతనయేలును,జెబెదయి కుమారులును, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి యుండిరి. 3. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారుమేమును నీతో కూడ వచ్చెదమనిరి
అపో. కార్యములు 1:13, ప్రభువు ఆరోహణమైన తర్వాత మేడగదిలోనికి ఎక్కిపోయిన వారిలో, పరిశుద్ధాత్మ కుమ్మరింపులో, అపొస్తలుల సేవలో, శ్రమలో తోమా ఉండెను.
తోమాను ప్రభువు మన దేశమునకు ప్రతినిధిగా ఎంచుకొనెను. మొదట్లో తోమా హోదు దేశమునకు(హిందూ, ఇండియా) వచ్చుటకు నిరాకరించెను గాని, ప్రభువు నేను వెళ్ళుచుండగా నీవు రావా అనగా నీతో వచ్చెదనని చెప్పి మన దేశములో దేవుని జీవము, ప్రేమ, సేవ, సువార్త అను బీజమును నాటెను.
తోమా సేవ బహుగా విస్తరించి, మన దేశ ఆశీర్వాదమునకు పునాదియాయెను. చివరకు మనదేశములో హతసాక్షియై ప్రభువుతో మనకొరకు విజ్ఞాపన ప్రార్థన చేయుచుండెను.
కష్టములో సహకారులైనవారు తోమాకు కవలయై యున్నారు.
దేవుడు తోమా తెగింపును మనకు దయచేయును గాక! ఆమెన్. మరనాత.