చావులేకుండ మేఘములోనికి వెళ్ళనైయున్న సంఘములో చేరగోరువారలారా! మీకు శుభము కలుగునుగాక! ఈ దిగువ నున్నవి దేవునినడిగి నిశ్చయము తెలిసికొని విశ్వాసమును స్థిరపరచుకొనండి.
మొదటి కథ:- “క్రీస్తు అవతారమునకు ముందు 4004వ సంవత్సరమున హనోకు మరణము లేకుంద మోక్షమునకు వెళ్ళెను.” ఆది 5:23. హనోకు దినములన్నియు మూడు వందల అరువదియైదేండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతనిని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.
రెండవ కథ:- క్రీస్తు అవతారమునకు ముందు 863వ సంవత్స్రమున ఏలీం మా మరణము లేకుండ మోక్షమునకు వెళ్ళెను. వారు (అనగా ఎలీషా, ఏలీయా) ఇంక వెళ్ళుచు మాటలాడుచుండగా అగ్ని రథము, అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరుచేసెను. అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను. 11వ రాజులు 2:11.
మూడవ కథ:- క్రీస్తు శకారంభమున క్రీస్తే ఆరోహణమాయెను. ఇది ఆయన మృతులలోనుండి మహిమ శరీరముతో లేచిన నలుబది దినములకు జరిగెను. అపో.కార్య. 1:8-11. “అయినను పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చినపుడు మీరు శక్తినొందెదరు. గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములందంతటను, భూదిగంతములవరకును నాకు సాక్షులై యుందురని వారితో (శిష్యులతో) చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు ఒక మేఘము వచ్చి వారి కన్నులకు కనబడకుండ ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశమువైపు తేరిచూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి గలిలయ మనుష్యులారా! మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీ యొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, యేరీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.”
నాల్గవ కథ:- 1థెస్స. 4:15-18. “మేము ప్రభువు మాటనుబట్టి మీతో చెప్పునదేమనగా – ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్ధముతోను, దేవుని బూరతోను, పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగ, ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము. కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి. ఇదే సంఘారోహణ దినము. ఇది రెండవ రాకడ దినము. ఇదే క్రీస్తుప్రభువు మేఘాసీనుడై రానైయున్న దినము. ఇదే రెప్పపాటు కాలమై యుండ బోవు దినము. దీనికి ఇంగ్లీషులో (Rapture) రేప్చర్ అనియు, (Reception Day) రెసెప్షన్ డే అనియు అందురు.(Rapture= ఆకర్షించుట; Reception= చేర్చుకొనబడుట) ఈ ఆరోహణము, నేడే అనునంత శీఘ్రముగా వచ్చుచున్నది. గనుక నేడే త్వరపడి త్వరగా సిద్ధపడండి. దీనిని వట్టిదిగాను, భ్రమగాను, ఊహాగాను, మోసముగాను ఎంచకండి.
1) దేవా! సృష్టికర్తవైన తండ్రీ! హనోకు మరణము లేకుండా మోక్షమునకు, వెళ్ళెనని ఆది 5:24 లో ఉన్నది. దయచేసి దీనిని వివరించుము.
2) ఏలీయా మరణము లేకుండ అగ్నిరథము మీద మోక్షమునకు వెళ్ళెనని 11రాజులు 2:11లో నున్నది. దయచేసి దీనిని వివరించుము.
3) యేసుప్రభువు మహిమ శరీరముతో ఆరోహణమాయెనని కార్య. 1: 15-18 లో ఉన్నది. దయచేసి దీనిని వివరించుము.
4) నిజక్రైస్తవ సంఘము చావులేకుండ ఒక్క రెప్పపాటులో మోక్షమునకు వెళ్ళనైయున్నదని 1థెస్స. 4: 16లో ఉన్నది. దయచేసి దీనిని వివరించుము.
5) యేసుప్రభువుయొక్క రెండవ, రాకడ దినమునకు ముందు జరుగవలసిన గురుతులు చాల వరకు నెరవేరినవని చెప్పుచున్నారు. ఇది నిజమా?
6) ఇంకను జరుగవలసిన గురుతులు ఏవేవో దయచేసి చెప్పుము.
7) యేసుప్రభువు యొక్క రెండవ రాకడ మిగుల త్వరలో సంభవించునని కొందరు భక్తులుచెప్పుచున్నారు. ఇది నిజమా?
8) నిజ క్రైస్తవులు మాత్రమే గాక రాకడను నమ్మి, ఆటంకములను బట్టి బాప్తిస్మము పొందలేని అభిమానులు కూడ ఆరోహణమగుదురని కొందరు చెప్పుచున్నారు. ఇది నిజమా?
9) పాపమెరుగని పిల్లలు ఏ మతములో నున్నవారైనను సరే, రాకడకు ఎత్తబడుదురని కొందరు చెప్పుచున్నారు. ఇది నిజమా?
10) ఇప్పుడు ఎంత చెప్పినను, నమ్మని అవిశ్వాసులు కొందరు ఆ సమయములో నమ్మి, ఎత్తబడుదురని కొందరు చెప్పుచున్నారు. ఇది నిజమా?
11) రాకడను నమ్ముచు సిద్ధపడియున్న విశ్వాసులు, ఆ సమయమందు రాకడ తలంపులేనివారై యున్న యెడల వారి గతి యేమి? దయచేసి వివరించుము.
12) రాకడకు సిద్ధమగుటకు మేము ఏమేమి చేయవలెనో దయచేసి ఆ పనుల జాబితా తెలియజెప్పుము.
13) రాకడ ఒక రెప్పపాటులోనే జరుగవలసియుండగా ఎవరు సిద్ధపడగలరు? సిద్ధపడలేరు గనుక ఇప్పుడే సిద్ధపడవలెనని రాకడ బోధకులు చెప్పుచున్నారు. నన్నును సిద్ధపర్చుము.
14) దేవా! ఏమి చేసిన నేను సిద్ధపడుదునో అవి నాకు స్పష్టముగా కలలోనో, దర్శనములోనో, తెలియజెప్పుము.
15) రెండవ రాకడను గురించి చెప్పబడుచున్న సంగతులు నిజమైన యెడల, నాకు మాత్రమే గాక లోకములో ప్రతి మనుష్యునికిని చెప్పించుము. లేదా నీవే స్వయముగ చెప్పుము. రాకడ మిక్కిలి సమీపము గనుక నీవే చెప్పవలెనని నేను కోరుచున్నాను. బోధకులు ఎంతమందికి చెప్పగలరు? రాకడను గురించిన పత్రికలు ఎంతమందికి అందగలవు? మేమెంత చెప్పినను గ్రహింపని వారుందురు. గ్రహించియు నమ్మనివారుందురు. నమ్మియు సిద్ధపడని వారుందురు. వీరందరిని కనికరించుము, వీరందరికి ఈ విషయములను స్ప ష్ట పరచుము.
16) యేసుప్రభువు మేఘాసీనుడై వచ్చునప్పుడు మృతులైన భక్తులు మొదట మేఘములోనికి వెళ్ళుదురనియు, పిమ్మట సజీవులైన భక్తులు వెళ్ళుదురనియు వ్రాయబడియున్నది. ఇది నాకు కొద్దిగా వివరించుము. నిజమైన సంగతులన్నిటిని నమ్మగల శక్తి నాకు దయచేయుము.
17) రాకడ, మిక్కిలి త్వరలో వచ్చిన యెడల సిద్ధపడని వారిగతి, శ్రమల పాలగుటయే అని చెప్పుచున్నారు. ఇది ఎట్లో వివరించుము. బైబిలో నున్నవన్నియు చదువుకొని లేక విని నేర్చుకొనగలను. కాని బేదాభిప్రాయములు కనబడుచున్నందున నిశ్చయము తెలియుటలేదు. గనుక నాకు నిశ్చయము తెలుపుము.
18) మృతులైన భక్తులు, రాకడవరకు అసహ్యమైన సమాధులలో ఉందురా? మోషే, ఏలీయాలు రూపాంతర పర్వతముమీదికి ఎక్కడనుండి వచ్చిరి?
19) దేవా! రాకడను గురించి ప్రచురమైన పత్రికలు, పుస్తకములు, బోధలు దీవించుమని వేడుకొనుచున్నాము. ఈ పత్రిక రాకడకు సిద్ధపడవలసిన వారికి ఉపయోగకరముగ నుండునట్లు దిద్దుమని, రాకడ క్రీస్తు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాను. ఆమెన్.