పునరుత్థాన చరిత్రయే అద్భుతము. అయితే ఆరోహణ చరిత్ర మహాద్భుతము. ఆదికాండము 5వ అధ్యాయములో పితామహుల కాలములో హనోకు ఆరోహణమాయెను. ప్రవక్తల కాలములో రాజుల గ్రంధములో ఏలీయా ఆరోహణమాయెను. రెండు వేల సంవత్సరముల క్రిందట సువార్తల కాలములో యేసుప్రభువు ఆరోహణమాయెను. ప్రకటన గ్రంధములో మనయొక్క ఆరోహణము అనగా సంఘముయొక్క ఆరోహణము ఉన్నది.
యేసుప్రభువు యొక్క ఆరోహణమునకు సంబంధించిన రెండు వర్తమానములు కలవు. అవి ఒక్కటి శరీర జీవమునకు సంబంధించిన వర్తమానము. మరొకటి ఆత్మీయ జీవమునకు సంబంధించిన వర్తమానము.
యేసుప్రభువు పునరుత్థానమైన తర్వాత 40 దినములున్నారు. చరిత్రనుబట్టి శిష్యులు కొన్ని సంగతులు కనిపెట్టిరి. యేసుప్రభువు లేచిన పిమ్మట శిష్యులు తలుపులు వేసికొన్నప్పటికి ఆయన లోపలికి రాగలిగెను. వారి నేత్రముల యెదుట బాహాటముగ రా గలిగెను. మరియు ఎమ్మాయు మార్గములో వారి కన్నులకు కనబడెను. ఆయన బోధ చెప్పుచుండగా వారు చెవులతో విని నేర్చుకొనిరి. కండ్లతో చూచి తెలిసికొనిరి, చెవులతో బోధలు విని తెలుసుకొనిరి. ఆయన వారితో కలసి భోజనము చేసెను. గనుక వారు ఈయన మనకు కనబడేవాడు. మనతో కలసి మాట్లాడేవాడు. మనతో భోజనము చేయువాడు అని ఈ సంగతులు తెలిసికొనిరి. ఆయన కనబడుటను బట్టియు, మాట్లాడుటయునుబట్టియు, వారితో కలసి భోజనము చేయుతను బట్టియు – మన రక్షకుడు బ్రతికియున్నాడు; చనిపోయినాడు గాని తిరిగి సజీవునిగా లేచి బ్రతికియున్నాడని గ్రహించిరి.
చరిత్రాంశములనుబట్టి కూడా తెలిసికొన్నారు. సిలువవేయబడినట్లు, సమాధిచేయబడినట్టు తెలిసికొన్నారు గాని వాటి వలన విచారము. తర్వాత ప్రభువుతో 11మంది శిష్యులు బేతనియ దగ్గర ఒలీవచెట్ల కొండకు వెళ్ళిరి. అక్కడ ప్రభువు ఆరోహణమై వెళ్ళిన వారు మహానందముతో తిరిగి వచ్చిరి. ఇచ్చట ‘తిరిగి వచ్చిరి ‘ అనునది చిన్నమాటయే గాని, ‘మహానందము ‘ అనునది పెద్దమాట. ఎందుకు మహానందము? ఆయన మరణము పొందినప్పుడు మహాదుఃఖము గాని 40దినములలో మహానందము కలిగెను. ఎందుకనగా మా రక్షకుడు సజీవుడైయున్నాడు. ఇక కనబడకపోయినను ఫర్వాలేదు ఆయన సజీవుడు, వారు ఆయనను చూచుట, మాట్లాడుట, అయిపోయినది గనుక వారికి మిక్కిలి సంతోషము. గనుక ఒకటవ వర్తమానము శరీర జీవన చరిత్ర, అనగా కంటికి కనబడుట., మాట్లాడుట. భోజనము చేయుట. ఇక ఆయన కనబడడు.
మనిషికి రెండు కన్నులు ఒకటి శరీర జీవితమునకు అవసరము. రెండవది ఆత్మీయ జీవితమునకు అవసరమైనవి తెలిసికొను కన్ను. ఆత్మీయ జీవితమునకు రాబోవు సంగతులు తెలిసికొను కన్ను అవసరము. ఇదే విశ్వాస నేత్రము. శరీర నేత్రమునకు బాహాటముగ కనబడవలెను గాని ఆత్మీయ నేత్రమునకు అట్లుకాదు. విశ్వాసముయొక్క నైజము రాబోవునవి కనబడకపోయినను నమ్మివేయడము; ఏమియు కనబడనక్కరలేదు, పునరుత్థానమైనాడని నమ్మివేయడమే, ఆరోహణమైనాడని నమ్మివేయడమే.తిరిగివచ్చునని నమ్మివేయుటే. తీసికొని వెళ్ళునని నమ్మివేయుటయే.అయితే శరీరనేత్రము నాకు కనబడలేదు. నా చెవికి వినబడలేదు అనును. విశ్వాస జీవితము యొక్క భాషకు కనబడటము ముఖ్యముకాదు. అన్ని నమ్మివేయుటయే. ఇదే గొప్ప శక్తి.
యేసుప్రభువు తన శిష్యులతో “నేను తండ్రి యొద్దకు వెళ్ళుదును. మళ్ళీ వచ్చి మిమ్మును తీసికొనివెళ్ళుదును” అని సిలువకు వెళ్ళక ముందే చెప్పెను. అనగా జరుగకముందే చెప్పెను. అయినను శిష్యులు నమ్మివేసిరి. వారి కన్నులకు కనిపించకపోయినను నమ్మివేసిరి. వారికి ప్రత్యక్షముగా ప్రభువు వెళ్ళుట, వచ్చుట వారిని తీసికొనివెళ్ళుట కనిపించినదా? లేదుగాని వారు నమ్మినారు. శిష్యులకు మాత్రముకాదు. మానవులందరకు ఈ రెండును చట్రములో అమర్చిపెట్టినాడు. అవి ఏవనగా శరీర నేత్రము మరియు ఆత్మీయ నేత్రము. మానవుడు శరీర నేత్రముతో మానవుని చట్రములో దేవుడు వ్రేళ్ళు, కాళ్ళు ఏలాగు అమర్చినాడో, అదే రీతిగా ఆ రెండూ కూడ అమర్చినాడు గనుక నమ్మవలెను. శరీర నేత్రమునకు కావలసిన అనుభవము కలిగినది. ఇక మీదట విశ్వాస నేత్రమునకు అనుభవము కావలెను. ‘ఆయన వెళ్ళినాడు, మరల వచ్చి మనలను తీసికొనిపోవును ‘ అనునది అనుభవము కావలెను. ప్రభువు మరల వస్తారనునది ఇది వరకే నమ్మినారు. ఇప్పుడు మరింత బలముగా నమ్మవలెను. అపోస్తలులయిన వారి మధ్యలో, ప్రభువు, తలుపులు వేసియుండగానే వచ్చినారు గదా! గనుక మనము ఎక్కడికి వెళ్ళినను, ఎక్కడ ఉన్నను, దేవుడు అన్యాయస్థుడు కాడు. మానవులందరిని, అన్ని మతముల వారికి ‘నన్ను నమ్మండి ‘ అని చెప్పెను. ముందు శరీర నేత్రములకు కొంత అనుభవము కలిగించి, విశ్వాస నేత్రములతో చూచి నమ్మండి అని చెప్పెను. శిష్యులకు అట్లు జరిగెను. మార్గములో చేపలు పట్టినప్పుడు కనబడెను. శరీర నేత్రములకు అంతాచేసి చూపించెను. శరీర నేత్రములకు కనబడుట, వినబడుట ఆగిన మీదట విశ్వాస నేత్రములకు బయలుపడుట. ఇది గొప్ప అనుభవము. ఇది సంఘమునకు కలిగిన అనుభవము. 11 మంది శిష్యులు శరీర నేత్రములతో చూచిన తర్వాత, విశ్వాస నేత్రములతో చూడగలిగిరి. 11మందిలో నుండి 120 మంది సంఘము అందులోనుండి 7 సంఘములు వచ్చినవి. ఇప్పుడు మనము వచ్చినాము. వారి దగ్గరనుండి వారసత్వము మనకు వచ్చినది. రుజువు అక్కరలేకుండ నమ్మివేసిన, అదే వరము. మనకు కనబడేది ఆయన కలుగజేసిన సృష్టి దీనిని బట్టి పరలోకములో ఇంతతంటే గొప్ప భాగ్యములున్నవని నమ్మివేయవలెను. వారు ఎట్లు పరలోక విషయములో గురి ఉంచినారో, మనమును విశ్వాసముతో అట్టి గురి ఉంచవలెను.
ఆత్మ సహాయము వలన వృద్దిలోనికి వత్తును అనే విశ్వాసము, తుదకు పరలోకము చేరుదునను విశ్వాసము మనకు ఉండవలెను. మన ప్రభువు ఆరోహణమాయెను గాన నేను కూడా అరోహణమగుదునను విశ్వాస నేత్రము మనము కలిగి యుండవలెను.