ఈ ఆరోహణ పండుగ అందరు చేయవలసినదే. క్రిష్ట్మస్, ఈస్టరు పండుగలు ఎంత ఉత్సాహముతో చేస్తున్నారో, అంత ఉత్సాహముగానే ఈ ఆరోహణ పండుగను కూడా చేయవలెను. ప్రభువు యొక్క ఆరోహణ చరిత్రను మూడు భాగములుగా వివరింపవచ్చును. 1. ఆరోహణ పండుగకు ముందు ఒక కథ. 2. ఆరోహణము జరిగినప్పుడు ఒక కథ. 3. జరిగిన తరువాత ఒక కథ. ఈ మూడు కలిపితే ఒక కథ. దీనివల్ల మనకేమి లాభమో నేర్చుకొనవలెను. కథ విరోధముగా, కఠినముగా, చిక్కుగా ఉండవచ్చును గాని, అందు మనకు గల ప్రయోజనము ను గ్రహించవలయును.
ప్రభువుయొక్క జన్మ పూర్వ చరిత్ర, జన్మ చరిత్ర, జీవిత చరిత్ర, పునరుత్థాన చరిత్ర, ఆరోహణ చరిత్ర, వీటి వల్ల మనకేమి మేలులో నేర్చుకొనవలెను వాక్యములో ఈ ఐదు చరిత్రలు హృదయ పూర్వకముగా ఎవరు ధ్యానిస్తారో వారికి తప్పక మేలున్నది. లేకపోతే ఆత్మ తండ్రి ఆ చరిత్రలు వ్రాయించడు.
ఈ దినమంతా మనము ఆరోహణమును ధ్యానించితే మంచిది. నేటి నా అంశము ఏమంటే, ఆరోహణ కథ వలన ఏ ఏ మేలులు సంభవించినవో వాటిని ధ్యానించుట. ముందు శిష్యులకు కలిగిన మేళ్ళు చూడవలెను. మత్తయి, మార్కు, లూకా, అపోస్తలుల కార్యములు అను ఈ పుస్తకములలో ఉన్న నాలుగు చరిత్రలు జ్ఞాపకము చేయుదును. మత్తయి 28:19. “మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులనుగా చేయుడి.” శిష్యులకు ప్రభువు గొప్ప ఉద్యోగమిచ్చినాడు. లోకపు పని కాదు. వారు తమ ఉద్యోగమునుబట్టి, లోకములో ఉన్న రాష్ట్రములన్నిటికి, దేశములన్నిటికి వెళ్ళవలెను. ఇది సువార్త ఉద్యోగము. ఇది అన్నిటికంటే గొప్ప ఉద్యోగము. మిగతా ఉద్యోగములవల్ల చాలా రాబడులున్నవి గాని, సువార్త ఉద్యోగమువల్ల ఈ లాభములు కాదుగాని, సైతాను నుండి, పాపము నుండి, విడుదల పొంది శరీరము వద్దనుండి వెళ్ళిపోయి, చివరగా ఆరోహణములోకి వెళ్ళుదుము. ఈ లోక ఉద్యోగమువల్ల పాపము నుండి, లోకము నుండి మొదలగు వాటి నుండి విడుదల కలుగదు. (1) వారు పని చేయవలసిన పొలము – లోకమంతా, (2) వారికిచ్చిన ఆజ్ఞ, ఉద్యోగము – సువార్త, (3) వారికిచ్చిన సువార్త – ప్రకటించుట.
మొదటిమేలు:- పరలోకమందు, భూలోకమందు సర్వాధికారమున్న ప్రభువే అనగా పైన, క్రింద సంపూర్ణాధికారమున్న ప్రభువు, శిష్యులకు సర్వాధికారమున్న ప్రభువే అనగా పైన, క్రింద సంపూర్ణాధికారమున్న ప్రభువు, శిష్యులకు ఉద్యోగమిచ్చినాడు గనుక వారు భయపడవలసిన పనిలేదు. ఒక పాదిరి గారికి 20 గ్రామములుంటే (20 సంఘములు) పేరిష్ ఇంకొకరికి 7 గ్రామాలుంటే పేరిష్. మరియొకరికి జిల్లా అంతా ఇచ్చారు. శిష్యులకైతె ప్రభువు లోకమంతటిని ఇచ్చినారు. ఎందుకంటే 31|2సంవత్సరములు ప్రభువునకు దగ్గరగానుండి కనిపెట్టుకొనియున్నారు. గనుక అంత గొప్ప ఉద్యోగము ఇచ్చారు. మీలో ఎవరికైన ప్రభువు కనబడి అట్టి ఉద్యోగమిస్తే, ఎంతమంది వెళ్ళుదురు? శిష్యులు మారు ప్రశ్న వేయకుండా వెళ్ళిరి. మీరు కూడా ప్రభువు పిలచిన అట్లే వెళ్ళవలెను. గాని ఎదురు ప్రశ్న వేయకూడదు. సర్వలోకమునకు సువార్త ప్రకటించే అధికారము ఇవ్వబడును.
2వ మేలు:- భూదిగంతముల వరకు నాకు సాక్షులై యుండండి. 1. ప్రకటించుట. 2. సాక్షులై యుండుట; బోధ ఉద్యోగమేలాగుంటుంది? సాక్ష్యమిచ్చే ఉద్యోగమేలాగుంటుంది? ఆలోచించవలెను. సాక్ష్యము అనగా మేము ప్రభువును చూచినాము, ఆయనతో ఉన్నాము. ఆయనతో పెండ్లికి వెళ్ళినాము, ఆయన శ్రమపడుట చూచినామని సాక్ష్యమిచ్చుట. ఇందులో ఏది గొప్పది? మీకు ఏది కావలెను? నేను ఈ దినము మేళ్ళను గూర్చి చెప్పుచున్నాను. బోధకులు బోధకోద్యోగము చేయగలరు గాని సాక్షి ఉద్యోగము చేయలేరు. మీరు ఈ మేలు పొందగోరితే సాక్షి ఉద్యోగము చేయండి.
3వ మేలు:- యోహాను 14:3 మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. భూలోకములో మనకు ఎంత స్థలమున్నది? మనము నివసించు ఇంటి స్థలము ఉన్నది. దీని కొరకు ప్రభువు వెళ్ళవలసిన అవసరము లేదు. గాని మనకొరకే పరమందు స్థల సిద్ధపరచ వెళ్ళుచున్నాడనే మేలు, ఆరోహణ కథలో బైలుపడినది. పై మూడింటిలో ఏది గొప్పది? మనమెంత సువార్త ప్రకటించినా, సాక్ష్యమిచ్చినా, పరలోకములో స్థలము లేకపోతే లాభమేమి?
4వ మేలు:- మత్తయి 28:20 యుగసమాప్తి పర్యంతము మీతో కూడా ఉన్నాను. ఆయన వెళ్ళిపోయేటప్పుడు శిష్యులకు దిగులున్నది. గాన ప్రభువు ఈ మాట చెప్పెను. ఇది వ్యతిరేకమైన మాటగా ఉన్నది. అయినప్పటికి ఈ మాటవల్లా వారికెక్కువ ధైర్యము వచ్చెను. వెళ్ళడము పరలోకమునకు – ఉండడము భూలోకములో – ఇది విచిత్ర నాటకము. రెండూ నిజమే. వెళ్ళుట = ఉండుట పై నాల్గింటిలో ఏది గొప్పది? 1. భూలోకములో మనుష్యులయొద్ద ప్రభువు ఉంటారు. 2. పరలోకములో మనుష్యులు ప్రభువునొద్ద ఉంటారు. (యోహాను 14:3; మత్తయి 28:20).
5వ మేలు:- పరలోకములో మీరు నాయొద్ద నుందురు. ఇది గొప్ప మేలు. మీరు గదిలోకి వెళ్ళి ఈ ఐదు మేళ్ళు తలంచుకొని, ఒక్కొక్క మేలు దగ్గర ప్రభువునకు హృదయపూర్వక వందనములు చేస్తారా! అట్టి వారికి ఆరోహణ దీవెనలు వచ్చును. ఆరోహణము ఇద్దరకు 1. ప్రభువునకు. 2. సంఘమునకు, మీకందరకు ఆరోహణ దీవెన కలుగును గాక!