క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. ఆరోహణ పండుగ...
  5. ఆరోహణ పండుగ

ఆరోహణ పండుగ

వాక్యము: మత్తయి 28:16-20;మార్కు16: 19,20; లూకా 24:50-53;అ. కార్య. 1:6-11.

ఆరోహణ పండుగ ఆచరించు విశ్వాసులారా! క్రిష్ట్మస్ దినమున దూత మహా సంతోషకరమైన వర్తమానము తీసికొనివచ్చెను. ప్రభువు యొక్క ఆరోహణ చరిత్రలో కూడ మహానందమని వ్రాయబడెను. క్రిష్ట్మస్ దినమున ఆనందము ఎందుకనగా యేసుప్రభువు మన కొరకు చనిపోవుటకు వచ్చెను. ఆలాగే ఆరోహణ దినమున మహానందము ఎందుకనగా ఆయన మన నిమిత్తమును, తన నిమిత్తమును పరలోకమునకు వెళ్ళెను. గనుక ఈ రెండును ఆనంద వృత్తాంతములే. ప్రభువు జీవితారంభమందు జయశీలుడుగా జన్మించి, జీవితకాలమంతా మహాజయముతో జీవించి, ఆరోహణ కాలమందు మహా ఆనందభరితుడుగాను, జయశీలుడుగాను ఆరోహణుడాయెను. మనము కూడా మొదటినుండి చివరి నిమిషము వరకు ఆనందభరితులనుగా నుండవలెను. చివర శాంతికరమైన మరణము పొందవలెను. నిచ్చెన వేసి అన్ని మెట్లు ఎక్కినట్లే, మనము ఆరంభమునుండి మరణము వరకు శాంతిచిత్తులమై యుండవలెను. యేసుప్రభువు యొక్క జన్మకాలములో హేరోదు ఆయనను చంపజూచెను. అయితే హేరోదు ఆకర్షణ ఆయనపై పనిచేయలేదు. ఆయన ఆకర్షింపబడలేదు. మత్తయి 4వ అధ్యాయములో సైతాను ఆయనను ఆకర్షింపవలెనని చూచెను. గాని ప్రభువు ఆకర్షింపబడలేదు. శత్రువులు ఆయనను ఆకర్షించవలెనని వల వేసిరి. ఆయన వారికి కూడా లొంగలేదు. వారు ఆయనకు మరణ వలలు వేసి, చంపిరి. గెలిచినామని వారు అనుకొనిరి గాని పునరుత్థాన కాలమందు ప్రభువు మరణము యొక్క ఆకర్షణను త్రోసివేసి, జయశీలుడుగా బయటికి వచ్చెను. ఆఖరు మెట్టు ఆరోహణము, భూమి యొక్క ఆకర్షణ శక్తి ఆయనను ఆరోహణము కాకుండ ఆకర్షించవలసినది. అయితే ప్రభువు గాలిలో నడిచి ఆరోహణుడాయెను. సాతానుకు, పాపమునకు, లోకమునకు, భూమికి ఆకర్షణ ఉన్నది. గాని అవి ప్రభువును ఆకర్షింపలేకపోయెను. ప్రభువు వాటిని జయించెను. నేటి శాస్త్రజ్ఞులు విమానములకు ఎక్కువ బలము అమర్చి, చంద్రమండలములోకి వెళ్ళవలెనని భూమి యొక్క ఆకర్షణ దాటి పైకి వెళ్ళుచున్నారు. మేఘములు దాటి వెళ్ళుచున్నారు. పక్షులు కూడ కొంతదూరము పైకి వెళ్ళగలవు. అయితే ప్రభువు ఈ ఆరోహణ దినమున వాటన్నిటికికన్న పైకి వెళ్ళెను. దేవుని మహిమలో, ఆయన ప్రక్కన కూర్చుండెను క్రిందనున్నదేదియు ఆయనను ఆకర్షించలేదు గనుక ఆయన మహోన్నతుడు. ఆయన భూలోకములోనున్న విశ్వాసుల నందరిని ఆకర్షించగల మహోన్నతుడు. సూదంటురాయి దగ్గర ఇనుపముక్క ఉంచినా, అది కదిలి ఎగిరిపడును. ఈ చివరి దినములు ఆకర్షణ దినములు. శిష్యులు మనకన్న ముందు ప్రభువుయొక్క ఆకర్షణలోనికి వెళ్ళిరి. ఇవి రాకడ దినములు. దినదినము మనము ప్రభువు వలన ఆకర్షింపబడుచు మరణము లేకుండ మహిమలోనికి ఆకర్షింపబడవలెను. మనము ఆకర్షింపబడుట ఆకాశమునకు కాదు, నక్షత్రముల వరకు కాదు. “నేను స్థలము సిద్ధపర్చ వెళ్ళుచున్నాను” అని ప్రభువు చెప్పిన స్థలమును చేరువరకు ఆకర్షింపబడవలెను. భూతద్దము ద్వారా అన్నియు కనబడునట్లు ప్రభువు మహిమ ద్వారా, ఆయన సహవాసము ద్వారా అన్నియు తెలిసికొనగలము. మొదటి రాకడ సమయమున దూతలు వర్తమానము తెచ్చెను. రెండవ రాకడకు గురుతులే వర్తమానములైయున్నవి. గాన మరణము చూడకుండ ఆ మహిమలోనికి వెళ్ళుటకు సిద్ధపడవలెను. ప్రతి మిషనులోనుండి, ప్రతి దేశము నుండి గురుతులను చూచి ప్రజలు సిద్ధపడుచున్నారు. లోకమునకు, సంఘమునకు గురుతులు తెలిసినవి. సజ్జనులకు, దుర్జనులకు ఈ గురుతులు తెలిసినవి గాన ఇంత బ్రతుకు బ్రతికి, ఎత్తబడకపోయిన ప్రయోజనము లేదు. ఆ దినము ఎప్పుడో తెలియదు గనుక ఇప్పుడే అని ముందుగానే సిద్దపడవలెను.

ప్రభువు కొందరి దగ్గరకు వెళ్ళి, ‘నన్ను వెంబడించుమని ‘ వారిని పిలువగా వెంటనే వారు వెంబడించిరి. ప్రభువు ఎక్కడకు వెళ్ళిననూ వారక్కడకి వెళ్ళిరి. ఆయన పాపుల యొద్దకు వెళ్ళిన, వారు వెళ్ళిరి. ప్రయాణములో, సముద్రములో, ఊళ్ళలో, పిచ్చివారి యొద్దకు, దయ్యములు పట్టినవారి యొద్దకు, చనిపోయిన వారి యొద్దకు, గెత్సెమనే తోటకు, సిలువ దగ్గరకు, ఆరోహణ కొండ వరకు, తుదకు ప్రభువు దగ్గరకు అనగా మహిమలోనికి ఆయనను వెంబడించిరి. ఆరంభమునుండి చివరి వరకు వెంబడించిరి. మనమును కొంతకాలము యేసును వెంబడించి, శ్రమలు వచ్చినప్పుడు విడువక అంతము వరకు, మేఘము వరకు, మహిమ లోకము వరకు ఆయనను వెంబడింతుము గాక! ఆమెన్.

ప్రార్ధన:- ఓ ప్రభువా! నీ శిష్యులకు ఆశీర్వాదమిచ్చి పని అప్పగించి, ఆనందము కలిగించినావు. భూలోకమంతా, తిరిగే ఆనందమిచ్చినావు, వారిని మహిమలోనికి ఆకర్షించినావు స్తొత్రము. ఈ దినము మాకు ఆరోహణానందము కలిగించినట్లు, నీ రాకడలో ఆకర్షింపబడు ఆనందమును కూద కలిగించి మహిమ పొందుమని వేడుకొనుచున్నాము. ఆమేన్.

Please follow and like us:

How can we help?

Leave a Reply