అ. పో.కా. 1:6-11.
ఈవేళ నేను క్రీస్తుప్రభువు యొక్క మహోన్నతమైన స్థితిని గురించి, అద్భుతకరమైన స్థితిని గురించి మీకు జ్ఞాపకము చేయుచున్నాను. 1. మహోన్నత స్థితి. 2. అద్భుతకరమైన స్థితి. క్రిస్ట్మస్ రోజున దేవదూతల స్తుతిలో ఏమున్నదో చెప్పగలరా! మహోన్నత స్థికి సంబంధించిన స్తుతి ఉన్నది. లూకా. 2:14లో మహోన్నత స్థితి అనగా సర్వోన్నతమైన స్థితియైయున్నది.
ఒక మిషనెరీ మనయొద్ద చాలా కాలము పనిచేసి వెళ్ళిపోవునప్పుడు ఫేర్ వెల్ మీటింగు జరుపుదుము. అట్టి సభలో ఆయన జీవితములో జరిగిన సంగతులన్నీ జ్ఞపకము చేసికొందురు. ఆలాగే ఈ వేళ ఆరోహణోత్సవ దినమందు, ఆ కథయే కాక తత్పూర్వ చరిత్ర కూడ ధ్యానింప వచ్చును. మరియు స్తుతింప వచ్చును. మిషనెరీయొక్క ఫేర్ వెల్ సభలో ఆయన చేసిన పనులన్నీ చెప్పి పొగడుదురు గదా, అట్లు పొగడుటయే స్తుతి. ఆలాగే యేసుప్రభువు యొక్క ఆరోహణ సమయమందు, ఆయన చేసిన పనులన్నీ, పూర్వ కార్యములను తలంచుకొని మనస్సునందు స్తుతించవలెను. పూర్వ చరిత్రలోని కార్యములు ఉదహరించుటే స్తుతి. మిషనెరీ చేసిన పనులన్నీ వివరించుదురు. అదే స్తుతి చేయుట. అలాగే క్రీస్తుప్రభువు యొక్క దీర్ఘ చరిత్రలో చరిత్రాంశములు జ్ఞాపకము చేసికొనుటే ఆయనను స్తుతించుట.
1. ఆయన దేవుడై యున్నాడు గనుక ఆయనకు ఆది లేకపోవుటయే మహోన్నతమైన అద్భుతకరమైన స్థితి. 2. ఆది లేని దేవుడు అంతముకూడ లేనివాడై యుండుటయే మహోన్నతమైన స్థితి. 3. ఆయన తేజోమయమైన పరిశుద్ధ లక్షణముల దేవుడై యుండుటయే మహోన్నతమైన స్థితి. ఆ లక్షణము లేవనగా 1. జీవము, 2. ప్రేమ, 3. పరిశుద్ధత 4. వెలుగు, 5. న్యాయము, 6. శక్తి, 7. సర్వవ్యాపకత్వము, 8. నిరాకారము, 9. స్వతంత్రత , మొదలైన వాటిని కలిగియుండుట అనేది మహోన్నతమైన స్థితి. దేవుడు ఈ తొమ్మిది లక్షణములే కలవాడు అని అనకూడదు. ఎందుకంటే, ఆలాగంటే ఈ తొమ్మిది లకషణములు, ఒకరి దగ్గర నుండి తెచ్చుకొని కలిగి ఉన్నాడని అర్ధమిచ్చును గనుక అట్లనరాదు. ఆ మాట అనగా ‘కలవాడు ‘ అనుమాట ఆయన శక్తికి చాలదు. గనుక యేసుప్రభువు ఈ తొమ్మిది లక్షణములైయున్నాడు అనవలెను. ఉదా: జీవమై యున్నడు, వెలుగై యున్నాడు, ప్రేమయై యున్నాడు అని చెపవలెను. గనుక ఈ లక్షణములనుబట్టి ఆయన మహోన్నత స్థితియై యున్నాడు. ఆ మహోన్నత స్థితికి అంతము లేదు, ఆ లక్షణములకు ఆదియు లేదు. అంతము లేదు. అనాది మహోన్నతమైనదే, అనంతము మహోన్నతమైనదే. పరలోకములోని అసలైన దేవుడు. ఆ అసలైన గుణములతో భూలోకమునకు వచ్చి, అసలైన మనుష్యుడై పోయినాడు. అది అద్భుతము. మహోన్నతము. అంత గొప్పవాడు, భూమి మీద అసలైన మనిషి అగుట గొప్పతనము కాకపోతే మరేమిటి?
1. పిశాచి ఉన్నా, పాపములు ఉన్నా, పాపకార్యములు గల మనుష్యులు ఉన్నా, పాప ఫలితములున్నా, అనగా వ్యాది, పేదరికము, మరణమున్నా ఈ లోకమునకు ఆయన రావడమే ఎంతో ఉన్నతమైన అద్భుతము.
2. ఓ మనుష్యులారా! నా దివ్య లక్షణములలో కొంత మీకిచ్చి, మిమ్మును కలుగజేసినప్పటికిని మీరు సైతాను ప్రేరేపణ వల్ల, ఆ సద్గుణములకు వ్యతిరేకమైన దుర్గుణములను సంపాదించుకొన్నారు. అయినప్పటికిని, నేను కలుగజేసిన బిడ్డలు గనుక నేను అక్కడ ఉండలేక, మీరున్న చోటికే వచ్చినానన్నట్లు ఆయన ఈ లోకములో ప్రవర్తించెను. అదే మహోన్నతమైన మహిమ గల స్థితి.
3. భూమి మీద పాపాత్ములైన వారు వండిన భోజనము, ప్రభువు వారి సరసన కూర్చుండి తినుట ఉన్నతమైన స్థితికాదా!
4. బోధకులకు సహా అంతుపట్టని విషయములు, పాపాత్ములకు, మోక్షలోకమునకు వెళ్ళే భోధ చెప్పుట ఎంత మహోన్నతమైన స్థితి. కఠినులైన పరిసయ్యులకు కూడ చెప్పెను. అది మోక్షలోకమంత ఉన్నతమైన స్థితి. మిక్కిలి పొడవైన స్థితి. 5. రోగులను మందు లేకుండ బాగుచేయుట ఉన్నతమైన స్థితి. 6. సముద్రమందు అపాయములు తప్పించుట ఉన్నతమైన స్థితి. 7.ఆకలిగా ఉన్నవారికి అద్భుతాహారము పెట్టుట మరియొక ఉన్నతమైన స్థితి. 8. అవమాన పరచి, కొట్టిన వారిని క్షమించుట ఇంకా ఉన్నతమైన స్థితి. 9. తుదకు దిక్కుమాలిన చావు పొందుట ఒక ఉన్నతమైన స్థితి. రాత్రులు మనలను కావలి కాయు దూతలు – శత్రువులు ప్రభువును చంపుచున్నప్పుడు చంపకుండా అడ్డు రాకూడదా? వారి సహాయము ఆయన కోరలేదు. వారు రాలేదు. అందుచేత ఆయన పొందినది దిక్కుమాలిన చావు. అదే ఉన్నతమైన మరియొక స్థితి. 10. ఆయన సమాధిలోకి వెళ్ళుట మరియొక ఉన్నతమైన స్థితి. 11. పశువుల తొట్టి మొదలుకొని సమాధి వరకు మధ్యనున్న కష్టకాలములలో ఆయన చేసినవన్నీ, ఆయన చూపినవన్నీ ఉన్నతమైన స్థితులే. 12. కష్టకాలములోని ఉన్నతమైన స్థితుల కంటే, సమాధిలో నుండి లేచుట మహా మహోన్నతమైనది. 13. తరువాత నలుబది దినములు ఈ లోకములో సంచరించి, పరలోకమునకు ఆరోహణమగుట; మహోన్నతమైన స్థితులన్నీ ఆరోహణములే. 14. ఆరోహణమై పరలోకమునకు వెళ్ళి దేవుని కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. ఇదొక ఉన్నతమైన స్థితి. కుడిపార్శ్వమందు కూర్చున్నది మొదలు, చివరి వరకు ఎన్ని ఉన్నత స్థితిలున్నవో అవన్నీ ఆరోహణములే.
1. అనాది – ఆరోహణము
2. పశువులతొట్టి – సమాధి, ఆరోహణము
భూలోకమందు ఎంతమంది పాపాత్ములున్నారో, వారి ఒక్కొక్కరి కొరకు ఎన్ని విజ్ఞాపన ప్రార్ధనలు చేయుచున్నారో అవన్నీ గొప్పదనములే. గనుక అవన్నీ ఆరోహణములే. మనిషి పిండముగా నున్నప్పుడు విజ్ఞాపన, కూరొన్నప్పుడు విజ్ఞాపన, లేచినప్పుడు, బాల్యము, యవ్వనము వీటన్నిటిలో విజ్ఞాపనలు ప్రభువు చేయుచున్నారు. సిం హాస నారోహణము చివరి విజ్ఞాపన. పుట్టిన ప్రతివానిని సిం హాసనము వద్దకు తీసికొని వెళ్ళుటకు, ఆయన విజ్ఞాపన పనిమీదనే యున్నాడు. ఒక మత విరోధియైన స్త్రీని గురించి ప్రభువు విజ్ఞాపన చేయుచున్నట్లు అయ్యగార్కి చెప్పిరి. అక్కడనుండి అనంతము వరకు మనలను గురించియే ఆయన ధ్యానమైయున్నది. ప్రభువు విజ్ఞాపన పాపుల కొరకు, పరిశుద్ధుల కొరకు, పక్షుల కొరకు, సమస్తము కొరకును చేయుచున్నారు.