క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. ఆరోహణ పండుగ...
  5. మరణమునకు బదులు ఆరోహణము

మరణమునకు బదులు ఆరోహణము

ప్రియులారా! యేసుక్రీస్తు ప్రభువుయొక్క ఆరోహణ భాగ్యమును మీకును కలుగునుగాక! క్రీస్తు ప్రభువునకు ముందు, 394వ సంవత్సరమునందు హనోకు అను దైవ జనుడు పితామహుల కాలములో మానవ శరీరముతోనే మహిమ లోకమునకు వెళ్ళెను. ఆయనకు మరణము లేదు. “హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతనిని తీసికొనిపోయెను – గనుక అతడు లేకపోయెను.” అని ఆయనను గురించి ఆది 5:24 లో ఉన్నది. దేవుడు హనోకు కలసి భూమిమీద నడచుచు, సంభాషించుచు పరమునకెళ్ళిరి. ప్రభువు ఆరోహణమైనప్పుడు ఆయన కదివరకున్న శరీరము అంతర్ధానమాయెను, అనగా చావులేని శరీరము వచ్చెనని తెలియుచున్నది. అలాగే హనోకునకు కూడ మారురూపము వచ్చెనని మనము గ్రహింపవచ్చును. అట్లే యేసుప్రభువు తన వధువు సంఘమును కూడ, హనోకుతో నడచుచు, సంభాషించుచు, పైకి తీసికొని వెళ్ళిన రీతిగానే తీసికొనివెళ్ళును. మన శరీరము మోక్షమునకు వెళ్ళనేరదు. రాకడలో మనకు మహిమ శరీరము వచ్చును. కాబట్టి హనోకు వలె దేవునితో నడచుటెట్లో మనము తెలిసికొనుట ఎంతో ప్రాముఖ్యమైన విషయము. ఈ దైవజనుడు దేవునితో నడచినాడు గనుక పైకి వెళ్ళగలిగెను. ఆయన వెళ్ళిన పిమ్మట జలప్రళయము వచ్చినది. భూమి మీద నుండి సంఘము పైకెత్తబడిన తరువాత జలప్రళయము వంటి మహాభయంకరమైన ఏడేండ్ల శ్రమకాలము వచ్చును. ఈయన మరికొన్ని సంవత్సరములు ఈ భూమి మీదనే యుండిన,జలప్రళయము తప్పక చూచియుండును. అయితే జలప్రళయమును దైవజనుడు చూడకుండగనే దేవుడు తీసికొనిపోయెను. అలాగే జలప్రళయము వంటి ఆ మహాశ్రమల కాలమును చూడకుండగనే, సంఘమును ప్రభువు తీసికొనిపోయెను. అలాగే జలప్రళయమువంటి ఆ మహాశ్రమల కాలమును చూదకుండగనే, సంఘమును ప్రభువు తీసికొని వెళ్ళును. నోవాహు కాలములో ఓడ పైకి ఎత్తబడెను. ఆలాగే ఏడేండ్ల శ్రమకాలము రాకముందే, సంఘము అను ఓడ పైకెత్తబడును. జలప్రళయానంతరము ఓడలోనుండి వారు దిగివచ్చినట్లు; పరలోకమునుండి ప్రభువు, సంఘము భూమి మీదకు దిగి వచ్చుట జరుగును. జలప్రళయము వలన భూమి పరిశుద్ధపరచబడినట్లు, పరిశుద్ధ అగ్ని చేత ఈ భూమి కూడా పరిశుద్ధ పరచబడును. అప్పుడు ఈ భూమి మీదనే వెయ్యి సంవత్సరములు శాంతి పరిపాలన జరుగును.

హనోకు దేవునితో నడచినాడు గనుక దేవునితో కలసి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళగలిగెను. నోవహు కూడా దేవునితో నడచినవాడు మరియు యదార్ధపరుడు గనుక ఆయన, ఆయన్ కుటుంబము ఉన్న ఓడ, పైకి వెళ్ళగలిగెను. జలప్రళయము వలన ఓడ పైకి వెళ్ళీ రీతిగా శ్రమల వలననే సంఘము పైకి ఎత్తబడును. శ్రమలు లేకపోతే విశ్వాసులు రాకడలో ఎత్తబడలేరు. ఆనాడు జలప్రళయము వచ్చినది. ఈనాడు రక్తప్రళయము రానున్నది, వచ్చే యున్నది. భక్తిహీనులకు ఆనాటి జలప్రళయం వరదవంటిది. అది నీ భక్తులైన వారికి సరదాగా ఉండును. లవొదికయ సంఘకాలము మనదే. శ్రమలు వచ్చిన ఓర్చుకొనవలయును. సహించవలయును. శ్రమలు లేకపోతే స్వర్గము లేదు. శ్రమలు వస్తేనే సంఘము ఎత్తబడును. శ్రమలు లేకపోతే సంఘము ఎత్తబడదు. శ్రమలు వద్దనే వారు మహిమ లోకములో ప్రవేశించుట అసాధ్యము. జలప్రళయ కాలములో ఈత చెట్టు ఎక్కినారు కాని పైకి వెళ్ళే ఓడలో ప్రవేశించలేకపోయిరి. అలాగే ఎన్ని బాధలైనా పడుదురు గానీ బాధనివారణ యిచ్చే సంఘములోనికి రారు. ఈ కాలము మన విశ్వాసమును వృద్ధిచేసుకొనే కాలము. మారుమనస్సు పొంది రక్షింపబడినవారు విశ్వాసమును వృద్ధి చేసికొని భయంకరమైన శ్రమలు సంఘమునకు వచ్చుచున్నవి. లవొదికయ సంఘమనగా పెండ్లికుమార్తె సంఘము. ఈ సంఘమునకే శ్రమలెక్కువ. ఈ శ్రమలకంటే ఆ భయంకరమైన ఏడేండ్ల శ్రమకాలములో ఎక్కువ శ్రమలు కలుగును. ఆ కాలము రాకముందే ప్రభువు తన సంఘమును ఎత్తుకొని వెళ్ళును. ఉదా:- ఒక గ్రామములో అమ్మాయిని, మరియొక గ్రామములోని అబ్బాయికి ఇచ్చిరి. ఆ గ్రామములో కలహములున్నవని తండ్రికి తెలియగానే, తండ్రి ఆ గ్రామమునకు వెళ్ళి, తనకుమార్తెను తీసికొనివచ్చెను. అలాగే మహాశ్రమలలో కృంగిపోకుండునట్లు, సంఘమును కూడా ప్రభువు ముందుగానే సిద్ధపరచి తీసికొని వెళ్ళును.

జలప్రళయము రానైయున్నదని నోవహునకు ముందుగానే తెలియును. గనుక ఆ విషయము గురించి , ఆ దినములలో ప్రజలందరికి ముందుగానే బోధించినాదు. గనుక వారికి కూడ జలప్రళయము గూర్చి ముందుగానే తెలియును. అలాగే లవొదికయ సంఘసభ్యులకు, సన్నిధాన వర్తులకు కూడ ముందే తెలియును. ఏలీయా ఆరోహణము, ఏలీయాకు ముందే తెలిసినరీతిగా సంఘారోహణము గురించి సంఘమునకు కూడ ముందుగానే తెలియవలెను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక! అనగా మనము జీవించి ఈ కాలము, సంఘ కాలము. సంఘ కాలములో దైవాత్మ, ప్రార్ధనాపరుల జ్ఞానమును వెలిగించి నూతన విషయములను బోధపరుచు, మర్మములను బయల్పరచుచుండవలెను. విశ్వాసి, ఆత్మోపదేశములను ధిక్కరింపడు. ప్రభువు రాకడ తారీఖులు ఎవరికినీ తెలియవు. అది మర్మముగా నున్నది. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా ఏమియును చేయడు. (ఆమోసు 3:7). గనుక రాకడ సమయము వచ్చినప్పుడు, దేవుడు విశ్వాసులకు, కాలనిర్ణయముకూడ తెలియపరచునని దీనినిబట్టి తెలియుచున్నది. ‘పరిశుద్ధాత్మ నా వాటిలోనివి తీసుకొని మీకు బోధించునని ‘ ప్రభువు చెప్పిన మాటలన్నిటికి ఇది సరిపోవును. ‘తాను వచ్చుచున్నాడని ‘ ఆయన పశువులకును తెలుపును అని యోబు 36:33 లో ఉన్నది. వీటిని చూచి చదువరులు ఏమనుకొందురో? ‘నా వాటిని ‘ అను మాటలో రాకడ సంగతి కూడా ఇమిడియున్నదని చదువరులు గ్రహింతురు గాక. నేను మరణము లేకుండ, హనోకువలె ఆరోహణ మగుదునని ఎవరునూ నిశ్చయము చెప్పలేరు. ఒకవేళ ఎవరికైన దేవుడు హనోకు, ఏలీయాలవలె ఆరోహణ వరమిచ్చిన యెడల మనమేమి చెప్పగలము? అది ఆయన ఇష్టము. ‘సజీవులమై నిలిచియుండు మనము కొనిపోబడుదుము ‘ అని 1థెస్స 4: 17లో వ్రాసిన మాటనుబట్టి చూడగా ఆయనకు (పౌలుకు) అట్టి నిరీక్షణయుండెను గాని అది జరిగినట్లుగా లేదు.

షరా:-ప్రపంచములో షుమారు వెయ్యి మిషనులవారున్నారు. అయితే రాకడకు సిద్ధపడండని కొందరు చెప్పుట లేదు సరికదా, ఆ చెప్పనివారు చెప్పేవారిని ఆక్షేపించుచు, దూషించుచున్నారు ఎవరు ఏమనుకొన్నను, బైబిలు మిషను వారమైన మేము, రాకడను గూర్చి ముమ్మరముగా బోధించుచున్నాము. అన్ని మిషనులవారు చెప్పకపోయినా, వాటిలోనున్న కొందరు వ్యక్తులైనా, రాకడను గురించి చెప్పుచున్నారు. కనుక రాకడ తలంపు అందరునూ కలిగియుండండి. రాకడకు సిద్ధపడండి. ప్రభువు రెప్పపాటులో వచ్చి, పావురమువలె సిద్ధపడిన మిమ్ములనందరిని తీసికొనిపోవును. సిద్ధపడనివారు రాకడలో వెళ్ళరు. సిద్ధపడినవారు మరణమునకు బదులు ఆరోహణమౌదురు. ఇట్టి ధన్యత చదువరులైన మీకు కలుగును గాక. ఆమెన్.

Please follow and like us:

How can we help?

Leave a Reply